స్థలం: వైజాగ్, పాత విక్టరీ క్లబ్ ఆవరణ – తెల్లవారుజామున 5:58 గంటలు.
గన్ బ్యారెల్ నుదుటికి తగలగానే బన్నీ వాస్ భయంతో వెనక్కి తగ్గాడు. నోట్లోంచి రక్తం కారుతున్నా చంద్రమౌళి చూపులో రవ్వంత కూడా దయ లేదు.
“చేతులు పైకెత్తురా!” చంద్రమౌళి హెచ్చరించాడు.
బన్నీ వాస్ నెమ్మదిగా చేతులు పైకెత్తాడు. దెబ్బలు తిని కింద పడ్డ ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ కష్టమ్మీద లేచి, కింద పడిపోయిన తమ తుపాకులు అందుకుని బన్నీ వాస్ రౌడీలను కవర్ చేశారు. గాయపడిన శివ ఒక పక్కన గోడను ఆనుకుని ఊపిరి పీల్చుకుంటున్నాడు.
చంద్రమౌళి రమ్య వైపు చూసి, “రమ్య గారూ… వీళ్లని మేము చూసుకుంటాం. మీరు త్వరగా లోపలికి వెళ్ళి ఆ పెన్‌డ్రైవ్ వెతకండి. ఎక్కువ టైమ్ లేదు!” అని చెప్పాడు.
రమ్య తల ఊపి, టార్చ్ లైట్ వేసుకుని వేగంగా ఆ పాత బిల్డింగ్ లోపలికి పరిగెత్తింది.
స్థలం: పాత ఆఫీస్ గది – తెల్లవారుజామున 6:01 గంటలు.
లోపల అంతా దుమ్ము, చీకటి. రమ్య టార్చ్ వెలుతురులో వెతుకుతూ ‘శ్రీ లక్ష్మి ఫైనాన్స్’ అని ఉన్న పాత గదిలోకి వెళ్లింది. అక్కడ ఉన్న టేబుల్ డ్రాయర్లు, పాత ఫైళ్లు తిరగేసింది కానీ ఏమీ దొరకలేదు.
ఆమె ఒక్క క్షణం ఆగి ఆలోచించింది. ‘రవి తన మొదటి విజయానికి దగ్గరగా దాచానని చెప్పాడు…’రమ్య గోడ వైపు టార్చ్ తిప్పగా, అక్కడ ఒక పాత చెస్ టోర్నమెంట్ ఫోటో కనిపించింది.
రవికుమార్ మొదటిసారి గెలిచిన కప్పుతో ఉన్న ఫోటో అది. రమ్య ఆ ఫోటో ఫ్రేమ్‌ను గోడ నుండి తీసి, వెనుక వైపు ఉన్న కార్డ్‌బోర్డ్ కవర్ విప్పి చూసింది.
అక్కడ టేప్‌తో అతికించి ఉన్న ఒక చిన్న సిల్వర్ కలర్ పెన్‌డ్రైవ్ కనిపించింది.”దొరికింది!” ఆ పెన్‌డ్రైవ్‌ను గట్టిగా పట్టుకుని రమ్య బయటకు పరుగెత్తింది.
స్థలం: బిల్డింగ్ వెలుపల – తెల్లవారుజామున 6:25 గంటలు.
రమ్య బయటకు వచ్చేసరికి అక్కడ పరిస్థితి ఘోరంగా మారిపోయింది!బన్నీ వాస్ ఒంటరిగా రాలేదు. బిల్డింగ్ వెనుక వీధిలో వాడు ముందే దాచి ఉంచిన బ్యాకప్ రౌడీలు నలుగురు… చంద్రమౌళి రమ్య వైపు చూస్తున్న ఆ ఒక్క క్షణం అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని వెనుక నుండి దాడి చేశారు!
ఒక రౌడీ ఇనుప రాడ్‌తో చంద్రమౌళి వీపు మీద బలంగా బాదాడు. చంద్రమౌళి నొప్పితో కింద పడబోతూ కూడా తిరిగి వాడి దవడ మీద గట్టిగా దెబ్బేశాడు. కానీ మిగతా ముగ్గురు రౌడీలు ఒక్కసారిగా చంద్రమౌళి మీద పడి, అతని చేతిలోని గన్‌ని నేలకేసి కొట్టి లాక్కున్నారు. ఇంకో ఇద్దరు రౌడీలు ఆ కానిస్టేబుళ్లను, గాయపడి ఉన్న శివను లొంగదీసుకున్నారు.
చంద్రమౌళి నేలపై మోకాళ్ల మీద పడిపోగా, ఒక రౌడీ అతని జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు.బన్నీ వాస్ కింద పడిన తన గన్‌ని తీసుకుని, చంద్రమౌళి ముఖం మీద కాలితో బలంగా తన్నాడు.
చంద్రమౌళి నోట్లోంచి రక్తం చిమ్మింది.”ఏంట్రా… నీకు ఖాకీ చొక్కా పొగరు ఇంకా తగ్గలేదా?”
బన్నీ వాస్ రౌడీల చేతిలోని ఫోన్ అందుకుని, భూపతి రెడ్డికి వీడియో కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు.ఫోన్ స్క్రీన్ లో భూపతి రెడ్డి కనిపించాడు. వాడి నవ్వు భయంకరంగా ఉంది.
“చంద్రమౌళీ… నా మేనేజర్ గాడు అక్కడ దొరికిపోతాడని నాకు తెలీదనుకున్నావా? అందుకే వాడి వెనుక నా బ్యాకప్ గ్యాంగ్ ని పంపాను. నిన్ను ఘాట్ రోడ్డులోనే లేపేద్దామనుకున్నా, కానీ నా పాత బిల్డింగ్ దాకా వచ్చి మరీ చావాలని నీకు రాసిపెట్టి ఉంది!” ఫోన్ లో భూపతి రెడ్డి అన్నాడు.
అప్పుడే లోపలి నుండి బయటకు వచ్చిన రమ్య ఆ సీన్ చూసి గడగడ వణికిపోయింది. ఆమె చేతిలో ఉన్న పెన్‌డ్రైవ్‌ను బన్నీ వాస్ చూశాడు.
“ఇటు తీసుకరా ఆ పెన్‌డ్రైవ్‌ని!” బన్నీ వాస్ గన్‌ని రమ్య వైపు గురిపెట్టాడు.రమ్య భయంతో అడుగు వెనక్కి వేసింది. మోకాళ్ల మీద రక్తం కారుతూ ఉన్న చంద్రమౌళి… పళ్లు కొరుకుతూ బన్నీ వాస్ కాళ్లను గట్టిగా పట్టుకుని కిందకు లాగడానికి ప్రయత్నించాడు.కానీ వెనుక ఉన్న రౌడీ చంద్రమౌళి తల మీద రాడ్‌తో కొట్టడానికి ఎత్తాడు!
📖 అన్నీ కథలు
-
మృత్యువు తొడిగిన పూలదండ-భాగం 17
-
రహస్య కోడలు – నిశబ్ద లావా (భాగం 11)
మరుసటి రోజు ఉదయం.
టీవీలో న్యూస్ వస్తోంది.
సరోజ సోఫాలో కూర్చుంది.అనూష కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది.
“అత్తయ్యా…”సరోజ వెంటనే స్పందించలేదు.అనూష కాసేపు అక్కడే నిలబడి, వెనక్కి తిరిగి కిచెన్‌లోకి వెళ్లిపోయింది.
ఆమె లోపలికి వెళ్లాకే, సరోజ కప్పు చేతిలోకి తీసుకుంది.
ఆ రోజు మధ్యాహ్నం.
అనూష డైనింగ్ టేబుల్ దగ్గర ఉల్లిపాయలు తరగుతోంది.
అప్పుడే సరోజ తన గది నుంచి బయటికి వచ్చి, ఫ్రిజ్‌లోంచి బెండకాయలు తీసుకుని ఆమె ఎదురుగా కూర్చుంది.
ఒక్క మాట కూడా మాట్లాడకుండా, బెండకాయలు కోయడం మొదలుపెట్టింది.
అనూష ఉల్లిపాయలు తరుగుతోంది. సరోజ బెండకాయల చివర్లు తీస్తోంది.
సరోజ బెండకాయల చివర్లు తీస్తూనే అడిగింది.”ఎంతకాలం ఉన్నావ్ అక్కడ?”
అనూష తలెత్తి చూసింది.”ఎక్కడ అత్తయ్యా?”
“అదే… కేఫ్‌లో.”
“ఏడు నెలలు అనుకుంటా.”
“అది సరే…” సరోజ మరో రెండు బెండకాయలు కోసి “రాధ ఇంకోటి కూడా చెప్పింది.”
అనూష తలెత్తి చూసింది. “ఏంటి?”
“స్పా అన్నది.”
“స్పానే కానీ అందులో నేను రిసెప్షనిస్ట్.”
“ఓహ్,” మరో రెండు బెండకాయలు తీసుకుంది సరోజ, కోయకుండా చేతిలో పట్టుకుని.”రిసెప్షనిస్టా? ఎంత జీతం ఇచ్చేవాళ్ళు?”
“బానే ఇచ్చేవాళ్ళు.”
“బానే అంటే ఎంత?”
అనూష ఉల్లిపాయ తరగడం ఆపింది. “మారుతూనే ఉండేది అత్తయ్యా… టిప్స్ కూడా కలిపి వచ్చేవి.”
సరోజ ఆమె వైపు చూసింది రెండు సెకన్లు. తర్వాత బెండకాయ కోసింది.”ఎలాంటి స్పా అది?”
“మామూలుదే. మసాజ్, ఫేషియల్స్.”
“ఎవరు నడిపేవాళ్ళు?”
“ఒకావిడ. పోలిష్ ఆవిడ.”
“నువ్వు తప్ప ఇంకెవరు పనిచేసేవాళ్ళు అక్కడ?”
అనూష కత్తి పక్కన పెట్టింది. “ఎందుకు అత్తయ్యా ఇన్ని ప్రశ్నలు?”
“అడగకూడదా?”
“అడగొచ్చు, కానీ…” ఆగింది అనూష.
“కానీ?”
“ఏం లేదు.” మళ్ళీ కత్తి తీసుకుంది, ఉల్లిపాయ మీద పెట్టింది.సరోజ బెండకాయల చివర్లు తీయడం కొనసాగించింది. “కిరణ్‌కి చెప్పావా?”
“నిన్న రాత్రి చెప్పా.”
“ఏమన్నాడు?”
“ఈరోజు మాట్లాడదాం అన్నాడు.”
సరోజ చేయి ఆగింది క్షణం. “అంతేనా?”
“అంతే అత్తయ్యా.”పళ్ళెంలో బెండకాయలు నింపుకుంది సరోజ, లేచింది.
“సరే. కడిగేయ్ ఇవి కూడా.” వంటగది వైపు నడిచింది, తలుపు దగ్గర ఆగకుండా ఈసారి.
“అనూష మళ్లీ ఉల్లిపాయ మీదే దృష్టి పెట్టింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. అవి ఉల్లిపాయ వల్ల వచ్చినవో… లేక తనలో మొదలైన భయం వల్ల వచ్చినవో, తనకే తెలియలేదు.”రాత్రి పదకొండున్నర.
ఫోన్ వైబ్రేట్ అయింది.”కిరణ్ కాలింగ్…”
అనూష రెండు సెకన్లు స్క్రీన్ వైపు చూసి, తర్వాత కాల్ లిఫ్ట్ చేసింది.”హలో…”
“ఏం చేస్తున్నావ్?” అడిగాడు కిరణ్.
“ఏం లేదు… పడుకోబోతున్నా.”
“తిన్నావా?”
“హ్మ్… ఇప్పుడే.”
“మావయ్య ఎలా ఉన్నారు?”
“సాయంత్రం మాట్లాడాను బాగానే ఉన్నారు.”
“గుడ్.”
కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఉన్నారు.
“ఏంటీ… చాలా సైలెంట్‌గా ఉన్నావ్ ఇవాళ,” అన్నాడు కిరణ్.
“అలాంటిదేం లేదు.”
“ఉంది.”
“లేదు.”కిరణ్ చిన్నగా నవ్వాడు.”అనూష, నువ్వు నాకు కొత్త పరిచయం కాదు. ఏదైనా ఉంటే నీ గొంతులోనే తెలిసిపోతుంది.”
“నిద్ర వస్తుంది అంతే.”
“అబద్ధం.”
మళ్ళీ మౌనం.
“ఏమైంది?” మెల్లగా అడిగాడు.
“ఏం కాలేదు.”
“ష్యూర్?”
“హ్మ్.”
“అమ్మతో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా?”
ఆ ప్రశ్న వినగానే అనూష కాసేపు ఏమీ మాట్లాడలేదు.
“అదేంటి అలా అడిగావ్?”
“ఊరికే కాదు. ఏదో జరిగింది. అత్త కోడళ్ళు ఓకే ఒరలో ఉన్నారు కదా! డౌట్ వచ్చి.”
అనూష నిట్టూర్చింది.”పెద్ద విషయం ఏం కాదు.”
“అంటే ఏదో ఉందన్న మాట.”
“అత్తయ్య ఇవాళ మళ్ళీ నా పోలాండ్ జాబ్ గురించి అడిగారు.”
“ఏమని?”
“‘ఎక్కడ పని చేసేదానివి?’… ‘ఎంత జీతం?’… ‘ఎవరు ఓనర్?’… ‘ఇంకెవరు పనిచేసేవాళ్లు?’… ఇలా.”
“నువ్వేం చెప్పావ్?”
“రిసెప్షనిస్ట్ అన్నా.”
“అంతేనా?”
“అంతే.”
“తర్వాత?”
“ఏం లేదు. మామూలుగానే అయిపోయింది.”
కిరణ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు.”అనూష…”
“హ్మ్?”
“అమ్మకి ఏమైనా డౌట్ వచ్చిందా?”
“తెలియదు.”
“నిజంగానే తెలియదా… లేక నన్ను కంగారు పెట్టకూడదని చెప్తున్నావా?”
అనూష చిన్నగా నవ్వింది.”రెండోది కాస్త ఎక్కువ.”కిరణ్ కూడా నవ్వాడు. కానీ ఆ నవ్వు కళ్ల వరకు రాలేదు.”సరే… నేను అమ్మతో మాట్లాడతాను.””వద్దు.””ఎందుకు?””ఇలాంటి విషయానికి మీరు ఇద్దరూ గొడవపడడం నాకు ఇష్టం లేదు.””గొడవ కాదు అనూష.””కానీ అవుతుంది.”కిరణ్ ఏమీ మాట్లాడలేదు.”ఇది కొత్తేమీ కాదు కిరణ్,” అంది అనూష మెల్లగా. “దాదాపు ప్రతి అత్తా కొత్త కోడల్ని కొంచెం పరీక్షిస్తుంది. నేను కూడా అలానే అనుకున్నా. పోతుంది.””అయినా…””ప్లీజ్.”మళ్ళీ నిశ్శబ్దం.”సరే,” అన్నాడు కిరణ్ చివరికి. “ఇప్పటికి ఏం మాట్లాడను.”అనూష ఊపిరి పీల్చుకుంది.”థాంక్యూ.”కాల్ కట్ అయిన తర్వాత కూడా కిరణ్ ఫోన్ చేతిలోనే పట్టుకుని కూర్చున్నాడు.”అమ్మతో మాట్లాడాలా… వద్దా?”అనే ఆలోచన అతని మనసులో మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉంది.ఒకవైపు అనూష మాట.మరోవైపు అమ్మ ప్రవర్తన.ఏది సరైనదో అర్థం కాక, చివరికి ఫోన్ పక్కన పెట్టి లైట్ ఆర్పేశాడు.”ఇప్పుడే అమ్మని నిలదీస్తే… ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందేమో.”అనే ఆలోచనే ఆ రాత్రి అతన్ని నిద్రపోనివ్వలేదు. -
మృత్యువు తొడిగిన పూలదండ (భాగం 16)
స్థలం: వైజాగ్, పాత విక్టరీ క్లబ్ ఆవరణ – తెల్లవారుజామున 5:45 గంటలు.
రమ్యను బన్నీ వాస్ రౌడీలు చుట్టుముట్టడం, సరిగ్గా అదే సమయానికి వెంకటరెడ్డి పంపిన పవర్‌ఫుల్ సెక్యూరిటీ హెడ్ ‘శివ’ తన బుల్లెట్ బైక్ దిగడం చూసి బన్నీ వాస్ ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. శివ బాడీ లాంగ్వేజ్, కళ్లల్లో ఉన్న పొగరు చూస్తేనే వాడు మామూలోడు కాదని అర్థమవుతోంది.
“రేయ్! రెడ్డి గారి మనుషుల జోలికి వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదా? ఆయుధాలు కింద పడేసి ఇక్కడి నుంచి పారిపొండి, లేదంటే ఈ రోడ్డు మీదే మీ శవాలు ఉంటాయి!” శివ తన నడుముకున్న గన్‌ని గట్టిగా పట్టుకుంటూ హెచ్చరించాడు.
బన్నీ వాస్ క్షణంలో తేరుకుని, తన చుట్టూ ఉన్న నలుగురు రౌడీల వైపు చూశాడు. “రేయ్! వచ్చింది ఒక్కడే కదరా… వీడిని కూడా చంపేయండి!” అని అరిచాడు.
నలుగురు రౌడీలు ఇనుప రాడ్లతో శివ మీదికి దూకారు.శివ క్షణంలో పక్కకు తప్పుకుంటూ, ఒక రౌడీ చేతిని పట్టుకుని నొక్కి, వాడి చేతిలోని రాడ్‌ను లాక్కుని వాడి మోకాళ్ల మీదే బలంగా బాదాడు. వాడు నొప్పితో కింద పడిపోగానే, మరో రౌడీని కాలితో తన్ని స్కార్పియో కారు అద్దాల మీద పడేలా విసిరాడు. శివ ఒంటరిగానే బన్నీ వాస్ మనుషులను ఊచకోత కోస్తున్నాడు.
సరిగ్గా అదే సమయంలో… ఆ పాత బిల్డింగ్ వెనుక ఉన్న దట్టమైన చెట్ల పొదల్లోంచి ఇద్దరు వ్యక్తులు గన్స్‌తో బయటకు దూకారు. వాళ్లు మరెవరో కాదు… చింతపల్లి స్టేషన్ నుండి బన్నీ వాస్ కదలికలపై నిఘా పెట్టడానికి చంద్రమౌళి పంపిన ఆ ఇద్దరు సివిల్ డ్రెస్ కానిస్టేబుల్స్! బన్నీ వాస్ రిసార్ట్ నుండి కారు తీసినప్పటి నుండి వాళ్లు రహస్యంగా వాడిని బైక్ పై ఫాలో అవుతూ వైజాగ్ దాకా వచ్చారు. చుట్టుపక్కల జనం లేకపోవడం, బన్నీ వాస్ మనుషులు శివతో గొడవ పడుతుండటంతో వాళ్లు రంగంలోకి దిగారు.
“పోలీస్! ఎవరూ కదలొద్దు!” అంటూ ఒక కానిస్టేబుల్ గాలిలోకి ఒక రౌండ్ కాల్చాడు.ఆ తుపాకీ శబ్దానికి విక్టరీ క్లబ్ ఆవరణ ఒక్కసారిగా దద్దరిల్లింది. బన్నీ వాస్ గ్యాంగ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. శివ కూడా పోలీసులను చూసి ఒక్క క్షణం ఆగాడు. సివిల్ డ్రెస్ లో ఉన్న ఇద్దరు పోలీసులు చేతుల్లో గన్స్ పట్టుకుని రమ్యకు అడ్డంగా నిలబడ్డారు.
బన్నీ వాస్ గాయపడిన తన రౌడీలను చూసి కోపంతో ఊగిపోయాడు. వాడు చాకచక్యంగా కారు వెనుక వైపు నుండి తిరిగి, కారు డాష్ బోర్డ్‌లో దాచిన ఒక చిన్న రివాల్వర్‌ను తీసి… ఊహించని విధంగా శివ వైపు గురి చూసి ట్రిగ్గర్ నొక్కాడు.
టాంగ్!
బుల్లెట్ శివ భుజాన్ని దూల్చుకుంటూ వెళ్ళింది. శివ నొప్పితో కింద పడిపోయాడు. అది చూసి పోలీసులు బన్నీ వాస్ వైపు గన్ గురిపెట్టే లోపే, మిగతా ఇద్దరు రౌడీలు ఇనుప రాడ్లతో ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ చేతుల మీద బలంగా బాదారు. గన్స్ కింద పడిపోయ్యాయి. బన్నీ వాస్ గ్యాంగ్ మళ్లీ పైచేయి సాధించింది.
బన్నీ వాస్ పొగలు కక్కుతున్న ఆ గన్‌ను రమ్య వైపు గురిపెడుతూ, క్రూరంగా నవ్వాడు. “చూశావా లాయర్ గారూ… నిన్ను కాపాడటానికి వచ్చిన వెంకటరెడ్డి కుక్క మోకరిల్లిపోయింది. ఇక ఆ సిఐ చంద్రమౌళి అంటావా… వాడు ఎప్పుడో ఘాట్ రోడ్డు లోయలో శవమయ్యాడు! ఇక నిన్ను రక్షించే నాథుడే లేడు. చెప్పు, రవికుమార్ పెన్‌డ్రైవ్ ఎక్కడ దాచాడు?” అంటూ కాలు ముందుకు వేశాడు.
బన్నీ వాస్ అన్న మాటలకి రమ్య ఒక్కసారిగా తీవ్రమైన షాక్‌కు గురైంది. చంద్రమౌళి చనిపోయాడా? ఈ కేసును నిజాయితీగా ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఏకైక పోలీస్ ఆఫీసర్ చనిపోతే… ఇక భూపతి రెడ్డిని ఆపడం ఎవరి తరం కాదు! రమ్య ముఖంలో భయం, నిస్సహాయత కమ్ముకున్నాయి.
బన్నీ వాస్ గన్ ట్రిగ్గర్ మీద వేలు నొక్కబోయాడు…సరిగ్గా అదే క్షణంలో… ఎక్కడి నుంచో “ధాం!” మంటూ ఒక తుపాకీ శబ్దం ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినపడింది. మరుసటి క్షణమే… ఒక బుల్లెట్ పదునుగా దూసుకొచ్చి కరెక్ట్‌గా బన్నీ వాస్ చేతిలోని గన్‌ను ఢీకొట్టింది!”ట్రింగ్!” మనే లోహపు శబ్దంతో బన్నీ వాస్ చేతిలోని గన్ గాల్లోకి ఎగిరి దూరంగా పడిపోయింది.
బన్నీ వాస్ చేతి వేళ్లు మొద్దుబారిపోయి నొప్పితో వెనక్కి తగ్గుతుండగా… రోడ్డు చివర నుండి టైర్ల ఘర్షణ శబ్దంతో (Brake Screech) ఒక పల్సర్ బైక్ దూసుకొచ్చి వాళ్ల ముందు ఆగింది. బైక్ పై నుండి దిగిన ఆ వ్యక్తి… ముఖం నిండా రక్తం కారుతున్నా, ఖాకీ చొక్కాపై బ్లడ్ స్టెయిన్స్ తో, చేతిలో పొగలు కక్కుతున్న రివాల్వర్ పట్టుకుని సింహంలా నిలబడ్డాడు.
ఆ లుక్ లో ఉన్న సిఐ చంద్రమౌళిని చూడగానే… చనిపోయాడనుకున్న వాడు బతికే ఉన్నాడని బన్నీ వాస్ గుండె ఆగిపోయినంత పని అయింది!
చంద్రమౌళి తన రివాల్వర్‌ను నేరుగా బన్నీ వాస్ నుదుటికి గురిపెడుతూ, గంభీరమైన గొంతుతో అరిచాడు:”నువ్వు నా చావును చూద్దామనుకున్నావు బన్నీ వాస్… కానీ ఖాకీ డ్రెస్ వేసుకున్న ఈ చంద్రమౌళి వేటను ఇంకా చూడలేదు కదా! రేయ్… ఒక్క అడుగు ముందుకు వేసినా మీ కపాలాలు కర కరలాడే అప్పడాలలాగా పగిలిపోతాయి!”
అటు భుజం గాయంతో ఉన్న శివ, ఇటు చేతులు విరిగి కింద పడ్డ కానిస్టేబుల్స్, భయంతో వణుకుతున్న బన్నీ వాస్ గ్యాంగ్… వాళ్ల మధ్యలో రక్తం కారుతున్న సింహంలా చంద్రమౌళి!
రమ్య ఆ భయంకరమైన యాక్షన్ వాతావరణం నుండి తప్పుకుని, రవికుమార్ దాచిన ఆ పెన్‌డ్రైవ్‌ను విక్టరీ క్లబ్ పాత బిల్డింగ్‌లో కనిపెట్టగలదా? ఈ లోపు భూపతి రెడ్డికి ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాడు ఎలాంటి ఘోరానికి ఒడిగడతాడు? అన్నది తరువాయి భాగం కోసం వేచి చూడండి! -
రహస్య కోడలు – అగ్ని పర్వతం బద్దలు (భాగం 10)
ఒక ఆదివారం ఉదయం, సరోజ వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేస్తూ, తన స్నేహితురాలు రాధకి కాల్ చేసింది.
“ఏం చేస్తున్నావ్ రాధా?”
“ఏం లేదు, ఇప్పుడే టిఫిన్ చేసుకుని కూర్చున్నా. మీ ఇంట్లో అంతా బాగున్నారా? కొత్త కోడలు ఎలా ఉంది?” రాధ అడిగింది.
“బానే ఉంది, బానే సర్దుకుంటోంది ఇంటి పద్ధతులకి,” సరోజ చెప్పింది, బాల్కనీలోకి వెళ్తూ.
కాసేపు వాళ్ళ ఇద్దరి పిల్లల గురించి, ఈమధ్య వచ్చిన ఏదో సీరియల్ గురించి కబుర్లు చెప్పుకున్నారు.
మాటల మధ్యలో, సరోజ కొంచెం తేలిక చేసి అంది, “ఒక్క విషయం రాధా, నాకు అర్థం కాలేదు – మా అనూష క్రాకోలో ఏం పని చేసిందో అడిగితే ఎప్పుడూ దాటవేస్తుంది. IT job అని చెప్తుంది కానీ డీటెయిల్స్ ఏం చెప్పదు.”
రాధ కాసేపు ఆలోచించి అంది, “మా అమ్మాయి స్నేహితురాలు ఒకామె కూడా పోలండ్‌లోనే ఉంది క్రాకోలోనే. అడిగి చూడనా ఏమన్నా తెలుసా అని?”
సరోజ ఒక్క క్షణం ఆగింది. “వద్దులే రాధా, అలా అనుషాకి తెలియకుండా తెలుసుకోవడం కరెక్ట్ కాదు,” అని అంది. కానీ మనసులో ఆసక్తి మాత్రం చంపుకోలేకపోయింది. “సరే, అడిగితే ఏమన్నా తెలిస్తే చెప్పు,” అని చివరికి ఒప్పుకుంది.
కాల్ పెట్టేశాక, రాధ తన అమ్మాయికి మెసేజ్ పెట్టింది, ఆ అమ్మాయి తన స్నేహితురాలికి పంపింది. ఇలా ఒకరి నుండి ఒకరికి ప్రశ్న ప్రయాణించి, చివరికి అది సరిగ్గా అనూష పాత కొలీగ్ దగ్గరికే చేరింది – ప్రపంచం ఎంత చిన్నదో ఋజువు చేస్తూ.మూడు రోజుల తర్వాత, రాధ సరోజకి తిరిగి కాల్ చేసింది, గొంతులో కొంచెం సంకోచంతో.
“సరోజా, ఒక విషయం చెప్పాలి, కానీ నీకు నచ్చుతుందో లేదో తెలియదు.”
సరోజ గుండె వేగం పెరిగింది. “ఏంటి రాధా, చెప్పు.”
“మా అమ్మాయి ఫ్రెండ్ దగ్గర తెలిసింది – మీ కోడలు క్రాకోలో ఒక బార్‌లో వెయిటర్‌గా పని చేసిందంట, అంతేకాకుండా వీకెండ్స్‌లో ఏదో స్పా సెంటర్ లో కూడా చేసేదంట. ఇది వినగానే నేను షాక్ అయ్యా! IT job అనేది నిజం కాదు సరోజ.”
సరోజ చేతిలో ఉన్న ఫోన్ జారిపోబోయింది. నెమ్మదిగా “ఖచ్చితంగా తెలుసా నీకు?” అంది.
“ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆ అమ్మాయి స్వయంగా చెప్పిందంట మా అమ్మాయికి, ఏదో పాత కామన్ కొలీగ్ దగ్గర్నుండి తెలిసిందని.”
కాల్ పెట్టేశాక, సరోజ చాలాసేపు అలానే కూర్చుండిపోయింది, మనసులో వేల ఆలోచనలు తిరుగుతూ. కోపం, బాధ, మోసపోయిన ఫీలింగ్ – అన్నీ కలగలిపి.
“నాకు అబద్ధం చెప్పింది. నా కొడుక్కి ఇది తెలుసా, తెలియకపోతే ఎలా చెప్పను?” అనుకుంది, గుండెల్లో ఏదో బరువు పేరుకుపోతూ.ఆ సాయంత్రం, అనూష బాల్కనీలో నుండి కిందకి చూస్తూ Blinkit డెలివరీ బాయ్ కోసం ఎదురుచూస్తోంది, ఆర్డర్ పెట్టిన కూరగాయలు రావాల్సి ఉంది. డెలివరీ తీసుకుని లోపలికి వచ్చేసరికి, సరోజ హాల్‌లో సోఫాలో కూర్చుని ఉంది, మొహం చాలా గంభీరంగా.
“అత్తయ్యా, ఏమైంది? బాలేదా?” అనూష కంగారుగా అడిగింది, డెలివరీ బ్యాగ్ కింద పెడుతూ.
సరోజ తలెత్తి చూసింది, కళ్ళలో ఏదో కొత్త చూపు – నమ్మకం పోయిన చూపు. “అనూషా, కూర్చో. నీతో మాట్లాడాలి.”
అనూష గుండె ఒక్కసారి జారిపోయినట్టు అనిపించింది. ఆ స్వరంలో ఉన్న తేడా ఆమెకి వెంటనే అర్థమైంది – ఏదో తప్పు జరిగిందని.”ఏంటి అత్తయ్యా?” అడిగింది, గొంతు వణుకుతూ, కానీ ఏం జరగబోతోందో ఆమెకి లోపల్లోపలే తెలిసిపోయింది.
సరోజ నేరుగా ఆమె కళ్ళలోకి చూసింది. “నువ్వు క్రాకోలో IT job చేయలేదు కదా. వెయిటర్‌గా కదా. నిజం చెప్పు?”గదిలో నిశ్శబ్దం అలుముకుంది.
అనూష చేతులు వణుకుతున్నాయి, మాట్లాడాలని ప్రయత్నించింది కానీ మాటలు రాలేదు మొదట్లో.”ఎవరు చెప్పారు మీకు?” అని మాత్రమే అడగగలిగింది, గొంతు పగిలిపోతూ.
“అది ముఖ్యం కాదు ఇప్పుడు. నిజమేనా అది, అవునా కాదా?” సరోజ గొంతులో కోపం, బాధ రెండూ కలగలిపి ఉన్నాయి.
అనూష కళ్ళలో నీళ్ళు తిరిగాయి, తల దించుకుంది. “అవును అత్తయ్యా. నిజమే.”ఆ ఒప్పుకోలుతో గదిలో ఒక భారీ నిశ్శబ్దం అలుముకుంది – మూడు నెలలుగా పేరుకుపోయిన అనుమానం, భయం, ఇప్పుడు ఒక్క క్షణంలో నిజమైన మాటగా మారిన క్షణం.
సరోజ, అనుషాలు ఒకరిని ఒకరు చూడకుండా తల దించుకునే మౌనంగా ఉన్నారు. ఒకరు మౌనం వెనుక ” అబద్ధం చెప్పాల్సిన అవసరమేముందని దీర్ఘ ఆలోచన ” మరొకరి మౌనం వెనుక ” ఈమెకు నేను కాక్రో లో చేసిందంతా తెలిసిపోయిందా? ఈ విషయం కిరణ్ కు చెబితే ఏమవుతుంది? ” అని… -
మృత్యువు తొడిగిన పూలదండ (భాగం 15)
స్థలం: నేషనల్ హైవే – ఘాట్ రోడ్డు మలుపు – అర్ధరాత్రి 3:42 గంటలు.
భారీ కంటైనర్ లారీ కారు వెనుక భాగాన్ని రెండోసారి బలంగా ఢీకొట్టడంతో… చంద్రమౌళి కారు రోడ్డు పక్కన ఉన్న లోయ రక్షణ గోడను బద్దలు కొట్టుకుంటూ అంచుకు వెళ్ళిపోయింది. కారు ముందరి టైర్లు గాల్లో తేలాయి. లారీ డ్రైవర్ కారును పూర్తిగా లోయలోకి నెట్టేయడానికి గేర్ మార్చి, యాక్సిలరేటర్ గట్టిగా తొక్కాడు. లారీ ఇంజన్ భయంకరంగా సౌండ్ చేస్తుంది.
కానీ అవతలి వైపు ఉన్నది ముప్పై ఏళ్ల సర్వీస్ ఉన్న సిఐ చంద్రమౌళి!మృత్యువు కళ్లముందు కనిపిస్తున్నా అతను నిబ్బరం కోల్పోలేదు. లారీ తన కారును పూర్తిగా నొక్కేయడానికి ముందే… చంద్రమౌళి సీట్ బెల్ట్ విప్పేసి, కారు డ్రైవింగ్ సీట్ పక్కనున్న ఉన్న డోర్‌ను బలంగా త్రోసి బయటకు దూకాడు. అతను నేలపై పడి పక్కకు దొర్లిన మరుసటి క్షణంలోనే… లారీ కారును పూర్తిగా లోయలోకి నెట్టేసింది.
చంద్రమౌళి కారు వందల అడుగుల లోతులో ఉన్న చీకటి లోయలోకి పడిపోతూ భయంకరమైన శబ్దంతో పేలిపోయింది.లారీ డ్రైవర్ కారు లోయలో పడటం చూసి, చంద్రమౌళి చనిపోయాడని అనుకుని లారీని వెనక్కి తీసి స్పీడ్‌గా పారిపోవడానికి ప్రయత్నించాడు.కానీ అప్పటికే నేలపై నుండి లేచిన చంద్రమౌళి ముఖం నిండా రక్తం కారుతున్నా, కళ్లల్లో భయంకరమైన కోపంతో లారీ వైపు పరుగెత్తాడు.
నడుముకున్న సర్వీస్ రివాల్వర్‌ను తీసి, లారీ క్యాబిన్ అద్దాన్ని గురిచూసి ట్రిగ్గర్ నొక్కాడు.టాంగ్! టాంగ్! అని రెండు బుల్లెట్లు అద్దాన్ని దూల్చుకుంటూ డ్రైవర్ భుజంలోకి దూసుకెళ్లాయి.డ్రైవర్ నొప్పితో అరుస్తూ లారీ స్టీరింగ్‌ను వదిలేశాడు. కంట్రోల్ తప్పిన ఆ భారీ లారీ రోడ్డు పక్కన ఉన్న కొండను బలంగా ఢీకొట్టి, ఒక వైపుకు వరిగిపోయి ఆగిపోయింది. చంద్రమౌళి పరుగెత్తుకుంటూ వెళ్లి లారీ డోర్ తెరిచి, గాయపడిన డ్రైవర్ కాలర్ పట్టుకుని కిందకు లాగాడు.
“ఎవర్రా నిన్ను పంపింది? భూపతి రెడ్డి హ, నా కొడుకా మాట్లాడు! లేదంటే నీ పుర్రె పుచ్చకాయలా పేలుతుంది.” అంటూ చంద్రమౌళి రివాల్వర్ బారెల్‌ను వాడి నోట్లో పెట్టాడు.
డ్రైవర్ రక్తం కక్కుకుంటూ భయంతో వణుకుతూ, “సార్… బన్నీ వాస్ సార్… బన్నీ వాస్ సార్ డబ్బులిచ్చి మిమ్మల్ని లేపేయమన్నాడు. అందుకే మిమ్మల్ని చంపాలని చూసాను సార్, అంతకమించి నాకేమి తెలియదు.” అని నిజం ఒప్పేసుకున్నాడు.
బన్నీ వాస్ పేరు వినగానే చంద్రమౌళికి విషయం అర్థమైపోయింది. వాడు తనను చంపడానికి ఇక్కడ స్కెచ్ వేశాడంటే… స్టేషన్ నుండి బయలుదేరినప్పుడు శ్రీను చూపించిన ఆ సీక్రెట్ మెసేజ్ గుర్తుకొచ్చింది. అందులో రమ్యను ఆపడం అనే పాయింట్ ఉంది. అంటే, ఒకే రాత్రి తనను ఇక్కడ లేపేస్తూ, అటు వైజాగ్ వైపు వెళ్తున్న లాయర్ రమ్యను కూడా వాళ్లు టార్గెట్ చేశారని చంద్రమౌళి ఇన్వెస్టిగేటివ్ మైండ్ వెంటనే పసిగట్టింది.”నన్నే ఇక్కడ చంపాలని చూశారంటే… ఒంటరిగా వెళ్తున్న రమ్యను వాళ్లు అస్సలు వదిలిపెట్టరు!” అని చంద్రమౌళి గుండె ఆవేశంతో కొట్టుకుంది.
అతను గాయాలతోనే హైవే పై వస్తున్న ఒక బైకర్ ని ఆపి, పోలీస్ ఐడీ కార్డ్ చూపిస్తూ ఆ బైక్ తీసుకుని వైజాగ్ వైపు పిడుగులా బయలుదేరాడు.
స్థలం: వైజాగ్, పాత విక్టరీ క్లబ్ రోడ్డు – తెల్లవారుజామున 5:30 గంటలు.
చింతపల్లి ఘాట్ రోడ్డు నుండి దాదాపు రెండున్నర గంటల పాటు కారును అత్యంత వేగంగా డ్రైవ్ చేసిన రమ్య… తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో వైజాగ్ లోని పాత విక్టరీ క్లబ్ రోడ్డుకు చేరుకుంది.కారు దిగడానికి ముందే రమ్య కారులోనే వెంకట రెడ్డికి తిరిగి ఫోన్ చేసింది.
“సార్! రవి పంపిన క్లూ ని నేను డికోడ్ చేశాను. రవికుమార్ కాలేజ్ రోజుల్లో గెలిచిన మొదటి చెస్ టోర్నమెంట్ వైజాగ్ లోని ‘విక్టరీ క్లబ్’ లోనే జరిగింది. ఆ పక్కనే ఉన్న పాత బిల్డింగ్ లోనే వాడు మొదటి ఆఫీస్ లో పనిచేశాడు. ప్రస్తుతం ఇది మూసేసి ఉంది. ఆ పెన్‌డ్రైవ్ అక్కడే దాచి ఉంటాడు సార్, నేను ప్రస్తుతం ఆ లొకేషన్ లోనే ఉన్నాను,” అని చెప్పింది.
“వెరీ గుడ్ రమ్య! కానీ ఒంటరిగా లోపలికి వెళ్లొద్దు. భూపతి రెడ్డి గాడు చాలా డేంజర్. నా పర్సనల్ సెక్యూరిటీ టీమ్ ని ఇప్పుడే అక్కడికి అలర్ట్ చేస్తున్నాను, జాగ్రత్త!” అని వెంకట రెడ్డి అవతలి నుండి సమాధానమిచ్చాడు.
రమ్య ఫోన్ కారులోనే పెట్టేసి, టార్చ్ లైట్ తీసుకుని కారు దిగింది. తెల్లవారుజామున మసక చీకటిగా, నిశ్శబ్దంగా ఉన్న ఆ పాత భవనం వైపు ఆమె నడుస్తుండగా…
హఠాత్తుగా ఆమె కారు వెనుక ఒక నల్లటి స్కార్పియో కారు లైట్లు ఆఫ్ చేసి వచ్చి ఆగింది. అందులోంచి నలుగురు రౌడీలు చేతుల్లో ఇనుప రాడ్లతో దిగారు. వారి ముందు నవ్వుకుంటూ నడిచి వస్తున్నాడు రిసార్ట్ మేనేజర్ బన్నీ వాస్!
అప్పటికే చింతపల్లి నుండి రమ్య కారును రహస్యంగా ఫాలో అవుతూ వాళ్లు ఇక్కడి దాకా వచ్చారు.రమ్య వెనక్కి తిరిగి చూసి షాక్ అయింది.
“ఆగమ్మా లాయర్ గారూ! వెలుతురు లేని ఈ చీకట్లో టార్చ్ లైట్ తో ఇక్కడ ఏం వెతుకుతున్నారు?” బన్నీ వాస్ కపటంగా నవ్వుతూ అడిగాడు.
“ఎవరు నువ్వు మిస్టర్! నన్ను ఎందుకు ఫాలో చేశావు?” రమ్య ధైర్యం నటిస్తూ అడిగింది.
“రాకపోతే ఎలా అమ్మా? భూపతి రెడ్డి సార్ కి వ్యతిరేకంగా ఉన్న ఆ పెన్‌డ్రైవ్ కోసం మీ ఇద్దరూ ఇంత డ్రామా ఆడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? రవికుమార్ దాచిన ఆ పెన్‌డ్రైవ్ ఎక్కడుందో మాతో చెప్తే… నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం. లేదంటే ఈ పాత బిల్డింగ్ లోనే నీ శవం దొరుకుతుంది,” బన్నీ వాస్ రాడ్ పట్టుకున్న తన మనుషులకు సైగ చేశాడు. వాళ్లు రమ్యను చుట్టుముట్టారు.రమ్య వెనక్కి అడుగులు వేస్తూ పాత భవనం గోడకు ఆనుకుంది. ప్రాణాపాయంలో ఉన్న రమ్యను కాపాడటం ఇప్పుడు ఎవరి వల్ల సాధ్యం కాదు అనుకుంటున్న తరుణంలో…
సరిగ్గా అదే సమయంలో… ఆ చీకటి రోడ్డు చివర నుండి ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ భయంకరమైన శబ్దంతో దూసుకొచ్చింది. ఆ బైక్ హెడ్‌లైట్ వెలుతురు నేరుగా బన్నీ వాస్ మనుషుల కళ్ల మీద పడింది.బైక్ ఆపి, స్టాండ్ వేసి దిగిన ఆ వ్యక్తిని చూసి బన్నీ వాస్ ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ వచ్చింది మరెవరో కాదు… చేతిలో పదునైన పగతో, వెంకట రెడ్డి ఆదేశంతో సరిగ్గా సమయానికి చేరుకున్న ఆయన సొంత సెక్యూరిటీ ఫోర్స్ హెడ్!
అటు ఘాట్ రోడ్డు యాక్సిడెంట్ నుండి తప్పించుకుని బైక్ పై వస్తున్న సిఐ చంద్రమౌళి… ఇటు విక్టరీ క్లబ్ లో ముంచుకొచ్చిన గ్యాంగ్ వార్… కథ ఇప్పుడు ఏ భయంకరమైన మలుపు తీసుకోబోతోందొ? -
రహస్య కోడలు – కొత్త కాపురం (భాగం 9)
కాపురం మొదలైన మొదటి వారం రోజులు ఒక కలలా గడిచిపోయాయి.కిరణ్ లండన్ తిరిగి వెళ్ళే ముందు కొన్ని రోజులు హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు, అనూషతో కలిసి.
సరోజ ఇంట్లో ముగ్గురూ – కొత్త కోడలు, కొడుకు, తల్లి – ఒక కొత్త లయలో ఇమడటానికి ప్రయత్నిస్తున్నారు.
అనూష ప్రతిరోజూ ఉదయాన్నే లేచి, సరోజకి ఇష్టమైన ఫిల్టర్ కాఫీ కలిపేది, వంటింట్లో సాయం చేసేది. “మీకు ఏం కావాలన్నా చెప్పండి అత్తయ్యా, నేను నేర్చుకుంటా,” అనేది వినయంగా.
సరోజకి కోడలి ఈ ప్రయత్నం నచ్చింది, కానీ మనసులో ఇంకా ఆ ప్రశ్న అలానే ఉండిపోయింది – క్రాకోలో అనూష ఏం చేసేది అనేది. నిశ్చితార్థం ముందు రోజు కాల్ కట్ అయిపోయాక మళ్ళీ అడగలేదు, కానీ మర్చిపోలేదు కూడా.
ఒక సాయంత్రం, ముగ్గురూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు, సరోజ ఏదో మాటల మధ్యలో అడిగింది.
“అనూషా, నువ్వు క్రాకోలో పని చేసిన కంపెనీ పేరు ఏంటి? నా స్నేహితురాలి అబ్బాయి కూడా అక్కడే ఏదో IT కంపెనీలో ఉన్నాడంట, తెలుసేమో అని.”
అనూష చేతిలో ముద్ద ఆగిపోయింది ఒక్క క్షణం. “అదీ… చిన్న కంపెనీ అత్తయ్యా, మీకు తెలిసే ఛాన్స్ లేదు,” అని దాటవేసింది, వెంటనే విషయం మార్చింది.
“ఈ కూర చాలా బాగుంది, ఎలా చేశారు?”సరోజ ఆ మార్పుని గమనించింది, కానీ ఏమీ అనలేదు అప్పటికి. కిరణ్ మాత్రం భార్య మొహంలో ఆ ఒక్క క్షణం కనిపించిన కంగారుని చూశాడు, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు – బహుశా అలసటేమో అనుకున్నాడు.
వారం రోజుల తర్వాత, కిరణ్ లండన్ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది, పని ఒత్తిడి వల్ల. ఎయిర్‌పోర్ట్‌లో వీడ్కోలు చెప్తూ, అనూష కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
“కొన్ని వారాలే కదా, తొందరగా వచ్చేస్తా,” కిరణ్ ఆమెని దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు.
“తెలుసు, కానీ అత్తయ్యతో ఒక్కదాన్నే ఉండాలంటే కొంచెం భయంగా ఉంది,” నిజాయితీగా చెప్పింది అనూష.
“ఎందుకు భయం? అమ్మ ఏమైనా ఇబ్బంది పెట్టిందా, నీకు నచ్చింది కూడా,” కిరణ్ ఆశ్చర్యంగా అడిగాడు.
“ఏం లేదు, కొత్త ఇల్లు, కొత్త మనిషి కదా, అలవాటు పడాలంతే,” అంది అనూష, నిజం మాటల్లో సగం మాత్రమే చెప్తూ.
కిరణ్ ఆమె భుజం మీద చేయి వేసి, “నేను దూరంగా ఉన్నా, ఫోన్‌లో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. అమ్మ కూడా నిన్ను అర్థం చేసుకుంటుంది, టైమ్ ఇవ్వు,” అని ధైర్యం చెప్పాడు.
అనూష తలూపింది, మనసులో ఉన్న అసలు భయాన్ని అతనికి కూడా పూర్తిగా చెప్పకుండా.
కిరణ్ వెళ్ళిపోయాక, ఇంట్లో సరోజ, అనూష ఇద్దరే మిగిలారు. మొదటి కొన్ని రోజులు బాగానే గడిచాయి – సరోజ కోడలికి ఇంటి పద్ధతులు నేర్పించడం, అనూష శ్రద్ధగా నేర్చుకోవడం.కానీ నెమ్మదిగా, చిన్న చిన్న సందర్భాల్లో అనూష తన లోపలి భయాన్ని దాచుకోవడంలో సడలింపు చూపించడం మొదలుపెట్టింది.
ఒకరోజు సాయంత్రం, టీవీలో ఏదో NRI జీవితం గురించిన కార్యక్రమం వస్తుంటే, సరోజ మామూలుగా అంది.
“నువ్వు కూడా విదేశాల్లో ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు ఏమైనా చూశావా? చాలామంది కష్టపడతారు అంటారు కదా మొదట్లో.”
అనూష ఒక్క క్షణం ఆగింది, గుండె వేగం పెరిగింది. “అవును అత్తయ్యా, మొదట్లో కొంచెం కష్టంగా ఉండేది…” అని మొదలుపెట్టబోతుండగా, ఫోన్ మోగింది – ఒక పాత స్నేహితురాలి కాల్.
“సారీ అత్తయ్యా, ఒక్క నిమిషం,” అని లేచి గదిలోకి వెళ్ళిపోయింది, ఆ సంభాషణ మళ్ళీ మధ్యలోనే ఆగిపోయింది. లోపల ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంది – ఈసారి కూడా తప్పించుకోగలిగినందుకు రిలీఫ్, కానీ ఎంతకాలం ఇలా తప్పించుకోగలదు అనే భయం రెండూ కలగలిపి.
సరోజ సోఫాలో అలానే కూర్చుండిపోయింది, కొంచెం ఆలోచనలో పడుతూ. “ఈ పిల్ల ఏదో దాచుతోంది,” అనే అనుమానం మనసులో మరింత బలపడింది, కానీ దాన్ని పైకి చెప్పలేదు.
ఆ రాత్రి, కిరణ్ కాల్ చేశాడు, ఎప్పటిలానే గంటసేపు మాట్లాడారు ఇద్దరూ. కిరణ్ తన ఆఫీస్ కబుర్లు చెప్పాడు, అనూష వంట నేర్చుకుంటున్న కొత్త వంటకాల గురించి నవ్వుతూ చెప్పింది, ఇద్దరూ కలిసి టైటానిక్ సినిమా చూద్దాం అని ప్లాన్ చేసుకున్నారు అతను వచ్చాక.
మాటల మధ్యలో కిరణ్ అడిగాడు, “ఏం చేస్తున్నారు ఇవాళ అమ్మతో?”అనూష గొంతులో ఒక్క క్షణం తడబాటు వచ్చింది.
“బానే ఉంది, టీవీ చూస్తూ కూర్చున్నాం సాయంత్రం,” అంది, ఆ సంభాషణ ఎక్కడ ఆగిందో ప్రస్తావించకుండా.
“అంతేనా? ఏం మాట్లాడుకోలేదా?” కిరణ్ మామూలుగానే అడిగాడు, ఏదో పట్టుకోవాలని కాదు.
” ప్రత్యేకంగా అంటూ ఏమి లేదు,” అంది అనూష, విషయం మార్చేసింది వెంటనే. “నీకు తెలుసా, ఇవాళ నేను చేసిన బిర్యానీ అత్తయ్యకి బాగా నచ్చింది, మళ్ళీ మళ్ళీ వడ్డించుకున్నారు.
“కిరణ్ నవ్వాడు, ఆ టాపిక్ షిఫ్ట్ గమనించకుండా. “వావ్, నువ్వు వచ్చే వారానికి నాకు కూడా చేసి పెట్టాలి మరి.”
సంభాషణ మామూలుగానే కొనసాగింది, నవ్వులు, కబుర్లు, ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ మాటల్లో స్పష్టంగా కనిపిస్తూ. కానీ ఫోన్ పెట్టేశాక, అనూష చీకటి గదిలో ఒంటరిగా కూర్చుండిపోయింది. తనలో తానే మాట్లాడుకుంది, “కిరణ్‌కి కూడా చెప్పలేను ఇది. ఏమనుకుంటాడో, నేను అతన్ని పెళ్ళికి ముందు మోసం చేసినట్టు ఫీలవుతాడేమో.”
ఈ ఒక్క భారాన్ని మాత్రం ఒంటరిగా మోయడం తప్ప వేరే దారి కనిపించలేదు ఆమెకి, మిగతా జీవితం మొత్తం అతనితో పూర్తిగా పంచుకుంటున్నా.
రోజులు గడుస్తున్న కొద్దీ, ఇంట్లో ఒక సూక్ష్మమైన మార్పు మొదలైంది. సరోజ, అనూష మధ్య మాటలు బాగానే సాగుతున్నా, ఆ ఒక్క ప్రశ్న ఎప్పుడూ గాలిలో వేలాడుతున్నట్టు ఉండేది – అడగబడకుండా, పూర్తి జవాబు ఇవ్వబడకుండా.సరోజ మనసులో ఆలోచన మరింత బలపడింది: “కోడలు ఏదో దాచుతోంది. ఏంటది?”అనూష మనసులో భయం మరింత పెరిగింది, ఒంటరిగా మోస్తూ: “ఎప్పుడు బయటపడుతుందో, ఎలా బయటపడుతుందో. కిరణ్‌కి కూడా ఎలా చెప్పాలో తెలియదు నాకు.”ఇద్దరికీ తెలియదు,
ఈ మౌనం త్వరలోనే ఒక పెద్ద తుఫానుగా మారబోతోందని. -
మృత్యువు తొడిగిన పూలదండ – భాగం 14
స్థలం: చింతపల్లి పోలీస్ స్టేషన్, సిఐ చంద్రమౌళి గది – అర్ధరాత్రి 3:20 గంటలు.
శ్రీను ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, ఊపిరి అందనంత వేగంగా పరుగెత్తుకుంటూ సిఐ కేబిన్‌లోకి దూసుకొచ్చాడు. అతని ముఖంలో భయం, కంగారు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
టేబుల్ మీద ఉన్న కేస్ ఫైల్స్ చూస్తూ గంభీరంగా ఆలోచిస్తున్న చంద్రమౌళి… శ్రీనుని చూడగానే సీరియస్‌గా కనుబొమ్మలు ముడిచాడు.
“ఏంట్రా శ్రీనూ… దయ్యం పట్టినట్టు అలా పరుగెత్తుకుంటూ వచ్చావ్? ఏమైంది?” చంద్రమౌళి అడిగాడు.
“సార్… సార్… ఘోరం జరిగిపోబోతోంది సార్! మీ ప్రాణాలకే ముప్పు ఉంది. ఇదిగోండి ఈ మెసేజ్ చూడండి!” శ్రీను వణుకుతున్న చేతులతో తన మొబైల్‌ను చంద్రమౌళి ముఖం ముందు పెట్టాడు.
చంద్రమౌళి స్క్రీన్ వైపు చూశాడు. ఆ అనామక మెసేజ్‌లో ఉన్న అక్షరాలు చదువుతున్న కొద్దీ అతని ముఖంలో రంగులు మారాయి.’…చంద్రమౌళిని ఈ రాత్రికి రాత్రే హైవే మీద యాక్సిడెంట్ చేసి చంపడానికి భూపతి రెడ్డి మనుషులు స్కెచ్ వేశారు…
‘శ్రీను కంగారు పడుతూ, “సార్, ఈ రాత్రికే మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపాలని చూస్తున్నారట. ఎస్పీ గారు కూడా భూపతి రెడ్డి వైపే ఉన్నారు కదా. మన డిపార్ట్‌మెంట్‌లోని పెద్దలే ఈ కుట్ర వెనుక ఉన్నారు సార్. మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పుకుందాం సార్,” అన్నాడు.
కానీ చంద్రమౌళి భయపడలేదు. అతని ముఖంలో ఒక భయంకరమైన నవ్వు కదిలింది. అతను తన చేతిలో ఉన్న పెన్నును టేబుల్ మీద గట్టిగా పెట్టాడు.
“తప్పుకోవడమా? నా ముప్పై ఏళ్ల సర్వీసులో ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూశాను శ్రీనూ. అయినా భూపతి రెడ్డి నా మీద ఇంత త్వరగా దాడికి ప్లాన్ చేశాడంటే… దానికి బలమైన కారణం ఉంది. రమ్య హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చేలోపే, నేనే స్వయంగా రవికుమార్ దాచిన ఆ పెన్‌డ్రైవ్‌ని కనిపెడతానని వాడు భయపడుతున్నాడు. ఒకవేళ వాడు నన్ను చంపేస్తే, కేసు అక్కడితో ఆగిపోతుంది. కానీ, వాడు తప్పు చేశాడు! నా ప్రాణం తీయాలని చూస్తే… నేనేంటో వాడికి చూపిస్తాను,” చంద్రమౌళి కళ్లల్లో ఖాకీ రంగు పట్టుదల పదునెక్కింది.
అతను వెంటనే తన సర్వీస్ రివాల్వర్‌ను తీసి చెక్ చేసుకుని నడుముకి తగిలించుకున్నాడు.”శ్రీనూ! స్టేషన్‌లో ఉన్న మిగతా కానిస్టేబుళ్లకు ఏ అనుమానం రాకూడదు. నువ్వు ఇక్కడే ఉండు. లావణ్య సెక్యూరిటీని నువ్వే చూసుకో. నేను ఒంటరిగానే వెళ్తున్నాను. భూపతి రెడ్డి మనుషులు నన్ను ఎక్కడ యాక్సిడెంట్ చేయాలనుకుంటున్నారో… నేనే నేరుగా అక్కడికే వెళ్లి వాళ్ల స్కెచ్ రివర్స్ చేస్తాను!” అంటూ చంద్రమౌళి గది బయటికి నడిచాడు.
స్థలం: నేషనల్ హైవే, రమ్య కారు – అర్ధరాత్రి 3:25 గంటలు.
హైవే మీద చీకటిని చీల్చుకుంటూ రమ్య కారు వేగంగా వెళ్తోంది. కారు స్టీరింగ్ పట్టుకున్న రమ్య మనసులో వెంకటరెడ్డి చెప్పిన ఆ పజిల్ తిరుగుతూనే ఉంది.’నేను నా ప్రాణాన్ని నా మొదటి విజయానికి దగ్గరగా దాచాను…'”మొదటి విజయం అంటే ఏంటి? రవికుమార్ వైజాగ్ లో ఆడిటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది ‘శ్రీ లక్ష్మి ఫైనాన్స్’ కంపెనీలో. కానీ దానికి విజయానికి ఏంటి సంబంధం? విజయం అంటే రవి గెలిచిన ఏదైనా కేసా? లేక…” రమ్య ఆలోచనలో పడింది.
సడన్‌గా ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. రవికుమార్ కాలేజ్ చదువుకునే రోజుల్లో స్టేట్ లెవెల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచాడు. ఆ తర్వాత అతను ఆడిన మొదటి టోర్నమెంట్ జరిగిన ప్రదేశం… వైజాగ్ లోని పాత ‘విక్టరీ క్లబ్’. ఆ టోర్నమెంట్ లో గెలిచిన ప్రైజ్ మనీతోనే అతను తన మొదటి కంప్యూటర్ కొనుక్కున్నాడు. ఆ విషయాన్ని ఒకసారి రవికుమార్ రమ్యతో ఆఫీస్ మీటింగ్‌లో సరదాగా చెప్పాడు.
“అవును! విక్టరీ అంటే విజయం! ‘నా మొదటి విజయానికి దగ్గరగా…’ అంటే ఆ పాత విక్టరీ క్లబ్ భవనం పక్కనే రవికుమార్ తన పాత ఆఫీస్ ని కూడా నడిపాడు. అంటే ఆ పెన్‌డ్రైవ్ ఆ పాత భవనంలోనే ఎక్కడో దాచి ఉండాలి!” రమ్య కళ్లల్లో మెరుపు మెరిసింది. ఆమె వెంటనే కారును వైజాగ్ లోని ఆ పాత విక్టరీ క్లబ్ రోడ్డు వైపు తిప్పింది.కానీ ఆమె గమనించలేదు…
ఆమె కారు వెనుక చాలా దూరంలో హెడ్‌లైట్లు ఆఫ్ చేసి, ఒక నల్లటి స్కార్పియో కారు నిశ్శబ్దంగా ఫాలో అవుతోంది. అందులో ఉన్నది భూపతి రెడ్డి నమ్మిన మనిషి, మేనేజర్ బన్నీ వాస్ మనుషులు!స్థలం: నేషనల్ హైవే – ఘాట్ రోడ్డు మూల – అర్ధరాత్రి 3:40 గంటలు.
చంద్రమౌళి తన ప్రైవేట్ కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. దారి పొడవునా చెట్లు, దట్టమైన చీకటి ఉన్నాయి. ఘాట్ రోడ్డులోని ఒక ప్రమాదకరమైన మలుపు దగ్గరకు కారు చేరుకోగానే… వెనుక నుండి ఒక భారీ కంటైనర్ లారీ అతి వేగంగా వస్తూ చంద్రమౌళి కారును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది.
ఆ లారీ హెడ్‌లైట్లు చంద్రమౌళి కారు వెనుక అద్దం మీద పడ్డాయి. ఆ లారీ నడుపుతున్న డ్రైవర్ ముఖం చంద్రమౌళికి స్పష్టంగా కనిపించలేదు, కానీ ఆ లారీ కారును పక్కకు తోసేయాలనే ఉద్దేశంతోనే వేగంగా దూసుకొస్తోందని అతనికి అర్థమైంది.
“వచ్చేశారురా భూపతి రెడ్డి కుక్కలు!” చంద్రమౌళి పళ్లు కొరికాడు.ట్యాప్! లారీ కారు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. చంద్రమౌళి కారు కంట్రోల్ తప్పి రోడ్డు పక్కన ఉన్న లోయ అంచు వైపు దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ మరోసారి కారును పూర్తిగా లోయలోకి తోసేయడానికి స్పీడ్ పెంచాడు… -
రహస్య కోడలు – శోభనం రాత్రి (భాగం8)
రిసెప్షన్ ముగిసి, చివరి బంధువులు కూడా వెళ్ళిపోయాక, ఇల్లు నిశ్శబ్దంగా మారింది. అనూష, కిరణ్‌లు శోభన గదిలోకి అడుగుపెట్టారు.
గది మల్లెపూల వాసనతో నిండి ఉంది. మంచం మీద పూలతో డిజైన్ చేసి ఉంది, కిటికీ గుండా బయటి నిండు వెన్నెల మెల్లగా లోపలికి జారుతోంది, గదిలో ఉన్న ఆకర్షణీయమైన బల్బ్ వెలుగుతో కలిసి ఒక మృదువైన కాంతిని సృష్టిస్తోంది.
అనూష తలుపు దగ్గరే ఆగిపోయింది, గుండె వేగంగా కొట్టుకుంటుండగా. కిరణ్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి, ఆమె రెండు చేతులని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
“చివరికి మనం ఒకటయ్యాం, ఇక మనం కలిసి నడవాల్సిన దారి ఇది,” అన్నాడు మెల్లగా, గొంతులో ఎన్నో నెలల నిరీక్షణ కరిగిన ఉపశమనం.“అవును,” అంది అనూష, కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా. ” కానీ ఎంత మోడర్న్ కాలమైన అమ్మాయినైనా సిగ్గు అనేది అలాగే ఉంటుంది. అందుకే అక్కడే ఆగిపోయాను.” అంటూ కిరణ్ తో నడిచింది.
ఆమె కళ్ళల్లో ఎప్పటిలాంటి ప్రేమే ఉంది, కానీ ఈ రాత్రి అందులో ఒక కొత్త భావన కూడా కలిసింది – ఎన్నో ఏళ్ల కల నిజమైన తాలూకు తృప్తి, కిరణ్‌లో తనకంటూ ఒక మనిషి దక్కిన భావన.కిరణ్ ఆమె నుదుటిపై మెల్లగా పెదాలుతో ముద్దుపెట్టాడు, ఆ స్పర్శలో ఏళ్ల నమ్మకం నిండి ఉంది. అనూష కళ్ళు మూసుకుంది, ఆ క్షణాన్ని పూర్తిగా అనుభవిస్తూ.
“నీకు గుర్తుందా,” కిరణ్ మెల్లగా అన్నాడు, “సంగీత్ రోజు నేను ‘ఉండిపోరాదే’ పాటకి పెదాలు కదిపినప్పుడు?”అనూష నవ్వింది, ఆ జ్ఞాపకం మనసులో మెదిలి.
“గుర్తుంది, పూర్తిగా. అప్పుడే అర్థమైంది నాకు, నువ్వు ఆ పాట నా కోసమే పాడుతున్నావని, నాపై ఎంత ప్రేమ పెంచుకున్నావో అని. కానీ అంతమందిలో ఎలా అలా పాడగలిగావు? అసలే నువ్వు ఇంట్రోవర్ట్ కదా!”“ఆ క్షణంలో అక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ కనిపించలేదు నాకు,” కిరణ్ చెప్పాడు, ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుంటూ. “ఈ రోజు కూడా అంతే. ఈ గదిలో, ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప , ఇంకేమీ కనిపించడం లేదు.”
మాటలు మెల్లగా తగ్గుతూ వచ్చాయి. బయట వెన్నెల మరింత స్పష్టంగా గదిలోకి పరచుకుంటోంది, కిటికీ తెరలు మెల్లగా గాలికి కదులుతూ ఆ వెలుగుని గదంతా నాట్యం చేయిస్తున్నాయి. మల్లెపూల వాసన ఇద్దరి చుట్టూ ఒక అదృశ్య కౌగిలి అల్లుతున్నట్టు అనిపించింది.కిరణ్ ఆమె చెంపని మెల్లగా తాకాడు, వేళ్ళు ఆమె ముందు వెంట్రుకలని నెమ్మదిగా వెనక్కి తోశాయి. అనూష తలెత్తి అతని కళ్ళలోకి చూసింది – ఆ చూపులో మాటలకి అందని ఒక భాష ఉంది, సంవత్సరాల పరిచయం అవసరం లేని ఒక అవగాహన.“భయంగా ఉందా?” కిరణ్ మృదువుగా అడిగాడు.
“కొంచెం,” అంది అనూష నిజాయితీగా. “కానీ నీతో ఉంటే ఏ భయం నిలవదు.” అని అంది.
ఆ మాటతో కిరణ్ ఆమెని మరింత దగ్గరగా తీసుకున్నాడు, ఆమె తల అతని ఛాతీ మీద ఆనింది, అతని గుండె చప్పుడు ఆమెకి స్పష్టంగా వినిపిస్తోంది – వేగంగా, కానీ స్థిరంగా, ఒక నమ్మకమైన లయలో.గదిలోని నిశ్శబ్దం ఇప్పుడు ఖాళీ నిశ్శబ్దం కాదు, అది ఒక మధురమైన కావ్యంలా మారింది. బయట రాత్రి వాహనాలు శబ్దంతో గందరగోళంగా ఉన్నా, వీరికి ఆ చప్పుళ్ళు వినిపించలేదు.
కిరణ్ నైట్ స్టాండ్ పై ఉండే లైట్ ఆర్పేశాడు. ఇప్పుడు గదిని వెలిగిస్తున్నది వెన్నెల మాత్రమే, కిటికీ గుండా జారి, ఇద్దరి మొహాల మీద ఒక వెండి కాంతిని పరుస్తూ.“నీకు తెలుసా,” అనూష మెల్లగా గుసగుసగా అంది, “ఆ రోజు ఎయిర్‌పోర్ట్‌లో వర్షం చూస్తూ కూర్చున్నప్పుడు, ఇలాంటి రాత్రి నా జీవితంలో వస్తుందని అస్సలు ఊహించలేదు నేను.”
“నేను కూడా,” కిరణ్ ఒప్పుకున్నాడు, ఆమె వీపు మీద మెల్లగా చేయి ఆడిస్తూ. “కొన్నిసార్లు జీవితం మనం ఊహించని దారుల్లో తీసుకెళ్తుంది, కానీ చివరికి సరైన చోటికే చేరుస్తుంది.”
అనూష తలెత్తి అతన్ని చూసింది, వెన్నెల వెలుగులో అతని మొహం మరింత మృదువుగా కనిపిస్తోంది. ఆమె చేయి మెల్లగా అతని చెంప మీదుగా జారి, గుండె దగ్గర ఆగింది – ఆ చప్పుడుని అనుభవిస్తూ.మాటలు ఇక అవసరం లేకుండా పోయాయి. ఇద్దరి శ్వాసలు మెల్లమెల్లగా ఒకే లయలో కలవడం మొదలైంది, ఒకరి హృదయ స్పందన మరొకరికి తెలిసేంత దగ్గరగా. కిటికీ తెర గాలికి మరింత గట్టిగా కదిలింది, మల్లెపూల వాసన గదంతా వ్యాపించి, ఒక అదృశ్య ఆశీర్వాదంలా వాళ్ళిద్దరినీ చుట్టుముట్టింది.
వారి శ్వాసల వేగం పెరిగిన వేళ, గదిలోని నిశ్శబ్దం మరింత గాఢంగా మారింది. చివరికి ఒకే హృదయ స్పందనలో లీనమైన క్షణం. వేరువేరుగా ప్రవహించిన రెండు నదులు, ఎట్టకేలకు ఒకే సముద్రంలో సంగమించినట్టు ఆ రాత్రి ఇద్దరు కలిసారు.
బయటనుండి వచ్చే చల్లని గాలి కూడా ఇద్దరి ఒంటి నుండి వచ్చే చమట చుక్కలని ఆపలేకపోయింది.
తెల్లవారుజామున, తొలి వెలుతురు కిటికీ గుండా వచ్చినప్పుడు, అనూష కిరణ్ భుజం మీద తలవాల్చి ప్రశాంతంగా నిద్రపోతోంది, అతని చేయి ఆమెని కాపాడుతున్నట్టు చుట్టుకుని ఉంది.
ఇద్దరి మొహాల్లో ఒక తృప్తి, ఒక కొత్త జీవితం మొదలైన ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తోంది.కిటికీ బయట పిచ్చుకలు మెల్లగా కూయడం మొదలుపెట్టాయి, ఒక కొత్త రోజుని, ఒక కొత్త అధ్యాయాన్ని స్వాగతిస్తున్నట్టు. -
మృత్యువు తొడిగిన పూలదండ (13)
స్థలం: చింతపల్లి పోలీస్ స్టేషన్, అర్ధరాత్రి 2:45 గంటలు.
లాయర్ రమ్య సవాల్ విసిరి స్టేషన్ నుండి కోపంగా వెళ్ళిపోయిన తర్వాత… సిఐ గదిలో వాతావరణం చాలా సీరియస్‌గా మారింది. సిఐ చంద్రమౌళి తన టేబుల్ ముందు తీవ్రమైన టెన్షన్ తో కూర్చుని ఉన్నాడు. రమ్య నిజంగానే జడ్జి గారి ఇంటికి వెళ్లి అర్ధరాత్రి అత్యవసర ఆర్డర్ తెస్తే ఇన్వెస్టిగేషన్ ఆగిపోతుందని అతని మెదడు ఆలోచిస్తోంది. పక్కనే కానిస్టేబుల్ శ్రీను నిలబడి ఉన్నాడు.
అప్పుడే చంద్రమౌళి పర్సనల్ మొబైల్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద ఎస్పీ గారి పేరు చూసి అతను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు.
“చెప్పండి సార్…”
“చంద్రమౌళి! టీవీల్లో అన్నదమ్ముల సవాల్-ప్రతిసవాల్ వార్తలు చూశావు కదా? రవికుమార్ మైనింగ్ స్కామ్ ఆడిట్ ఫైల్స్ గురించిన లీక్స్ బయటకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. పైగా లాయర్ రమ్య హైకోర్టు నుండి ప్రెజర్ తేవడానికి ట్రై చేస్తోంది. లీగల్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవ్వకముందే… రేపు ఉదయం కోర్టులు తెరిచే సమయానికి లావణ్యను పక్కా ఆధారాలతో మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్‌కి పంపించేయాలి. ఇది నా ఆర్డర్!” అవతలి నుండి ఎస్పీ గట్టిగా చెప్పి ఫోన్ కట్ చేశారు.
చంద్రమౌళి ఫోన్‌ను టేబుల్ మీద పక్కకు నెట్టాడు. అతని కళ్లల్లో పదునైన ఒక వింతైన మెరుపు మెరిసింది.”
ఎస్పీ గాడు, కేసు త్వరగా క్లోజ్ చేయమని కంగారుపడుతున్నాడు శ్రీనూ… ఎందుకంటే వెంకట రెడ్డి పరామర్శ నెపంతో భూపతి రెడ్డి మైనింగ్ స్కామ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. ఆ ప్రైవేట్ నంబర్ భూపతి రెడ్డిదే అని వెంకట రెడ్డికి పక్కా ఆధారాలు ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే మన డిపార్ట్‌మెంట్ కూడా కంగారు పడుతోంది,” చంద్రమౌళి గొంతు తగ్గించి అన్నాడు.
“మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? రమ్య గారు ఆర్డర్ పట్టుకొస్తే లావణ్యను మనం ఇక్కడ ఉంచలేం కదా?” శ్రీను ఆందోళనగా అడిగాడు.
“రమ్య లీగల్ గా వెళ్తుంది, వెళ్లనివ్వు. అది మనకు ఒక రకంగా ప్లస్సే. ఎందుకంటే చట్టపరంగా కేసు ఎంత హీట్ ఎక్కితే… భూపతి రెడ్డి గానీ, అతని మనుషులు గానీ అంత తొందరపడి ఒక పెద్ద తప్పు చేస్తారు. మీడియాలో అన్న వేసిన నిందల నుండి తప్పించుకోవడానికి భూపతి రెడ్డి కచ్చితంగా ఆ ఆడిట్ ఫైల్స్ ఉన్న ల్యాప్‌టాప్ లేదా పెన్‌డ్రైవ్ కోసం వెతుకుతాడు. రవికుమార్ చనిపోయే ముందు ఆ ఫైల్స్ ఎక్కడో దాచాడు. లావణ్య ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా అవి లావణ్యకు కూడా తెలియవు అని అర్థమవుతుంది. కానీ ఆ రిసార్ట్‌లో ఉన్న మేనేజర్ బన్నీ వాస్‌కి ఏదో ఒక క్లూ తెలిసే అవకాశం ఉంది,” చంద్రమౌళి లేచి నిలబడ్డాడు.అతను తన వైర్ లెస్ సెట్ పక్కన పెట్టి, సివిల్ డ్రెస్ లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిచాడు.
“మీరు ఇద్దరూ ఇప్పుడే సీధోని రిసార్ట్‌కి వెళ్ళండి. మేనేజర్ బన్నీ వాస్ కదలికలపై నిఘా పెట్టండి. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ప్రతి నిమిషం నాకు అప్‌డేట్ కావాలి. గుర్తుపెట్టుకోండి, ఇది అన్‌అఫీషియల్ ఇన్వెస్టిగేషన్. ఎస్పీ గారికి గానీ, స్టేషన్ లో ఉన్న మిగతా వాళ్లకు గానీ ఈ విషయం తెలియకూడదు,” చంద్రమౌళి ఆర్డర్ వేశాడు. వాళ్లు సెల్యూట్ చేసి వెంటనే చీకట్లోకి బయలుదేరారు.
స్థలం: నేషనల్ హైవే, రమ్య కారు – అర్ధరాత్రి 3:00 గంటలు.
చింతపల్లి స్టేషన్ నుండి వైజాగ్ వైపు రమ్య కారు అత్యంత వేగంగా దూసుకుపోతోంది. రమ్య స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ, అర్ధరాత్రి జడ్జి గారి నివాసానికి వెళ్లేందుకు లీగల్ పాయింట్లను మనసులో సిద్ధం చేసుకుంటోంది.
అప్పుడే కార్ డ్యాష్ బోర్డ్‌పై ఉన్న ఆమె మొబైల్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద ‘వెంకట రెడ్డి సార్’ అని పేరు కనిపించింది.
రమ్యకు, వెంకటరెడ్డికి మధ్య ఒక బలమైన ప్రొఫెషనల్ పరిచయం ఉంది. నిన్న పగలు రమ్య హైకోర్టులో గెలిపించిన ఆ పదిహేనేళ్ల నాటి అన్‌సాల్వ్డ్ గిరిజనుడి కేసు వెనకున్న అసలైన శక్తీ, ఆర్థిక సాయం వెంకటరెడ్డివే. భూపతి రెడ్డి అక్రమంగా లాక్కున్న ఆ పేద గిరిజనుల భూముల కోసం, కోర్టు ఖర్చులు భరించలేని ఆ అభాగ్యుల తరపున వెంకటరెడ్డే లీగల్ ఫీజులు చెల్లించి, రమ్య ప్రతిభను నమ్మి ఈ కేసును ఆమెకు అప్పగించాడు. ఆ కేసును రమ్య గెలిపించిన తీరు చూసి, ఆమె లీగల్ ఇంటెలిజెన్స్ మీద వెంకటరెడ్డికి అపారమైన గౌరవం ఏర్పడింది.
ఆ నమ్మకంతోనే, తన నమ్మిన మనిషి రవికుమార్ హత్య కేసులో లావణ్యను రక్షించడానికి రమ్య రంగంలోకి దిగిందని తెలిసి ఆయన ఈ అర్ధరాత్రి వేళ ఫోన్ చేశారు.
రమ్య బ్లూటూత్ ఆన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసింది. “నమస్తే సార్. రాత్రి టీవీలో భూపతి రెడ్డి ఇచ్చిన ఇండైరెక్ట్ కౌంటర్ చూశాను. రవికుమార్ హత్య కేసును వాడు రివర్స్ లో మీ పైకే నెట్టాలని చూస్తున్నాడు సార్. ప్రస్తుతం నేను చింతపల్లి స్టేషన్ నుండి జడ్జి గారి నివాసానికి బయలుదేరాను,” అంది.
అవతలి నుండి వెంకట రెడ్డి బరువైన, గంభీరమైన గొంతు వినిపించింది. “వాడు మీడియా ముందు ఎంత నాటకమాడినా… లోపల వాడు వణుకుతున్నాడు రమ్య. పగలు నువ్వు కోర్టులో నా క్లయింట్ అయిన ఆ గిరిజనుడిని ఎలా గెలిపించావో నాకు తెలుసు, నీ పదునైన లీగల్ మైండ్ మీదే నా ఆశలన్నీ ఉన్నాయి. రవికుమార్ నా తమ్ముడు భూపతి రెడ్డి దగ్గరే సీనియర్ ఆడిటర్‌గా పని చేసేవాడు. వాడు భూపతి రెడ్డికి నమ్మిన మనిషిగా ఉంటూనే… లోపల జరుగుతున్న వందల కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్స్ చూసి భరించలేకపోయాడు. అందుకే చనిపోయే రెండు రోజుల ముందే నాకు ఒక ఎన్‌క్రిప్టెడ్ మెయిల్ పంపాడు. భూపతి రెడ్డి నా సంస్థల నుండి దొంగిలించిన మైనింగ్ డిజిటల్ సాక్ష్యాలన్నీ ఒక పెన్‌డ్రైవ్‌లో భద్రపరిచానని, దాన్ని ఒక సేఫ్ ప్లేస్ లో దాచానని చెప్పాడు. ఆ పెన్‌డ్రైవ్ గనుక దొరికితే… భూపతి రెడ్డి అక్రమ సామ్రాజ్యం కూలిపోవడమే కాదు, నీ క్లయింట్ లావణ్య కూడా నిర్దోషిగా బయటపడుతుంది. ఎందుకంటే ఆ ఫైల్స్ కోసమే నా తమ్ముడు రవిని చంపించాడు!”
“మరి ఆ పెన్‌డ్రైవ్ ఎక్కడ ఉందో రవి ఆ మెయిల్‌లో రాయలేదా సార్?” రమ్య కారు వేగాన్ని తగ్గిస్తూ పదునైన గొంతుతో అడిగింది.
“రాశాడు రమ్య… కానీ డైరెక్ట్‌గా లొకేషన్ చెప్పకుండా ఒక పజిల్ లాంటి క్లూ ఇచ్చాడు. ‘నేను నా ప్రాణాన్ని నా మొదటి విజయానికి దగ్గరగా దాచాను’ అని ఉంది. రవి నా తమ్ముడి దగ్గర చేరకముందు వైజాగ్ లోనే ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీలో ఆడిటర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు. బహుశా ఆ ‘మొదటి విజయం’ దానికి సంబంధించిందేమో!
లాయర్‌గా నీకున్న ఇన్వెస్టిగేటివ్ మైండ్‌తో ఆ లొకేషన్ ఎక్కడో నువ్వే కనిపెట్టాలి. ఎందుకంటే ఈ విషయం నా తమ్ముడు భూపతి రెడ్డికి తెలిస్తే, వాడు ఆ పెన్‌డ్రైవ్‌ను నాశనం చేస్తాడు,” వెంకట రెడ్డి వివరించాడు.
రమ్య ఆ వాక్యాన్ని తన మెదడులో గట్టిగా రికార్డ్ చేసుకుంది. ‘నా మొదటి విజయానికి దగ్గరగా…’ వైజాగ్ లో రవికుమార్ కెరీర్ స్టార్ట్ చేసిన ఆ పాత ఆఫీస్ ఎక్కడుంది? జడ్జి గారి దగ్గరకు వెళ్లేలోపే ఈ క్లూ ని డికోడ్ చేయాలని రమ్య ఆలోచించడం ప్రారంభించింది.
స్థలం: చింతపల్లి పోలీస్ స్టేషన్ బయట – అర్ధరాత్రి 3:15 గంటలు.
స్టేషన్ వెనుక ఉన్న క్వార్టర్స్ రోడ్డు వైపు చీకటి దట్టంగా ఉంది. కానిస్టేబుల్ శ్రీను స్టేషన్ బయట ఉన్న కారు దగ్గర నిలబడి నీళ్లు తాగుతుండగా… అతని ఫోన్‌కి ఒక అపరిచిత నంబర్ నుండి సడన్‌గా ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్ వచ్చింది.శ్రీను ఫోన్ ఓపెన్ చేసి చూశాడు. ఆ మెసేజ్ చూసి అతని కళ్లు ఒక్కసారిగా పెద్దవయ్యాయి.
అది డిపార్ట్‌మెంట్‌లోని పెద్దల ప్లాన్‌ను ముందే పసిగట్టిన ఎవరో ఒక అనామక శ్రేయోభిలాషి (రహస్య పోలీస్ లీక్) పంపిన హెచ్చరిక సందేశం లాగా ఉంది:
“శ్రీనూ! మీ సిఐ చంద్రమౌళి ప్రాణాలకు ప్రమాదం ఉంది. పైనుండి వచ్చిన పొలిటికల్ ప్రెజర్ వల్ల… చంద్రమౌళిని ఈ రాత్రికి రాత్రే హైవే మీద యాక్సిడెంట్ చేసి చంపడానికి భూపతి రెడ్డి మనుషులు స్కెచ్ వేశారు. రమ్యను కోర్టుకి వెళ్లకుండా ఆపడం కాదు… మొదట మీ సిఐ ని కాపాడుకోండి!”అని.
శ్రీను గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ అర్ధరాత్రి వేళ వచ్చిన ఆ సీక్రెట్ హెచ్చరిక మెసేజ్ చూసి అతను ఒక్క క్షణం స్తంభించిపోయాడు. తన ఆఫీసర్ చంద్రమౌళిని చంపడానికి డిపార్ట్‌మెంట్ పెద్దల బ్యాకింగ్ తో భూపతి రెడ్డి మనుషులు రంగంలోకి దిగారా? అతను కంగారుగా స్టేషన్ లోపలికి, చంద్రమౌళి కేబిన్ వైపు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగెత్తబోయాడు… -
రహస్య కోడలు – పెళ్లి వేడుకులు (భాగం 7)
నిశ్చితార్థం తర్వాత, పెళ్ళి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా చేయాలని నిర్ణయం చేసుకున్నారు కిరణ్, సరోజ. అతను విదేశాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి బంధువులు, స్నేహితులు అందరూ ఒకేసారి కలవడానికి ఇదే సరైన అవకాశం. రామారావు ఆరోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటూనే, తులసమ్మ, అనూష హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు, ఒక ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ బుక్ చేసి రామారావుని జాగ్రత్తగా తీసుకొచ్చారు.
ప్రీ-వెడ్డింగ్ షూట్
పెళ్ళికి పది రోజుల ముందు, హైదరాబాద్‌లోని ఒక పాత హవేలీలో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ జరిగింది. అనూష లేత గులాబీ రంగు లెహంగాలో, కిరణ్ క్రీమ్ కలర్ కుర్తాలో – ఇద్దరూ పాత రాతి గోడల మధ్య, సాయంత్రం బంగారు వెలుతురులో ఫోటోలు దిగారు. ఫోటోగ్రాఫర్ ఒక మూమెంట్ క్యాప్చర్ చేయమని కోరగా, కిరణ్ అనూష చెవిలో ఏదో గుసగుసగా చెప్పాడు, ఆమె నిజంగా నవ్వేసింది – ఆ కాండీడ్ ఫోటో తర్వాత వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా ఇష్టపడిన ఫోటో అయింది.”ఇలాంటి ఫోటోలు తీయించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు నేను,” అనూష నవ్వుతూ చెప్పింది, సెట్ మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ.”నేను కూడా,” కిరణ్ ఒప్పుకున్నాడు. “కానీ నీతో అయితే బాగానే ఉంది.”
హల్దీ వేడుక
హల్దీ రోజు ఉదయం, కిరణ్ అపార్ట్మెంట్ టెర్రస్ పై పసుపు రంగు అలంకరణలతో నింపేశారు – పసుపు రంగు గొడుగులు, పూల తోరణాలు, పసుపు, తెలుపు రంగు బెలూన్లు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ పసుపు రంగు దుస్తుల్లో వచ్చారు, సంగీతం మోగుతుండగా.అనూష పసుపు రంగు చీరలో ఒక పీట మీద కూర్చుంటే, ముందుగా తులసమ్మ, తర్వాత సరోజ, తర్వాత మిగతా బంధువులు అందరూ వంతుల వారీగా పసుపు రాశారు ఆమె మొహానికి, చేతులకి.
చిన్న పిల్లలు కూడా పసుపు ముద్దలు అనూష మీద పడేసి నవ్వుతూ పరిగెత్తారు, ఆమె వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ నవ్వుతూనే ఉంది.అదే సమయంలో కిరణ్‌కి కూడా వేరే చోట హల్దీ జరుగుతోంది, స్నేహితులు అతని మీద పసుపు రాస్తూ, పాటలు పాడుతూ డాన్స్ చేయిస్తున్నారు. ఇద్దరూ చివర్లో ఒకచోట కలిసినప్పుడు, ఇద్దరి మొహాలు, బట్టలు పసుపు రంగులో మునిగిపోయి ఉన్నాయి, ఒకరిని ఒకరు చూసుకుని ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు.
రామారావు వీల్‌చైర్‌లో కూర్చుని ఈ సందడి అంతా చూస్తూ, మొహం నిండా చిరునవ్వుతో ఉన్నారు. “ఇలాంటి సందడి చూసి చాలా కాలం అయింది,” అని తులసమ్మతో చెప్పారు, ఆమె కళ్ళు చెమర్చాయి ఆ మాటకి.సంగీత్ రాత్రి
సాయంత్రం ఒక పెద్ద హాల్‌లో సంగీత్ వేడుక జరిగింది, రంగురంగుల లైట్లు, డీజే మ్యూజిక్‌తో నిండిన వేదిక. కిరణ్ స్నేహితులు ఒక గ్రూప్ డాన్స్ ప్రిపేర్ చేశారు, పాత తెలుగు సినిమా పాటలకి కొత్త స్టెప్స్ కలిపి. అనూష స్నేహితురాళ్ళు, ఆమె కాలేజిమేట్స్ కూడా సంగీత్ లో జాయిన్ అయ్యి ఎంజాయ్ చేశారు.
సరోజ కూడా, అందరి ప్రోత్సాహంతో, ఒక పాత పాటకి కొడుకుతో కలిసి చిన్న స్టెప్స్ వేసింది – నవ్వుతూ, సిగ్గుపడుతూ. చాలా కాలం తర్వాత ఆమె అంత రిలాక్స్ గా, సంతోషంగా కనిపించడం చూసి కిరణ్ కూడా ముచ్చటపడ్డాడు.
రాత్రి చివర్లో, కిరణ్ మైక్ తీసుకుని అందరి ముందు అనూష కోసం ఒక చిన్న స్పీచ్ ఇచ్చాడు, గొంతు వణుకుతూ. “ఈ అమ్మాయి నా జీవితంలోకి ఒక ఫ్లైట్ డిలే వల్ల వచ్చింది. ఇప్పుడు అనిపిస్తుంది, ఆ వర్షం, ఆ డిలే అన్నీ నాకోసమే జరిగాయని. ప్రకృతి బలంగా కోరుకుంది మా ఇద్దరి కలయికని.” అందరూ చప్పట్లు కొట్టారు, అనూష కళ్ళలో నీళ్ళు తిరిగాయి.మెహందీ వేడుక
మర్నాడు మధ్యాహ్నం, మహిళలంతా కలిసి మెహందీ వేడుకలో పాల్గొన్నారు. అనూష చేతులు, కాళ్ళ మీద క్లిష్టమైన డిజైన్లతో మెహందీ కళాకారుడు అందమైన నమూనాలు వేశాడు, మధ్యలో చిన్నగా “K” అక్షరం కూడా దాచిపెట్టి, తర్వాత అనూషని వెతకమని అందరూ సరదాగా ఆటపట్టించారు.
సరోజ, తులసమ్మ పక్కపక్కనే కూర్చుని తమ చేతులకి కూడా మెహందీ వేయించుకున్నారు, మాటల మధ్యలో మంచి స్నేహం పెంచుకుంటూ. “మా అబ్బాయి అదృష్టవంతుడు మీ అమ్మాయి దొరకడం,” సరోజ చెప్పింది, ఈసారి పూర్తి మనసుతో.వివాహ మహోత్సవం
పెళ్ళి రోజు వచ్చేసింది. హైదరాబాద్‌లో ఒక పెద్ద కళ్యాణ మండపంలో, వందలాది మంది అతిథుల మధ్య, పూల అలంకరణలతో నిండిన వేదిక మీద గ్రాండ్‌గా పెళ్ళి జరిగింది. మండపం మొత్తం తెలుపు, గులాబీ రంగు పూలతో అలంకరించారు, పైనుండి వేలాడుతున్న క్రిస్టల్ లైట్లు మెరుస్తున్నాయి.
అనూష ఎర్రటి పట్టు చీరలో, సాంప్రదాయ నగలతో, పెళ్ళికూతురిలా మెరిసిపోతూ మండపంలోకి ప్రవేశించింది, తండ్రి రామారావు వీల్‌చైర్‌లో పక్కనే ఉండి ఆమెని దగ్గరికి తీసుకువచ్చారు. కళ్ళల్లో ఆనందభాష్పాలు ఆపుకోలేకపోయారు ఆయన.కిరణ్ తెల్లటి షేర్వానీలో, వేదిక మీద ఆమె కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు, మొహంలో ఉత్సాహం దాచుకోలేకపోతూ.
పురోహితుడు మంత్రాలు చదువుతుండగా, సంప్రదాయ తంతులన్నీ ఒక్కొక్కటిగా జరిగాయి – కన్యాదానం, తలంబ్రాలు, సప్తపది.
మాంగల్యధారణ సమయంలో, కిరణ్ చేతులు వణుకుతుండగా అనూష మెడలో తాళి కట్టాడు. ఆమె కళ్ళలో నీళ్ళు, అతని కళ్ళలో కూడా – ఇద్దరికీ తెలుసు, ఈ క్షణం కోసం ఎంత దూరం ప్రయాణించారో, ఒక ఫ్లైట్ ఆలస్యం నుండి మొదలైన కథ ఇక్కడిదాకా వచ్చిందని.
సరోజ ముందు వరుసలో కూర్చుని ఈ దృశ్యం చూస్తూ, మనసులో మిశ్రమ భావాలు – సంతోషం, గర్వం, కానీ ఎక్కడో లోపల ఒక పాత గాయం కూడా మెల్లగా కదులుతూ.
పెళ్ళి తంతు ముగిశాక, తులసమ్మ సరోజ చేయి పట్టుకుంది. “ఒదిన గారు, నాది ఒకటే కోరిక,! తప్పైన ఒప్పైన ఒక తల్లి లాగా క్షమిస్తూ ఉండడండి. మా అమ్మాయిని మీ అమ్మాయిలా చూసుకోండి.”సరోజ చిన్నగా నవ్వి తలూపింది.
“తప్పకుండా. మీ అమ్మాయి ఇప్పుడు మా అమ్మాయే.”రిసెప్షన్
సాయంత్రం జరిగిన రిసెప్షన్‌లో ఆధునిక టచ్ కనిపించింది – ఒక కాక్టెయిల్ – స్టైల్ డిన్నర్, లైవ్ మ్యూజిక్ బాండ్, ఫోటో బూత్ ఏర్పాటు చేశారు యువతరం అతిథుల కోసం. కిరణ్, అనూష ఒక ప్రత్యేక స్టేజ్ మీద కూర్చుని అతిథుల శుభాకాంక్షలు స్వీకరించారు, గంటల తరబడి ఫోటోలు దిగుతూ.
రాత్రి చివర్లో, డాన్స్ ఫ్లోర్ మీద కిరణ్, అనూష వాళ్ళ మొదటి కపుల్ డాన్స్ చేశారు, హుషారు సినిమాలో ఉండిపోరాదే పాటకి – నెమ్మదిగా అడుగులు వేస్తూ, ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ. వచ్చే పాటలో ఉండే లిరిక్స్ కిరణ్ పెదవులుపై కనిపిస్తుంటే ,అందరూ చుట్టూ నిలబడి చప్పట్లు కొడుతూ చూశారు, కొందరు ఫోన్లలో వీడియో తీసుకున్నారు. ఆఖరులో కిరణ్ అనుషాను ఎత్తుకొని అలా తిప్పుతుంటే , ఆ సమయంలో అనూష అనుభూతి వర్ణించలేనిది.
రిసెప్షన్ తర్వాత రాత్రి, అందరూ వెళ్ళిపోయాక, కిరణ్ అనూష కొత్త గదిలో ఇద్దరే ఉన్నప్పుడు, అనూష కిటికీ దగ్గర నిలబడి బయటకి చూస్తోంది, అలసటగా కానీ సంతృప్తిగా.”ఏమిటి ఆలోచిస్తున్నావు?”
కిరణ్ దగ్గరికి వచ్చి అడిగాడు.”ఏమీ లేదు, ఇదంతా నిజమేనా అని అనిపిస్తోంది. ఈ కొన్ని వారాల్లో ఇంత జరిగిపోయింది – ఒక ఎయిర్‌పోర్ట్‌లో కలిసిన అపరిచితులం, ఇప్పుడు భార్యాభర్తలం,” అంది అనూష, చిన్నగా నవ్వుతూ.
కిరణ్ ఆమె పక్కన నిలబడి, భుజం మీద చేయి వేశాడు. “నాకు కూడా అలానే అనిపిస్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం – ఆ ఫ్లైట్ డిలే అవ్వకపోయుంటే, మనం ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు.”
అనూష నవ్వుతూ అతని వైపు తిరిగింది. “కృతజ్ఞతలు చెప్పాలేమో ఆ వర్షానికి.”ఇద్దరూ నవ్వుకున్నారు, కానీ ఆ నవ్వు వెనుక ఇద్దరికీ తెలుసు – ఇది కేవలం మొదటి అధ్యాయం మాత్రమే.
అసలు కథ ముందుంది…
కథల ప్రయాణం
రియాలిటీ, రొమాన్స్, కామెడీ, సస్పెన్స్ మరియు ఫిలాసఫీ కలబోసిన కథల సమాహారం.మన సంస్కృతిని, జీవిత సత్యాలను రేపటి తరానికి పరిచయం చేసే డిజిటల్ వేదిక