స్థలం: వైజాగ్, పాత విక్టరీ క్లబ్ ఆవరణ – తెల్లవారుజామున 6:26 గంటలు.
ఆ రౌడీ బలంగా విసిరిన ఇనుప రాడ్ చంద్రమౌళి తలకు కాకుండా పక్కగా అతని భుజం మీద బలంగా పడింది. ఆ దెబ్బకి చంద్రమౌళి నొప్పితో కింద పడిపోయాడు…
సరిగ్గా అదే క్షణంలో… సడన్ బ్రేకుల శబ్దంతో పాటు రెండు పోలీస్ జీపులు ఆవరణలోకి దూసుకొచ్చాయి. హెడ్‌లైట్ల వెలుతురు సీన్ మీద పడగానే, జీపుల్లోంచి ఆరుగురు పోలీసులు చేతుల్లో లాఠీలు, తుపాకులతో కిందకి దిగారు.
ముందు జీప్ లోంచి దూకిన కానిస్టేబుల్ శ్రీను, తుపాకీ గురిపెట్టి గట్టిగా కేకేశాడు:”డోంట్ మూవ్! ఆయుధాలు కింద పడేయండి!”
పోలీసులు ఒకేసారి చుట్టుముట్టడంతో రౌడీల చేతుల్లో ఉన్న రాడ్లు కింద పడిపోయాయి. బన్నీ వాస్ భయంతో వెనక్కి తగ్గి, పాత బిల్డింగ్ తలుపుల వైపు పరుగెత్తాడు.
సరిగ్గా అదే సమయానికి రమ్య చేతిలో పెన్‌డ్రైవ్ గట్టిగా పట్టుకుని తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది. ఎదురుగా రక్తం కారుతున్న ముఖంతో పరుగెత్తుకొస్తున్న బన్నీ వాస్‌ని చూసి ఆమె అడుగు వెనక్కి వేసింది.
“అది ఇటు ఇవ్వవే!” అంటూ బన్నీ వాస్ పిచ్చివాడిలా ఆమె మీదికి దూకి, ఆమె పిడికిలి విరిచి పెన్‌డ్రైవ్ లాక్కోవడానికి చూశాడు.
కానీ రమ్య వెనక్కి తగ్గలేదు! ఆమె తన కుడిచేతిలో ఉన్న హెవీ డ్యూటీ టార్చ్ లైట్ బేస్‌తో బన్నీ వాస్ కంటి కింద బలంగా బాదింది!
“అమ్మా!” అంటూ బన్నీ వాస్ కళ్లు మూసుకుని కింద కూలబడ్డాడు. కంటి కింద నుండి రక్తం వస్తుంది.
అదే సమయంలో పోలీసులు మిగతా రౌడీల మీద పడి వాళ్ళని లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక్కసారిగా పెద్ద గందరగోళం, పెనుగులాట మొదలైంది. ఆ గందరగోళంలో నొప్పిని బిగబట్టి లేచిన బన్నీ వాస్… “దీన్ని వదలకండిరా, లాక్కెళ్లండి!” అని అరిచాడు.
వెంటనే ఇద్దరు రాక్షసుల్లాంటి రౌడీలు రమ్య వైపుకి వెళ్ళారు. అందులో ఒకడు ఆమె పిడికిలి పట్టుకుని పెన్‌డ్రైవ్ లాక్కోవడానికి చూడగా… రమ్య తన ఎడమచేతి గోళ్లతో వాడి ముఖాన్ని ఘోరంగా గీరి, పాయింటెడ్ టార్చ్ లైట్ కొసతో వాడి ముక్కు మీద బలంగా కొట్టింది!
“అయ్యో!” అని వాడు ముక్కు పట్టుకుని రక్తం కక్కుకుంటూ వెనక్కి తుళ్ళిపడ్డాడు.ఇంతలో రెండో రౌడీ వెనుక నుండి వచ్చి ఆమె రెండు చేతులనూ గట్టిగా బంధించి, జుట్టు పట్టుకుని ఈడ్చాడు. రమ్య తన వెనుక ఉన్న వాడి కాలి బొటనవేలి మీద తన హైహీల్స్ చెప్పుతో గట్టిగా తొక్కి, మోకాలితో వాడి పొత్తికడుపులో బలంగా తన్నింది!
వాడు కేక వేస్తూ వదిలేయగానే… ఆమె పారిపోవడానికి ప్రయత్నించింది.కానీ అంతలోనే కోలుకున్న మొదటి రౌడీ, దెబ్బతిన్న బన్నీ వాస్ ఇద్దరూ కలిసి ఆమెను పట్టుకున్నారు. రమ్య తన శక్తినంతా ఉపయోగిస్తూ కాళ్లతో తన్నుతూ, చేతులతో గట్టిగా వాళ్ల మొహాలను బాదుతూ, పిచ్చిగా కేకలు వేస్తూ విలవిలలాడింది.
ఒక ఆడపిల్ల తన ప్రాణాలను, ఆ ఆధారాలను కాపాడుకోవడానికి చేయాల్సిన పోరాటమంతా చేసింది. కానీ ఆ రాక్షసుల శారీరక బలం ముందు ఆమె పోరాటం సరిపోలేదు!
వాళ్లు ఆమె నోరు నొక్కి, బలవంతంగా ఈడ్చుకెళ్లి సగం తెరిచి ఉన్న నల్లటి స్కార్పియో వెనుక సీట్లోకి తోసేసి, తలుపు బలంగా వేసి లాక్ చేశారు. కారు టైర్లు పొగలు కక్కుతూ మెయిన్ రోడ్డు వైపు దూసుకెళ్లాయి.
“ఆగండి! కారు ఆపండి!” అని శ్రీను కేకలు వేస్తూ గన్ గురిపెట్టినా, అప్పటికే కారు హైవే ఎక్కేసింది.శ్రీను వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి, తీవ్రంగా గాయపడి రక్తం కక్కుతున్న చంద్రమౌళి దగ్గరకు వచ్చాడు.
“సార్… సార్… మీకు చాలా దెబ్బ తగిలింది!” శ్రీను ఆందోళనగా చంద్రమౌళిని పట్టుకున్నాడు.
చంద్రమౌళి నొప్పితో మూలుగుతూ, శ్రీను షర్ట్ కాలర్ పట్టుకుని బలవంతంగా పైకి చూస్తూ రొప్పుతూ అన్నాడు:”శ్రీనూ… నా గురించి బెంగ పెట్టుకోకు! ఆ లాయర్ రమ్య… ఆమె దగ్గరే పెన్‌డ్రైవ్ ఉంది! ఆ బన్నీ వాస్ గాడు పెన్ డ్రైవ్ ను వదలడు… నువ్వు వెంటనే జీప్ తీసుకొని ఒంటరిగా వాళ్ళని ఫాలో అవ్వు! వాళ్ళు సిటీ దాటకుండా పట్టుకోవాలి!”
“సార్, మిమ్మల్ని ఇలా వదిలేసి నేను…” శ్రీను ఆందోళన పడ్డాడు.
“నేను ఇక్కడే శివతో ఉంటాను! టైమ్ వేస్ట్ చేయకు శ్రీనూ… వెళ్లు!” చంద్రమౌళి గట్టిగా చెప్పాడు.
శ్రీను వెంటనే పరుగు తీసి పోలీస్ జీప్ ఎక్కాడు. గేర్ మార్చి యాక్సిలరేటర్ గట్టిగా తొక్కేసరికి… జీప్ టైర్లు నేలను గీరుకుంటూ స్పీడ్‌గా ముందుకు దూసుకెళ్లాయి.
ముందు రమ్యను తీసుకుని పారిపోతున్న బన్నీ వాస్ కారు… దాని వెనుకే సైరన్ మోతలతో శ్రీను తోలుతున్న పోలీస్ జీప్! తెల్లవారుజామున మసక చీకటిలో హైవే మీద ఒక భయంకరమైన వేట మొదలైంది…
Leave a Reply