స్థలం: కేజీహెచ్ హాస్పిటల్ ఐసీయూ కారిడార్ – అర్ధరాత్రి 1:15 గంటలు
ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చిన కానిస్టేబుల్ శ్రీను, సీఐ చంద్రమౌళి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఐసీయూ కారిడార్‌లోకి వచ్చాడు.
కారిడార్‌లోని బెంచ్‌పై డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు రాము, వెంకట్ అలసటతో నిద్రపోతున్నారు. శ్రీను వాళ్ల భుజాలు తట్టి లేపి, చంద్రమౌళి ఉన్న గది వైపు నడిచాడు.
అదే సమయంలో గది లోపల నుంచి బయటకు వస్తున్న డ్యూటీ నర్స్‌ను చూసి ఆపాడు.”సిస్టర్… సార్ పరిస్థితి ఎలా ఉంది?” అని అడిగాడు.
“బీపీ ఇంకా నార్మల్ కాలేదు. పల్స్ కూడా స్టేబుల్‌గా లేదు. డాక్టర్ గారు చూసి మందులు ఇచ్చారు. పొద్దుటి వరకు అబ్జర్వేషన్‌లో ఉంచాలని చెప్పారు,” అని చెప్పి ఆమె వెళ్లిపోయింది.
ఆ మాటలు విని శ్రీను ఆందోళనగా రమ్య ఉన్న రూమ్ వైపు నడిచాడు.
గది బయట ఉన్న కుర్చీలో లావణ్య మౌనంగా కూర్చుంది. ఆమె ముఖంలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి.శ్రీనును చూడగానే ఆమె లేచి,”సార్… సీఐ గారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఏమన్నారు?” అని అడిగింది.
“ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. పొద్దుటి వరకు వేచి చూడాలన్నారు,” అన్నాడు శ్రీను.
“రమ్యకి కూడా ఇంకా స్పృహ రాలేదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు,” అంది లావణ్య ఆవేదనగా.
“మీరు ఇంటికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా. ఇక్కడ మా వాళ్లు ఉన్నారు,” అన్నాడు శ్రీను.
“అలా ఎలా వెళ్లగలను శ్రీను గారు? నా కోసం వచ్చి రమ్య ఈ పరిస్థితిలో ఉంటే నేను ఇంట్లో ప్రశాంతంగా ఉండలేను. ఆమెకు స్పృహ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను,” అంది లావణ్య.
ఇద్దరూ మాట్లాడటం ఆపి రమ్య గది అద్దంలోంచి లోపలికి చూశారు. చూసిన దృశ్యానికి ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
బెడ్ పక్కన నిలబడి ఉన్న భూపతి మనిషి, రమ్య ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్‌ను లాగేసి ఆమె గొంతును బలంగా నొక్కుతున్నాడు. ఊపిరి కోసం రమ్య విలవిల్లాడుతుండగా, మానిటర్ బీప్… బీప్… అంటూ గట్టిగా మోగుతోంది.
“ఆగు… ఏం చేస్తున్నావ్!” అంటూ లావణ్య గట్టిగా అరిచింది.
శ్రీను తలుపు తెరిచేలోపే, లావణ్య ఒక్క తోపుతో ఐసీయూ తలుపు తెరిచి లోపలికి దూసుకెళ్లింది.
ఆ కేకకు కారిడార్‌లో ఉన్న రాము, వెంకట్ కూడా పరుగెత్తుకుంటూ వచ్చారు.ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, పక్కనే ఉన్న ఇనుప సెలైన్ స్టాండ్‌ను అందుకున్న లావణ్య, భూపతి మనిషి తల వెనుక బలంగా కొట్టింది.ఆ దెబ్బకు వాడు తూలి కిందపడిపోయాడు. తల నుంచి రక్తం కారడం మొదలైంది.లావణ్య వెంటనే అతడిని పక్కకు లాగేసి, రమ్య ముఖానికి ఆక్సిజన్ మాస్క్‌ను మళ్లీ సరిగా అమర్చింది.
కిందపడిన రౌడీ వెంటనే తన నడుముకు దాచుకున్న ఫోల్డింగ్ నైఫ్‌ను బయటకు తీసి లావణ్య వైపు దూసుకొచ్చాడు.
అంతలోనే వెనక నుంచి వచ్చిన శ్రీను వాడి చేతిని బలంగా మెలితిప్పి కత్తిని కిందపడేశాడు.
వెంటనే వాడిని నేలకేసి పడేసి అదిమిపట్టుకున్నాడు.రాము, వెంకట్ లోపలికి వచ్చి అతడికి బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు.
శ్రీను వెంటనే ఎమర్జెన్సీ బెల్ నొక్కాడు.కొన్ని క్షణాల్లోనే డాక్టర్ రాజు తన టీమ్‌తో పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు.
లావణ్య సమయానికి ఆక్సిజన్ మాస్క్‌ను మళ్లీ అమర్చడంతో రమ్య పల్స్ క్రమంగా కుదుటపడటం ప్రారంభించింది.
రమ్యను పరీక్షించిన డాక్టర్ రాజు ఊపిరి పీల్చుకుని,”సమయానికి ఆక్సిజన్ మాస్క్ మళ్లీ పెట్టారు. లేకపోతే పరిస్థితి మరింత విషమించేది.” అన్నాడు.
శ్రీను పట్టుబడిన రౌడీని చూస్తూ,”భూపతి రెడ్డి మనుషులు మరోసారి ప్రయత్నిస్తారని ముందే ఊహించాం. కానీ హాస్పిటల్‌లోకే చొరబడి ఇంత దారుణానికి తెగబడతారని అనుకోలేదు. వీడిని వెంటనే స్టేషన్‌కి తీసుకెళ్లండి. నోరు విప్పిస్తే ఇంకా ఎన్ని నిజాలు బయటపడతాయో.
📖 అన్నీ కథలు
-
మృత్యువు తొడిగిన పూలదండ- భాగం 22
-
రహస్య కోడలు – తులసి రాక ( భాగం 16)
మాదాపూర్ అపార్ట్‌మెంట్ – ఉదయం 10:30 గంటలు.
డోర్‌బెల్ మోగడంతో వంటగదిలో ఉన్న అనూష చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపు తీసింది.ఎదురుగా తులసమ్మ నిలబడి ఉంది.
”అమ్మా… నువ్వా?” అనూష ముఖంలో ఆశ్చర్యం.
” ఏంటమ్మా… లోపలికి రానివ్వవా?” తులసి చిన్నగా నవ్వింది.
” ఏంటమ్మా నువ్వు మరిను ,రా లోపలకి,” అనూష పక్కకు తప్పుకుంది.
తులసి లోపలికి అడుగుపెట్టింది. ఒక చేతిలో చిన్న బ్యాగ్, మరో చేతిలో పళ్ల కవర్ ఉన్నాయి.”పక్కింటి వాళ్ల పెళ్లికి హైదరాబాద్ వచ్చానమ్మా. నిన్ను చూసి వెళ్దామని ఇలా వచ్చేశా.”
“ముందే చెప్పి ఉంటే నేనే వచ్చేదాన్ని కదా?”
“దానికేముందిలేవే, నా బంగారమింటికి రావడానికి కూడా ముందస్తు కబుర్లు ఎందుకు?” అంది నవ్వుతూ.
అనూష కూడా నవ్వాలని చూసింది, కానీ ఆ నవ్వు పెదవుల దాటి రాలేదు. అది తులసమ్మ దృష్టిని దాటలేదు. క్షణకాలం కూతురి ముఖాన్నే పరీక్షగా చూస్తూ ఉండిపోయింది.
“ఏంటమ్మా… ఏమైంది?” మెల్లగా అడిగింది.
“ఏం లేదు అమ్మ.”
”నాతో అబద్ధం చెప్పకు.”అనూష తల దించుకుంది.
తులసి దగ్గరకు వచ్చి, కూతురి చేయి పట్టుకుంది. “నిన్ను నేను కన్నానమ్మా. నీ ముఖం చూస్తే నీమనసులో ఏముందో నాకు తెలియదా? ముఖంలో ఆ కళ ఏది? కళ్ల కింద నల్లటి మచ్చలు వచ్చాయి, సరిగ్గా తిండి, నిద్ర ఉందో లేదో కూడా అనుమానమే. ఏమైంది చెప్పు?”తులసమ్మ గొంతులో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
అనూష కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క క్షణం మారెక్ బెదిరింపులు, ఆ వీడియో దృశ్యాలు కళ్లముందు మెదిలాయి. ‘అమ్మకి చెప్పేద్దామా?’ అనిపించింది. కానీ మరుక్షణమే తట్టుకోలేని ఆవేదనతో ఆ ఆలోచనను విరమించుకుంది. కన్నీళ్లను బలవంతంగా దిగమింగుకుంటూ, “ఏం లేదమ్మా… నువ్వే అనవసరంగా ఊహించుకుంటున్నావు,” అని సర్దిచెప్పే ప్రయత్నం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
తులసి ముఖంలో అనుమానం అలాగే ఉంది.అప్పుడే హాలులోకి సరోజ వచ్చింది.”అరే, ఒదిన గారు! ఎప్పుడు వచ్చారు?” అంటూ ఆప్యాయంగా పలకరించింది.
“ఇప్పుడే వచ్చానండీ.”
సరోజ వచ్చి సోఫాలో కూర్చుంటూ, “ముందే కబురు చేసి ఉంటే ఏదైనా కారు పంపించేదానిని కదా!” అంది.
తులసి చిన్నగా నవ్వింది, కానీ ఆమె దృష్టి అనూష పైనే ఉంది. కొద్దిసేపు మామూలు విషయాలు మాట్లాడాక, ఇక ఆగలేక నేరుగా అడిగేసింది.”ఒదిన… మా అమ్మాయి ఎందుకో చాలా దిగులుగా కనిపిస్తోంది. ఏమైనా జరిగిందా?”
సరోజ ఒక్కసారి అనూష గది వైపు చూసింది. “నాకూ అర్థం కావడం లేదండీ. రెండు రోజులుగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటోంది. అడిగితే ఏం లేదంటుంది.”
ఇంతలో అనూష గది నుండి హాల్ లోకి వచ్చి “అత్తయ్య… నిజంగానే ఏం లేదు,” అనూష ఆత్రంగా అంది.
తులసి తల ఊపినా, ఆమె మనసు ఒప్పుకోలేదు.”చిన్నప్పటి నుంచి దీని అలవాటు ఇంతే ఒదిన… మనసులో ఎంత బాధ ఉన్నా బయటకు పడనివ్వదు,” అంటూ అనూష వైపు చూసింది.
“పెళ్లయిందని అమ్మకి పరాయిదానివి అయిపోయావామ్మా?”ఆ మాట అనూష గుండెల్లో ఈటెలా గుచ్చుకుంది. తల్లి ఒడిలో తలపెట్టి గుండెలవిసేలా ఏడ్చేయాలనిపించింది. నిజం చెప్పేయాలని నాలుక చివరిదాకా వచ్చింది. కానీ మారెక్ హెచ్చరిక మనసులో మెదిలి నోరు నొక్కేసింది.
అనూష మౌనంగా తల వంచుకుంది. ఆ నిశ్శబ్దం ఆ గదిలోని ముగ్గురికీ మూడు వేర్వేరు భావాలను మిగిల్చింది.
-
మృత్యువు తొడిగిన పూలదండ – భాగం 21
స్థలం: కేజీహెచ్ హాస్పిటల్ – ఐసీయూ కారిడార్ – మధ్యాహ్నం 2:15 గంటలు
ఐసీయూ కారిడార్‌లోని ఇనుప బెంచ్ మీద కానిస్టేబుల్ శ్రీను ఒరిగి కూర్చున్నాడు. యూనిఫాం మీద ఎండిపోయిన రక్తపు మరకలు ఇంకా అలాగే ఉన్నాయి. కళ్ల కింద నల్లటి మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి నుంచి ఒక్క నిమిషం కంటి మీద కునుకు లేదు.ఐసీయూ తలుపు మీద వెలుగుతున్న ఎర్రటి లైట్ వైపు చూస్తూనే ఉన్నాడు.
అప్పుడే కారిడార్ చివర నుంచి సివిల్ డ్రెస్సులో కానిస్టేబుల్స్ రాము, వెంకట్ వచ్చారు.రాము దగ్గరికి వచ్చి శ్రీను భుజం మీద చేయి వేశాడు.
“రేయ్ శ్రీనూ… డాక్టర్స్ ఏమన్నారు?”
శ్రీను నెమ్మదిగా తలెత్తాడు.”ఆ రాము… సార్ లోపల ప్రాణాలతో పోరాడుతున్నారు.”
ఒక్క క్షణం ఆగి…వెంకట్ మధ్యలో అన్నాడు. “లాయర్ రమ్య పరిస్థితీ ఎలా ఉంది?.”
“ఆపరేషన్లు పూర్తయ్యాయి… కానీ స్పృహ వస్తే తప్ప ఏమీ చెప్పలేమంటున్నారు.”శ్రీను గొంతు భారమైంది.”సార్… నన్ను నమ్మి బన్నీ వాస్‌ని వెంబడించమన్నారు. కానీ ఆమెను కాపాడలేకపోయానేమో అనిపిస్తోంది.”
రాము వెంటనే అతని భుజం గట్టిగా పట్టుకున్నాడు.”అలా అనకు రా.”
“ఆ స్పీడ్‌లో వెళ్తున్న కారును అంత దూరం ఒక్కడివే వెంటాడావు. యాక్సిడెంట్ అయిన వెంటనే అందరినీ బయటికి తీసి హాస్పిటల్‌కు చేర్చావు. నువ్వు లేకపోతే వాళ్లు అక్కడికక్కడే చనిపోయేవాళ్లు.”
వెంకట్ కూడా తల ఊపాడు.”ఎస్‌పీ గారే ఇప్పుడే చెప్పి వెళ్లారు. ‘శ్రీను లాంటి మనిషి మన డిపార్ట్మెంట్లో ఉండడం, నిజంగా మనకు గర్వం.’ అని.”
శ్రీను ఏమీ మాట్లాడలేదు.రాము చేతిలో ఉన్న కవర్ బెంచ్ మీద పెట్టాడు.”ఇందులో బట్టలు ఉన్నాయి. రూంకి వెళ్లి స్నానం చేసి, ఏదైనా తిని, రెండు గంటలు పడుకో.”
“రేపు మార్నింగ్ డ్యూటీకి మళ్లీ నువ్వే రావాలి.”శ్రీను వెంటనే తల అడ్డంగా ఊపాడు.”నేను వెళ్లను. సార్ కళ్లు తెరిచే వరకు నేనే ఇక్కడ ఉంటాను.”
రాము నవ్వాడు.”అది ఎస్పి ఆర్డర్ రా. ఇక్కడ మేముంటాము, ఏమైనా అయితే వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేస్తాం.”
శ్రీను ఇంకా సందేహంగానే ఐసీయూ తలుపు వైపు చూశాడు.అంతలో ఓ వార్డ్ బాయ్ ట్రాలీ తోసుకుంటూ ఐసీయూ లోపలికి వెళ్లబోయాడు.
రాము అతన్ని ఒక్కసారి గమనించాడు.”ఒక్క నిమిషం ఆగు.. నీ ఐడి కార్డు చూపించు?” అని రాము అడిగాడు.
వార్డ్ బాయ్ ఏమాత్రం తడబడకుండా జేబులో నుంచి డ్యూటీ కార్డు చూపించాడు.”నైట్ షిఫ్ట్ స్టాఫ్ సార్.”
వెంకట్ వెంటనే అన్నాడు.”సరే… ఉదయం నుంచి షిఫ్ట్‌లు మార్చారు కదా. కొత్త వాళ్లే ఉంటారు. వెళ్లనివ్వు.”
రాము మరోసారి అతని ముఖం చూసి…”సరే… వెళ్లు.”అన్నాడు.
వార్డ్ బాయ్ నెమ్మదిగా తల వంచి ఐసీయూ లోపలికి వెళ్లిపోయాడు.
శ్రీను చివరిసారి ఐసీయూ తలుపు వైపు చూసి…”రమ్య మేడమ్ గది వైపు కొంచెం కన్నేసి ఉంచండి. బన్నీ వాస్ మనుషులు ఏమైనా ప్రయత్నించొచ్చు.”
అన్నాడు.
“నువ్వు టెన్షన్ పడకు.”అన్నాడు రాము.
శ్రీను నెమ్మదిగా కారిడార్ దాటి వెళ్లిపోయాడు.మంచం మీద నిశ్చలంగా పడుకుని ఉంది.ముఖానికి ఆక్సిజన్ మాస్క్.చేతికి ఐవీ లైన్లు.ఈసీజీ మానిటర్‌పై ఆకుపచ్చ గీతలు నెమ్మదిగా కదులుతున్నాయి.
(రమ్య కల…)
చీకటితో కప్పబడిన పాత విక్టరీ క్లబ్.చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం.చేతిలో టార్చ్ పట్టుకుని రమ్య ఒంటరిగా నడుస్తోంది.”ఆ పెన్‌డ్రైవ్ దొరికితే… భూపతి రెడ్డి అంతం.”అని తనలో తానే అనుకుంది.
పాత టేబుల్ కింద దుమ్ముతో కప్పబడి ఏదో మెరుస్తోంది. టార్చ్ వెలుతురు అక్కడ పడింది. సిల్వర్ రంగు పెన్‌డ్రైవ్. రమ్య కళ్లల్లో ఆనందం మెరిసింది.”దొరికింది…”అని ముందుకు అడుగు వేసింది.
కానీ…ఒక్కసారిగా ఊపిరి బిగుసుకుంది.మరొక అడుగు…ఇంకా ఊపిరి అందలేదు. ఆమె గట్టిగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించింది. గాలి మాత్రం లోపలికి రావడం లేదు. గొంతు బిగుసుకుపోతోంది.చేతులు మెడవైపు వెళ్లాయి.
(వాస్తవ ప్రపంచం…)
అదే సమయంలో…ఐసీయూలోని లైట్లు మసకగా వెలుగుతున్నాయి.వార్డ్ బాయ్ యూనిఫాం వేసుకున్న ఆ వ్యక్తి నెమ్మదిగా రమ్య మంచం దగ్గరకు వచ్చాడు. ఒక్కసారి చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. మెల్లగా ఆమె ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్‌ను పక్కకు జరిపాడు. తర్వాత ప్లాస్టిక్ గ్లౌజ్ వేసుకున్న చేతిని…ఆమె ముక్కు, నోరు మీద బలంగా అదిమిపట్టాడు.
రమ్య శరీరం ఒక్కసారిగా కంపించింది.మానిటర్ మీద గుండె స్పందన వేగంగా మారింది.
బీప్… బీప్… బీప్…అని మొదలైన శబ్దం…
క్షణక్షణానికి మరింత వేగంగా మారసాగింది. -
రహస్య కోడలు – కన్ఫ్యూషన్ (భాగం 15)
మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలు.
సాధారణంగా తెల్లవారుజామునే లేచే అనూష, ఆ రోజు ఇంకా గది తలుపు కూడా తీయలేదు.
సరోజ బెడ్‌రూమ్ తలుపు దగ్గరకు వచ్చి మెల్లగా తట్టింది.
“అనూషా…”
లోపల నుంచి కాసేపటికి తలుపు తెరుచుకుంది. చెదిరిపోయిన జుట్టు, రాత్రి నిద్రలేక ఎర్రబడిన కళ్లతో అనూష నిలబడి ఉంది.
“ఏమైంది? ఇంకా లేవలేదు ఈరోజు?” అని సరోజ అడిగింది.
“ఏం లేదు అత్తయ్యా… కొంచెం తలనొప్పిగా ఉంది.”
సరోజ కాసేపు ఆమె మొహం చూసింది.
“సరే… ముందు బ్రష్ చేసుకుని రా. కాఫీ చేసి ఇస్తా.”
“వద్దు అత్తయ్యా. రెండు నిమిషాల్లో నేనే వచ్చి టిఫిన్ చేస్తాను.”
“అవసరం లేదు. ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో. టిఫిన్ సంగతి నేను చూసుకుంటా.” అంతే అని వెనక్కి తిరిగి వంటగది వైపు నడిచింది.
తలుపు మూసిన వెంటనే అనూష మెల్లగా నిట్టూర్చింది. రాత్రంతా కంటిమీద కునుకు లేకపోవడంతో, తలనొప్పి కంటే మనసులోని భయమే ఆమెను ఎక్కువగా అలసిపోయేలా చేసింది.
సరోజ వంటగదిలో టిఫిన్ పనిలో పడిపోయాక, అనూష నెమ్మదిగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది.
మంచం మీద ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకుంది.
కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయింది.
నిన్న వచ్చిన ఆ మూడు మిస్డ్ కాల్స్… ఆ తర్వాత వచ్చిన బెదిరింపు… ఏదీ మనసులో నుంచి పోవడం లేదు.
ఫోన్ అన్‌లాక్ చేసి, కాంటాక్ట్స్‌లో లేని నంబర్ల జాబితా తెరిచింది.
ఆ +44 నంబర్ కనిపించగానే చేయి ఆగిపోయింది.
“బ్లాక్ చేసేస్తే… నిజంగానే వదిలేస్తాడా?”
తనలో తానే గొణుక్కుంది.
వెంటనే మరో ఆలోచన వచ్చింది.
“వదిలేసే మనిషి అయితే… ఇంతవరకు వచ్చేవాడు కాదు.”
ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి మంచం మీద పెట్టేసింది.
కొన్ని క్షణాలు అలాగే కూర్చుంది.
ఏం చేయాలో ఆమెకు అర్థం కావడం లేదు. కిరణ్‌కి చెప్పాలా… లేక ఈ సమస్యని తనే ఎదుర్కోవాలా… రెండింట్లో ఏదీ ఆమెకు సులభంగా అనిపించడం లేదు.
అదే రోజు… లండన్.
లంచ్ బ్రేక్‌లో కిరణ్ ఫోన్ తీసుకుని అనూషకి మెసేజ్ పెట్టాడు.
“ఏం చేస్తున్నావ్?”
కొన్ని నిమిషాల తర్వాత రిప్లై వచ్చింది.
“ఏం లేదు.”
అంతే.
కిరణ్ మళ్లీ టైప్ చేశాడు.
“బోర్ కొడుతుందా?”
“కొంచెం.”
ఆ రెండు మెసేజ్‌లు చదివాక అతను ఫోన్ స్క్రీన్‌నే చూస్తూ ఉండిపోయాడు.
మామూలుగా అయితే అనూష ఒక ప్రశ్న అడిగితే, మరో నాలుగు మాటలు కూడా జోడించేది.
“నువ్వు తిన్నావా?”
“ఆఫీస్ ఎలా ఉంది?”
“ఈరోజు పని ఎక్కువా?”
ఇలా.
కానీ ఈరోజు…
ప్రతి సమాధానం ఒక్క మాటతోనే ముగుస్తోంది.
కిరణ్ కొద్దిసేపు ఆలోచించి టైప్ చేశాడు.
“అంతా ఓకేనా?”
అవతల నుంచి రిప్లై రావడానికి రెండు నిమిషాలు పట్టింది.
“ఓకే.”
ఆ ఒక్క మాటే కిరణ్ మనసులో ఇంకా ఎక్కువ సందేహాన్ని పెంచింది.
ఆ రాత్రి…
సరోజ ప్లేటులో అన్నం వడ్డించుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది.
అనూష కూడా వచ్చి ఎదురుగా కూర్చుంది.
ఇద్దరూ మౌనంగానే తినడం మొదలుపెట్టారు.
సరోజ మధ్యలో ఒక్కసారి అనూష ప్లేట్ వైపు చూసింది.
“ఇంతేనా తినేది?”
అనూష తలెత్తి చూసింది.
“చాలు, ఆకలి లేదు అత్తయ్యా.”
“ఉదయం కూడా సరిగ్గా తినలేదు.”
” తలనొప్పి ఇంకా తగ్గలేదు, అందుకే తినబుద్ధి కవ లేదు.”
సరోజ ఇంకేమీ మాట్లాడలేదు.
తన ప్లేట్ ఖాళీ చేసి లేచింది.
“సారిడాన్ టాబ్లెట్ వేసుకుని పడుకో.”
“సరే అత్తయ్యా.”
సరోజ ప్లేట్ తీసుకుని కిచెన్‌లో పెట్టి, అక్కడి నుంచి నేరుగా తన గదిలోకి వెళ్లిపోయింది.
అనూష మాత్రం ఇంకో ముద్ద నోట్లో వేసుకోవాలని ప్రయత్నించింది.
కాలేదు, చేయి కడిగేసి తన గదికి వెళ్ళిపోయింది.
గదిలోకి వెళ్లిన అనూష మంచం మీద కూర్చుంది.
ఫోన్ తీసి WhatsApp తెరిచింది.
Kaisa పేరు మీద వేళ్లు ఆగిపోయాయి.
“చెప్పేస్తే…”
అనిపించింది.
వెంటనే తల ఊపుకుంది.
“చెప్పి ఏం లాభం? అక్కడి నుంచి ఆమె ఏం చేయగలదు?”
మరోసారి ఆ చాట్ ఓపెన్ చేసింది.
Call బటన్ మీద బొటనవేలు ఆగి… మళ్లీ వెనక్కి తీసుకుంది.
చివరికి ఫోన్ లాక్ చేసి పక్కన పెట్టేసింది. -
మృత్యువు తొడిగిన పూలదండ – భాగం 20
స్థలం: నేషనల్ హైవే – యాక్సిడెంట్ స్పాట్ – ఉదయం 6:45 గంటలు.
కళ్లముందే స్కార్పియో కారు ఐరన్ లోడ్ లారీ కిందకి దూసుకెళ్లడం, ఆ దృశ్యం చూసి శ్రీను ఒక్క క్షణం స్థంభించిపోయాడు. రోడ్డు మీద పొగలు కక్కుతున్న ఆ కారు దగ్గరకు జీప్‌ని వేగంగా తీసుకెళ్లి సడన్ బ్రేక్ వేశాడు.కారు ముందు భాగం నలిగిపోయి లారీ కింద ఇరుక్కుపోయింది. స్టీరింగ్‌కు బలంగా తాకడంతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
శ్రీను క్షణం కూడా టైమ్ వేస్ట్ చేయకుండా జీప్‌లోని వైర్‌లెస్ సెట్ అందుకున్నాడు.
“కంట్రోల్ రూమ్… నేషనల్ హైవే బైపాస్ మలుపు దగ్గర మేజర్ యాక్సిడెంట్. మల్టిపుల్ క్యాజువల్టీస్. వెంటనే అంబులెన్సులు, ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ పంపించండి.” ఓవర్!”
అప్పటికే హైవే పై వస్తున్న ప్రైవేట్ బస్సు, లారీ డ్రైవర్లు వాహనాలు ఆపి కిందకి దిగారు. శ్రీను ఆ రోడ్డుపై ఉన్న మనుషుల సహాయంతో కారు వెనుక డోర్‌ను లారీలో ఉన్న ఐరన్ రాడ్ తీసుకుని బద్దలు కొట్టించాడు. రమ్య వెనుక సీటు చివర పడి ఉండటం వల్ల లారీ నేరుగా గుద్దుకోలేదు.
కానీ ఆమె శరీరమంతా గాయాలై స్పృహ లేకుండా ఉంది. జనం సహాయంతో శ్రీను జాగ్రత్తగా రమ్యను బయటకు తీసి పక్కన పడుకోబెట్టాడు. ఆమె కోటుని ఆమెపై కప్పి, తల కింద బట్టలు అమర్చి ప్రాణాలు ఉన్నాయో లేదో చెక్ చేశాడు. పల్స్ ఉంది… త్వరగా ఎక్కించండి.
కారులో దెబ్బతిని తీవ్ర రక్తగాయాలతో స్పృహతప్పి ఉన్న బన్నీ వాస్‌ని, మిగతా ఇద్దరు రౌడీలను కూడా జనం బయటకు తీశారు.
సరిగ్గా అదే సమయానికి సైరన్ మోతలతో 108 అంబులెన్స్ అక్కడ ప్రత్యక్షమైంది. శ్రీను రమ్యను, బన్నీ వాస్‌ని అంబులెన్స్‌లోకి ఎక్కించి, వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) కు పంపించి, తను కూడా వెంట వెళ్ళాడు.స్థలం: కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH), వైజాగ్ – ఎమర్జెన్సీ క్యాజువాలిటీ – ఉదయం 7:12 గంటలు.
ఎమర్జెన్సీ క్యాజువాలిటీ మొత్తం పరుగులు, కేకలు, స్ట్రెచర్ల చప్పుడు, మానిటర్ల బీప్‌లతో హడావుడిగా మారిపోయింది. గాయపడిన సీఐ చంద్రమౌళిని మరో పోలీస్ జీప్‌లో తీసుకొచ్చి అప్పటికే ట్రామా బేలోకి తరలించారు.
అదే సమయంలో కానిస్టేబుల్ శ్రీను అంబులెన్స్‌లో రమ్యను, బన్నీ వాస్‌ను తీసుకుని క్యాజువాలిటీ ముందు ఆపాడు.స్ట్రెచర్లు వరుసగా లోపలికి దూసుకెళ్తున్నాయి.
డ్యూటీలో ఉన్న సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ రాజు, గ్లౌజులు తొడుక్కుంటూ వేగంగా ట్రామా బేలోకి వచ్చాడు.
ఒక డ్యూటీ డాక్టర్ కేస్ షీట్ అందిస్తూ అన్నాడు.”సార్… సీఐ చంద్రమౌళికి తలకు తీవ్ర గాయం. ఇంటర్నల్ బ్లీడింగ్ అనుమానం ఉంది. బీపీ పడిపోతోంది.
“డాక్టర్ రాజు వెంటనే మరో స్ట్రెచర్ వైపు తిరిగాడు.”ఈ పేషెంట్?”
“రమ్య… రోడ్డు ప్రమాదం. హెడ్ ఇంజ్యూరీ, మల్టిపుల్ ట్రామా. ప్రస్తుతం అన్‌కాన్షస్. బీపీ చాలా లోగా ఉంది సార్.”
“ఇద్దరికీ వెంటనే CT స్కాన్ పూర్తి చేయండి. న్యూరో OT రెడీ చేయండి. అనస్థీషియా టీమ్‌ని వెంటనే పిలవండి. బ్లడ్ బ్యాంక్‌కి సమాచారం ఇవ్వండి. క్రాస్‌మ్యాచ్ ఆలస్యం కాకూడదు.”
డాక్టర్ రాజు వరుసగా ఆదేశాలు ఇస్తుండగా, నర్సులు, జూనియర్ డాక్టర్లు తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
అప్పటికే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ మోగింది.”సార్… పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి కాల్.”
డాక్టర్ రాజు ఫోన్ అందుకున్నాడు.
“డాక్టర్… సీఐ చంద్రమౌళి, అడ్వకేట్ రమ్య… ఇద్దరి పరిస్థితి ఎలా ఉంది?” అవతలి వైపు నుంచి ఆందోళనతో కూడిన స్వరం వినిపించింది.
డాక్టర్ రాజు ఒక క్షణం ఇద్దరి వైపు చూసి సమాధానమిచ్చాడు.”ఇప్పుడే ఖచ్చితంగా ఏమీ చెప్పలేం సార్. ఇద్దరికీ తీవ్ర గాయాలున్నాయి. న్యూరోసర్జరీ టీమ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతోంది. మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.”అని చెప్పి ఫోన్ నర్స్‌కు ఇచ్చేశాడు.
కొద్ది క్షణాలకే ఇద్దరి స్ట్రెచర్లను న్యూరో ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకెళ్లారు.
ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకుపోయాయి.పైన వెలిగిన ఎర్రటి లైట్ ఒక్కటే ఇప్పుడు బయట వేచి ఉన్న ప్రతి ఒక్కరిలో ఆందోళనను మరింత పెంచుతోంది.స్థలం: బీచ్ రోడ్డులోని భూపతి రెడ్డి రాయల్ విల్లా – ఉదయం 7:20 గంటలు.
నగరం ఒకవైపు భయంకరమైన హత్యలు, యాక్సిడెంట్లు, పోలీస్ హడావుడితో రగులుతుంటే… భూపతి రెడ్డి మాత్రం ప్రశాంతంగా తన విల్లా లాన్‌లో వైట్ ట్రాక్ సూట్ వేసుకుని, లగ్జరీ మ్యూజిక్ వింటూ జాలీగా జాగింగ్ చేస్తున్నాడు.వాడి ముఖంలో ఎలాంటి కంగారు లేదు. సరిగ్గా అదే సమయానికి వాడి పర్సనల్ ఐఫోన్ రింగ్ అయింది.
భూపతి రెడ్డి జాగింగ్ ఆపి, చెమట తుడుచుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి కాన్ఫిడెంట్‌గా “చెప్పు!” అన్నాడు.
అవతలి వైపు నుండి వాడి అనుచరుడు వణుకుతున్న గొంతుతో చెప్పాడు: “అన్నా… పెద్ద ప్రమాదం జరిగింది. బన్నీ వాస్ కారు హైవే మీద ఐరన్ లారీని ఢీకొట్టింది. డ్రైవర్ స్పాట్ డెడ్! బన్నీ వాస్, ఆ లాయర్ రమ్య, పోలీస్ చంద్రమౌళి… అందరూ చావుబతుకుల మధ్య కేజీహెచ్ హాస్పిటల్‌లో ఉన్నారు. హాస్పిటల్ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఉంది.”
భూపతి రెడ్డి ముఖంలో ఉన్న నవ్వు ఒక్కసారిగా మాయమైంది. వాడు జాగింగ్ ఆపేసి, సిగరెట్ వెలిగించాడు. పొగను గాల్లోకి వదులుతూ, సముద్రం వైపు చూశాడు.”ఆ పెన్‌డ్రైవ్ ఏమైందిరా?” భూపతి రెడ్డి గంభీరంగా అడిగాడు.
“అది తెలిదు అన్నా… పోలీసుల చేతికి చిక్కిందో లేదో క్లారిటీ లేదు!” అవతలి వ్యక్తి అన్నాడు.
భూపతి రెడ్డి కళ్లు కొద్దిగా సన్నబడ్డాయి. వాడు సిగరెట్ ను చేతితో నలిపేస్తూ ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు:”చంద్రమౌళి గాడు ఆపరేషన్ థియేటర్ లోంచి బయటకు రాకూడదు! ఆ రమ్య కళ్లు తెరిచేలోపే ఆ పెన్‌డ్రైవ్ మన చేతిలో ఉండాలి… లేదా అదే లేకుండాపోవాలి. కేజీహెచ్ హాస్పిటల్‌కి మన మనుషులను పంపించు. అవకాశం చూసుకుని… మన దారికి అడ్డుగా ఉన్న ఒక్కరూ మిగలకూడదు.” -
రహస్య కోడలు – ఇంగ్లీష్ కాల్ (భాగం 14)
మధ్యాహ్నం… మాదాపూర్‌లోని ఆ అపార్ట్‌మెంట్ అంతా నిశ్శబ్దంగా ఉంది. గోడ గడియారం టిక్‌టిక్ కూడా స్పష్టంగా వినిపిస్తోంది.
సరోజ బంధువుల ఇంటికి వెళ్లడంతో అనూష ఇంట్లో ఒంటరిగా ఉంది.
సరిగ్గా అదే సమయంలో ఫోన్ గట్టిగా మోగడం మొదలైంది. స్క్రీన్ మీద మళ్లీ అదే విదేశీ కంట్రీ కోడ్ ఉన్న నంబర్ మెరుస్తోంది.అనూష ఆ దడ పుట్టించే స్క్రీన్ వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది. రెండు రింగ్‌లు పూర్తయ్యేదాకా చేయి చాచడానికి కూడా భయం వేసింది. మూడో రింగ్‌కి వణుకుతున్న చేతులతో కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది.
“హలో?”
అవతలి వైపు రెండు క్షణాలు నిశ్శబ్దం… ఆ తర్వాత ఇంగ్లీష్‌లో పోలిష్ యాస ఉన్న ఒక గొంతు వినిపించింది.”అనూషా? నేను… మారెక్.”
ఆ పేరు వినగానే అనూష ముఖంలోని రంగు ఒక్కసారిగా మారిపోయింది.”నువ్వు… నా నంబర్ నీకు ఎక్కడ దొరికింది?”
“నువ్వు మా స్పా సెంటర్‌లో జాబ్‌కి అప్లై చేసినప్పుడు ఇచ్చిన రిజ్యూమే గుర్తుందా? అందులో నుంచే నీ నంబర్ తీసుకున్నాను.”
అనూష గుండె మళ్లీ వేగంగా కొట్టుకోవడం మొదలైంది.”ఎందుకు కాల్ చేశావ్? ఇప్పుడు నాతో నీకేం పని?”
“నీతో ఒక పని ఉంది అనూషా,” అన్నాడు మారెక్. అతని గొంతులో ఏమాత్రం జాలి లేదు. “నా దగ్గరికి వచ్చే ఆ VIP మళ్లీ నీ గురించే అడుగుతున్నాడు. ఈ ఒక్కసారి కలిస్తే చాలు.”
“మారెక్!”అనూష తెలియకుండానే కిటికీ కర్టెన్ లాగేసింది. ఎవరైనా తనను గమనిస్తున్నట్టుగా ఆమెకు అనిపించింది.
గొంతు తగ్గించి ఆవేదనగా అంది.”నేను ఆ జీవితాన్ని అక్కడే మర్చిపోయాను మారెక్. ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది… హస్బెండ్ ఉన్నారు. దయచేసి మళ్లీ నన్ను ఆ జీవితంలోకి లాగకు.”
అవతలి వైపు నుంచి చల్లని నవ్వు వినిపించింది.”అంత ఈజీగా గతం చెరిపేయలేవు అనూషా. ఆ రోజు జరిగిన దానికి సంబంధించిన వీడియో ఇప్పటికీ నా దగ్గరే ఉంది. అది బయటకు వెళ్లకూడదు… నీ భర్త చేతికి చేరకూడదు అనుకుంటే, నేను చెప్పిన దానికి ఒప్పుకోవాలి.”
ఆ మాట వినగానే అనూష కాళ్ల కింద నేల కదిలిపోయినంత పనైంది. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి.”బాగా ఆలోచించుకో.”అంతే… మారెక్ కాల్ కట్ చేశాడు.
ఫోన్ చేతిలోనే ఉండిపోయింది. స్క్రీన్ చీకటిగా మారేదాకా, గుండెల్లో భయం పేరుకుపోతుండగా, అనూష అలాగే నిలబడి ఉండిపోయింది.
సాయంత్రం వేళ సరోజ ఇంటికి తిరిగి వచ్చేసరికి, అనూష వంటగదిలో కూరగాయలు కడుగుతోంది. కానీ మనసంతా మారెక్ బెదిరింపు, ఆ వీడియో గురించే ఆలోచిస్తోంది. ఒకే కూరగాయను కుళాయి కింద పదేపదే కడుగుతూనే ఉంది.
హ్యాండ్‌బ్యాగ్ కింద పెడుతూ సరోజ వంటగది వైపు చూసింది.”ఏమైంది అనూషా? అంతగా ఆలోచిస్తున్నావ్?”
“ఏం… ఏం లేదు అత్తయ్య,” అంటూ అనూష తొందరపడి నీళ్ల కుళాయి ఆపేసింది.
సరోజ ఆమె వైపు కాసేపు అనుమానంగా చూసింది. కానీ ఏమీ అడగకుండా బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్లిపోయింది.
అనూష చేతిలోని కూరగాయను పక్కన పెట్టి, వణుకుతున్న చేతులతో మళ్లీ ఫోన్ తీసుకుంది. మారెక్ చెప్పిన ప్రతి మాట ఆమె చెవుల్లో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది.
ఆ రాత్రి…మంచం మీద పడుకున్నా అనూషకి నిద్ర పట్టలేదు. తీవ్రంగా ఆలోచిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మారెక్ ప్రొఫైల్ సెర్చ్ చేసింది.అతని ప్రొఫైల్ తెరిచి, మెసేజ్ టైప్ చేయడం మొదలుపెట్టింది.”Please… don’t do this…”అని టైప్ చేసి కొద్దిసేపు స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయింది.
తర్వాత ఒక్కసారిగా ఆ మెసేజ్ మొత్తం డిలీట్ చేసేసింది.అతన్ని వేడుకోవాలా… లేక ఎదురించాలా…అనే అంతర్మథనంలో కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, చివరకు ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి నిశ్శబ్దంగా కళ్లుమూసుకుంది. -
మృత్యువు తొడిగిన పూలదండ – భాగం 19
స్థలం: నేషనల్ హైవే – వైజాగ్ అంచులు – తెల్లవారుజామున 6:35 గంటలు.
తెల్లవారుజాము కాస్త చీకటిని కూడా చీల్చుకుంటూ ఆ నల్లటి స్కార్పియో కారు గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో హైవే మీద రయ్యిమంటూ దూసుకెళ్తోంది.
కారు వెనుక సీట్లో రమ్య స్పృహ తప్పి పడి ఉంది. రౌడీలతో జరిగిన పోరాటంలో తగిలిన దెబ్బలకు ఆమె స్పృహ కోల్పోయింది.
కంటి కింద కారుతున్న రక్తాన్ని చేత్తో తుడుచుకుంటూ బన్నీ వాస్ రాక్షసుడిలా రమ్య మీదికి పడ్డాడు. ఆమె రెండు చేతుల పిడికిళ్లు బలవంతంగా విరిచి చూశాడు. అక్కడ పెన్‌డ్రైవ్ లేదు!వాడికి పగ, భయం ఒకేసారి నెత్తికెక్కాయి. పిచ్చివాడిలా రమ్య పక్కన పడి ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ని గుంజి, అందులో ఉన్న ఫైళ్లు, వస్తువులన్నీ కారు ఫ్లోర్ మీద పారబోశాడు. ఎక్కడా దొరకలేదు.
నిస్సహాయ స్థితిలో స్పృహ లేకుండా ఉన్న రమ్యను చూసి, వాడిలో క్రూరత్వం పీక్స్‌కి చేరింది.బన్నీ వాస్ ఏమాత్రం కనికరం లేకుండా ఆమె కట్టుకున్న చీర విప్పేసి, ఆమె శరీరంపై నూలుపోగు లేకుండా అన్ని విప్పేసి, పెన్‌డ్రైవ్ కోసం మరింత పిచ్చిగా వెతికాడు.
కానీ ఆమె దగ్గర అది ఎక్కడా కనిపించలేదు!“ఎక్కడ దాచావే? చెప్పే… ఎక్కడుంది?” అంటూ బన్నీ వాస్ స్పృహలేని రమ్య భుజాలు పట్టుకుని పిచ్చివాడిలా ఊపేశాడు. కానీ రమ్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆమె తల నిస్సత్తువగా పక్కకు వాలిపోయింది.
సరిగ్గా అదే సమయంలో… కారు వెనుక అద్దంలోంచి సైరన్ వెలుగులు, దానికి తోడు భయంకరమైన బుల్లెట్లు కాల్పులు వినబడ్డాయి.
కానిస్టేబుల్ శ్రీను తోలుతున్న పోలీస్ జీప్ కళ్లు మూసి తెరిచేలోగా స్కార్పియో కారుకు చేరువగా వచ్చింది! డ్రైవింగ్ సీట్లో ఉన్న శ్రీను స్టీరింగ్‌ను ఒంటిచేతితో బలంగా పట్టుకుని, కుడిచేతిని కిటికీ బయటకు పెట్టి కారు టైర్లను టార్గెట్ చేస్తూ తుపాకీతో వరుసగా కాల్పులు జరిపాడు!
“ధాం! ధాం!” అంటూ శబ్దాలు చేస్తూ, స్పీడ్ కారణంగా గురి తప్పి, బుల్లెట్లు కారు బ్యాక్ బంపర్‌కి తగిలి మెరుపులు చిందాయి.
“ఆపకు రా! ముందు ఏది అడ్డొచ్చినా దూసుకుపో… కానీ వాడికి మాత్రం దొరకొద్దు!” అని బన్నీ వాస్ రక్తం కళ్లతో డ్రైవర్ మీద అరిచాడు.
అప్పటికే పూర్తిగా తెల్లవారింది. హైవే మీద ఒకటొకటిగా కూరగాయల లారీలు, ఆర్టీసీ బస్సులు వస్తూనే ఉన్నాయి. ఆ హెవీ ట్రాఫిక్ మధ్యలో స్కార్పియో కారు, పోలీస్ జీప్ ఒంపులు తిరుగుతూ, వాహనాల మధ్య నుంచి కట్ కొడుతూ దూసుకెళ్తున్నాయి. ఆ రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులకు అది మృత్యువుతో పందెం పడుతున్న F1 రేసులా, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని చావు రేస్‌లా అనిపిస్తోంది.
ఒక ఆర్టీసీ బస్సును రాంగ్ సైడ్‌లో దాటుకుంటూ బన్నీ వాస్ కారు ముందుకు వెళ్లగా… శ్రీను జీప్‌ని డివైడర్ అంచు వరకు తీసుకెళ్లి కారును లాక్ చేస్తూ పక్క నుంచే పారలెల్‌గా వచ్చాడు.
శ్రీను జీప్ నుంచి అరిచాడు.”కారు ఆపరా బన్నీ వాస్! లేదంటే బుల్లెట్ నీ హెడ్ లోకి కాలుస్తా!”
కానీ స్కార్పియో డ్రైవర్ జవాబుగా యాక్సిలరేటర్‌ను మరింత బలంగా తొక్కేశాడు.సరిగ్గా అదే క్షణంలో… హైవే మలుపు వద్ద లెఫ్ట్ సైడ్ లేన్‌లో వెళ్తున్న ఇండికేటర్ వేస్తూ వేగం తగ్గించిన భారీ ఐరన్ లోడ్ లారీ… సడన్‌గా కుడివైపు ఉన్న కట్‌లోకి తిరిగింది!
కళ్లముందు కొండంత లారీ అడ్డంగా రావడం చూసి స్కార్పియో డ్రైవర్ కంగారులో బ్రేక్ బలంగా తొక్కాడు. కానీ గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంలో ఉన్న ఆ కారు సడన్ బ్రేక్ వేయడంతో టైర్లు స్కిడ్ అయి, కంట్రోల్ తప్పి నేరుగా వెళ్లి ఆ భారీ లోడ్ లారీ వెనుక భాగాన్ని భయంకరమైన శబ్దంతో ఢీకొట్టింది!
“ఢాం!”అని రోడ్డు దద్దరిల్లింది. స్కార్పియో కారు ఇంజన్ ముక్కలై, కారు ముందు భాగం లారీ కిందకి దూసుకెళ్లిపోయింది!కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జై, ఇంజన్ నుంచి దట్టమైన పొగలు ఎగసిపడుతున్నాయి.వెనుకే ఉన్న శ్రీను జీప్‌ని సడన్ బ్రేక్ వేసి ఆపాడు.
-
రహస్య కోడలు – మలుపు (భాగం -13)
ఆదివారం రాత్రి…
మాదాపూర్ అపార్ట్‌మెంట్ బెడ్‌రూమ్‌లో నిశ్శబ్దం గనక పగిలితే వినిపించేంత ప్రశాంతత. మర్నాడు ఉదయాన్నే లండన్ తిరిగి వెళ్లాల్సి ఉన్న కిరణ్ బ్యాగ్ సర్దుతోంది అనూష. చేతులు మాత్రమే పనిచేస్తున్నాయి… మనసంతా ఎక్కడో దూరంగా ఉంది.
“షర్ట్‌లు అన్నీ పెట్టేశా,” అంది అనూష, సూట్‌కేస్ జిప్ లాగుతూ.
“సరే,” ఫోన్‌లో ఈ-టికెట్ వివరాలు చూసుకుంటూ పొడిగా సమాధానమిచ్చాడు కిరణ్.
కానీ ఇద్దరినీ ఆ మౌనం తొలిచేస్తోంది. అనూష సూట్‌కేస్‌ని మంచం పక్కన నిలబెట్టి, కొద్దిగా ధైర్యం తెచ్చుకుని పిలిచింది.”కిరణ్.”
అతను ఫోన్ నుంచి చూపు తిప్పి ఆమె వైపు చూశాడు.
“నువ్వు వెళ్లిపోతున్నావ్… కానీ మనం సరిగ్గా మాట్లాడుకోలేదు.”
“దేని గురించి?”
“అదే… నా పరిస్థితి గురించి.”
కిరణ్ ఫోన్ పక్కన పెట్టి, కాస్త గంభీరంగా ఆమె వైపు చూశాడు.”ఏం మాట్లాడాలి అనూష? నువ్వు చెప్పేదంతా విన్నాను. అమ్మ అభిప్రాయం కూడా విన్నాను. మన మధ్య ఇంకా మాట్లాడుకోవడానికి ఏం మిగిలింది?”
అనూష వేళ్లు సూట్‌కేస్ జిప్‌కి గట్టిగా బిగుసుకున్నాయి.”తెలియదు… కానీ నువ్వు నా మీద ఇంకా కోపంగా ఉన్నావేమో అని భయంగా ఉంది.”
“కోపం కాదు అనూష,” కాసేపు మౌనంగా ఉండి అన్నాడు కిరణ్. “కానీ… ఇంతకుముందులా ఒకరికొకరం పూర్తిగా స్పష్టంగా ఉన్నామనే నమ్మకం రావట్లేదు… అంతే.”
“ఎందుకు అలా అనిపిస్తోంది?”
కిరణ్ లేచి కిటికీ దగ్గరికి నడిచాడు. రాత్రి వేళ దూరంగా మెరుస్తున్న హైటెక్ సిటీ వెలుగుల వైపు చూస్తూ అన్నాడు.”తెలియదు… నువ్వు మాట్లాడే ప్రతి మాట వెనుక ఏదో ఒక విషయాన్ని ఇంకా దాచిపెడుతున్నావేమో అనిపిస్తోంది.”
ఆమె వైపు తిరక్కుండానే మళ్లీ అడిగాడు.”నిజంగా ఇంకా ఏమైనా ఉందా అనూష?”
“ఏం ఉంటుంది కిరణ్?” ఆమె గొంతు వణికింది.
“నాకేం తెలుసు? అందుకే నిన్నే అడుగుతున్నా.”
ఆ గదిలో కొద్దిసేపు మళ్లీ నిశ్శబ్దం రాజ్యమేలింది. అనూష గొంతు సర్దుకుని మెల్లగా అంది.”లేదు కిరణ్… ఇంకేం లేదు.”
కిరణ్ మెల్లగా తల ఊపాడు. కానీ అతని కళ్లలో ఆమె మాటలపై నమ్మకం కనిపించలేదు. ఆ సంభాషణను అక్కడితో ముగించేయాలనే అలసట మాత్రమే కనిపించింది.
మరుసటి రోజు ఉదయం…
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.కిరణ్‌ను పంపడానికి సరోజ, అనూష ఇద్దరూ వచ్చారు.
డిపార్చర్ గేట్ దగ్గర చెక్-ఇన్ లైన్‌లో నిలబడి, భుజాన ఉన్న హ్యాండ్ లగేజ్ సరిచేసుకుంటూ కిరణ్ ఫోన్ చూసుకున్నాడు.”ల్యాండ్ అయ్యాక ఒక మెసేజ్ పెడతా,” అన్నాడు ఇద్దరి వైపు చూస్తూ.
అనూష ఒక్క అడుగు ముందుకు వేసి అతన్ని హత్తుకోవాలనుకుంది. కానీ ఎయిర్‌పోర్ట్ రద్దీ… పక్కనే ఉన్న అత్తగారి చూపులు గుర్తొచ్చి ఆగిపోయి, భారంగా తల ఊపింది.
సెక్యూరిటీ చెకింగ్ లైన్‌లోపలికి వెళ్లేముందు కిరణ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. చిన్నగా చేయి ఊపి, ఆ తర్వాత లోపలి ప్యాసింజర్ రద్దీలో కలిసిపోయాడు.
కారులో ఇంటికి తిరిగి వస్తుంటే ఐటీ కారిడార్ ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ అప్పుడే మొదలవుతోంది.సరోజ కిటికీ బయటకి చూస్తూనే, మెల్లగా అడిగింది.”బాగానే మాట్లాడుకున్నారా… నిన్న రాత్రి?”
“ఆ… బాగానే.”అనూష సమాధానం చాలా చిన్నదిగా ముగిసింది. ఆమె గొంతులోని నీరసాన్ని సరోజ గమనించినా, మళ్లీ ఆ విషయం ప్రస్తావించలేదు.
ఇంటికి చేరగానే అనూష అలసటగా హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి ఫోన్ బయటకు తీసింది.స్క్రీన్ మీద…
3 Missed Callsఅని కనిపించింది.
ఆ మూడూ ఒకే విదేశీ కంట్రీ కోడ్ (+44) ఉన్న కొత్త నంబర్ నుంచే వచ్చాయి!ఆ కంట్రీ కోడ్ కనిపించగానే అనూష గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది.
రెండు క్షణాలు ఆ నంబర్ వైపు భయం, అయోమయంతో చూస్తూ నిలిచిపోయింది.ఆ తర్వాత ఎవరైనా గమనిస్తారనే భయంతో, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కాల్ హిస్టరీని డిలీట్ చేసేసింది! -
మృత్యువు తొడిగిన పూలదండ – భాగం 18
స్థలం: వైజాగ్, పాత విక్టరీ క్లబ్ ఆవరణ – తెల్లవారుజామున 6:26 గంటలు.
ఆ రౌడీ బలంగా విసిరిన ఇనుప రాడ్ చంద్రమౌళి తలకు కాకుండా పక్కగా అతని భుజం మీద బలంగా పడింది. ఆ దెబ్బకి చంద్రమౌళి నొప్పితో కింద పడిపోయాడు…
సరిగ్గా అదే క్షణంలో… సడన్ బ్రేకుల శబ్దంతో పాటు రెండు పోలీస్ జీపులు ఆవరణలోకి దూసుకొచ్చాయి. హెడ్‌లైట్ల వెలుతురు సీన్ మీద పడగానే, జీపుల్లోంచి ఆరుగురు పోలీసులు చేతుల్లో లాఠీలు, తుపాకులతో కిందకి దిగారు.
ముందు జీప్ లోంచి దూకిన కానిస్టేబుల్ శ్రీను, తుపాకీ గురిపెట్టి గట్టిగా కేకేశాడు:”డోంట్ మూవ్! ఆయుధాలు కింద పడేయండి!”
పోలీసులు ఒకేసారి చుట్టుముట్టడంతో రౌడీల చేతుల్లో ఉన్న రాడ్లు కింద పడిపోయాయి. బన్నీ వాస్ భయంతో వెనక్కి తగ్గి, పాత బిల్డింగ్ తలుపుల వైపు పరుగెత్తాడు.
సరిగ్గా అదే సమయానికి రమ్య చేతిలో పెన్‌డ్రైవ్ గట్టిగా పట్టుకుని తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది. ఎదురుగా రక్తం కారుతున్న ముఖంతో పరుగెత్తుకొస్తున్న బన్నీ వాస్‌ని చూసి ఆమె అడుగు వెనక్కి వేసింది.
“అది ఇటు ఇవ్వవే!” అంటూ బన్నీ వాస్ పిచ్చివాడిలా ఆమె మీదికి దూకి, ఆమె పిడికిలి విరిచి పెన్‌డ్రైవ్ లాక్కోవడానికి చూశాడు.
కానీ రమ్య వెనక్కి తగ్గలేదు! ఆమె తన కుడిచేతిలో ఉన్న హెవీ డ్యూటీ టార్చ్ లైట్ బేస్‌తో బన్నీ వాస్ కంటి కింద బలంగా బాదింది!
“అమ్మా!” అంటూ బన్నీ వాస్ కళ్లు మూసుకుని కింద కూలబడ్డాడు. కంటి కింద నుండి రక్తం వస్తుంది.
అదే సమయంలో పోలీసులు మిగతా రౌడీల మీద పడి వాళ్ళని లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక్కసారిగా పెద్ద గందరగోళం, పెనుగులాట మొదలైంది. ఆ గందరగోళంలో నొప్పిని బిగబట్టి లేచిన బన్నీ వాస్… “దీన్ని వదలకండిరా, లాక్కెళ్లండి!” అని అరిచాడు.
వెంటనే ఇద్దరు రాక్షసుల్లాంటి రౌడీలు రమ్య వైపుకి వెళ్ళారు. అందులో ఒకడు ఆమె పిడికిలి పట్టుకుని పెన్‌డ్రైవ్ లాక్కోవడానికి చూడగా… రమ్య తన ఎడమచేతి గోళ్లతో వాడి ముఖాన్ని ఘోరంగా గీరి, పాయింటెడ్ టార్చ్ లైట్ కొసతో వాడి ముక్కు మీద బలంగా కొట్టింది!
“అయ్యో!” అని వాడు ముక్కు పట్టుకుని రక్తం కక్కుకుంటూ వెనక్కి తుళ్ళిపడ్డాడు.ఇంతలో రెండో రౌడీ వెనుక నుండి వచ్చి ఆమె రెండు చేతులనూ గట్టిగా బంధించి, జుట్టు పట్టుకుని ఈడ్చాడు. రమ్య తన వెనుక ఉన్న వాడి కాలి బొటనవేలి మీద తన హైహీల్స్ చెప్పుతో గట్టిగా తొక్కి, మోకాలితో వాడి పొత్తికడుపులో బలంగా తన్నింది!
వాడు కేక వేస్తూ వదిలేయగానే… ఆమె పారిపోవడానికి ప్రయత్నించింది.కానీ అంతలోనే కోలుకున్న మొదటి రౌడీ, దెబ్బతిన్న బన్నీ వాస్ ఇద్దరూ కలిసి ఆమెను పట్టుకున్నారు. రమ్య తన శక్తినంతా ఉపయోగిస్తూ కాళ్లతో తన్నుతూ, చేతులతో గట్టిగా వాళ్ల మొహాలను బాదుతూ, పిచ్చిగా కేకలు వేస్తూ విలవిలలాడింది.
ఒక ఆడపిల్ల తన ప్రాణాలను, ఆ ఆధారాలను కాపాడుకోవడానికి చేయాల్సిన పోరాటమంతా చేసింది. కానీ ఆ రాక్షసుల శారీరక బలం ముందు ఆమె పోరాటం సరిపోలేదు!
వాళ్లు ఆమె నోరు నొక్కి, బలవంతంగా ఈడ్చుకెళ్లి సగం తెరిచి ఉన్న నల్లటి స్కార్పియో వెనుక సీట్లోకి తోసేసి, తలుపు బలంగా వేసి లాక్ చేశారు. కారు టైర్లు పొగలు కక్కుతూ మెయిన్ రోడ్డు వైపు దూసుకెళ్లాయి.
“ఆగండి! కారు ఆపండి!” అని శ్రీను కేకలు వేస్తూ గన్ గురిపెట్టినా, అప్పటికే కారు హైవే ఎక్కేసింది.శ్రీను వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి, తీవ్రంగా గాయపడి రక్తం కక్కుతున్న చంద్రమౌళి దగ్గరకు వచ్చాడు.
“సార్… సార్… మీకు చాలా దెబ్బ తగిలింది!” శ్రీను ఆందోళనగా చంద్రమౌళిని పట్టుకున్నాడు.
చంద్రమౌళి నొప్పితో మూలుగుతూ, శ్రీను షర్ట్ కాలర్ పట్టుకుని బలవంతంగా పైకి చూస్తూ రొప్పుతూ అన్నాడు:”శ్రీనూ… నా గురించి బెంగ పెట్టుకోకు! ఆ లాయర్ రమ్య… ఆమె దగ్గరే పెన్‌డ్రైవ్ ఉంది! ఆ బన్నీ వాస్ గాడు పెన్ డ్రైవ్ ను వదలడు… నువ్వు వెంటనే జీప్ తీసుకొని ఒంటరిగా వాళ్ళని ఫాలో అవ్వు! వాళ్ళు సిటీ దాటకుండా పట్టుకోవాలి!”
“సార్, మిమ్మల్ని ఇలా వదిలేసి నేను…” శ్రీను ఆందోళన పడ్డాడు.
“నేను ఇక్కడే శివతో ఉంటాను! టైమ్ వేస్ట్ చేయకు శ్రీనూ… వెళ్లు!” చంద్రమౌళి గట్టిగా చెప్పాడు.
శ్రీను వెంటనే పరుగు తీసి పోలీస్ జీప్ ఎక్కాడు. గేర్ మార్చి యాక్సిలరేటర్ గట్టిగా తొక్కేసరికి… జీప్ టైర్లు నేలను గీరుకుంటూ స్పీడ్‌గా ముందుకు దూసుకెళ్లాయి.
ముందు రమ్యను తీసుకుని పారిపోతున్న బన్నీ వాస్ కారు… దాని వెనుకే సైరన్ మోతలతో శ్రీను తోలుతున్న పోలీస్ జీప్! తెల్లవారుజామున మసక చీకటిలో హైవే మీద ఒక భయంకరమైన వేట మొదలైంది… -
రహస్య కోడలు – రిటర్న్ టికెట్ ( భాగం 12)
సాయంత్రం ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ నెమ్మదిగా రద్దీగా మారుతోంది. మాదాపూర్‌లోని ఆ అపార్ట్‌మెంట్ బాల్కనీలో నిలబడితే దూరంగా మెట్రో లైన్, మెరిసే హైరైజ్ భవనాలు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ కిరణ్ మనసు మాత్రం ఎయిర్‌పోర్ట్ నుంచి క్యాబ్‌లో వస్తున్నంతసేపూ వేరే చోటే ఉంది.
విదేశాల్లో ఉన్న గత కొన్ని రోజులుగా అనూషతో మాట్లాడిన ప్రతిసారీ, ఆమె గొంతులో వినిపించిన ఆ చిన్న మార్పు అతన్ని వదల్లేదు. మాటల్లో నవ్వే ఉంది… కానీ ఆ నవ్వు వెనుక ఏదో అలసట కూడా ఉంది.
శనివారం ఉదయం షమ్షాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన కిరణ్, ఎవరికీ చెప్పకుండా నేరుగా ఇంటికి వచ్చాడు.
డోర్‌బెల్ మోగింది.
తలుపు తీసిన అనూష రెండు సెకన్లు అలాగే నిలబడి చూసింది.
“ఏమండీ మీరా?” అంది ఆశ్చర్యంగా.
“నేనే డార్లింగ్… లోపలికి రానివ్వవా?” అని నవ్వాడు కిరణ్.
అనూష ఏమీ అనకుండా పక్కకు తప్పుకుంది. అతను లోపలికి అడుగుపెట్టగానే, బ్యాగ్ నేల మీద పెట్టి ఆమెని దగ్గరకు లాక్కుని హత్తుకున్నాడు.
“నేను నిన్ను చాలా మిస్ అయ్యాను.”
అనూష కళ్ళు మూసుకుంది. “నేనూ కూడా.”
“చెప్పకుండా వస్తే ఇలాగే రిసీవ్ చేసుకుంటావా?” అని ఆమె నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు.
అప్పుడే హాల్‌లోకి వచ్చిన సరోజ నవ్వింది.”వచ్చావా నాన్నా? దిగాక అయినా ఫోన్ చేయొచ్చు కదా.”
“చెప్తే సర్ప్రైజ్ ఉండదు కదమ్మా,” అన్నాడు కిరణ్.
మధ్యాహ్నం భోజనం అయిపోయాక, అనూష బాల్కనీలో బట్టలు ఆరేస్తోంది.కిరణ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు.
“హెల్ప్ చేయనా?”
“నువ్వా?” నవ్వింది అనూష.
“రెండు క్లిప్స్ పెట్టేలోపే విసుగొచ్చేస్తుంది నీకు.”
“అంత బాగా తెలుసా నాకు?”
“తెలుసు. నీ సంగతి నాకకుండా ఇంకెవరికి తెలుస్తుంది.”
కిరణ్ కూడా ఒక తువాలు తీసుకుని క్లిప్ పెట్టాడు.కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు.
“అను.”
“హ్మ్?”
“హ, ఇప్పుడు చెప్పు అసలు ఏమి జరిగింది?”
ఆమె చేతిలో ఉన్న చీర ఆగిపోయింది.”ఏం జరగాలి?”
“నువ్వు మునుపటిలా లేవు.”
“నేనా?” నవ్వడానికి ప్రయత్నించింది
.”ఫోన్‌లో కూడా అలాగే అనిపించింది. ఇప్పుడూ అలాగే అనిపిస్తోంది.”
అనూష చూపు తిప్పుకుంది.”ఏమీ లేదు కిరణ్.”
“నిజమా?”
“నిజమే.”
“నా కళ్లలోకి చూసి చెప్పు.”
అనూష మెల్లగా అతని వైపు చూసింది.రెండు సెకన్లు.మూడు సెకన్లు.తర్వాత బలవంతంగా నవ్వింది.”నువ్వు ఓవర్ గా థింక్ చేస్తున్నావు.”
కిరణ్ కూడా నవ్వాడు. కానీ పూర్తిగా నమ్మలేదు.”అమ్మతో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా?”
అనూష వెంటనే తల ఊపింది.” ఏ బాబు, నీకు చెబితే అర్థం కాదా!”
“ఏదైనా నువ్వు చెబితేనే నాకు అర్థమవుతుంది.”
“అయితే విను, అత్తలు కొత్త కోడల్ని ప్రశ్నలు అడగడం, కొంచెం టార్చర్ పెట్టడం… ఇవన్నీ కామనే కదా. అంతే.”
“అంతేనా?”
“అంతే.”
“నువ్వు హర్ట్ అయ్యావు.”
“మొదట్లో కొంచెం. ఇప్పుడు అలవాటైపోతోంది.”
కిరణ్ మొహం మారిపోయింది.”అమ్మతో మాట్లాడనా?”
అనూష వెంటనే అతని చేయి పట్టుకుంది.”వద్దు.”
“ఎందుకు?”
“నువ్వు మాట్లాడితే అది చిన్న విషయంగా ఉండదు. అత్తా కోడళ్ల మధ్య ఉండాల్సిన విషయం, అమ్మా కొడుకుల మధ్యకి వెళ్తుంది.”
కిరణ్ మౌనంగా ఆమె వైపు చూశాడు.
“ప్లీజ్.”
“నీకేం ఇబ్బంది రాకూడదనేదే.”
“నాకు ఇబ్బంది లేదు. నువ్వు అత్తమ్మతో మాట్లాడితేనే ఇబ్బంది మొదలవుతుంది.”
కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడలేదు.చివరికి కిరణ్ చిన్నగా తల ఊపాడు.
“సరే. ఇప్పుడైతే మాట్లాడను.”అనూష ఊపిరి పీల్చుకుంది.
సాయంత్రం కాఫీ తాగుతూ హాల్‌లో కూర్చున్నాడు కిరణ్.వంటగదిలో సరోజ, అనూష ఇద్దరూ ఏదో మాట్లాడుతున్నారు.సరోజ ఏదో అడుగుతోంది.అనూష చిన్న చిన్న సమాధానాలు చెబుతోంది.ఆ మాటలు స్పష్టంగా వినిపించలేదు.కానీ…
అనూష గొంతులో ఉన్న జాగ్రత్త మాత్రం కిరణ్‌కు స్పష్టంగా వినిపించింది.అతను కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టాడు.లోపలికి వెళ్లి ఏదైనా అడగాలని అనిపించింది.
కానీ వెంటనే అనూష చెప్పిన మాట గుర్తొచ్చింది.”నువ్వు మాట్లాడితేనే ఇబ్బంది మొదలవుతుంది.”మళ్లీ సోఫాలోనే వెనక్కి ఆనుకున్నాడు.
బయట సాయంత్రం చీకటి నెమ్మదిగా నగరాన్ని కప్పేస్తోంది.ఆ ఇంట్లో కూడా…
ఎవరి మనసులో వాళ్లు దాచుకున్న మాటలు, నెమ్మదిగా నిశ్శబ్దాన్ని మరింత భారంగా మారుస్తున్నాయి.
కథల ప్రయాణం
రియాలిటీ, రొమాన్స్, కామెడీ, సస్పెన్స్ మరియు ఫిలాసఫీ కలబోసిన కథల సమాహారం.మన సంస్కృతిని, జీవిత సత్యాలను రేపటి తరానికి పరిచయం చేసే డిజిటల్ వేదిక