మాదాపూర్ అపార్ట్మెంట్ – ఉదయం 10:30 గంటలు.
డోర్బెల్ మోగడంతో వంటగదిలో ఉన్న అనూష చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపు తీసింది.ఎదురుగా తులసమ్మ నిలబడి ఉంది.
”అమ్మా… నువ్వా?” అనూష ముఖంలో ఆశ్చర్యం.
” ఏంటమ్మా… లోపలికి రానివ్వవా?” తులసి చిన్నగా నవ్వింది.
” ఏంటమ్మా నువ్వు మరిను ,రా లోపలకి,” అనూష పక్కకు తప్పుకుంది.
తులసి లోపలికి అడుగుపెట్టింది. ఒక చేతిలో చిన్న బ్యాగ్, మరో చేతిలో పళ్ల కవర్ ఉన్నాయి.”పక్కింటి వాళ్ల పెళ్లికి హైదరాబాద్ వచ్చానమ్మా. నిన్ను చూసి వెళ్దామని ఇలా వచ్చేశా.”
“ముందే చెప్పి ఉంటే నేనే వచ్చేదాన్ని కదా?”
“దానికేముందిలేవే, నా బంగారమింటికి రావడానికి కూడా ముందస్తు కబుర్లు ఎందుకు?” అంది నవ్వుతూ.
అనూష కూడా నవ్వాలని చూసింది, కానీ ఆ నవ్వు పెదవుల దాటి రాలేదు. అది తులసమ్మ దృష్టిని దాటలేదు. క్షణకాలం కూతురి ముఖాన్నే పరీక్షగా చూస్తూ ఉండిపోయింది.
“ఏంటమ్మా… ఏమైంది?” మెల్లగా అడిగింది.
“ఏం లేదు అమ్మ.”
”నాతో అబద్ధం చెప్పకు.”అనూష తల దించుకుంది.
తులసి దగ్గరకు వచ్చి, కూతురి చేయి పట్టుకుంది. “నిన్ను నేను కన్నానమ్మా. నీ ముఖం చూస్తే నీమనసులో ఏముందో నాకు తెలియదా? ముఖంలో ఆ కళ ఏది? కళ్ల కింద నల్లటి మచ్చలు వచ్చాయి, సరిగ్గా తిండి, నిద్ర ఉందో లేదో కూడా అనుమానమే. ఏమైంది చెప్పు?”తులసమ్మ గొంతులో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
అనూష కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క క్షణం మారెక్ బెదిరింపులు, ఆ వీడియో దృశ్యాలు కళ్లముందు మెదిలాయి. ‘అమ్మకి చెప్పేద్దామా?’ అనిపించింది. కానీ మరుక్షణమే తట్టుకోలేని ఆవేదనతో ఆ ఆలోచనను విరమించుకుంది. కన్నీళ్లను బలవంతంగా దిగమింగుకుంటూ, “ఏం లేదమ్మా… నువ్వే అనవసరంగా ఊహించుకుంటున్నావు,” అని సర్దిచెప్పే ప్రయత్నం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
తులసి ముఖంలో అనుమానం అలాగే ఉంది.అప్పుడే హాలులోకి సరోజ వచ్చింది.”అరే, ఒదిన గారు! ఎప్పుడు వచ్చారు?” అంటూ ఆప్యాయంగా పలకరించింది.
“ఇప్పుడే వచ్చానండీ.”
సరోజ వచ్చి సోఫాలో కూర్చుంటూ, “ముందే కబురు చేసి ఉంటే ఏదైనా కారు పంపించేదానిని కదా!” అంది.
తులసి చిన్నగా నవ్వింది, కానీ ఆమె దృష్టి అనూష పైనే ఉంది. కొద్దిసేపు మామూలు విషయాలు మాట్లాడాక, ఇక ఆగలేక నేరుగా అడిగేసింది.”ఒదిన… మా అమ్మాయి ఎందుకో చాలా దిగులుగా కనిపిస్తోంది. ఏమైనా జరిగిందా?”
సరోజ ఒక్కసారి అనూష గది వైపు చూసింది. “నాకూ అర్థం కావడం లేదండీ. రెండు రోజులుగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటోంది. అడిగితే ఏం లేదంటుంది.”
ఇంతలో అనూష గది నుండి హాల్ లోకి వచ్చి “అత్తయ్య… నిజంగానే ఏం లేదు,” అనూష ఆత్రంగా అంది.
తులసి తల ఊపినా, ఆమె మనసు ఒప్పుకోలేదు.”చిన్నప్పటి నుంచి దీని అలవాటు ఇంతే ఒదిన… మనసులో ఎంత బాధ ఉన్నా బయటకు పడనివ్వదు,” అంటూ అనూష వైపు చూసింది.
“పెళ్లయిందని అమ్మకి పరాయిదానివి అయిపోయావామ్మా?”ఆ మాట అనూష గుండెల్లో ఈటెలా గుచ్చుకుంది. తల్లి ఒడిలో తలపెట్టి గుండెలవిసేలా ఏడ్చేయాలనిపించింది. నిజం చెప్పేయాలని నాలుక చివరిదాకా వచ్చింది. కానీ మారెక్ హెచ్చరిక మనసులో మెదిలి నోరు నొక్కేసింది.
అనూష మౌనంగా తల వంచుకుంది. ఆ నిశ్శబ్దం ఆ గదిలోని ముగ్గురికీ మూడు వేర్వేరు భావాలను మిగిల్చింది.
Leave a Reply