మధ్యాహ్నం… మాదాపూర్‌లోని ఆ అపార్ట్మెంట్ అంతా నిశ్శబ్దంగా ఉంది. గోడ గడియారం టిక్‌టిక్ కూడా స్పష్టంగా వినిపిస్తోంది.
సరోజ బంధువుల ఇంటికి వెళ్లడంతో అనూష ఇంట్లో ఒంటరిగా ఉంది.
సరిగ్గా అదే సమయంలో ఫోన్ గట్టిగా మోగడం మొదలైంది. స్క్రీన్ మీద మళ్లీ అదే విదేశీ కంట్రీ కోడ్ ఉన్న నంబర్ మెరుస్తోంది.అనూష ఆ దడ పుట్టించే స్క్రీన్ వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది. రెండు రింగ్‌లు పూర్తయ్యేదాకా చేయి చాచడానికి కూడా భయం వేసింది. మూడో రింగ్‌కి వణుకుతున్న చేతులతో కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది.
“హలో?”
అవతలి వైపు రెండు క్షణాలు నిశ్శబ్దం… ఆ తర్వాత ఇంగ్లీష్‌లో పోలిష్ యాస ఉన్న ఒక గొంతు వినిపించింది.”అనూషా? నేను… మారెక్.”
ఆ పేరు వినగానే అనూష ముఖంలోని రంగు ఒక్కసారిగా మారిపోయింది.”నువ్వు… నా నంబర్ నీకు ఎక్కడ దొరికింది?”
“నువ్వు మా స్పా సెంటర్లో జాబ్‌కి అప్లై చేసినప్పుడు ఇచ్చిన రిజ్యూమే గుర్తుందా? అందులో నుంచే నీ నంబర్ తీసుకున్నాను.”
అనూష గుండె మళ్లీ వేగంగా కొట్టుకోవడం మొదలైంది.”ఎందుకు కాల్ చేశావ్? ఇప్పుడు నాతో నీకేం పని?”
“నీతో ఒక పని ఉంది అనూషా,” అన్నాడు మారెక్. అతని గొంతులో ఏమాత్రం జాలి లేదు. “నా దగ్గరికి వచ్చే ఆ VIP మళ్లీ నీ గురించే అడుగుతున్నాడు. ఈ ఒక్కసారి కలిస్తే చాలు.”
“మారెక్!”అనూష తెలియకుండానే కిటికీ కర్టెన్ లాగేసింది. ఎవరైనా తనను గమనిస్తున్నట్టుగా ఆమెకు అనిపించింది.
గొంతు తగ్గించి ఆవేదనగా అంది.”నేను ఆ జీవితాన్ని అక్కడే మర్చిపోయాను మారెక్. ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది… హస్బెండ్ ఉన్నారు. దయచేసి మళ్లీ నన్ను ఆ జీవితంలోకి లాగకు.”
అవతలి వైపు నుంచి చల్లని నవ్వు వినిపించింది.”అంత ఈజీగా గతం చెరిపేయలేవు అనూషా. ఆ రోజు జరిగిన దానికి సంబంధించిన వీడియో ఇప్పటికీ నా దగ్గరే ఉంది. అది బయటకు వెళ్లకూడదు… నీ భర్త చేతికి చేరకూడదు అనుకుంటే, నేను చెప్పిన దానికి ఒప్పుకోవాలి.”
ఆ మాట వినగానే అనూష కాళ్ల కింద నేల కదిలిపోయినంత పనైంది. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి.”బాగా ఆలోచించుకో.”అంతే… మారెక్ కాల్ కట్ చేశాడు.
ఫోన్ చేతిలోనే ఉండిపోయింది. స్క్రీన్ చీకటిగా మారేదాకా, గుండెల్లో భయం పేరుకుపోతుండగా, అనూష అలాగే నిలబడి ఉండిపోయింది.
సాయంత్రం వేళ సరోజ ఇంటికి తిరిగి వచ్చేసరికి, అనూష వంటగదిలో కూరగాయలు కడుగుతోంది. కానీ మనసంతా మారెక్ బెదిరింపు, ఆ వీడియో గురించే ఆలోచిస్తోంది. ఒకే కూరగాయను కుళాయి కింద పదేపదే కడుగుతూనే ఉంది.
హ్యాండ్‌బ్యాగ్ కింద పెడుతూ సరోజ వంటగది వైపు చూసింది.”ఏమైంది అనూషా? అంతగా ఆలోచిస్తున్నావ్?”
“ఏం… ఏం లేదు అత్తయ్య,” అంటూ అనూష తొందరపడి నీళ్ల కుళాయి ఆపేసింది.
సరోజ ఆమె వైపు కాసేపు అనుమానంగా చూసింది. కానీ ఏమీ అడగకుండా బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్లిపోయింది.
అనూష చేతిలోని కూరగాయను పక్కన పెట్టి, వణుకుతున్న చేతులతో మళ్లీ ఫోన్ తీసుకుంది. మారెక్ చెప్పిన ప్రతి మాట ఆమె చెవుల్లో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది.
ఆ రాత్రి…మంచం మీద పడుకున్నా అనూషకి నిద్ర పట్టలేదు. తీవ్రంగా ఆలోచిస్తూ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మారెక్ ప్రొఫైల్ సెర్చ్ చేసింది.అతని ప్రొఫైల్ తెరిచి, మెసేజ్ టైప్ చేయడం మొదలుపెట్టింది.”Please… don’t do this…”అని టైప్ చేసి కొద్దిసేపు స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయింది.
తర్వాత ఒక్కసారిగా ఆ మెసేజ్ మొత్తం డిలీట్ చేసేసింది.అతన్ని వేడుకోవాలా… లేక ఎదురించాలా…అనే అంతర్మథనంలో కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, చివరకు ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి నిశ్శబ్దంగా కళ్లుమూసుకుంది.
Leave a Reply