స్థలం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి – కోర్టు హాల్ నెంబర్ 3.
కోర్టు హాల్ అంతా దట్టమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. బెంచ్ మీద ఉన్న ఇద్దరు జడ్జీలు సీరియస్‌గా ఫైల్స్ చూస్తున్నారు. బోనులో ఒక అభాగ్యుడైన గిరిజనుడు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని మీద పదిహేనేళ్ల క్రితం జరిగిన ఒక భారీ భూ కుంభకోణం, హత్య నేరం మోపబడి ఉంది.
ప్రాసిక్యూషన్ సీనియర్ అడ్వకేట్ సుబ్రహ్మణ్యం చాలా కాన్ఫిడెంట్‌గా లేచి నిలబడ్డాడు. “మై లార్డ్, ఈ కేసు పదిహేనేళ్లుగా నడుస్తోంది. నిందితుడు ఆరోజు రాత్రి భూమి పత్రాల కోసం ఇద్దరిని హత్య చేశాడనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. మరణించిన వ్యక్తుల ఇంటి వెనుక ఉన్న డ్రైనేజీ పైపులో హత్యకు వాడిన వేటకొడవలి దొరికింది. దానిపై నిందితుడి వేలిముద్రలు ఉన్నాయి. ఇక అదే రాత్రి నిందితుడు పరుగెత్తుకుంటూ వెళ్లడం చూశానని ప్రత్యక్ష సాక్షి రామారావు కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకంటే పక్కా సాక్ష్యాలు ఏం కావాలి మై లార్డ్? నేరం వంద శాతం రుజువైంది,” అంటూ గర్వంగా కూర్చున్నాడు.
అప్పుడు డిఫెన్స్ వైపు నుండి రమ్య నిదానంగా లేచి నిలబడింది. నల్లటి బ్లాక్ కోట్, చేతిలో పాత కేసు ఫైల్. ఆమె కళ్లల్లో అపారమైన ఆత్మవిశ్వాసం ఉంది.”మై లార్డ్… ప్రాసిక్యూషన్ చూపిస్తున్న సాక్ష్యాలు పైకి పటిష్టంగా కనిపిస్తున్నా, వాటి వెనుక ఉన్న నిజాలు వేరు,” రమ్య గొంతు గంభీరంగా మారుమ్రోగింది.
“మొదటిది, వేటకొడవలిపై ఉన్న వేలిముద్రలు. పదిహేనేళ్ల క్రితం నా క్లయింట్ ఒక మెకానిక్ షెడ్లో పని చేసేవాడు. ఆ షెడ్డు యజమానిదే ఆ వేటకొడవలి. షెడ్డులో పని చేసే ప్రతి ఒక్కరి వేలిముద్రలు అక్కడ దొరికే ఇనుప వస్తువులపై ఉండటం సహజం. కేవలం వేలిముద్రలు ఉన్నంత మాత్రాన అతనే హంతకుడు కాడు. రెండవది, ప్రత్యక్ష సాక్షి రామారావు స్టేట్మెంట్. ఆరోజు రాత్రి 11:30 గంటలకి నా క్లయింట్ పరుగెత్తుకుంటూ వెళ్లడం చూశానని అతను చెప్పాడు. కానీ, ఆరోజు రాత్రి సరిగ్గా 11:15 నుండి 12:00 వరకు ఆ ఏరియాలో భారీ వర్షం కారణంగా పవర్ కట్ అయింది. కారుచీకట్లో, అదీ యాభై గజాల దూరం నుండి ఒక వ్యక్తి ముఖాన్ని రామారావు ఎలా గుర్తుపట్టగలడు?”
సుబ్రహ్మణ్యం వెంటనే లేచి అడ్డుపడ్డాడు. “అబ్జెక్షన్ మై లార్డ్! పవర్ కట్ అయినా, ఆ రోడ్డు పక్కన ఉన్న పెద్ద ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయి. ఆ వెలుతురులోనే రామారావు నిందితుడిని చూశాడు. ఈ విషయం పోలీస్ చార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. డిఫెన్స్ లాయర్ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు!”
కోర్టు హాల్ లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది. జడ్జీలు ఇద్దరూ రమ్య వైపు చూశారు. సుబ్రహ్మణ్యం వేసిన కౌంటర్ చాలా బలంగా ఉంది. ఎవరు గెలుస్తారో అర్థం కాని పరిస్థితి.
రమ్య ఏ మాత్రం కంగారు పడకుండా ఒక సన్నటి పదునైన నవ్వు నవ్వింది. “సార్… మీరు చెప్పిన పాయింటే నా క్లయింట్‌ని నిర్దోషిగా నిలబెడుతుంది,” అంటూ ఫైల్లోంచి ఒక అఫీషియల్ డాక్యుమెంట్‌ను తీసి జడ్జిల ముందు పెట్టింది.”మై లార్డ్, ఇది ఆరోజు రాత్రి విద్యుత్ శాఖ (APSPDCL) రికార్డ్ చేసిన లాగ్‌బుక్ రిపోర్ట్. ప్రాసిక్యూషన్ చెప్తున్నట్టు ఆరోజు రాత్రి ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వచ్చిన మాట నిజమే. కానీ అది జరిగింది రాత్రి 11:55 గంటలకి! అంటే నా క్లయింట్ పరుగెత్తుకుంటూ వెళ్లాడని చెప్తున్న 11:30 గంటలకి అక్కడ ఎలాంటి వెలుతురూ లేదు, కారుచీకటి మాత్రమే ఉంది! లేని వెలుతురులో సాక్షి ఎలా చూశాడు? అంటే… ఎవరో కావాలనే నా క్లయింట్‌ని ఇరికించడానికి సాక్ష్యాలను, సమయాన్ని మార్చి పోలీసులతో ఫేక్ చార్జ్ షీట్ రాయించారు!”
రమ్య ఇచ్చిన ఆ పక్కా టైమ్-లైన్ లాజిక్‌తో కూడిన కౌంటర్‌కి సుబ్రహ్మణ్యం ముఖం తెల్లబడిపోయింది. అతను సీట్లో వెనక్కి ఒరిగి కూలబడ్డాడు. కోర్టు హాల్ లో ఉన్న పెద్ద లాయర్లందరూ రమ్య పట్టుకున్న లూప్‌హోల్ చూసి నిశ్చేష్టులైపోయారు.
జడ్జీలు ఇద్దరూ కాసేపు తీవ్రంగా చర్చించుకుని, ఆఖర్లో తీర్పు ఇచ్చారు. “డిఫెన్స్ లాయర్ రమ్య ప్రవేశపెట్టిన పక్కా సాక్ష్యాధారాల ప్రకారం, నిందితుడి మీద నేరం రుజువు కావడం లేదు. పదిహేనేళ్ల పాటు ఒక అభాగ్యుడిని తప్పుడు సాక్ష్యాలతో నిర్బంధించినందుకు పోలీసుల నిర్లక్ష్యాన్ని కోర్టు తప్పుపడుతోంది. నిందితుడు తక్షణమే విడుదల కాబోతున్నాడు!” అంటూ హ్యామర్ తో టేబుల్ పై కొట్టారు.
కోర్టు హాల్ బయట ఆ గిరిజనుడి కుటుంబ సభ్యులు రమ్య కాళ్లమీద పడి ఏడ్చారు. రమ్య వారిని ఓదార్చి, విజయం సాధించిన గర్వంతో కోర్టు బయటికి నడిచింది.
స్థలం: హైకోర్టు బయట – రమ్య కారు.
రమ్య తన కారు దగ్గరకు రాగానే, ఆమె జూనియర్ లాయర్ సురేష్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు.”కంగ్రాచులేషన్స్ మేడం! అస్సలు ఊహించలేదు. ఆ టైమ్-లైన్ ట్విస్ట్‌తో ప్రాసిక్యూషన్ లాయర్ని పూర్తిగా తిక్కమకపెట్టేసారు. యువర్ డిఫెన్స్ వాజ్ జస్ట్ మైండ్-బ్లోయింగ్!” సురేష్ ఎక్సైట్మెంట్తో అన్నాడు.
రమ్య నవ్వి, “థాంక్స్ సురేష్. చట్టం ఎప్పుడూ సరైన సాక్ష్యాల కోసమే వెతుకుతుంది,” అంటూ కారు ఎక్కబోయింది.
“మేడం, మరో ముఖ్యమైన విషయం…” సురేష్ తన ఫోన్ తీసి చూపించాడు. “నేను మీ ఫోన్ నిన్న నైట్ సైలెంట్లో పెట్టాను. ఈరోజే ఆన్ చేసాను. చూస్తే… నిన్న నైట్ 11:15 నుండి 11:30 మధ్య మీ ఫోన్‌కి మీ ఫ్రెండ్ లావణ్య గారి నంబర్ నుండి వరుసగా పది ‘మిస్సెడ్ కాల్ అలర్ట్’ మెసేజ్ లు వచ్చాయి మేడం. చాలా ఎమర్జెన్సీ లాగా ఉంది,” అన్నాడు.
రమ్య ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమైంది. లావణ్య పంతొమ్మిది రోజుల క్రితమే రవికుమార్‌ను పెళ్లి చేసుకుని హానీమూన్ కి వెళ్ళింది కదా. అర్ధరాత్రి పూట తన ఫ్రెండ్ నుండి అన్ని కాల్స్ ఎందుకు వచ్చాయి? అని అనుకుంది.రమ్య ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే లావణ్య నంబర్‌కి కాల్ చేసింది. రింగ్ వెళ్తోంది… ఒక్కసారి… రెండు సార్లు… కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. రమ్య మనసులో ఒక రకమైన ఆందోళన మొదలైంది. లావణ్యకు ఏమైనా ఆపద వచ్చిందా?
ఆమె వెంటనే లావణ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసింది.”హలో, అంకుల్… నేను రమ్యని మాట్లాడుతున్నా. లావణ్య నిన్న నైట్ నాకు చాలాసార్లు కాల్ చేసింది. తిరిగి చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తను బావుందా?” రమ్య కంగారుగా అడిగింది.
అవతలి నుండి లావణ్య తండ్రి గొంతు భరించలేని దుఃఖంతో, వణుకుతూ వినిపించింది. “రమ్య… లావణ్య… మా బిడ్డకు ఎంత కష్టం వచ్చింది రమ్య! నిన్న రాత్రే రవికుమార్ చనిపోయాడు రమ్య! ఆ సీధోని రిసార్ట్‌లో ఎవరో అతనికి విషమిచ్చి చంపేసారు. పోలీసులు ఇప్పుడు మా లావణ్యనే హంతకురాలు అని అనుమానిస్తూ అరెస్ట్ చేసి చింతపల్లి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు!”
ఆ మాట వినగానే రమ్య చేతిలో ఫోన్ అలాగే ఉండిపోయింది. ఆమె కళ్లముందు చీకటి కమ్ముకొస్తుండగా, ఒక్క క్షణం స్తంభించిపోయింది. తన అమాయకురాలైన ఫ్రెండ్, ఇప్పుడే పెళ్లి చేసుకున్న లావణ్య… హత్య నేరం మీద జైలులో ఉందా?రమ్య కళ్లల్లో దుఃఖం, ఆ వెంటనే విపరీతమైన పగటి వెలుతురు లాంటి కోపం, పట్టుదలలు స్థిరపడ్డాయి. తన ఫ్రెండ్‌ని ఈ అన్యాయమైన వ్యవస్థ నుండి రక్షించడానికి, అసలైన హంతకులను చట్టం ముందు నిలబెట్టడానికి ఇప్పుడు రమ్య ది ప్రొటెక్టర్ లాగా బరిలోకి దిగాల్సి వచ్చింది.
ఆమె విసురుగా కారు తలుపు తీసి, లోపలికి ఎక్కింది. “సురేష్! తిరుపతి కేసును నువ్వు చూసుకో. నేను వైజాగ్ మీదుగా చింతపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నాను. లావణ్య అరెస్ట్ పేపర్స్, రవికుమార్ మర్డర్ కేసు ప్రాథమిక సమాచారం మొత్తం వైజాగ్ లో ఉన్న మన నెట్వర్క్ ద్వారా నాకు ఇప్పుడే వాట్సాప్ చేయమని చెప్పు!” అని ఆర్డర్ వేస్తూ, కారును అత్యంత వేగంగా హైవే మీద పోనిచ్చింది…
Category: Blog
Your blog category
-
మృత్యువు తొడిగిన పూలదండ (9)
-
రహస్య కోడలు (1) – తొలి పరిచయం
కిరణ్ లాప్టాప్ బ్యాగ్ భుజాన సర్దుకుంటూ, వార్సా ఎయిర్పోర్ట్ లాంజ్‌లో ఖాళీ సీటు వెతుక్కుంటూ నడిచాడు. బయట వర్షం భారీగా పడుతోంది, గ్లాస్ కిటికీల మీద నుండి కారుతున్న నీటి చుక్కలు రన్‌వే లైట్లని విరిచేస్తూ కనిపిస్తున్నాయి.
మూడు రోజుల క్రితం వచ్చిన కాల్ ఇంకా చెవుల్లో మార్మోగుతోంది. “కిరణ్, హైదరాబాద్‌లో ఒక అమ్మాయిని చూశాను నీకు. మంచి ఫ్యామిలీ, బాగా చదువుకుంది. అమ్మాయి డీటెయిల్స్ వాట్సాప్ చేశాను, చూసావు కదా! ఈసారి వెళ్ళి కలువు, ఇంకా వాయిదా వేయద్దు.” అని అమ్మ సరోజ.
అమ్మ గొంతులో ఉన్న ఆత్రుత కిరణ్‌కి తెలియనిది కాదు. తండ్రి పోయిన దగ్గర్నుండి సరోజకి కిరణ్ పెళ్ళి చేసుకోవడం ఒక్కటే కోరిక మిగిలింది. మిగతా జీవితం అంతా ఆమె అతని చుట్టూనే తిప్పుకుంది. ఆ కోరికని కాదనడం కిరణ్‌కి ఎప్పుడూ కష్టమే, చిన్నప్పటి నుండి అదే అలవాటు. అమ్మ మాట జవదాటకపోవడం, తన సొంత ఇష్టాలని నిశ్శబ్దంగా వెనక్కి నెట్టేయడం.
ఫోన్లో ఆ అమ్మాయి ఫోటో మళ్ళీ ఒకసారి చూశాడు. ప్రొఫైల్ చదివాడు – బాగానే ఉంది, తగినట్టే ఉంది కూడా. కానీ లోపల ఏమీ కదల్లేదు. ఆఫీస్‌లో మూడు రోజుల లీవ్ పెట్టుకుని, ఈ ఒక్క పని కోసం ఇంత దూరం ప్రయాణం. తనకి కావాలని కాదు, అమ్మకి కావాలని.
తలెత్తి డిస్ప్లే బోర్డ్ వైపు చూశాడు. “DELAYED” అని రెడ్ లెటర్స్‌లో మెరుస్తోంది క్రాకో నుండి వచ్చే ఫ్లైట్ పక్కన కూడా, హైదరాబాద్ ఫ్లైట్ పక్కన కూడా. వర్షం మొత్తం షెడ్యూల్‌ని దెబ్బతీసేసింది.
నిట్టూర్చి, పక్కనే ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. ఫోన్ జేబులో పెట్టేసుకుని, కళ్ళు మూసుకుని కాసేపు రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాడు. కానీ కొన్ని నిమిషాల్లోనే పక్కన ఎవరో కూర్చున్న అలికిడి అయింది, సూట్‌కేస్ చక్రాలు నేల మీద కర్రుమని శబ్దం చేస్తూ.
కళ్ళు తెరిచి పక్కకి చూశాడు – ఒక అమ్మాయి, పెద్ద సూట్‌కేస్ పక్కన నిలబెట్టి, అలసిపోయిన మొహంతో కూర్చుంది. చేతిలో పేపర్ కప్‌లో కాఫీ, కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న నిద్రలేమి, ఏదో ఆలోచనల్లో మునిగిపోయినట్టు దూరంగా చూస్తోంది.
కాసేపు ఇద్దరూ మౌనంగా, ఎవరి లోకంలో వాళ్ళు ఉండిపోయారు. మళ్ళీ డిస్ప్లే బోర్డ్ మీద అనౌన్స్మెంట్ వచ్చింది – “Flight to Krakow delayed by additional one hour.” ఆమె ఫ్లైట్ అని అర్థమైంది కిరణ్‌కి, ఆమె రియాక్షన్ చూసి.
ఆమె చిరాకుగా కళ్ళు మూసుకుని నిట్టూర్చింది, తలని సీట్ వెనక్కి ఆనించి తనలో తానే గొణుక్కుంది, తెలుగులో. “ఛీ, ఈ వర్షం ఎప్పటికి ఆగుతుందో ఏంటో. ఇలాగే ఉంటే రేపు కూడా వెళ్ళలేను.”
కిరణ్ ఒక్కసారి తలతిప్పి చూశాడు, ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని. “మీరు తెలుగా?” అడిగాడు, గొంతులో దాచుకోలేని కుతూహలంతో.
ఆమె కూడా ఆశ్చర్యంగా అతని వైపు తిరిగింది. “అవును! మీరు కూడానా?” మొహంలో అప్పటిదాకా ఉన్న అలసట కొంచెం తగ్గి, స్వచ్ఛమైన నవ్వు వచ్చింది మొదటిసారి.
“అవును, హైదరాబాద్ వాడిని. ఇక్కడ, ఈ ఫారిన్ ఎయిర్‌పోర్ట్‌లో, మధ్యరాత్రి వేళ తెలుగు వినిపిస్తుందని అస్సలు అనుకోలేదు,” అన్నాడు కిరణ్ నవ్వుతూ, తనలో ఉన్న ఒత్తిడి కాస్త తేలికపడినట్టు అనిపించింది.
“నిజమే, నేనూ అలానే ఫీలవుతున్నా. ఇక్కడ ఇండియన్స్ కనిపించినా, తెలుగు వాళ్ళు దొరకడం చాలా రేర్. యూరప్‌లో ఎక్కువగా హిందీ లేదా మలయాళం వినిపిస్తుంది, తెలుగు కాదు,” అంది అనూష, గొంతులో ఇప్పుడు ఒక సాన్నిహిత్యం, కాసేపటి క్రితం ఉన్న అపరిచితులు అనే భావన ఇప్పుడు పూర్తిగా మాయమైపోయింది.
“మీ పేరు?” అడిగాడు కిరణ్.
“అనూష. మీది?”
“కిరణ్. ఎక్కడికి ప్రయాణం మీది, అనూష గారు?”
“గారు వద్దండి, పెద్దదాన్ని కాదు నేను,” నవ్వుతూ అంది. “విజయవాడ. క్రాకోలో ఉంటున్నా, అక్కడ్నుండి బయలుదేరాను.”
“నాది హైదరాబాద్,” అన్నాడు కిరణ్, ఫ్యామిలీ పని విషయం జాగ్రత్తగా దాచిపెడుతూ. “క్రాకోలో ఏం చేస్తున్నారు?”
“IT job,” అంది అనూష చిన్నగా, కొంచెం తడబడుతూ – పూర్తి నిజం కాకపోయినా, పచ్చి అబద్ధం కూడా కాదు. వెంటనే టాపిక్ మార్చాలని అనుకుంది. “మీరు?”
“లండన్‌లో లాజిస్టిక్స్ కంపెనీలో పని చేస్తున్నా. పోలండ్-UK బోర్డర్ ఆపరేషన్స్ చూసుకుంటా, అందుకే తరచూ ఇలా ట్రావెల్ చేస్తుంటా,” చెప్పాడు కిరణ్.
అలా మొదలైంది సంభాషణ – మొదట్లో మార్నింగ్ కాఫీ లాంటి మాటలు, ఫ్లైట్ డిలే కంప్లైంట్స్ గురించి, ఎయిర్పోర్ట్ ఫుడ్ ఎంత ఖరీదో అనే చిట్ చాట్ తో.నెమ్మదిగా, గంటలు ఒకదాని తర్వాత ఒకటి గడుస్తున్న కొద్దీ, మాటలు ఇంకొంచెం లోతుగా మారాయి. ఇద్దరూ చిన్నప్పటి ఊహలు, కాలేజీ రోజుల సంగతులు, ఫారిన్‌కి రావడం వెనుక ఉన్న కారణాలు పంచుకున్నారు.
మూడు గంటలు గడిచాక, రెండో కాఫీ కప్పు తాగుతూ, అనూష కొంచెం మెత్తబడింది. కిటికీ బయట ఇంకా కురుస్తున్న వర్షం వైపు చూస్తూ, “నిజం చెప్పాలంటే, ఇంటికి వెళ్తున్నది అసలు కారణం వేరు, గొంతులో బరువు స్పష్టంగా తెలుస్తోంది. “నాన్నకి ఆరోగ్యం సరిగా లేదు.” అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేదు అప్పుడే – ఒక అపరిచితుడితో అంత లోతుగా షేర్ చేయడం తనకే కొత్తగా అనిపించింది.
కిరణ్ వెంటనే ఏమీ అడగలేదు, తొందరపడలేదు. కాసేపు మౌనంగా ఉండి, “అర్థమవుతుంది. కుటుంబం విషయంలో ఇలాంటివి ఎప్పుడూ కష్టమే,” అన్నంతే చెప్పాడు, ఖాళీ సానుభూతి మాటలు లేకుండా, అతి వాగడం చేయకుండా.
ఆ చిన్న మర్యాద, అనవసరంగా ప్రశ్నలు అడగకపోవడం – అనూషకి ఎందుకో నచ్చింది.
బహుశా తనకి పరిచయమైన అబ్బాయిలు కిరణ్ లా లేకవడం వల్లేమో!చాలామంది ఇలాంటప్పుడు వెంటనే “ఏమైంది? ఎంత సీరియస్?” అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కిరణ్ అలా చేయలేదు. ఇద్దరి మధ్య ఒక చిన్న నిశ్శబ్దం ఏర్పడింది, ఇబ్బందిగా అనిపించని మౌనం.
చివరికి, గంటన్నర తర్వాత, కిరణ్ ఫ్లైట్ ముందుగా అనౌన్స్ అయింది. అతను లేచి నిలబడుతూ, బ్యాగ్ భుజాన వేసుకుని అనూష వైపు తిరిగాడు. “నా టర్న్ వచ్చేసింది. మీ నాన్నగారు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా,” అన్నాడు, గొంతులో నిజాయితీ.
“థాంక్స్ కిరణ్. సేఫ్ జర్నీ, మీ పనీ బాగా జరగాలి,” అంది అనూష, చిన్నగా నవ్వుతూ.
కిరణ్ వెళ్ళిపోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె ఇంకా కిటికీ బయటకి చూస్తూ కూర్చుంది, వర్షంలో తడుస్తున్న రన్‌వే వైపు, ఏదో ఆలోచనల్లో మునిగిపోయి.
బోర్డింగ్ గేట్ వైపు నడుస్తూ, కిరణ్ మనసులో ఒక వింత ఆలోచన మెదిలింది – కొన్ని గంటల క్రితం అస్సలు తెలియని ఈ అమ్మాయితో, ఇప్పుడు తను కలవబోయే సంబంధం అమ్మాయి కంటే ఎక్కువ ఈజీగా మాట్లాడగలిగాడు. కానీ ఆ ఆలోచనని పక్కన పెట్టేసి, తనని తాను సముదాయించుకున్నాడు – ఇది కేవలం ఒక ఫ్లైట్ డిలే లో పరిచయం, అంతకుమించి పులిహోర కలపాలని కాదు అని.
అతనికి తెలియదు, ఈ యాదృచ్ఛిక కలయిక ముందు ముందు ఎన్ని మలుపులు తిప్పబోతుందో.
వెయిటింగ్ ఫర్ 3rd పార్ట్. -
మృత్యువు తొడిగిన పూలదండ (8)
స్థలం: లోకల్ రైల్వే స్టేషన్, పబ్లిక్ రెస్ట్ రూమ్.
రెస్ట్ రూమ్ లోపల మసక వెలుతురులో ట్యాప్ నుండి నీళ్లు కారుతున్న చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. నేలపై తల పగిలి, రక్తం మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు సీధోని రిసార్ట్ వెయిటర్. అతని పక్కనే రక్తం అంటిన ఆ బరువైన ఇనుప రాడ్ పడి ఉంది.
వెయిటర్ వెనక నుండి వచ్చి క్రూరంగా కొట్టిన ఆ గుర్తుతెలియని వ్యక్తి నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆ మసక వెలుతురులో అతని ముఖం స్పష్టంగా కనిపించింది… అతను మరెవరో కాదు, రిసార్ట్ మేనేజర్ బన్నీ వాస్!బన్నీ వాస్ చేతులకు గ్లౌజెస్ ఉన్నాయి. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ భయం, కంగారు ఇప్పుడు లేవు; ఒక పక్కా నేరస్థుడి క్రూరత్వం ఉంది. వాడు జేబులోంచి రుమాలు తీసి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు.
భూపతి రెడ్డి ఫామ్‌హౌస్ నుండి గంగూభాయ్ బయలుదేరినప్పటి నుండి వాడు రైల్వే స్టేషన్ లోనే నిఘా పెట్టాడు. వెయిటర్ గంగూభాయ్‌ని చూసి పోలీసులకు ఫోన్ చేయడం, సిగ్నల్ లేక కట్ అవ్వడం అంతా బన్నీ వాస్ గమనించాడు. వాడు మెల్లగా వంగి, వెయిటర్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్‌ని తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత రెస్ట్ రూమ్ తలుపు తీసి, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం చూసి నిశ్శబ్దంగా చీకట్లోకి మాయమైపోయాడు. గంగూభాయ్ ఎక్కిన రైలు అప్పటికే స్టేషన్ దాటి చాలా దూరం వెళ్ళిపోయింది.
స్థలం: పోలీస్ స్టేషన్, లాకప్/విచారణ గది.
అదే అర్ధరాత్రి వేళ… విచారణ గదిలోని సన్నటి కిటికీ గుండా బయట ఉన్న చీకటి ఆకాశం కనిపిస్తోంది. కుర్చీలో తల వెనక్కి ఆనించి కూర్చుని ఉంది లావణ్య. ఆమె కళ్లు అలసటతో ఉన్నాయి, కానీ మనసు మాత్రం కొద్ది నెలల క్రితం జరిగిన తన మధురమైన జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది.అది వాళ్ల ఎంగేజ్మెంట్ జరిగిన కొత్త రోజులు. లావణ్య అప్పుడు విజయనగరం రోడ్లో ఉన్న “శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్” లో టీచర్‌గా పని చేస్తోంది.
ఒకరోజు మధ్యాహ్నం స్కూల్ బెల్ అవ్వగానే గేట్ దాటి బయటికి వస్తున్న లావణ్యకు… గేట్ అవతల తన లగ్జరీ కార్ ఆనించి రవి నిలబడి కనిపించాడు. వందం కోట్ల బిజినెస్ హడావిడిలో ఉండే రవి, తన కోసం అంత దూరం కార్ డ్రైవ్ చేసుకుని రావడం ఆమెకు పెద్ద ఆశ్చర్యం.
“ఏంటి రవి గారు.. ఇక్కడికి వచ్చారు?” అని లావణ్య కంగారుగా అడిగాంది.
రవి తన ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ నిశ్శబ్దమైన, మెచ్యూర్డ్ నవ్వు నవ్వాడు.”బిజినెస్ మీటింగ్‌లు ఎప్పుడూ ఉండేవే లావణ్య. కానీ నీ క్లాస్ అయిపోయాక నీ ముఖంలో వచ్చే ఆ అలసటను చూసి, నిన్ను బయటికి తీసుకెళ్లడం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు,” అన్నాడు.
ఆరోజు రవి ఆమెను సిటీకి దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన కాఫీ షాప్‌కి తీసుకెళ్లాడు. అక్కడ రవి చూపించిన ప్రేమలో ఎలాంటి ఆడంబరాలూ లేవు; ఒక లోతైన నిలకడ, గౌరవం ఉన్నాయి.
“లావణ్య, బిజినెస్ ప్రపంచం చాలా క్రూరమైనది. అక్కడ రోజూ వందల మంది ముసుగులు వేసుకున్న మనుషులను చూసి నా మనసు విసిగిపోతుంది. కానీ నీ పక్కన కూర్చుంటే, నీ ఆ సాదాసీదా మాటలు వింటుంటే… నా మనసుకు ఎక్కడో లేని ప్రశాంతత దొరుకుతుంది. నీ ప్రశాంతతే నా లైఫ్ ఇన్సూరెన్స్” అని రవి ఆమె కళ్లల్లోకి చూస్తూ చాలా మెచ్యూర్డ్‌గా చెప్పిన మాటలు ఆమెను పూర్తిగా ఇంప్రెస్ చేశాయి.
అలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని తను జీవితాంతం హత్తుకుందాం అనుకుంది.కానీ… ఆ మెచ్యూర్డ్ ప్రేమను, ఆ ప్రశాంతతను పెళ్లయిన పంతొమ్మిది రోజులకే కాలం తన నుండి శాశ్వతంగా లాగేసుకుంది. రవిని కోల్పోయి, ఇప్పుడు ఈ చీకటి పోలీస్ స్టేషన్లో ఒంటరిగా నిలబడాల్సి వచ్చింది. లావణ్య కళ్లల్లోంచి ఒక వేడి కన్నీటి చుక్క నిశ్శబ్దంగా జారి కింద పడింది. కానీ ఆ కన్నీటి వెనక భయం లేదు; రవి చూపించిన ఆ ప్యూర్ లవ్ ఇచ్చిన మొండి ధైర్యం ఉంది. తన భర్తను చంపిన ఆ నల్లటి నీడను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా ఆమె చూపుల్లో పట్టుదల స్థిరపడింది.
స్థలం: చింతపల్లి రోడ్– పోలీస్ జీప్.
సరిగ్గా అదే సమయంలో… చంద్రమౌళి ప్రయాణిస్తున్న పోలీస్ జీప్ చింతపల్లి టౌన్ సరిహద్దుల్లోకి ప్రవేశించింది. చంద్రమౌళి చేతిలో ఉన్న మొబైల్ వైబ్రేట్ అయింది. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్ (CCIC) ఆఫీసర్ నుండి చంద్రమౌళికి ఫోన్ వచ్చింది. చంద్రమౌళి కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు.”చెప్పండి ఆఫీసర్, టవర్ డంప్ డేటా ఏమైంది?” చంద్రమౌళి పదునుగా అడిగాడు.
“సార్, నేను సిస్టమ్ ముందు కూర్చుని డేటా మొత్తం ఫిల్టర్ చేశాను. నిన్న రాత్రి 11:10 నుండి 11:20 మధ్య… లావణ్య రిసార్ట్ గార్డెన్లో ఉన్న ఆ ఐదు నిమిషాల వ్యవధిలో, ఆమె చుట్టుపక్కల రేడియస్‌లో యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్ల లిస్ట్ మీ వాట్సాప్‌కి పంపాను. అందులో చాలా నంబర్లు రిసార్ట్ స్టాఫ్ వి, లోకల్ టూరిస్టులవి ఉన్నాయి. కానీ సార్… ఒక నిర్దిష్టమైన నంబర్ దగ్గర కసస్టమర్ పేరు ఉండాల్సిన చోట ‘RESTRICTED / PRIVATE NUMBER’ అని చూపిస్తోంది. దాని ఐడెంటిటీని టెలికాం ఆపరేటర్ సిస్టమ్ దాచిపెట్టింది. ఈ నంబరే ఆ చీకటి మనిషిది కావచ్చు సార్!” అని సైబర్ క్రైమ్ ఆఫీసర్ అవతలి నుండి చెప్పాడు.
“దొరికాడు శ్రీనూ! ఆ ప్రైవేట్ నంబరే ఆ చీకటి మనిషిది,” చంద్రమౌళి పక్కనున్న కానిస్టేబుల్ వైపు చూస్తూ గంభీరంగా అన్నాడు. కానీ చంద్రమౌళికి తెలుసు… టెలికాం రూల్స్ ప్రకారం ఇలాంటి ప్రైవేట్ నంబర్ల కాల్ డేటా రికార్డ్స్ (CDR) గానీ, కస్టమర్ వివరాలు గానీ ఓపెన్ చేయాలంటే జిల్లా ఎస్పీ డిజిటల్ సంతకంతో కూడిన అఫీషియల్ లెటర్ సబ్మిట్ చేయాలి. పైగా ఇలాంటి నంబర్లు హై-ప్రొఫైల్ నెట్‌వర్క్‌లో మాత్రమే ఉంటాయి.
చంద్రమౌళి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ కలపమన్నాడు. రింగ్ వెళ్తోంది… ఎస్పీ ఫోన్ ఎత్తారు.”హలో, గుడ్ ఈవెనింగ్ ఎస్పీ సార్… నేను చింతపల్లి CI చంద్రమౌళిని. రవికుమార్ మర్డర్ కేసులో ఒక కీలకమైన ప్రైవేట్ నంబర్ టవర్ డంప్‌లో దొరింది సార్. దాన్ని అర్జంట్‌గా ట్రేస్ చేయడానికి మీ డిజిటల్ పర్మిషన్ లెటర్ కావాలి సార్…” చంద్రమౌళి అడిగాడు.
అవతలి నుండి ఎస్పీ గొంతు చాలా సీరియస్‌గా, నిశ్శబ్దంగా వినిపించింది.”చంద్రమౌళి… నువ్వు ఏ నంబర్ గురించి మాట్లాడుతున్నావో నాకు తెలుసు. ఇప్పుడే పైనుండి విపరీతమైన ప్రెజర్ వచ్చింది. ఇందులో చాలా పెద్దవాళ్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు! ఆ నంబర్ జోలికి నువ్వు వెళ్లడానికి వీల్లేదు. ప్రస్తుతానికి ఆ ట్రేసింగ్ ప్రాసెస్‌ని అక్కడితో హోల్డ్‌లో పెట్టు. దట్స్ మై ఆర్డర్!”ఎస్పీ మాట ముగియగానే ఫోన్ కట్ అయింది.
చంద్రమౌళి చేతిలో ఫోన్ అలాగే ఉండిపోయింది. అతని ముఖం కోపంతో, ఆశ్చర్యంతో ఎర్రబడింది. -
రహస్య కోడలు
భాగం 1:
ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు అనూషకి తెలియదు – అది తన జీవితాన్ని పూర్తిగా వేరే దిక్కుకి తిప్పబోతోందని. అంతకంటే తెలియదు, ఆ దిక్కు చివర్లో ఒక మనిషి ఎదురుచూస్తున్నాడని.
క్రాకో నగరంలో అక్టోబర్ చలి మొదలైంది. సాయంత్రం ఆరు గంటలకే చీకటి పడిపోతుంది ఇక్కడ.అనూష ఆ చిన్న బార్లో టేబుల్స్ క్లీన్ చేస్తూ, ఒక్కసారి కిటికీ బయటకి చూసింది. వర్షం మొదలైంది. ఇంకో రెండు గంటలు షిఫ్ట్ ఉంది.
“అనూషా, టేబుల్ నంబర్ ఆరుకి ఆర్డర్ తీసుకో,” బార్ మేనేజర్ పిలిచాడు పోలిష్ యాక్సెంట్‌తో ఇంగ్లీష్‌లో.ఆమె తలూపి వెళ్ళింది. ఇది రొటీన్ – రోజూ ఇదే. మార్నింగ్ IT సపోర్ట్ కాల్స్ తర్వాత, సాయంత్రం ఇక్కడ వెయిటర్‌గా, వీకెండ్స్‌లో ఒక ఆఫీస్ క్లీనింగ్‌కి – మూడు జాబ్స్ బ్యాలెన్స్ చేస్తూ బతుకుతోంది, ఒంటరిగా, ఎవరికీ చెప్పకుండా.ఇంటికి మాత్రం “IT job లో బాగానే సెటిల్ అయ్యాను” అని మాత్రమే చెప్తుంది. అమ్మ నాన్న సంతోషంగా ఉంటారని అబద్ధం కాని అబద్ధం చెప్తూ బతుకుతోంది మూడేళ్ళుగా.
రాత్రి పదకొండు గంటలకి ఇంటికి వచ్చి, అలసిన శరీరంతో బెడ్ మీద వాలగానే ఫోన్ మోగింది.
విజయవాడ నుండి అమ్మ కాల్.”అనూ…” గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది.
“అమ్మా, ఏమైంది?” అనూష వెంటనే లేచి కూర్చుంది.
“నాన్నకి కిడ్నీల్లో ఏదో ప్రాబ్లం అంట. చాలా రోజులుగా నలతగా ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు, రిపోర్ట్స్ చూసి డాక్టర్ scared చేసేసారు. Regular dialysis మొదలుపెట్టాలంట, కనీసం రెండేళ్ళు. ఇంట్లో ఎవరో ఒకరు పూర్తిగా ఉండి చూసుకోవాలి అనూ, నేను ఒక్కదాన్ని తట్టుకోలేను.
“అనూష ఫోన్ పట్టుకున్న చేయి వణికింది. ఇది చిన్న విషయం కాదు – రెండేళ్ళు, రెగ్యులర్ కేర్, అమ్మ వొంటరిగా భరించలేని బాధ్యత. కిటికీ బయట క్రాకో వర్షంలో తడుస్తోంది. ఇక్కడ ఆమె కట్టుకున్న చిన్న ప్రపంచం – ఈ జాబ్స్, ఈ struggle, ఈ independence – అన్నీ ఒక్క క్షణంలో దూరమైపోతున్నట్టు అనిపించింది.
“అమ్మా, నేను వచ్చేస్తాను. కంగారు పడకు,” అంది, గొంతు స్థిరంగా ఉంచుకుంటూ.
కాల్ కట్ అయ్యాక, ఆమె చాలాసేపు అలానే కూర్చుండిపోయింది. మనసులో రెండు ఆలోచనలు పోటీ పడుతున్నాయి – మూడేళ్ళు కష్టపడి కట్టుకున్నది వదిలేయాలా అనే బాధ, నాన్న దగ్గర ఉండాలనే బాధ్యత. కానీ ఎంతసేపటికీ రెండో ఆలోచనే గెలిచింది. ఇది ఎంచుకోవాల్సిన నిర్ణయం కాదు, తప్పనిసరి అయినది.
తెల్లారి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంది – వారం రోజుల్లో విజయవాడ వెళ్ళడానికి, ఈసారి తిరిగి రాని ప్రయాణంలా. బ్యాగ్ సర్దుకుంటూ, మూడేళ్ళ క్రాకో జీవితాన్ని ఒక్క సూట్‌కేస్‌లో folded చేసేస్తున్నట్టు అనిపించింది ఆమెకి.
ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరే ముందు రోజు, ఆమెకి తెలియదు – వేరే ఒక ఫ్లైట్, వేరే ఒక కారణంతో, అదే ఎయిర్‌పోర్ట్‌లో ఒక వ్యక్తి తనని కలవడానికి సిద్ధమవుతున్నాడని. -
మృత్యువు తొడిగిన పూలదండ (7)
స్థలం: హైదరాబాద్ నుండి చింతపల్లి వెళ్తున్న హైవే – పోలీస్ జీప్.రాత్రి చీకట్లో పోలీస్ జీప్ హైవే మీద వేగంగా దూసుకుపోతోంది. కనకరాజు శవాన్ని హైదరాబాద్ లోకల్ పోలీసులకి అప్పగించి, పంచనామా పూర్తి చేసి చంద్రమౌళి, శ్రీను తిరిగి చింతపల్లి బయలుదేరారు. జీప్ లోపల సైలెన్స్ ఉంది, కానీ చంద్రమౌళి మెదడులో మాత్రం ఆలోచనల తుఫాను నడుస్తోంది. కనకరాజు చనిపోయాడు…
అంటే ఆ రాత్రి లావణ్యతో గార్డెన్లో మాట్లాడింది, రవిని హత్య చేసింది కనకరాజు కాదని వంద శాతం నిర్ధారణ అయిపోయింది. మరి ఆ చీకటిలో ఉండే మనిషి ఎవరు? వాడిని కనిపెట్టడం ఎలా? చంద్రమౌళి సీట్లో వెనక్కి ఆనుకుని కళ్లు మూసుకున్నాడు.
“శ్రీనూ… ఒకసారి ఈ కేసు మొదటి నుండి రీవైండ్ చెయ్. హత్య జరగకముందు, జరిగిన తర్వాత… ఎవరెవరు ఏమేం స్టేట్మెంట్లు ఇచ్చారో లైన్ బై లైన్ మళ్లీ చెప్పు,” చంద్రమౌళి గంభీరంగా అన్నాడు.
శ్రీను డ్రైవ్ చేస్తూనే గుర్తు తెచ్చుకుంటూ చెప్పడం మొదలుపెట్టాడు. “సార్, మేనేజర్ బన్నీ వాస్ చెప్పిన దాని ప్రకారం… నిన్న రాత్రి రవికుమార్ గదిలోకి వెయిటర్ గ్రీన్ టీ పట్టుకెళ్లాడు. లావణ్య తలుపు సగం తీసి వెయిటర్ ని పంపించేసింది. ఆ తర్వాత 11:15 కి లావణ్య కారిడార్ లో ఫోన్ పట్టుకుని తిరిగింది, వెంటనే సర్వీస్ లిఫ్ట్ ఎక్కి కింద గార్డెన్ లో ఒక మగాడిని కలిసింది. ఇక లావణ్య చెప్పిన దాని ప్రకారం… భూపతి రెడ్డి ఫోన్ వచ్చినప్పటి నుండి రవికుమార్ కి మైగ్రేన్ వచ్చింది, బయటి వెలుతురు పడకుండా తలుపు వేసింది. కారిడార్ లో సిగ్నల్ లేక నెట్వర్క్ సెర్చ్ చేస్తూ కిందకి వెళ్తే అక్కడ ఆ చీకటి మనిషి కనిపించాడు. వాడు ‘ఇక్కడ సిగ్నల్స్ రావు, మేనేజర్ ని పిలుస్తా’ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇవీ సార్ మన దగ్గరున్న స్టేట్మెంట్లు.”
చంద్రమౌళి కళ్లు మూసుకునే ఆ మాటలన్నింటినీ మెదడులో విశ్లేషించడం మొదలుపెట్టాడు. లావణ్య మాటలు… బన్నీ వాస్ మాటలు… సీసీటీవీ విజువల్స్… కనకరాజు చావు… వైఫై నెట్వర్క్… అన్నీ ఒకదానికొకటి ముడిపడుతూ, విడిపోతున్నాయి. జీప్ హైవే హెడ్లైట్ల వెలుతురులో ముందుకు సాగుతోంది. అకస్మాత్తుగా చంద్రమౌళి కళ్లు తెరిచాడు. అతని ముఖంలో ఒక విపరీతమైన ఎక్సైట్మెంట్ కనిపించింది.
“దొరికాడు శ్రీనూ!” చంద్రమౌళి సీట్లోంచి ముందుకు జరిగి గట్టిగా అరిచాడు.”ఎవరు సార్?” శ్రీను బ్రేక్ వేయబోయినంత పని చేశాడు.”ఆ చీకటి మనిషి! మన మెదడు ఇంతకాలం తప్పుడు దారిలో వెతికింది శ్రీనూ. మనం కనకరాజు సెల్ నెట్వర్క్ సెర్చ్ చేశాం, వాడు హైదరాబాద్ లో ఉన్నాడని తేలింది. కానీ మనం అసలైన పాయింట్ మిస్ అయ్యాం. ఆరోజు రాత్రి, ఆ టైమ్‌లో… లావణ్య సిగ్నల్స్ లేవని కారిడార్ లో, గార్డెన్ లో తిరుగుతున్నప్పుడు… ఆమె చుట్టుపక్కల ఏ నెట్వర్క్ యాక్టివ్‌గా ఉందో మనం కనిపెట్టాలి! లావణ్య ఫోన్ లో నెట్వర్క్ సెర్చ్ మోడ్ ఆన్ లో ఉందంటే… ఆ రిసార్ట్ టవర్ పరిధిలో ఏ మొబైల్ సిగ్నల్స్ అయితే యాక్టివ్‌గా ఉన్నాయో, వాటన్నింటి డంప్ డేటా (Tower Dump Data) తీస్తే… సరిగ్గా అదే ఐదు నిమిషాల గ్యాప్ లో లావణ్య ఉన్న గార్డెన్ పరిసరాల్లో ఏ మొబైల్ నంబర్ మూవ్మెంట్ ఉందో తెలిసిపోతుంది. ఆ నంబర్ ఎవరిదో తేలితే… ఆ చీకటి మనిషి ఎవడో క్షణాల్లో తెలిసిపోతుంది!
“చంద్రమౌళి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన ఫోన్ తీసి CCIC (Cyber Crime Investigation Cell) ఆఫీసర్‌కి కాల్ చేశాడు. “హలో, నేను చింతపల్లి CI చంద్రమౌళిని మాట్లాడుతున్నా. అర్జంట్ కేస్. నిన్న రాత్రి 11:00 నుండి 11:30 మధ్యలో… సీధోని రిసార్ట్ లొకేషన్ టవర్ పరిధిలోని టవర్ డంప్ డేటా మొత్తం నాకు ఇప్పుడే కావాలి. ముఖ్యంగా లావణ్య అనే నంబర్ మూవ్మెంట్ ఉన్న ఆ ఐదు నిమిషాల గ్యాప్ లో… ఆ చుట్టుపక్కల రేడియస్‌లో యాక్టివ్‌గా ఉన్న నంబర్స్ లిస్ట్ ని ఫిల్టర్ చేసి నా వాట్సాప్‌కి పంపండి. రిసార్ట్ అడ్రస్, లావణ్య నంబర్ డీటెయిల్స్ ఇప్పుడే మెసేజ్ చేస్తున్నా. ఇట్స్ ఆన్ ఎమర్జెన్సీ!” అంటూ కాల్ ఎండ్ చేశాడు.
చంద్రమౌళి ముఖంలో కేసును క్లైమాక్స్‌కి తెచ్చాననే పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది.స్థలం: లోకల్ రైల్వే స్టేషన్.
ప్లాట్‌ఫారమ్ మీద ఉన్న మైకుల్లో నుండి మసక శబ్దంతో అనౌన్స్మెంట్ వినిపించడం మొదలైంది.“మే ఐ హావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్… వైజాగ్ వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారమ్ మీదికి వస్తోంది…” అంటూ రైల్వే అనౌన్స్మెంట్ వరుసగా మూడుసార్లు స్టేషన్ అంతా ప్రతిధ్వనించింది.
సరిగ్గా మూడు నిమిషాల తర్వాత, చీకటిని చీల్చుకుంటూ భారీ శబ్దంతో ట్రైన్ ప్లాట్‌ఫారమ్ మీదికి వచ్చి ఆగింది. చక్రాల ఘర్షణ శబ్దం, ఇంజన్ హారన్ స్టే션을 కుదిపేశాయి. పిల్లర్ వెనుక దాక్కున్న రిసార్ట్ వెయిటర్ కళ్లు అస్సలు పక్కకి తిరగట్లేదు. అతని కళ్ల ముందే… ఆ నార్త్ ఇండియన్ కిల్లర్ గంగూభాయ్ నిదానంగా నడుచుకుంటూ వెళ్లి ట్రైన్ కంపార్ట్మెంట్ లోపలికి ఎక్కిపోయాడు.వెయిటర్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.
వాడు వణుకుతున్న చేతులతో తన జేబులోంచి ఫోన్ తీసి, చింతపల్లి పోలీస్ స్టేషన్‌కి కాల్ చేశాడు. రింగ్ వెళ్తోంది… ఒక్క సెకండ్… రెండు సెకన్లు… లోపల కానిస్టేబుల్ ఫోన్ ఎత్తాడు, “హలో, చింతపల్లి పిఎస్…” అని అవతలి నుండి స్వరం వినిపించింది.వెయిటర్ కంగారుగా గొంతు పెంచి, ” సార్… నేను సీధోని రిసార్ట్ వెయిటర్ని మాట్లాడుతున్నా. నిన్న రాత్రి రూమ్ నెంబర్ 207 కి నేను పాలు ఇస్తున్నప్పుడు కిటికీ నుండి దిగిన ఆ హంతకుడు ఇప్పుడు రైల్వే స్టేషన్లో…” అని వాడు పూర్తి చేసేలోపే… ఫోన్ లో స్పీకర్ అటు ఇటు అవుతూ ‘బీప్ బీప్’ అని శబ్దం వచ్చింది. సరైన సిగ్నల్ లేకపోవడం వల్ల కాల్ ఆటోమేటిక్‌గా ఎండ్ అయిపోయింది!
వెయిటర్ ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. గుండె గొంతుకలోకి వచ్చినంత పని అయింది.”అయ్యో దేవుడా… ఇప్పుడు చూసి కట్ అయిందేంటి! ఛ్… దరిద్రపు సిగ్నల్!” అని వాడు పిచ్చెక్కినట్టు ఫోన్ స్క్రీన్‌ని చూస్తూ, చేతులు వణుకుతుండగా మళ్లీ నంబర్ డయల్ చేయడానికి ట్రై చేశాడు. కానీ స్క్రీన్ మీద ‘నో నెట్వర్క్’ అని చూపిస్తోంది.
వాడు కంగారుగా ఫోన్‌ని గాల్లోకి ఎత్తుతూ ప్లాట్‌ఫారమ్ మీద అటు ఇటు నడిచాడు.సరిగ్గా అదే సమయంలో… ట్రైన్ కదలడానికి లాంగ్ వీజిల్ వినిపించింది. చక్రాలు నెమ్మదిగా కదులుతున్న చప్పుడు మొదలైంది. ఆ శబ్దం వినబడగానే వెయిటర్ కడుపులో తిప్పేసినట్టు అయింది. చేతిలో ఫోన్ పట్టుకుని, కళ్లముందే హంతకుడు పారిపోతున్నాడే అనే విపరీతమైన భయం, ఆందోళన వాడి ముఖంలో స్పష్టంగా కనిపించాయి.ఇక లాభం లేదనుకుని వాడు ఫోన్‌ని జేబులో పడేసి, కంగారుగా ప్లాట్‌ఫారమ్ మీదున్న రైల్వే పోలీస్ స్టేషన్ వైపు పరిగెత్తాడు. ఎలాగైనా అక్కడున్న పోలీస్ టీమ్‌ను కలిసి ఆ హత్య స్టోరీ చెప్పి గంగూభాయ్‌ని పట్టించాలని వాడు స్టేషన్ లోపల, ప్లాట్‌ఫారమ్ అంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని పోలీసుల కోసం వెతకడం మొదలుపెట్టాడు.
కానీ ఆ అర్ధరాత్రి వేళ ప్లాట్‌ఫారమ్ మీద ఏ ఒక్క పోలీస్ కూడా కనిపించలేదు.ఇంతలో ట్రైన్ స్పీడందుకుని ప్లాట్‌ఫారమ్ దాటి కదిలిపోతోంది. చక్రాల శబ్దం పెరిగిపోతోంది. కంగారుగా వెయిటర్ పోలీసుల కోసం వెతుకుతాడు. అలా వెతుకుతున్న ప్రాసెస్ లో… ప్లాట్‌ఫారమ్ చివరన ఉన్న పాత పబ్లిక్ రెస్ట్ రూమ్ (Rest room) వైపు నడిచాడు.
బాలా బహుశా పోలీసులు లోపల ఏమైనా ఉన్నారేమో అని కంగారుగా రెస్ట్ రూమ్ లోపలికి అడుగుపెట్టాడు. లోపల లైట్ మసకగా వెలుగుతోంది, ట్యాప్ నుండి నీళ్లు కారుతున్న శబ్దం తప్ప ఎవరూ లేరు.వెయిటర్ నిరాశగా వెనక్కి తిరగబోయాడు…సరిగ్గా అప్పుడు… వెనక నుండి ఒక నల్లటి నీడ నిశ్శబ్దంగా వచ్చింది. వెయిటర్ ఆ నీడను గమనించేలోపే… ఒక బరువైన ఇనుప రాడ్‌తో ఆ గుర్తుతెలియని వ్యక్తి వెయిటర్ తలపై చాలా బలంగా కొట్టాడు!ధభ్! అనే శబ్దంతో పాటు వెయిటర్ తల పగిలి రక్తం చిమ్మింది. వాడు కళ్లెదుటే చీకటి కమ్ముకొస్తుండగా, నోటి నుండి ఒక్క కేక కూడా రాకుండా నేలపై కుప్పకూలిపోయాడు. రెస్ట్ రూమ్ టైల్స్ మీద రక్తం మెల్లగా పాకడం మొదలైంది. -
ట్రాజెడీ కథలు
సాయి పుట్టుక గురించి ఎవరూ పెద్దగా గుర్తుపెట్టుకోలేదు — ఏ ఆసుపత్రిలోనో, ఏ మామూలు రోజునో. సాయికి తెలిసిందల్లా ఒక్కటే, పుట్టినప్పటి నుండే వాడు తనను తాను కాపాడుకోవడం. ఇది ఒంటరి జీవితం నేర్పిన పాఠం.
తల్లిదండ్రులు ఇద్దరూ శబరిమల యాత్రకని బయలుదేరిన బస్సు కొండ మలుపులో బోల్తా పడి పోయారు, సాయికి అప్పుడు పదిహేనేళ్ళు. వాళ్ళు కట్టిన చిన్న ఇల్లు ఒక్కటే మిగిలింది, ఇప్పుడు గోడలు పగుళ్ళు వేసి, పైకప్పు లీక్ అవుతూ. బంధువులు కొందరు వచ్చారు, “పాపం” అన్నారు, ఫోన్ నంబర్లు ఇచ్చారు, తర్వాత ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేసిన సాకులు చెప్పేవారు కానీ సాయం చేసేవారు కాదు. అలసిపోయాడు, అడగడం ఆగిపోయాడు.స్కూలు మధ్యలోనే ఆగిపోయింది.
బతకడం కోసం ఏం దొరికితే అది చేశాడు — హోటల్లో సర్వర్ గా, తర్వాత డెలివరీ బాయ్ గా బైక్ మీద ఆర్డర్లు మోసేవాడు. యాప్ లో రేటింగ్ పడిపోయినప్పుడు తిట్లు తినేవాడు, రోజంతా తిరిగినా చేతిలో మిగిలేది కొన్ని వందలే. సేవింగ్స్ అకౌంట్ ఉన్నా అందులో బ్యాలెన్స్ ఎప్పుడూ సున్నా. ఆ రోజు సంపాదన ఆ రోజే ఖర్చు — ఫోన్ రీచార్జ్, తిండి, మిగిలింది సిగరెట్లకో, గుట్కాకో.
ఇరవై రెండేళ్ళ వయసులో ఏజెంట్ ఒకడు నమ్మించి ఖతార్ పంపాడు, “అక్కడ మంచి జీతం” అని. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ సైట్లో ఎండలో పనిచేశాడు, రూమ్‌లో పదిమందితో కలిసి ఉండేవాడు. జీతం సరిగ్గా రాలేదు, పాస్‌పోర్టు కంపెనీ దగ్గరే ఉండిపోయింది. రెండేళ్ళు తిరిగాక కంపెనీ మూతపడి, వీసా రద్దయి, తిరిగి ఇండియా పంపేశారు — వచ్చినప్పుడు జేబులో ఏమీ లేదు, అప్పులు తప్ప.
ఊరికి పోకుండా బెంగళూరు వచ్చాడు. అక్కడ ఒక చిన్న గదిలో, రోజు కూలి పనులు చేస్తూ మూడేళ్ళు గడిపాడు. ఫోన్ లో రీల్స్ చూస్తూ రాత్రిళ్ళు గడిపేవాడు, ఎవరితోనూ పెద్దగా మాట కలిపేవాడు కాదు. స్నేహితులు అనేవాళ్ళు వాట్సాప్ గ్రూప్‌లకే మిగిలిపోయారు, ఫోన్ చేసేవాళ్ళు లేరు.పెళ్ళి ప్రస్తావన ఎవరూ తేలేదు — తేవడానికి ఎవరూ లేరు కాబట్టి. జేబులో డబ్బు మిగిలిన రాత్రుల్లో, పరిచయస్తుడొకడు చెప్పిన అడ్రస్‌కు (redlight area) వెళ్ళేవాడు, కొన్ని గంటలు ఎవరైనా పక్కన ఉన్నారన్న భావన కోసం. అంతకుమించి ఏమీ ఆశించలేదు.
చివరికి ఊరు, ఆ పాత ఇల్లు గుర్తొచ్చి తిరిగొచ్చాడు. వయసు నలభైకి దగ్గరైంది. అప్పటికే శరీరం లోపల్లోపల విరిగిపోతూ వచ్చింది — పొద్దున్నే లేవగానే సిగరెట్, పగలంతా పాకెట్ల చిప్స్, సమోసాలు, కూల్‌డ్రింక్స్, రాత్రి బ్రాందీ బాటిల్. నోట్లో ఎప్పుడూ పాన్ మసాలా. వ్యాయామం అనే మాటే వాడి రొటీన్లో లేదు — రోజంతా బండి మీద తిరిగేవాడు కదా, అదే ఎక్సర్సైజ్ అనుకునేవాడు.
ఒక రాత్రి, ఫోన్లో రీల్స్ చూస్తూ, బ్రాందీ తాగి పడుకున్నాడు. బయట వీధి లైట్ల వెలుతురు కిటికీలోంచి పడుతోంది, ఎక్కడో వీధి కుక్కలు మొరుగుతున్నాయి. అర్థరాత్రి దాటిన ఏదో గంటలో ఛాతీలో ఒక్కసారిగా బరువు, ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. లేవాలని ప్రయత్నించిన చెయ్యి మంచం అంచు దాటకముందే, సాయి గుండె శాశ్వతంగా ఆగిపోయింది.
మూడు రోజుల వరకు ఎవరికీ తెలియలేదు. పక్కింటివాళ్ళకు దుర్వాసన అనిపించి పోలీసులకు చెప్పారు. తలుపు బద్దలు కొట్టి చూస్తే, మంచం మీద కుళ్ళిపోతున్న శవం. మున్సిపాలిటీ వాళ్ళు గ్లవుజులు వేసుకుని, ముక్కుకు గుడ్డ కట్టుకుని, శవాన్ని బ్యాగులో సర్దారు, తీసుకెళ్ళడానికి వ్యాన్ ఎక్కించారు.
అంతా అయిపోయాక, వ్యాన్ కదిలేముందు, పనివాళ్ళలో ఒకడు గ్లవుజులు తీస్తూ పక్కవాడితో అన్నాడు — “వీడెవడో, ఎవరూ లేరు వీడికి. అడవిలో చచ్చిపోయే జంతువులాగా ఒంటరిగా చచ్చిపోయాడు, పట్టించుకునేవాళ్ళు లేకుండా.” ఆ మాట గాలిలో కలిసిపోయింది,
వ్యాన్ కదిలిపోయింది. వీధి మామూలుగానే మిగిలింది — సాయి బతికాడని కూడా ఎవరికీ గుర్తుండదు, చచ్చిపోయాడని మాత్రమే గుర్తుంటుంది, అది కూడా కొన్ని రోజులే.
-
మృత్యువు తొడిగిన పూలదండ (6)
స్థలం: హైదరాబాద్, పాడుబడిన బిల్డింగ్కనకరాజు శవం ముందు నిలబడిన చంద్రమౌళి మైండ్ తీవ్రమైన సందిగ్ధంలో పడింది. సైబర్ క్రైమ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం… గత మూడు రోజులుగా కనకరాజు మొబైల్ సిగ్నల్స్ రికార్డ్స్ పూర్తిగా హైదరాబాద్ లోనే చూపిస్తున్నాయి. వాడు మూడు రోజుల ముందే ఇక్కడికి వచ్చాడనే పక్కింటివాడి సాక్ష్యం వంద శాతం నిజం.చంద్రమౌళి టార్చ్ లైట్ ఆన్ చేసి, తన ఫోన్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ స్క్రీన్ షాట్‌ను,
కింద పడి ఉన్న కనకరాజు శవాన్ని మళ్లీ పోల్చి చూడటం మొదలుపెట్టాడు. ఇద్దరి బాడీ స్ట్రక్చర్, ఎత్తు, కుడి భుజం వాలిన తీరు అంతా ఒకేలా ఉన్నాయి. కానీ… చంద్రమౌళి చూపులు స్క్రీన్ షాట్లోని ఆ నల్లటి నీడ చేతి మణికట్టు మీద ఆగాయి. ఆ చీకటి మనిషి ఎడమ చేతికి ఒక మందపాటి ఇనుప బ్రేస్లెట్ (Bracelet) స్పష్టంగా మెరుస్తోంది.అతను వెంటనే కనకరాజు శవం ఎడమ చేతిని చూశాడు. వాడి చేతికి ఎలాంటి బ్రేస్లెట్ లేదు. వాడు అసలు బ్రేస్లెట్ వేసుకునే రకం కాదు.
“శ్రీనూ… వీడు ఆ చీకటి మనిషి కాదు!” చంద్రమౌళి గొంతులో గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది.
“అదేంటి సార్? బాడీ స్ట్రక్చర్ అంతా సేమ్ ఉంది కదా?” శ్రీను ఆశ్చర్యంగా అడిగాడు.
“స్ట్రక్చర్ ఒక్కటే, కానీ వీడి చేతికి బ్రేస్లెట్ లేదు. ఆ రాత్రి రిసార్ట్ గార్డెన్లో లావణ్యను కలిసిన ఆ చీకటి మనిషి ఎడమ చేతికి స్పష్టంగా బ్రేస్లెట్ ఉంది. అసలు నేరస్థుడు కనకరాజు కాదంటే… మరి వాడు ఎవడు? వాడి బాడీ స్ట్రక్చర్‌ను వాడుకుని, వీడిని ఇక్కడ చంపేసి, కేసును క్లోజ్ చేయాలని చూస్తున్న ఆ నల్లటి నీడ వెనుక ఉన్నదెవరు?” చంద్రమౌళి మళ్లీ ఒక అంతుచిక్కని ఆలోచనల చీకటి గుహలోకి మునిగిపోయాడు. .
స్థలం: రవికుమార్ స్వగృహం.
గది నిండా రోదనలు, నిశ్శబ్దం అల్లుకుపోయాయి. ఒకే ఒక్క కొడుకును కోల్పోయిన ఆ ముసలి తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. రవికుమార్ తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తుంటే, తండ్రి స్పృహ తప్పిన స్థితిలో మంచం మీద పడి ఉన్నాడు. ఇల్లు నిండా చుట్టాలు, ఊరి జనాలు నిలబడి ఉన్నారు.
అప్పుడే చుట్టాల్లోని ఒక వ్యక్తి గట్టిగా అన్నాడు, “పెళ్లయిన పంతొమ్మిది రోజులకే మొగుడిని మింగేసింది. ఆ లావణ్యే ఆస్తి కోసం రవికి విషమిచ్చి చంపేసింది. లేకపోతే అర్ధరాత్రి పూట ఆవిడ ప్రవర్తన ఏంటి? పోలీసుల విచారణలో అంతా బయటపడిందట, ఆవిడే హంతకురాలు!”
ఆ మాట వినగానే రవికుమార్ ముసలి తల్లి ఒక్కసారిగా లేచి కూర్చుంది. కళ్లల్లో నీళ్లు కారుతున్నా, ఆమె గొంతులో విపరీతమైన ఆక్రోశం, పట్టుదల కనిపించాయి. ఆమె ఆ మాట్లాడిన వ్యక్తి వైపు తిరిగి గట్టిగా కేక లేచింది.
“నోరు మూయ్! నా కోడలి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే ఊరుకోను!” ఆమె ఏడుస్తూనే ఎదిరించింది. “నా కొడుకు ఎలాంటివాడో, నా కోడలు ఎలాంటిదో నాకు తెలుసు. లావణ్య నా కొడుకు ప్రాణం. తను రవిని చంపడం ఏంటి? మీ నోటికి ఏది వస్తే అది వాగుతారా? ఆ పిల్లకు పెళ్లయి కనీసం నెల కూడా కాలేదు, తన పసుపు కుంకుమలు పోయి అక్కడ ఏడుస్తుంటే… మీరు ఇలాంటి నిందలు వేస్తారా? నా లావణ్య ప్రాణం పోయినా అలాంటి తప్పుడు పని చేయదు. అసలు హంతకుడు ఎవడో బయట తిరుగుతుంటే, నా కోడలిని అంటారా? లావణ్య నిర్దోషి… తను ఏ పాపం చేయలేదు!” అంటూ రవి తల్లి ఏడుస్తూ గట్టిగా లావణ్యను సమర్థిస్తూ నిలబడింది. చుట్టాలందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు.
స్థలం: భూపతి రెడ్డి ఫామ్‌హౌస్.
పచ్చటి చెట్ల మధ్య ఉన్న భూపతి రెడ్డి లగ్జరీ ఫామ్‌హౌస్ లోపల లైట్లు తక్కువ వెలుతురులో వెలుగుతున్నాయి.
టేబుల్ మీద ఖరీదైన మద్యం సీసాలు ఉన్నాయి. భూపతి రెడ్డి సోఫాలో రిలాక్స్‌గా కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. అతని అవతల… ఒక పటిష్టమైన బాడీ, ఎడమ చేతికి మందపాటి ఇనుప బ్రేస్లెట్ వేసుకుని, నల్లటి దుస్తుల్లో ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. అతను చూడటానికి నార్త్ ఇండియాలా ఉన్నాడు. అతని పేరే గంగూభాయ్.భూపతి రెడ్డి గ్లాసులో మద్యం పోసి గంగూభాయ్ వైపు నెట్టాడు.
“గంగూభాయ్… నీ పనితనం అద్భుతం. రవికుమార్‌ను ముగించావ్, ఆడిట్ ఫైల్స్ లేపేశావ్. ఆ చంద్రమౌళి గాడు ఆ నాలుగు గోడల మధ్య లావణ్య చుట్టు తిరుగుతూ అలిసిపోయి దానినే నేరస్థురాలు చేస్తాడు.. ఇక పోలీసులకి ఈ కేసులో ఎలాంటి లింకూ దొరకదు. లావణ్య జైలుకి వెళ్లడం ఖాయం,” భూపతి రెడ్డి ముఖంలో ఒక క్రూరమైన నవ్వు కనిపించింది.గంగూభాయ్ మద్యం గ్లాస్ అందుకుని ఒకే గుటకలో ఖాళీ చేశాడు. అతని ముఖంలో ఎలాంటి భావాలూ లేవు.
“గంగూభాయ్… నీతో నా పని అయిపోయింది. ఇక నువ్వు ఇప్పుడే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవచ్చు. నీకు ఇవ్వాల్సిన అమౌంట్ నీ అకౌంట్‌కి చేరిపోయింది. దిస్ ఈజ్ ఎ స్మాల్ పార్టీ ఫర్ యు,” అంటూ భూపతి రెడ్డి చిన్న సెలబ్రేషన్ ముగించాడు.
సెలబ్రేషన్స్ పూర్తి కాగానే, అర్ధరాత్రి వేళ గంగూభాయ్ తన బ్యాగ్ పట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా లోకల్ రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాడు. స్టేషన్ ప్లాట్‌ఫారమ్ మీద జనాలు పెద్దగా లేరు. లైట్లు మసకగా వెలుగుతున్నాయి. గంగూభాయ్ రైలు కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు.
సరిగ్గా అదే సమయంలో… సీధోని రిసార్ట్ వెయిటర్ (నిన్న రాత్రి రవికుమార్ రూమ్‌కి గ్రీన్ టీ తీసుకెళ్లినవాడు) తన ఊరికి వెళ్లడం కోసం అదే రైల్వే స్టేషన్‌కి వచ్చాడు.
వాడు ప్లాట్‌ఫారమ్ మీద నడుచుకుంటూ వెళ్తుండగా, అక్కడ నిలబడి ఉన్న గంగూభాయ్ మీద వాడి చూపు పడింది. గంగూభాయ్ ఎడమ చేతికి ఉన్న ఆ ఇనుప బ్రేస్లెట్ మసక వెలుతురులో మెరిసింది.
వెయిటర్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. వాడి కళ్లు భయంతో, ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నిన్న రాత్రి జరిగిన సీన్ వాడి కళ్లముందు కదలాడింది.
“అరేయ్… వీడు… వీడే కదా ఆరోజు రాత్రి! నేను రూమ్ నెంబర్ 207 కి గ్రీన్ టీ ఇవ్వడానికి వెళ్లినప్పుడు… కారిడార్ చివర విండో (కిటికీ) నుండి కిందకి దిగిపోయింది వీడే కదా! ఆ బ్రేస్లెట్, ఈ నడక… వంద శాతం వీడే. వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ విషయం వెంటనే పోలీసులకి చెప్పాలి,” అనుకుంటూ వెయిటర్ వణుకుతున్న చేతులతో కంగారుగా జేబులోంచి ఫోన్ బయటికి తీశాడు… -
మిస్సింగ్ మొగుడు
నాకు తెలిసిన ఒక స్త్రీ ఉంది. తనెప్పుడూ తన భర్తను వెతుకుతూనే ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, పేపర్లో యాడ్ వేయించినా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, న్యూస్ ఛానెల్స్‌లో గంటల తరబడి డిస్కషన్స్ పెట్టినా, బంధువులు, కుటుంబీకులు.. ఇలా అందరి చేతా ఈ భూ ప్రపంచాన్ని జల్లెడ పట్టి వెతికించినా అతను ఎక్కడా దొరకలేదు.
చివరికి అంతరిక్షంలో దాక్కున్నాడేమో అని అక్కడ కూడా వెతికించింది, అయినా దొరకలేదు.
ఒకరోజు నేను తనని అడిగాను, “అసలు ఏం జరిగింది? నీ మొగుడు ఎలా మిస్ అయ్యాడు, చెప్పు?” అని.
ఆ స్త్రీ ఇలా అంది: “మాకు పెళ్లయిన కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నాడు! రోజుకు ఏదో ఒక మాటైనా చెప్పే తను, ఆ రోజు మాత్రం ఏ మాట చెప్పలేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత నా మాటలు వినడం మానేశాడు. అలా కొన్ని వారాలకి తను నాపై అరవడం స్టార్ట్ చేశాడు. కొన్ని నెలల తర్వాత కొట్టడం మొదలుపెట్టాడు. ఏడాది తిరిగేసరికి తాగడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సడెన్‌గా ఒకరోజు కనిపించకుండా పోయాడు. ఇదే జరిగింది.”
“అవునా! సరే నాకు ఇది చెప్పమ్మా! ఇంతకీ మీ ఆయన రోజూ ఏదో ఒక మాట చెప్పేవాడు కదా, ఆ రోజు ఎందుకు చెప్పలేదు?” అని అడిగాను.
“అదా..! ఒకరోజు తను ఏదో చెబుతుంటే… ‘చాలు చాలులే… ఏం చేయాలో, ఏం చేయకూడదో నాకు తెలియదా! నేనేమైనా చిన్న పిల్లననుకుంటున్నావా నువ్వు చెప్పే అడ్డమైన సోది వినడానికి’ అన్నాను, అంతే! ఆ మరుసటి రోజు నుండి తను ఏ మాట చెప్పలేదు. ఆ తర్వాత రోజు ‘తప్పయిందండి, నిన్న మిమ్మల్ని అలా అనకుండా ఉండాల్సింది’ అని సారీ కూడా చెప్పా!”
”సారీ చెప్పినా ఎందుకు మాట్లాడలేదు?” అని అడిగా.
”సారీ అయితే చెప్పాను కానీ.. ఆ తర్వాత అతని మాటలు నాకు వినబుద్ధి కాలేదు. అందుకే తను ఏమైనా చెప్పేస్తాడేమోనని, నేనే ముందుగా మాట్లాడేసేదానిని. కానీ నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా తను పట్టించుకోవడం మానేశాడు. అప్పటికే చాలా సారీలు చెప్ప అని నా మాటలు వినడం మానేశాడు దాంతో నాకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఒకసారి గట్టిగా అరిచా!”
”అరిస్తే ఏమైంది? విన్నాడా?”
“లేదు, వినలేదు.. నాలుగు గోడల మధ్య అరిస్తే లాభం లేదని, వాళ్ళ వాళ్ల ముందు అరిస్తేనైనా నా మాట వింటాడని, ఎక్కడ పడితే అక్కడ తనపై అరిచేదానిని. ఏమైందో తెలియదు, ఎక్కడి నుండి ఏ బలమొచ్చిందో తెలియదు.. తను కూడా నాపై అరవడం స్టార్ట్ చేశాడు. దాంతో నాకు చిర్రెత్తి, అర్థంపర్థం లేని మాటలతో ఇంకా గట్టిగా అరిచేదానిని” అంటూ ఆగిపోయింది.
జోరుగా కురిసే వర్షంలా మాట్లాడి, సడెన్‌గా ఆగిపోతే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత నెమ్మదిగా “ఎందుకు చెప్పడం ఆపేశావు?” అని అడిగా.
తను చిన్నగా నవ్వుతూ, “ఏమీ లేదు.. అది ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయా!” అంది.
“అంటే అర్థంపర్థం లేని నీ మాటలకే తను తాగడం స్టార్ట్ చేశాడా?” అని కావాలనే కథను కాస్త ముందుకు నడిపించడానికి అడిగాను.
తను నావైపు చూస్తూ, మళ్ళీ తల దించుకుంటూ… కాస్త సిగ్గుపడుతూ “ఆ రోజు తను నాపై చేయి చేసుకున్నాడు.. నన్ను కొట్టాడు” అని అంది.
”నిన్ను కొట్టాడని సిగ్గుతో చెబుతున్నావేంటి?” అని కుతూహలంగా అడిగా!
”మొదటి ప్రేమలో ఉండే అనుభూతి చెప్పలేనిదైతే.. మొగుడు కొట్టే మొదటి దెబ్బ వర్ణించలేనిది. నీకు అర్థమవ్వాలంటే శ్రీదేవి, చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ పాట వింటే అర్థమవుతుంది” అంది.
“అంత నచ్చిందా?”
“మామూలుగా కాదు, తీన్మార్ డప్పుల సౌండ్.. మోత మోగిపోయింది. ఎలాగైనా మళ్లీ దెబ్బలు తినాలని నేను ఇంకా రెచ్చిపోయాను. కానీ నేను ఎంత రెచ్చగొట్టినా నాలో మార్పు రాకపోయేసరికి.. తను నన్ను కొట్టడం మానేసి, మందు కొట్టడం మొదలుపెట్టాడు. ఇక అంతే నేను ఆడదానిని మర్చిపోయి, బూతుల బయోగ్రఫీలో ఉండే అన్ని బూతులూ అతనిపై వదిలేశా! దాంతో ఒకరోజు సడెన్‌గా మాయమైపోయాడు. అతను ఉన్నప్పుడు ఏనాడూ నాకు బోర్ కొట్టలేదు. మనిషి కళ్ళ ముందు లేకపోయేసరికి నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఒక్కోసారి ఎందుకు బ్రతకాలి, చనిపోదామా అనిపిస్తుంది. నాకు తను కావాలి. తిండి, బంగారం, ఆస్తులు.. ఇంకేమీ వద్దు, తను మాత్రమే కావాలి. నువ్వైనా తనని నాకు వెతికి ఇస్తావా? ప్లీజ్ ప్లీజ్!” అంటూ నా కాళ్లపై పడిపోయింది.
నేను తనని పైకి లేపుతూ, సూటిగా తన కళ్ళల్లోకి చూసి ఒక మాట చెప్పాను: “అరికాలు కింద భూమి దగ్గర నుండి అంతరిక్షం వరకు వెతికినా దొరకని వాడు.. కొన్నిసార్లు మనిషి మనసుల్లో వెతికితే దొరుకుతాడు. కళ్ళు మూసుకుని, తెలియక చేసిన తప్పులకి క్షమాపణలు చెప్పుకుంటూ, ఇకనైనా ఆ మనిషిని తన స్వేచ్ఛతో బ్రతకనిస్తే.. నువ్వు కళ్ళు తెరిచేసరికి నీ కళ్ళ ముందే ఉంటాడు” అని చెప్పి నేను మాయమైపోయాను! -
మృత్యువు తొడిగిన పూలదండ (5)
లావణ్య ప్రాథమిక విచారణ ముగిసిన వెంటనే, CI చంద్రమౌళి ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కానిస్టేబుల్ శ్రీనుని తీసుకుని నేరుగా కొండపై ఉన్న సీధోని రిసార్ట్‌కి బయలుదేరాడు. రిసార్ట్ మేనేజర్ బన్నీ వాస్ క్యాబిన్లోకి అడుగుపెట్టేసరికి వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఏసీ గాలి చల్లగా తగులుతున్నా, టేబుల్ అవతల నిలబడి ఉన్న బన్నీ వాస్ ముఖంలో ఒక రకమైన కంగారు కనిపిస్తోంది.
చంద్రమౌళి చాలా గంభీరంగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.”సిస్టమ్ ఆన్ చెయ్ బన్నీ వాస్. నిన్న రాత్రి 11:15 టైమ్‌స్టాంప్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ ప్లే చెయ్,” చంద్రమౌళి స్వరం గదిలోని ఏసీ చల్లదనాన్ని దాటుకుని పదునుగా వినిపించింది.బన్నీ వాస్ వణుకుతున్న చేతులతో మౌస్ క్లిక్ చేశాడు. కంప్యూటర్ స్క్రీన్ మీద నిన్న రాత్రి రిసార్ట్ వెనుక ఉన్న చీకటి గార్డెన్ తాలూకు విజువల్స్ ప్లే అవ్వడం మొదలయ్యాయి. కారిడార్ నుండి నిశ్శబ్దంగా సర్వీస్ లిఫ్ట్ ఎక్కి కిందకి వచ్చిన లావణ్య, ఆ చీకటి ప్లేస్‌లో నిలబడి ఉండటం స్క్రీన్‌పై కనిపించింది. ఆ తర్వాత సరిగ్గా ఐదు నిమిషాలకి, ఆ చీకట్లోకి ఒక మగమనిషి ప్రవేశించాడు. అతను లావణ్యకు కాస్త దూరంగా వచ్చి నిలబడ్డాడు. ఆ ఏరియాలో వెలుతురు చాలా తక్కువగా ఉండటం వల్ల అతని ముఖం పూర్తిగా బ్లర్‌గా, నల్లటి నీడలా మాత్రమే కనిపిస్తోంది.చంద్రమౌళి టేబుల్ మీద ముందుకు వంగాడు. అతని చూపులు ఆ స్క్రీన్‌ని నిలువునా చీల్చేలా ఉన్నాయి.
“మేనేజర్… సీన్‌ని కొంచెం జూమ్ చెయ్. వాడు నడుచుకుంటూ వస్తున్న ఆ రెండు సెకన్ల విజువల్‌ని పదే పదే రివైండ్ చెయ్,” అన్నాడు చంద్రమౌళి. మేనేజర్ స్క్రీన్‌ని జూమ్ చేసి, ఆ మనిషి నడకను రివైండ్ చేస్తూ ప్లే చేశాడు. చంద్రమౌళి ఆ స్క్రీన్ వైపే చూస్తూ పది నిమిషాల పాటు ఏమీ మాట్లాడకుండా తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతని ఇరవై ఏళ్ల పోలీసు సర్వీసులో ఎంతోమంది పాత నేరస్థుల బాడీ లాంగ్వేజ్‌లను, వాళ్ల నడక తీరును క్లోజ్‌గా గమనించిన అనుభవం ఉంది. ఆ నల్లటి నీడలా ఉన్న మనిషి శరీర ఆకృతి (Body Structure) ని, అతను నడుస్తున్నప్పుడు అతని భుజాలు కదులుతున్న తీరును చంద్రమౌళి చాలా నిశితంగా అబ్జర్వ్ చేశాడు. ఆ మనిషి నడుస్తున్నప్పుడు అతని కుడి భుజం కొద్దిగా వంగి, ఎడమ కాలు స్వల్పంగా వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తోంది.
పది నిమిషాల నిశ్శబ్దం తర్వాత, చంద్రమౌళి ముఖంలో ఒక్కసారిగా ఒక పదునైన పొగరు, ఆ చీకటి మనిషిని పట్టుకున్నాననే నమ్మకం కనిపించాయి. అతను టేబుల్ మీద గట్టిగా చరిచి లేచి నిలబడ్డాడు.”శ్రీనూ! వీడి బాడీ స్ట్రక్చర్ చూడు… ఆ కుడి భుజం వాల్చడం, ఎడమ కాలు కొంచెం లాగుతూ నడుస్తున్న ఆ స్టైల్ చూడు. వీడు మన పాత రికార్డుల్లో ఉన్న కనకరాజు! అవునా కాదా?” అన్నాడు చంద్రమౌళి.
కానిస్టేబుల్ శ్రీను కూడా స్క్రీన్‌ని మరింత దగ్గరగా చూసి, ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. “అవును సార్! వంద శాతం వాడే. చింతపల్లి మండలంలో మెకానిక్, ఎలెక్ట్రానిక్ పనులు చేస్తుంటాడు కదా… ఆ కనకరాజే సార్ వీడు! రౌడీ షీట్ కూడా ఉంది వీడి మీద. గతంలో నాలుగు కేసుల్లో మనం వీడిని అరెస్ట్ చేశాం,” అన్నాడు శ్రీను.
“కచ్చితంగా వాడే,” చంద్రమౌళి కళ్లల్లో పగటి వెలుతురు లాంటి స్పష్టత వచ్చింది. “అర్ధరాత్రి పూట ఈ లగ్జరీ రిసార్ట్ గార్డెన్లో ఈ చింతపల్లి రౌడీ కనకరాజుకి ఏం పని? లావణ్య చెప్పిన ఆ మిస్టరీ మ్యాన్ వీడే అయితే కేస్ సాల్వ్ అయినట్టే. శ్రీనూ… పద, ఒక నిమిషం కూడా ఆలస్యం వద్దు. వాడిని పట్టుకొని నాలుగు తన్నితే నిజాలు అవే బయటికొస్తాయి. ఇప్పుడే చింతపల్లి టౌన్‌కి జీపు పోనివ్వు,” అంటూ చంద్రమౌళి తన గన్ బెల్ట్ సర్దుకుంటూ క్యాబిన్ నుండి బయటికి నడిచాడు.
స్థలం: చింతపల్లి టౌన్, కనకరాజు ఇల్లు.
మధ్యాహ్నం ఎండ విపరీతంగా కాస్తోంది. రిసార్ట్ నుండి దాదాపు గంటన్నర పాటు కొండ దారుల్లో ప్రయాణించి, చంద్రమౌళి మరియు శ్రీను చింతపల్లి టౌన్‌లోని కనకరాజు నివసించే చిన్న ఇరుకైన వీధిలోకి చేరుకున్నారు. కనకరాజు ఇల్లు ఒక పాత పెంకుటిల్లు, దానికి ఒక పెద్ద ఇనుప తాళం వేసి ఉంది. చుట్టుపక్కల వాతావరణం చాలా నిశ్శబ్దంగా, ఏ మనిషీ తిరగనట్టుగా ఉంది.చంద్రమౌళి జీపు దిగి, ఆ పాత ఇంటి తలుపు దగ్గరకు వెళ్లి తాళాన్ని పరిశీలించాడు. తాళం మీద దుమ్ము కొట్టుకుని ఉంది. అతను చుట్టుపక్కల ఇళ్ల వైపు చూస్తున్నప్పుడు, కనకరాజు ఇంటి పక్కనే ఉన్న ఒక పొరుగువ్యక్తి వీధి అరుగు మీద కూర్చుని బీడీ కాలుస్తూ కనిపించాడు.
చంద్రమౌళి అతని వైపు పదునైన చూపులు విసురుతూ నడిచాడు.
“ఏయ్… ఇటు రా. ఈ ఇంట్లో ఉండే కనకరాజు ఎక్కడున్నాడు? ఎప్పటి నుండి తాళం వేసి ఉంది?” చంద్రమౌళి గంభీరంగా అడిగాడు.
ఆ పొరుగువ్యక్తి పోలీసులను చూడగానే కాస్త కంగారుపడి, బీడీ కింద పడేసి చేతులు కట్టుకున్నాడు. “సార్… కనకరాజు ఇంట్లో లేడు సార్. మూడు రోజుల ముందే ఏదో అర్జంట్ పని ఉందని హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పాడు సార్. ఆ రోజే ఇల్లు తాళం వేసి వెళ్లాడు. అప్పటి నుండి ఇటువైపు రాలేదు సార్,” అని చెప్పాడు.
“మూడు రోజుల ముందే హైదరాబాద్ వెళ్లాడా? కచ్చితంగా చెప్పగలవా?” చంద్రమౌళి కళ్లు చిన్నవి చేసి అడిగాడు.”అవును సార్, నేనే చూశాను. బ్యాగ్ పట్టుకుని బస్సు ఎక్కడానికి వెళ్తుంటే అడిగాను కూడా. హైదరాబాద్ లో ఏదో పెద్ద ఎలక్ట్రానిక్ రిపేర్ పని దొరికింది, మంచి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పాడు సార్,” అన్నాడు ఆ పొరుగువ్యక్తి.
చంద్రమౌళి ఒక్క క్షణం తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. రవికుమార్ హత్య జరిగింది మొన్న రాత్రి. కానీ కనకరాజు మూడు రోజుల ముందే హైదరాబాద్ వెళ్లాడని ఇంటి పక్కవాడు సాక్ష్యం చెప్తున్నాడు. అంటే వాడు హైదరాబాద్ వెళ్లినట్టు అందరినీ నమ్మించి, నిన్న రాత్రి రహస్యంగా రిసార్ట్‌కి వచ్చి మర్డర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడా? లేక నిజంగానే హైదరాబాద్ వెళ్లాడా? అని చంద్రమౌళి వేగంగా జీపు వైపు నడిచాడు.
“శ్రీనూ! ఇప్పుడే వైజాగ్ సైబర్ క్రైమ్ టీమ్‌కి ఫోన్ చేయ్. కనకరాజు పాత మొబైల్ నంబర్ ట్రేసింగ్ (Mobile Number Tracing) ఇప్పుడే ఆన్ చేయమను. వాడు నిజంగా హైదరాబాద్ లో ఉన్నాడా, లేక నిన్న రాత్రి వాడి లొకేషన్ ఈ రిసార్ట్ టవర్ పరిధిలో ఉందా అనేది రెండు నిమిషాల్లో నాకు తేలాలి,” అని ఆర్డర్ వేశాడు.స్థలం: హైదరాబాద్, శివార్లలోని ఒక నిర్మానుష్య ప్రాంతం.కనకరాజు మొబైల్ సిగ్నల్స్ హిస్టరీని సైబర్ క్రైమ్ టీమ్ ట్రాక్ చేసినప్పుడు… నిన్న రాత్రి వాడు హైదరాబాద్ లోనే ఉన్నట్టు టవర్ లొకేషన్ చూపించింది. కానీ ఆశ్చర్యకరంగా… గడిచిన కొన్ని గంటలుగా ఆ నంబర్ లొకేషన్ హైదరాబాద్ శివార్లలోని ఒకే ఒక్క నిర్జన ప్రదేశంలో స్థిరంగా ఆగిపోయి ఉంది. దాంతో చంద్రమౌళి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, హైదరాబాద్ లోకల్ పోలీసుల సహాయంతో ఒక ప్రత్యేక టీమ్‌ను తీసుకుని ఆ లొకేషన్ వైపు బయలుదేరాడు.
నగరం దాటి చాలా దూరం వచ్చాక… చుట్టుపక్కల ఎలాంటి ఇళ్లూ లేని ఒక పాత, సగం కూలిపోయిన పాడుబడిన ఇండస్ట్రియల్ బిల్డింగ్ దగ్గర మొబైల్ సిగ్నల్ పాయింట్ చూపిస్తోంది. ఆ ప్రాంతం అంతా చాలా భయంకరంగా, ఎండిపోయిన చెట్లతో, దట్టమైన నిశ్శబ్దంతో ఉంది.చంద్రమౌళి తన గన్ని చేతిలోకి తీసుకుని, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆ పాత బిల్డింగ్ లోపలికి ప్రవేశించాడు. అతని వెనుక శ్రీను, లోకల్ పోలీసులు కూడా గన్స్ పట్టుకుని అప్రమత్తంగా నడుస్తున్నారు. లోపల చీకటిగా, బూజు పట్టి ఉంది. నడుస్తున్నప్పుడు కాలికొడుతున్న ఎండుటాకుల శబ్దం తప్ప మరేమీ వినిపించట్లేదు.సరిగ్గా అప్పుడు… అక్కడ కనిపించిన దృశ్యం చూసి చంద్రమౌళి, శ్రీనుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. ఇద్దరూ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు.అక్కడ నేలపై… కనకరాజు శవమై పడి ఉన్నాడు!
అతని ముఖం అంతా నల్లబడిపోయింది, కనకరాజు ఒంటి నిండా గన్ బుల్లెట్స్ ఉన్నాయి.చంద్రమౌళి ఆ శవం వైపు చూస్తూ అలాగే స్తంభించిపోయాడు. అతని వెన్నులో ఒక చలి వణుకు పుట్టింది.
కేసును సాల్వ్ చేయడానికి దొరికిన ఏకైక కీలకమైన లింక్, ఆ మిస్టరీ మ్యాన్ కనకరాజు… ఇప్పుడు మాట్లాడలేని శవంగా పడి ఉన్నాడు.చంద్రమౌళికి ఏమీ అర్థం కాలేదు. కేసు మళ్లీ పూర్తిగా ఊహించని ఒక క్రూరమైన, చీకటి మలుపు తిరిగింది… -
మౌన ప్రేమ
జావెలిన్ చేతిలో పట్టుకున్నప్పుడు నా మనసు ఎప్పుడూ ఖాలీగా, లక్ష్యంపై పూర్తి ఏకాగ్రతతో ఉంటుంది. కానీ ఆ రోజు, నాకు పక్కనే ఉన్న స్విమ్మింగ్ వైపు నుండి వచ్చిన ఆ కేక విన్నప్పుడు – నా మనసు మొదటిసారి ఏకాగ్రత తప్పింది.”
Gold! Another gold for her!”అనౌన్సర్ గొంతు గాల్లో మారుమోగింది.
నేను తలతిప్పి చూశాను. దూరంగా, పూల్ లో నుండి బయటికి వస్తూ, తడి ఒంటితో, ఒక చేత్తో వీల్‌చైర్ ని పట్టుకుంటూ ఆమె. చుట్టూ కెమెరాలు, ఫ్లాష్‌లు.ఆమెను నేను ఇంతకుముందు చూశాను – మ్యాగజైన్ కవర్ మీద, న్యూస్ ఛానల్స్‌లో. “Inspiration”, “Warrior”, “Champion” – ఇలాంటి పదాలతో ఆమెను వర్ణించేవాళ్ళు. కానీ ఆ ఫోటోల్లో ఉన్న నవ్వు, ఇప్పుడు ఇక్కడ లైవ్‌గా చూసినప్పుడు లేదు. అలసట, ఏదో లోతైన శూన్యం – కళ్ళలో కనిపించింది.
అదే క్షణం, నా గుండె పాత సంకేతాలు గుర్తుచేసుకుంటుంది.ఐదు సంవత్సరాల క్రితం నా ప్రేయసి లాంటి ఆ కళ్ళు, ఆ నవ్వు. అచ్చం ఆమెలాగే ఈమెను చూస్తుంటే ఆమెనే చూస్తున్నట్టు ఉంది. తను ఎప్పుడూ నా పక్కనే ఉండేది, ప్రతి పోటీకి ముందు నా చేయి పట్టుకుని “గెలుపు నీదే” అనేది. ఒక బైక్ యాక్సిడెంట్ లో నేను నా రెండు కాలు కోల్పోయాను. కోమాలోకి వెళ్ళాను. ఎప్పుడూ నా పక్కనే ఉండే తను ఆరు మాసాల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే లేదు. ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. బహుశా నా కొత్త జీవితాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయిందేమో. తన కోసం ఎంతో వెతికాను, ఎందరినో అడిగాను. బహుశా తనకి కూడా భయమేమో.
నేను గెలిస్తే విష్ చేయడానికైనా తను వస్తుందని నా ఈ ప్రయత్నం.ఇప్పుడు, ఈ కొత్త మొహంలో ఆ పాత కళ్ళు కనిపిస్తున్నాయి.
ఆ రోజు రాత్రి, అథ్లెట్స్ విలేజ్ కేఫటేరియాలో ఆమెను రెండో సారి చూశాను. దూరం నుండి చందమామను చూస్తున్నట్టు ఉంది నాకు. తన కోచ్‌తో మాట్లాడుతూ, ఒక అరటిపండు తింటూ ఉంది. చాలా మామూలు మనుషులాగా. టీవీలో కనిపించే “ఛాంపియన్” కాదు ఇక్కడ – సాధారణ స్త్రీ లాగా.
నేను తెలుసుకున్నాను – తను మారేడ్. తనపై రాసిన ఒక ఆర్టికల్ లో చదివాను. ఆమె గురించి మరింత తెలుసుకుంటుంటే నాకే తెలియకుండా ఆమెపై ప్రేమ పెరుగుతుంది. “ప్రేమ పుట్టడానికి ఒక సెకండ్ చాలు” అని ఏ మహానుభావుడు చెప్పాడో కానీ ఆమెను చూసిన కొన్ని సెకండ్లకే నాలో ప్రేమ పుట్టింది. కానీ “నా ప్రేమ చెప్పడానికి ఆమె ఇప్పుడు సింగిల్ కాదు. మరొకరి భార్య.”
ఈ ఒక్క వాక్యం నా మనసులో మళ్ళీ మళ్ళీ తిరిగింది. నేను ప్రేమను తెలపడం ఆపేసుకున్నాను. అంతే. ఇక్కడితో ఆపేసుకోవాలి అనుకున్నాను. ఆదిలో చిగురించి ఆదిలోనే అంతం చేశాను నా ప్రేమను.కానీ మనసు ఆగదు కదా. అది మెదడు చెప్పే ఆజ్ఞలు అసలు వినదు.
రోజులు గడిచాయి. నేను నా ఈవెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను, తనని దూరం నుండి గమనిస్తూనే ఉన్నాను. కేఫటేరియాలో ఒక చిన్న నవ్వు, ఒక చూపు. అందుకోవాలని ఆశగా ఉన్న అందుకోలేని అడ్డుగోడ నా ముందుంది.
ఇలా నాలో ప్రేమ నీటి బుడగలాగా పుడుతుంది.నా జావెలిన్ ఈవెంట్ రోజు వచ్చింది. మొదటి రెండు త్రోలు మనసు ఏకాగ్రత తప్పి తడబడ్డాయి. మూడో త్రో కి సిద్ధం అవుతున్నప్పుడు, స్టాండ్స్ లో ఒక మూలగా ఆమెను చూశాను – తన స్విమ్మింగ్ హీట్స్ మధ్య ఖాలీ టైమ్‌లో వచ్చి కూర్చుంది.
ఆ చూపు నాలో ఏదో కొత్త శక్తి పోసింది.కాలు నొక్కుకుంటూ, శరీరం అంతా ఏకం చేసి, గట్టిగా ఊపిరి పీల్చుకుని విసిరాను. జావెలిన్ గాల్లో సాగి, పోడియం దూరాన్ని దాటి పడింది. స్టేడియం మొత్తం అరిచింది. నా పేరు స్కోర్ బోర్డ్ మీద మొదటి స్థానంలో మెరిసింది. గోల్డ్.ఫలితం ప్రకటించాక, స్టాండ్స్ వైపు చూశాను.
ఆమె లేచి నిలబడి చప్పట్లు కొడుతోంది. ఆ నవ్వు ముఖంలో నిజమైన సంతోషం స్పష్టంగా కనిపించింది – మ్యాగజైన్ కవర్ మీద కనిపించే నవ్వు కాదు అది, నిజమైనది. ఒక్క క్షణం మా చూపులు కలిశాయి. తను నాకోసం చప్పట్లు కొడుతుంది అనే ఆలోచనే నా గుండెల్ని పూర్తిగా ఆవరించింది.ఆ రాత్రి, క్లోజింగ్ వీక్ సందర్భంగా అథ్లెట్స్ కోసం ఏర్పాటు చేసిన పార్టీ. లైట్లు మ్యూజిక్ మధ్య, అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను ఒక మూలగా కూర్చుని డ్రింక్ పట్టుకుని ఉండగా, తను నా పక్కకు వచ్చి కూర్చుంది.
“Congratulations on your gold,” అంది, నవ్వుతూ.”Thank you. మీది కూడా,” అన్నాను.మాటలు మొదలయ్యాయి. ఆటల గురించి, ప్రాక్టీస్ కష్టాల గురించి, ఇద్దరి injury స్టోరీల గురించి. డ్రింక్స్ మెల్లగా మనం కట్టుకున్న గోడల్ని కరిగించాయి. మాటల మధ్యలో, తనే అడిగింది – “మీ కళ్ళలో ఎప్పుడూ ఏదో దూరం కనిపిస్తుంది. ఎందుకు?”
ఆ ప్రశ్న నా గుండెని తట్టింది. నేను నా past గురించి చెప్పడం మొదలుపెట్టాను – యాక్సిడెంట్, కోమా, ఆరు మాసాల తర్వాత ఆమె లేకపోవడం. చెప్తూ చెప్తూ, నా గొంతు వణికింది. “మీ కళ్ళు చూసినప్పుడు… ఆమె కళ్ళే గుర్తొచ్చాయి. మొదటి సారి మిమ్మల్ని చూసినప్పుడు, నేను మిమ్మల్ని చూడలేదు, ఆమెనే చూశాను అనిపించింది.”తను నిశ్శబ్దంగా విన్నది. ఏమీ మాట్లాడలేదు. కళ్ళలో ఆశ్చర్యం, జాలి, మరియు ఏదో వెచ్చదనం కలగలిసిన భావం.”నాకు తెలుసు మీరు మారేడ్ అని,”
నేను కంటిన్యూ చేశాను, గొంతు తగ్గించి. “నేను ఏమీ ఆశించడం లేదు. కానీ ఇది చెప్పకుండా ఉండలేకపోయాను. మీరు నా దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టినప్పుడు, జీవితంలో మొదటిసారి నేను తిరిగి బతికినట్టు అనిపించింది.”
తను కళ్ళు దించుకుంది. చాలా సేపు మౌనం. ఆ మౌనంలోనే నాకు అర్థమైంది – తనకి కూడా ఏదో అనిపిస్తుందని, కానీ చెప్పలేని పరిస్థితి తనది. “నాకు ఇది వినడం… కష్టంగా ఉంది,” అంది మెల్లగా.
“నేను ఏమీ చెప్పలేను మీకు. నా జీవితం ఇప్పటికే నిర్ణయమైపోయింది.”తను లేచి, ఒక్క క్షణం నా వైపు చూసి, మెల్లగా వెళ్ళిపోయింది. వెళ్ళేముందు తన కళ్ళలో కనిపించిన ఆ చివరి చూపు – అది confirmation. తనకి అర్థమైంది. కానీ మార్చలేని satyam ముందు ఇద్దరమూ ఆగిపోయాము.Type your paragraph here
మూడు రోజుల తర్వాత, ఆమె ఫైనల్ మ్యాచ్ రోజు వచ్చింది.రేసు మొదలైంది. వంద మీటర్ల దూరం – ఆమె తన చేతులతో నీటిని పక్కకు నెట్టుకుంటూ చాలా వేగంగా ఈదుకుంటూ ముందుకు వెళ్ళింది. చివరి ఇరవై మీటర్లలో తను అందరికంటే ముందుకు వెళ్ళింది. ఫినిష్ లైన్ టచ్ చేసిన క్షణం – స్టేడియం మొత్తం అరిచింది.ఆమె గెలిచింది.
ఆఖరి గోల్డ్.నేను ఆమె దగ్గరకు వెళ్లాలనుకున్నాను. కానీ అక్కడొక పెద్ద జాతరలా ఉంది. మీడియా వాళ్ళు, కెమెరామెన్లు, కోచ్‌లు, టీమ్ మేట్స్, ఫ్యాన్స్… ఇలా ప్రతి ఒక్కరూ ఆమెను ఒక గోడలా కమ్మేశారు. ఒక్కసారిగా మైకులన్నీ ముందుకు వచ్చాయి. ఫ్లాష్ లైట్ల వెలుతురులో ఆమె చుట్టూ ఉన్న కోలాహలం స్పష్టంగా కనిపించింది.నేను ఆ గుంపు అంచున నిలబడి ఉన్నాను. దగ్గరికి వెళ్ళడానికి దారి లేదు.కానీ ఆమె చూసింది. గుంపు మధ్యలో నుండి, తన కళ్ళు నా వైపు తిరిగాయి.
నేను నోటితో మాత్రమే అన్నాను, చేయి ముందుకు చాచలేకపోయాను – “Congratulations.”అంతే. చేయి కలపలేదు. దూరం తగ్గలేదు. మధ్యలో ప్రెస్, కోచ్‌లు, ఆమె జీవితంలో భాగమైన మనుషులు – వాళ్ళందరూ ఒక అడ్డుగోడలా నిలబడ్డారు, పార్టీ రాత్రి మాటల్లో దాటిన గోడ, ఇప్పుడు తిరిగి నిజ జీవితంలో నిలబడింది.ఆమె తలవంచి ఒక్క క్షణం నా వైపు చూసింది. ఏమీ చెప్పలేని ఆ చూపులోనే అన్నీ చెప్పబడ్డాయి. ఆ తర్వాత గుంపు తనని మళ్ళీ లోపలికి తీసుకుపోయింది. ఇంటర్వ్యూలు, ఫోటోలు, సెలబ్రేషన్.నేను వెనక్కి తిరిగాను.మూడు రోజుల తర్వాత, క్లోజింగ్ సెరిమనీలో, దూరం నుండి ఆమెను ఒకసారి చూశాను. తన భర్త పక్కనే నిలబడి ఉంది, నవ్వుతూ. ఆ నవ్వు నిజమో, అలవాటుగా వేసుకున్న ముసుగో నాకు తెలియదు.తను కూడా నా వైపు ఒకసారి చూసింది. ఒక్క క్షణం. ఆ తర్వాత తలతిప్పుకుంది.ఎయిర్‌పోర్ట్‌లో, వేర్వేరు గేట్ల వైపు నడుస్తూ, ఇద్దరి దేశాలు వేరు, ఇద్దరి ఆటలు వేరు, ఇద్దరి జీవితాలు వేరు – అని గుర్తుచేసుకున్నాను.
కీర్కేగార్డ్ ఒక చోట అంటాడు – నిజమైన బాధని మాటల్లో చెప్పలేమని, అది లోపలే ఉండిపోతుందని. కానీ ఆ రాత్రి పార్టీలో నేను మాటల్లో చెప్పాను. ఆమెకి అర్థమైంది. అయినా మౌనమే మిగిలింది – ఎందుకంటే కొన్ని సత్యాలు చెప్పినా, మార్చలేని పరిస్థితుల ముందు మాటలు కూడా నిస్సహాయమైపోతాయి.
నేను ఇప్పటికీ జావెలిన్ ఎత్తుకుంటాను. ప్రతిసారి, గాల్లోకి దాన్ని విసిరేటప్పుడు, ఒక్క క్షణం ఆ రాత్రి పార్టీలో ఆమె కళ్ళలో కనిపించిన ఆ చివరి చూపు గుర్తొస్తుంది.చెప్పిన ప్రేమ కూడా కొన్నిసార్లు మౌనంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ప్రేమని అర్థం చేసుకోవడం వేరు, దాన్ని జీవించడం వేరు.కొన్ని ప్రేమలు గెలవడానికి పుట్టవు. మౌనంగా జీవించడానికే పుడతాయి.