మృత్యువు తొడిగిన పూలదండ (10)

Written by

in

స్థలం: చింతపల్లి పోలీస్ స్టేషన్, విచారణ గది.

అర్ధరాత్రి రెండు గంటలు దాటుతోంది. సిఐ చంద్రమౌళి, శ్రీను ఇంకా హైదరాబాద్ నుండి స్టేషన్‌కు చేరుకోలేదు. విచారణ గదిలో ఒంటరిగా, దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ కూర్చుని ఉంది లావణ్య. సరిగ్గా అదే సమయంలో… హైకోర్టు ఐడీ కార్డు చూపించి, లేడీ కానిస్టేబుల్ అనుమతితో రమ్య విచారణ గదిలోకి అడుగుపెట్టంది.


“లావణ్యా!” రమ్య గొంతులో ఆందోళన స్పష్టంగా వినిపించింది.తన ఫ్రెండ్‌ని చూడగానే లావణ్య ఒక్కసారిగా లేచి వచ్చి రమ్యను హత్తుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.


“రమ్యా… రవి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు రమ్యా! ఎవరో అతనికి విషమిచ్చి చంపేశారు. కానీ ఈ పోలీసులు నేనే చంపానని నన్ను ఇక్కడ బంధించారు,” అంటూ ఏడవసాగింది.


రమ్య ఆమె కన్నీళ్లు తుడుస్తూ, భుజాలు పట్టుకుని నిలబెట్టింది. “నువ్వు ధైర్యంగా ఉండు లావణ్యా, నీ ఫ్రెండ్ లాయర్ రమ్య ఇక్కడికి వచ్చింది అందుకే. అసలు ఆ రాత్రి ఆ రిసార్ట్‌లో ఏం జరిగిందో ఒక్కటి కూడా దాచకుండా నాకు పిన్ టు పిన్ చెప్పు,” అంది.


లావణ్య వణుకుతున్న గొంతుతో చెప్పడం మొదలుపెట్టింది. “ఆరోజు రాత్రి 11:10 కి రవి నోట్లో నుండి నురుగు రావడం చూసి నేను పిచ్చెక్కిపోయాను రమ్యా. రూమ్ ఇంటర్‌కామ్ పని చేయలేదు. ఆ కంగారులో లాయర్‌వి, నా ప్రాణ స్నేహితురాలివి అయిన నీకే ఫోన్ చేసి సాయం అడుగుదామని కారిడార్‌లోకి వచ్చాను. కానీ ఆ కొండ ప్రాంతంలో రిసార్ట్ వైఫై నెట్‌వర్క్ మాత్రమే పనిచేస్తోంది, మొబైల్ సిగ్నల్స్ లేవు. ఫోన్‌లో కేవలం నెట్‌వర్క్ సెర్చ్ అని వస్తూ కాల్స్ కలవలేదు. దాంతో నేను నెట్‌వర్క్ వెతుక్కుంటూ కింద గార్డెన్‌లోకి వెళ్లాను. అక్కడ చీకట్లో ఒక మనిషి కనిపిస్తే సాయం అడిగాను. వాడు కావాలనే నన్ను తప్పుదోవ పట్టించడానికి ‘ఇక్కడ సిగ్నల్స్ రావు, నేను వెళ్లి మేనేజర్‌ని పిలుస్తా’ అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను తిరిగి రూమ్‌కి వచ్చేసరికి రవి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఆ పోలీసు ఆఫీసర్ చంద్రమౌళి… నేను ఆ చీకటి మనిషిని కలవడానికే కిందకి వెళ్లానని, నాకే ఆ హంతకుడితో సంబంధం ఉందని నన్ను నేరస్థురాలిలా చూస్తున్నాడు రమ్యా!”


లావణ్య చెప్పిన ప్రతి మాటను రమ్య తన లీగల్ మైండ్‌తో నోట్ చేసుకుంది. టెక్నికల్ గా కేసులో ఎక్కడ లూప్‌హోల్ ఉందో ఆమెకు అర్థమైపోయింది. “నువ్వు దేనికీ భయపడకు లావణ్యా, ఆ చంద్రమౌళి ఆటలు నేడు సాగనివ్వను,” అని ధైర్యం చెప్పి విచారణ గది నుండి బయటికి వచ్చింది.


స్థలం: సిఐ చంద్రమౌళి కేబిన్.

సరిగ్గా అదే సమయంలో సిఐ చంద్రమౌళి, శ్రీను జీప్ దిగి తీవ్రమైన కోపంతో స్టేషన్ లోపలికి అడుగుపెట్టారు. ప్రైవేట్ నంబర్‌ను ట్రేస్ చేయనివ్వకుండా ఎస్పీ గారు వేసిన ఆర్డర్ చంద్రమౌళి ఈగోని దెబ్బతీసింది. అతను తన గదిలోకి వెళ్లి కుర్చీలో కూర్చోబోతుండగా… రమ్య తలుపును బలంగా తోసుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. చేతిలో లీగల్ ఫైల్స్ పట్టుకుని పట్టుదలగా నిలబడింది.


“మిస్ రమ్య! ఇది పోలీస్ స్టేషన్. పర్మిషన్ లేకుండా ఇలా సిఐ కేబిన్‌లోకి రావడం…” చంద్రమౌళి గంభీరంగా గొంతు పెంచాడు.

“పర్మిషన్ గురించి మీరు మాట్లాడకండి సిఐ గారు!” రమ్య తన చేతిలోని లీగల్ నోటీసును చంద్రమౌళి టేబుల్ మీద బలంగా విసిరికొట్టింది.”సెక్షన్ 46(4) ఆఫ్ సీఆర్‌పీసీ ప్రకారం… ఒక మహిళను సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు ఏ రకమైన ప్రత్యేక పరిస్థితులు లేకుండా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ అంతగా అరెస్ట్ చేయాల్సి వస్తే ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నుండి రాతపూర్వక అనుమతి ఉండాలి. మీ దగ్గర ఆ ఆర్డర్ కాపీ ఉందా సార్?”


చంద్రమౌళి కుర్చీలోంచి నిదానంగా లేచి నిలబడ్డాడు. ఖాకీ యూనిఫాం పదునైన రంగు అతని కళ్లల్లో ప్రతిబింబించింది. “మిస్ రమ్య, చట్టాలు నాకు నేర్పించకండి. కేసు మర్డర్ మిస్టరీ. నిందితురాలు లావణ్యకు హంతకుడితో సంబంధం ఉందని మాకు బలమైన ఆధారాలు దొరికాయి.అందుకే విచారణ కోసం ఆమెను ఇక్కడికి తీసుకొచ్చాం.”


“విచారణ పేరుతో తీసుకొచ్చి, ఒక అభాగ్యురాలిని నేరస్థురాలి లాగా లాకప్‌లో ఉంచడం ఏ రకమైన న్యాయం సార్?” రమ్య పగటి వెలుతురు లాంటి పదునైన చూపులతో చంద్రమౌళిని కార్నర్ చేసింది. “పెళ్లయిన పంతొమ్మిది రోజులకే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక మహిళను, కనీసం భర్త అంత్యక్రియలకు కూడా వెళ్లనివ్వకుండా ఇక్కడ నిర్బంధించడం చట్టవిరుద్ధం కాదా? ఆమె ఇంకా నిందితురాలే, నేరస్థురాలు కాదు! చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ పొందే హక్కు ఉంది, గౌరవంగా జీవించే హక్కు ఉంది!”


“హక్కుల గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆ రూమ్ నెంబర్ 207 లో పడి ఉన్న రవికుమార్ శవాన్ని చూడండి లాయర్ గారు!”


చంద్రమౌళి టేబుల్ మీద చేతులు గట్టిగా ఆనించి ముందుకు వంగి అరిచాడు. “ఆ రాత్రి 11:15 కి భర్త గదిలో కొట్టుకుంటూ చనిపోతుంటే, ఈమె కారిడార్‌లోకి వచ్చి ఐదు నిమిషాల పాటు ఫోన్ పట్టుకుని తిరిగింది. ఆ తర్వాత కింద గార్డెన్‌లోకి వెళ్లి ఒక చీకటి మనిషిని కలిసింది. ఆ మనిషి ఎవడో కాదు, రవికుమార్‌ను చంపిన అసలైన కిల్లర్! వాడితో ఈమెకు సంబంధం లేకపోతే అర్ధరాత్రి పూట ఆ చీకటి మనిషిని కలవాల్సిన అవసరం ఏంటి? నా ముప్పై ఏళ్ల ఖాకీ సర్వీసులో ఇలాంటి నేరస్థులను ఎంతో మందిని చూశాను!”


“ఆ ఖాకీ రంగు ఇచ్చిన అహంకారంతోనే మీరు కళ్లు మూసుకుని మాట్లాడుతున్నారు చంద్రమౌళి గారు!”రమ్య ఏ మాత్రం తగ్గకుండా చంద్రమౌళి కళ్లల్లోలోకి చూస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది.


“లావణ్య ఆరోజు రాత్రి కారిడార్‌లోకి వచ్చింది సాయం కోసం నా నంబర్‌కే కాల్ చేయడానికి! ఆ కొండ ప్రాంతంలో రిసార్ట్ వైఫై నెట్‌వర్క్ మాత్రమే పనిచేస్తోంది, మొబైల్ సిగ్నల్స్ లేవు. లావణ్య నెట్‌వర్క్ వెతుక్కుంటూ కిందకి వెళ్లినప్పుడు ఆ చీకటి మనిషి కావాలనే ఆమెను తప్పుదోవ పట్టించడానికి ‘సిగ్నల్స్ రావు, మేనేజర్‌ని పిలుస్తా’ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఐదు నిమిషాల గ్యాప్‌లోనే రూమ్ నెంబర్ 207 కిటికీ నుండి కిల్లర్ లోపలికి దూకి రవికుమార్‌కు విషమిచ్చాడు! మీరు తీసిన ఆ సైబర్ క్రైమ్ టవర్ డంప్ రికార్డ్స్‌లోనే లావణ్య నంబర్ కేవలం నెట్‌వర్క్ సెర్చ్ మోడ్‌లో ఉందని తేలిపోయింది కదా! అయినా ఇంకా ఆమెనే నేరస్థురాలు అంటారా?”


రమ్య నోట ‘టవర్ డంప్’ అనే పదం వినబడగానే చంద్రమౌళి ఒక్క క్షణం స్తంభించిపోయాడు. అతని ముఖంలో ఆశ్చర్యంతో పాటు తీవ్రమైన కోపం కదిలింది. సైబర్ క్రైమ్ ఆఫీసర్ తనకు జీప్‌లో ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పిన ఆ రహస్య టవర్ డంప్ డేటా వివరాలు… అప్పుడే స్టేషన్‌కి వచ్చిన ఈ లేడీ లాయర్‌కి ఎలా తెలిశాయి?అవును! లావణ్యే స్వయంగా తనతో రమ్యకు ఫోన్ ట్రై చేశానని చెప్పి ఉంటుంది, దాన్ని బట్టి రమ్య టెలికాం రూల్స్ ప్రకారం టవర్ డంప్ లాజిక్‌ను ఊహించి చంద్రమౌళి ముందే ఆ బాంబు పేల్చింది. ఒక లేడీ లాయర్ తన స్టేషన్‌కి వచ్చి, కేసులోని అసలైన టెక్నికల్ లూప్‌హోల్‌ని పట్టుకుని తన్నే నిలదీసేసరికి చంద్రమౌళి ఈగో దారుణంగా దెబ్బతింది.కానీ చంద్రమౌళికి తెలుసు… ఆ టవర్ డంప్‌లో లావణ్య పక్కనే ఒక ‘ప్రైవేట్ నంబర్’ కూడా యాక్టివ్‌గా ఉంది. ఆ నంబర్ ట్రేస్ చేస్తే అసలైన హంతకుడు ఎవరో తెలుస్తుంది. కానీ ఎస్పీ గారు ఆ నంబర్ జోలికి వెళ్లొద్దని, అందులో చాలా పెద్దవాళ్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆర్డర్ వేశారు. ఆ నిజాన్ని చంద్రమౌళి ఈ నల్లకోటు లాయర్ ముందర ఒప్పుకోలేడు.చంద్రమౌళి తన కోపాన్ని అణచుకుంటూ, కుర్చీలో వెనక్కి ఆని డిక్టేటర్ లాగా నవ్వాడు.


“చాలా బాగా వాదించారు మిస్ రమ్య. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కేవలం నెట్‌వర్క్ రికార్డ్స్ మీదే నడవదు. మాకు ఇంకా చాలా ఆధారాలు కావాలి. లావణ్యను రేపు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేసేవరకు ఆమె మా కస్టడీలోనే ఉంటుంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి!”


రమ్య టేబుల్ మీదున్న తన ఫైల్‌ను చేతిలోకి తీసుకుని, చంద్రమౌళి వైపు తీవ్రమైన చూపులు చూసింది.”రేపు ఉదయం వరకు కూడా లావణ్య మీ కస్టడీలో ఉండదు చంద్రమౌళి గారు! మీ పై అధికారులు పొలిటికల్ ప్రెజర్ వల్ల ఆ టవర్ డంప్‌లోని ప్రైవేట్ నంబర్ ఇన్వెస్టిగేషన్‌ను ఇక్కడితో ఆపేయమని మీకు ఆర్డర్స్ ఇచ్చారనే విషయం నాకు అర్థమైపోయింది. మీరు వ్యవస్థకు లొంగిపోయి హంతకులను కాపాడుతున్నారు! కానీ నేను ఇప్పుడే నేరుగా హైకోర్టు జడ్జి గారి నివాసానికి వెళ్లి ‘హేబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేసి, అర్ధరాత్రి అత్యవసర ఆదేశాలు ద్వారా లావణ్యకు బెయిల్ ఆర్డర్ పట్టుకొస్తాను. అంతకంటే ముందు… ఆ ప్రైవేట్ నంబర్ వివరాలు బయటికి తీయాలని కోర్టు ద్వారా స్పెషల్ ఆర్డర్ తెప్పిస్తాను! అప్పుడు మీ ఖాకీ రంగు చట్టం ముందు సమాధానం చెప్పాల్సి వస్తుంది!”


రమ్య విసిరిన ఆ సవాల్ చంద్రమౌళి గుండెల్లో తూటాలా పేలింది. ఆమె వెనక్కి తిరిగి విసురుగా గది తలుపులు తీసి బయటికి నడిచింది.చంద్రమౌళి చేతిలో ఉన్న పెన్నును కోపంతో టేబుల్ కేసి గట్టిగా కొట్టాడు. ఒకవైపు ఎస్పీ వేసిన ఆర్డర్… మరోవైపు హైకోర్టు లాయర్ రమ్య విసిరిన ఓపెన్ ఛాలెంజ్!

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *