రహస్య కోడలు (1) – తొలి పరిచయం

Written by

in

కిరణ్ లాప్‌టాప్ బ్యాగ్ భుజాన సర్దుకుంటూ, వార్సా ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఖాళీ సీటు వెతుక్కుంటూ నడిచాడు. బయట వర్షం భారీగా పడుతోంది, గ్లాస్ కిటికీల మీద నుండి కారుతున్న నీటి చుక్కలు రన్‌వే లైట్లని విరిచేస్తూ కనిపిస్తున్నాయి.
మూడు రోజుల క్రితం వచ్చిన కాల్ ఇంకా చెవుల్లో మార్మోగుతోంది. “కిరణ్, హైదరాబాద్‌లో ఒక అమ్మాయిని చూశాను నీకు. మంచి ఫ్యామిలీ, బాగా చదువుకుంది. అమ్మాయి డీటెయిల్స్ వాట్సాప్ చేశాను, చూసావు కదా! ఈసారి వెళ్ళి కలువు, ఇంకా వాయిదా వేయద్దు.” అని అమ్మ సరోజ.

అమ్మ గొంతులో ఉన్న ఆత్రుత కిరణ్‌కి తెలియనిది కాదు. తండ్రి పోయిన దగ్గర్నుండి సరోజకి కిరణ్ పెళ్ళి చేసుకోవడం ఒక్కటే కోరిక మిగిలింది. మిగతా జీవితం అంతా ఆమె అతని చుట్టూనే తిప్పుకుంది. ఆ కోరికని కాదనడం కిరణ్‌కి ఎప్పుడూ కష్టమే, చిన్నప్పటి నుండి అదే అలవాటు. అమ్మ మాట జవదాటకపోవడం, తన సొంత ఇష్టాలని నిశ్శబ్దంగా వెనక్కి నెట్టేయడం.

ఫోన్‌లో ఆ అమ్మాయి ఫోటో మళ్ళీ ఒకసారి చూశాడు. ప్రొఫైల్ చదివాడు – బాగానే ఉంది, తగినట్టే ఉంది కూడా. కానీ లోపల ఏమీ కదల్లేదు. ఆఫీస్‌లో మూడు రోజుల లీవ్ పెట్టుకుని, ఈ ఒక్క పని కోసం ఇంత దూరం ప్రయాణం. తనకి కావాలని కాదు, అమ్మకి కావాలని.

తలెత్తి డిస్‌ప్లే బోర్డ్ వైపు చూశాడు. “DELAYED” అని రెడ్ లెటర్స్‌లో మెరుస్తోంది క్రాకో నుండి వచ్చే ఫ్లైట్ పక్కన కూడా, హైదరాబాద్ ఫ్లైట్ పక్కన కూడా. వర్షం మొత్తం షెడ్యూల్‌ని దెబ్బతీసేసింది.

నిట్టూర్చి, పక్కనే ఖాళీగా ఉన్న సీట్‌లో కూర్చున్నాడు. ఫోన్ జేబులో పెట్టేసుకుని, కళ్ళు మూసుకుని కాసేపు రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాడు. కానీ కొన్ని నిమిషాల్లోనే పక్కన ఎవరో కూర్చున్న అలికిడి అయింది, సూట్‌కేస్ చక్రాలు నేల మీద కర్రుమని శబ్దం చేస్తూ.
కళ్ళు తెరిచి పక్కకి చూశాడు – ఒక అమ్మాయి, పెద్ద సూట్‌కేస్ పక్కన నిలబెట్టి, అలసిపోయిన మొహంతో కూర్చుంది. చేతిలో పేపర్ కప్‌లో కాఫీ, కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న నిద్రలేమి, ఏదో ఆలోచనల్లో మునిగిపోయినట్టు దూరంగా చూస్తోంది.

కాసేపు ఇద్దరూ మౌనంగా, ఎవరి లోకంలో వాళ్ళు ఉండిపోయారు. మళ్ళీ డిస్‌ప్లే బోర్డ్ మీద అనౌన్స్‌మెంట్ వచ్చింది – “Flight to Krakow delayed by additional one hour.” ఆమె ఫ్లైట్ అని అర్థమైంది కిరణ్‌కి, ఆమె రియాక్షన్ చూసి.

ఆమె చిరాకుగా కళ్ళు మూసుకుని నిట్టూర్చింది, తలని సీట్ వెనక్కి ఆనించి తనలో తానే గొణుక్కుంది, తెలుగులో. “ఛీ, ఈ వర్షం ఎప్పటికి ఆగుతుందో ఏంటో. ఇలాగే ఉంటే రేపు కూడా వెళ్ళలేను.”

కిరణ్ ఒక్కసారి తలతిప్పి చూశాడు, ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని. “మీరు తెలుగా?” అడిగాడు, గొంతులో దాచుకోలేని కుతూహలంతో.

ఆమె కూడా ఆశ్చర్యంగా అతని వైపు తిరిగింది. “అవును! మీరు కూడానా?” మొహంలో అప్పటిదాకా ఉన్న అలసట కొంచెం తగ్గి, స్వచ్ఛమైన నవ్వు వచ్చింది మొదటిసారి.

“అవును, హైదరాబాద్ వాడిని. ఇక్కడ, ఈ ఫారిన్ ఎయిర్‌పోర్ట్‌లో, మధ్యరాత్రి వేళ తెలుగు వినిపిస్తుందని అస్సలు అనుకోలేదు,” అన్నాడు కిరణ్ నవ్వుతూ, తనలో ఉన్న ఒత్తిడి కాస్త తేలికపడినట్టు అనిపించింది.

“నిజమే, నేనూ అలానే ఫీలవుతున్నా. ఇక్కడ ఇండియన్స్ కనిపించినా, తెలుగు వాళ్ళు దొరకడం చాలా రేర్. యూరప్‌లో ఎక్కువగా హిందీ లేదా మలయాళం వినిపిస్తుంది, తెలుగు కాదు,” అంది అనూష, గొంతులో ఇప్పుడు ఒక సాన్నిహిత్యం, కాసేపటి క్రితం ఉన్న అపరిచితులు అనే భావన ఇప్పుడు పూర్తిగా మాయమైపోయింది.

“మీ పేరు?” అడిగాడు కిరణ్.

“అనూష. మీది?”

“కిరణ్. ఎక్కడికి ప్రయాణం మీది, అనూష గారు?”

“గారు వద్దండి, పెద్దదాన్ని కాదు నేను,” నవ్వుతూ అంది. “విజయవాడ. క్రాకోలో ఉంటున్నా, అక్కడ్నుండి బయలుదేరాను.”

“నాది హైదరాబాద్,” అన్నాడు కిరణ్, ఫ్యామిలీ పని విషయం జాగ్రత్తగా దాచిపెడుతూ. “క్రాకోలో ఏం చేస్తున్నారు?”

“IT job,” అంది అనూష చిన్నగా, కొంచెం తడబడుతూ – పూర్తి నిజం కాకపోయినా, పచ్చి అబద్ధం కూడా కాదు. వెంటనే టాపిక్ మార్చాలని అనుకుంది. “మీరు?”

“లండన్‌లో లాజిస్టిక్స్ కంపెనీలో పని చేస్తున్నా. పోలండ్-UK బోర్డర్ ఆపరేషన్స్ చూసుకుంటా, అందుకే తరచూ ఇలా ట్రావెల్ చేస్తుంటా,” చెప్పాడు కిరణ్.

అలా మొదలైంది సంభాషణ – మొదట్లో మార్నింగ్ కాఫీ లాంటి మాటలు, ఫ్లైట్ డిలే కంప్లైంట్స్ గురించి, ఎయిర్‌పోర్ట్ ఫుడ్ ఎంత ఖరీదో అనే చిట్ చాట్ తో.నెమ్మదిగా, గంటలు ఒకదాని తర్వాత ఒకటి గడుస్తున్న కొద్దీ, మాటలు ఇంకొంచెం లోతుగా మారాయి. ఇద్దరూ చిన్నప్పటి ఊహలు, కాలేజీ రోజుల సంగతులు, ఫారిన్‌కి రావడం వెనుక ఉన్న కారణాలు పంచుకున్నారు.

మూడు గంటలు గడిచాక, రెండో కాఫీ కప్పు తాగుతూ, అనూష కొంచెం మెత్తబడింది. కిటికీ బయట ఇంకా కురుస్తున్న వర్షం వైపు చూస్తూ, “నిజం చెప్పాలంటే, ఇంటికి వెళ్తున్నది అసలు కారణం వేరు, గొంతులో బరువు స్పష్టంగా తెలుస్తోంది. “నాన్నకి ఆరోగ్యం సరిగా లేదు.” అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేదు అప్పుడే – ఒక అపరిచితుడితో అంత లోతుగా షేర్ చేయడం తనకే కొత్తగా అనిపించింది.

కిరణ్ వెంటనే ఏమీ అడగలేదు, తొందరపడలేదు. కాసేపు మౌనంగా ఉండి, “అర్థమవుతుంది. కుటుంబం విషయంలో ఇలాంటివి ఎప్పుడూ కష్టమే,” అన్నంతే చెప్పాడు, ఖాళీ సానుభూతి మాటలు లేకుండా, అతి వాగడం చేయకుండా.
ఆ చిన్న మర్యాద, అనవసరంగా ప్రశ్నలు అడగకపోవడం – అనూషకి ఎందుకో నచ్చింది.
బహుశా తనకి పరిచయమైన అబ్బాయిలు కిరణ్ లా లేకవడం వల్లేమో!చాలామంది ఇలాంటప్పుడు వెంటనే “ఏమైంది? ఎంత సీరియస్?” అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కిరణ్ అలా చేయలేదు. ఇద్దరి మధ్య ఒక చిన్న నిశ్శబ్దం ఏర్పడింది, ఇబ్బందిగా అనిపించని మౌనం.

చివరికి, గంటన్నర తర్వాత, కిరణ్ ఫ్లైట్ ముందుగా అనౌన్స్ అయింది. అతను లేచి నిలబడుతూ, బ్యాగ్ భుజాన వేసుకుని అనూష వైపు తిరిగాడు. “నా టర్న్ వచ్చేసింది. మీ నాన్నగారు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా,” అన్నాడు, గొంతులో నిజాయితీ.

“థాంక్స్ కిరణ్. సేఫ్ జర్నీ, మీ పనీ బాగా జరగాలి,” అంది అనూష, చిన్నగా నవ్వుతూ.

కిరణ్ వెళ్ళిపోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె ఇంకా కిటికీ బయటకి చూస్తూ కూర్చుంది, వర్షంలో తడుస్తున్న రన్‌వే వైపు, ఏదో ఆలోచనల్లో మునిగిపోయి.

బోర్డింగ్ గేట్ వైపు నడుస్తూ, కిరణ్ మనసులో ఒక వింత ఆలోచన మెదిలింది – కొన్ని గంటల క్రితం అస్సలు తెలియని ఈ అమ్మాయితో, ఇప్పుడు తను కలవబోయే సంబంధం అమ్మాయి కంటే ఎక్కువ ఈజీగా మాట్లాడగలిగాడు. కానీ ఆ ఆలోచనని పక్కన పెట్టేసి, తనని తాను సముదాయించుకున్నాడు – ఇది కేవలం ఒక ఫ్లైట్ డిలే లో పరిచయం, అంతకుమించి పులిహోర కలపాలని కాదు అని.

అతనికి తెలియదు, ఈ యాదృచ్ఛిక కలయిక ముందు ముందు ఎన్ని మలుపులు తిప్పబోతుందో.

వెయిటింగ్ ఫర్ 3rd పార్ట్.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *