మృత్యువు తొడిగిన పూలదండ (8)

Written by

in

స్థలం: లోకల్ రైల్వే స్టేషన్, పబ్లిక్ రెస్ట్ రూమ్.​

రెస్ట్ రూమ్ లోపల మసక వెలుతురులో ట్యాప్ నుండి నీళ్లు కారుతున్న చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. నేలపై తల పగిలి, రక్తం మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు సీధోని రిసార్ట్ వెయిటర్. అతని పక్కనే రక్తం అంటిన ఆ బరువైన ఇనుప రాడ్ పడి ఉంది.​


వెయిటర్ వెనక నుండి వచ్చి క్రూరంగా కొట్టిన ఆ గుర్తుతెలియని వ్యక్తి నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆ మసక వెలుతురులో అతని ముఖం స్పష్టంగా కనిపించింది… అతను మరెవరో కాదు, రిసార్ట్ మేనేజర్ బన్నీ వాస్!​బన్నీ వాస్ చేతులకు గ్లౌజెస్ ఉన్నాయి. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ భయం, కంగారు ఇప్పుడు లేవు; ఒక పక్కా నేరస్థుడి క్రూరత్వం ఉంది. వాడు జేబులోంచి రుమాలు తీసి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు.


భూపతి రెడ్డి ఫామ్‌హౌస్ నుండి గంగూభాయ్ బయలుదేరినప్పటి నుండి వాడు రైల్వే స్టేషన్ లోనే నిఘా పెట్టాడు. వెయిటర్ గంగూభాయ్‌ని చూసి పోలీసులకు ఫోన్ చేయడం, సిగ్నల్ లేక కట్ అవ్వడం అంతా బన్నీ వాస్ గమనించాడు. వాడు మెల్లగా వంగి, వెయిటర్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్‌ని తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత రెస్ట్ రూమ్ తలుపు తీసి, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం చూసి నిశ్శబ్దంగా చీకట్లోకి మాయమైపోయాడు. గంగూభాయ్ ఎక్కిన రైలు అప్పటికే స్టేషన్ దాటి చాలా దూరం వెళ్ళిపోయింది.​


స్థలం: పోలీస్ స్టేషన్, లాకప్/విచారణ గది.​

అదే అర్ధరాత్రి వేళ… విచారణ గదిలోని సన్నటి కిటికీ గుండా బయట ఉన్న చీకటి ఆకాశం కనిపిస్తోంది. కుర్చీలో తల వెనక్కి ఆనించి కూర్చుని ఉంది లావణ్య. ఆమె కళ్లు అలసటతో ఉన్నాయి, కానీ మనసు మాత్రం కొద్ది నెలల క్రితం జరిగిన తన మధురమైన జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది.​అది వాళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగిన కొత్త రోజులు. లావణ్య అప్పుడు విజయనగరం రోడ్‌లో ఉన్న “శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్” లో టీచర్‌గా పని చేస్తోంది.


ఒకరోజు మధ్యాహ్నం స్కూల్ బెల్ అవ్వగానే గేట్ దాటి బయటికి వస్తున్న లావణ్యకు… గేట్ అవతల తన లగ్జరీ కార్ ఆనించి రవి నిలబడి కనిపించాడు. వందం కోట్ల బిజినెస్ హడావిడిలో ఉండే రవి, తన కోసం అంత దూరం కార్ డ్రైవ్ చేసుకుని రావడం ఆమెకు పెద్ద ఆశ్చర్యం.​

“ఏంటి రవి గారు.. ఇక్కడికి వచ్చారు?” అని లావణ్య కంగారుగా అడిగాంది.

రవి తన ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ నిశ్శబ్దమైన, మెచ్యూర్డ్ నవ్వు నవ్వాడు.​”బిజినెస్ మీటింగ్‌లు ఎప్పుడూ ఉండేవే లావణ్య. కానీ నీ క్లాస్ అయిపోయాక నీ ముఖంలో వచ్చే ఆ అలసటను చూసి, నిన్ను బయటికి తీసుకెళ్లడం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు,” అన్నాడు.​

ఆరోజు రవి ఆమెను సిటీకి దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన కాఫీ షాప్‌కి తీసుకెళ్లాడు. అక్కడ రవి చూపించిన ప్రేమలో ఎలాంటి ఆడంబరాలూ లేవు; ఒక లోతైన నిలకడ, గౌరవం ఉన్నాయి.

“లావణ్య, బిజినెస్ ప్రపంచం చాలా క్రూరమైనది. అక్కడ రోజూ వందల మంది ముసుగులు వేసుకున్న మనుషులను చూసి నా మనసు విసిగిపోతుంది. కానీ నీ పక్కన కూర్చుంటే, నీ ఆ సాదాసీదా మాటలు వింటుంటే… నా మనసుకు ఎక్కడో లేని ప్రశాంతత దొరుకుతుంది. నీ ప్రశాంతతే నా లైఫ్ ఇన్సూరెన్స్” అని రవి ఆమె కళ్లల్లోకి చూస్తూ చాలా మెచ్యూర్డ్‌గా చెప్పిన మాటలు ఆమెను పూర్తిగా ఇంప్రెస్ చేశాయి.


అలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని తను జీవితాంతం హత్తుకుందాం అనుకుంది.​కానీ… ఆ మెచ్యూర్డ్ ప్రేమను, ఆ ప్రశాంతతను పెళ్లయిన పంతొమ్మిది రోజులకే కాలం తన నుండి శాశ్వతంగా లాగేసుకుంది. రవిని కోల్పోయి, ఇప్పుడు ఈ చీకటి పోలీస్ స్టేషన్‌లో ఒంటరిగా నిలబడాల్సి వచ్చింది. లావణ్య కళ్లల్లోంచి ఒక వేడి కన్నీటి చుక్క నిశ్శబ్దంగా జారి కింద పడింది. కానీ ఆ కన్నీటి వెనక భయం లేదు; రవి చూపించిన ఆ ప్యూర్ లవ్ ఇచ్చిన మొండి ధైర్యం ఉంది. తన భర్తను చంపిన ఆ నల్లటి నీడను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా ఆమె చూపుల్లో పట్టుదల స్థిరపడింది.​

స్థలం: చింతపల్లి రోడ్– పోలీస్ జీప్.​

సరిగ్గా అదే సమయంలో… చంద్రమౌళి ప్రయాణిస్తున్న పోలీస్ జీప్ చింతపల్లి టౌన్ సరిహద్దుల్లోకి ప్రవేశించింది. చంద్రమౌళి చేతిలో ఉన్న మొబైల్ వైబ్రేట్ అయింది. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్ (CCIC) ఆఫీసర్ నుండి చంద్రమౌళికి ఫోన్ వచ్చింది. చంద్రమౌళి కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు.​”చెప్పండి ఆఫీసర్, టవర్ డంప్ డేటా ఏమైంది?” చంద్రమౌళి పదునుగా అడిగాడు.​


“సార్, నేను సిస్టమ్ ముందు కూర్చుని డేటా మొత్తం ఫిల్టర్ చేశాను. నిన్న రాత్రి 11:10 నుండి 11:20 మధ్య… లావణ్య రిసార్ట్ గార్డెన్‌లో ఉన్న ఆ ఐదు నిమిషాల వ్యవధిలో, ఆమె చుట్టుపక్కల రేడియస్‌లో యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్ల లిస్ట్ మీ వాట్సాప్‌కి పంపాను. అందులో చాలా నంబర్లు రిసార్ట్ స్టాఫ్ వి, లోకల్ టూరిస్టులవి ఉన్నాయి. కానీ సార్… ఒక నిర్దిష్టమైన నంబర్ దగ్గర కసస్టమర్ పేరు ఉండాల్సిన చోట ‘RESTRICTED / PRIVATE NUMBER’ అని చూపిస్తోంది. దాని ఐడెంటిటీని టెలికాం ఆపరేటర్ సిస్టమ్ దాచిపెట్టింది. ఈ నంబరే ఆ చీకటి మనిషిది కావచ్చు సార్!” అని సైబర్ క్రైమ్ ఆఫీసర్ అవతలి నుండి చెప్పాడు.​


“దొరికాడు శ్రీనూ! ఆ ప్రైవేట్ నంబరే ఆ చీకటి మనిషిది,” చంద్రమౌళి పక్కనున్న కానిస్టేబుల్ వైపు చూస్తూ గంభీరంగా అన్నాడు.​ కానీ చంద్రమౌళికి తెలుసు… టెలికాం రూల్స్ ప్రకారం ఇలాంటి ప్రైవేట్ నంబర్ల కాల్ డేటా రికార్డ్స్ (CDR) గానీ, కస్టమర్ వివరాలు గానీ ఓపెన్ చేయాలంటే జిల్లా ఎస్పీ డిజిటల్ సంతకంతో కూడిన అఫీషియల్ లెటర్ సబ్మిట్ చేయాలి. పైగా ఇలాంటి నంబర్లు హై-ప్రొఫైల్ నెట్‌వర్క్‌లో మాత్రమే ఉంటాయి.​


చంద్రమౌళి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ కలపమన్నాడు. రింగ్ వెళ్తోంది… ఎస్పీ ఫోన్ ఎత్తారు.​”హలో, గుడ్ ఈవెనింగ్ ఎస్పీ సార్… నేను చింతపల్లి CI చంద్రమౌళిని. రవికుమార్ మర్డర్ కేసులో ఒక కీలకమైన ప్రైవేట్ నంబర్ టవర్ డంప్‌లో దొరింది సార్. దాన్ని అర్జంట్‌గా ట్రేస్ చేయడానికి మీ డిజిటల్ పర్మిషన్ లెటర్ కావాలి సార్…” చంద్రమౌళి అడిగాడు.​


అవతలి నుండి ఎస్పీ గొంతు చాలా సీరియస్‌గా, నిశ్శబ్దంగా వినిపించింది.​”చంద్రమౌళి… నువ్వు ఏ నంబర్ గురించి మాట్లాడుతున్నావో నాకు తెలుసు. ఇప్పుడే పైనుండి విపరీతమైన ప్రెజర్ వచ్చింది. ఇందులో చాలా పెద్దవాళ్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు! ఆ నంబర్ జోలికి నువ్వు వెళ్లడానికి వీల్లేదు. ప్రస్తుతానికి ఆ ట్రేసింగ్ ప్రాసెస్‌ని అక్కడితో హోల్డ్‌లో పెట్టు. దట్స్ మై ఆర్డర్!”​ఎస్పీ మాట ముగియగానే ఫోన్ కట్ అయింది.

చంద్రమౌళి చేతిలో ఫోన్ అలాగే ఉండిపోయింది. అతని ముఖం కోపంతో, ఆశ్చర్యంతో ఎర్రబడింది.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *