రహస్య కోడలు (భాగం 4)

Written by

in

ప్రేమను తెలిపే క్షణం

కిరణ్ మనసులో ఒక కొత్త ఆలోచన మొలకెత్తుతోంది – దాన్ని తనే ఇంకా నమ్మలేకపోతున్నాడు.
ప్రియ విషయం తేలిపోయాక, సరోజ నిరాశపడకుండా వెంటనే ఇంకో సంబంధం వెతకడం మొదలుపెట్టింది. “బాబు, ఈసారి నీకు సరిపడే అమ్మాయిని చూస్తాను, మీ మేనమామ చెప్పిన సంబంధం ఒకటుంది, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఫోటో పంపిస్తా అన్నాడు, పంపాడా?.”
కిరణ్ ఫోన్‌లో మేనమామ పంపిన ఫోటో చూసి, పైకి తలూపాడు కానీ లోపల ఏమీ స్పందించలేదు. “సరే అమ్మా, నాకు కొంచెం టైమ్ కావాలి,” అన్నాడు, ఎప్పటిలానే.

కానీ ఆ రాత్రి, తను ఆలోచిస్తుంది మేనమామ చూపించిన అమ్మాయి కోసం కాదు – అనూష మెసేజ్ కోసం.

గత రెండు వారాలుగా వాళ్ళ మధ్య సంభాషణ ఒక రొటీన్ గా మారింది. ఉదయం “గుడ్ మార్నింగ్” తో మొదలై, రాత్రి “గుడ్ నైట్” తో ముగిసేది. మధ్యలో చిన్న చిన్న విషయాలు – ఆమె తండ్రి ఆరోగ్యం, అతని వర్క్ షెడ్యూల్, ఇద్దరూ చూసిన సినిమాలు, ఇష్టమైన పాటలు, ఇలా.

ఒక రాత్రి, అనూష ఒక వాయిస్ మెసేజ్ పంపింది. “సారీ, మెసేజ్ చేయడానికి చాలా బద్ధకంగా ఉంది ఇవాళ. నాన్నని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను, డయాలసిస్ కోసం. అలసిపోయాను.”
కిరణ్ వెంటనే కాల్ చేశాడు, టెక్స్ట్ కాకుండా. “బాగున్నారా మీరు?”

“అలసిపోయాను, కానీ పర్వాలేదు,” అంది అనూష, గొంతులో అలసట స్పష్టంగా. “నాన్న డయాలసిస్ చూస్తుంటే బాధగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండేవారు, ఇప్పుడు నా మీద ఆధారపడాల్సి రావడం ఆయనకి కూడా కష్టంగా ఉంది.”

“మీరు ఒక్కరే అంతా చూసుకుంటున్నారా? మీ అమ్మగారు హెల్ప్ చేయట్లేదా?” అడిగాడు కిరణ్.

“అమ్మ చేస్తుంది, కానీ అమ్మకి కూడా వయసు అవుతోంది కదా. నేను క్రాకోలో ఉన్నప్పుడు దూరం నుండి చూస్తూ గిల్ట్ ఫీలయ్యేదాన్ని. ఇప్పుడు దగ్గరుండి చూసుకుంటున్నా అనే సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ…” ఆమె ఆగింది.

“కానీ?”

“కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది, నా సొంత లైఫ్ ఏమైంది అని. క్రాకోలో కష్టపడి కట్టుకున్నదంతా ఇక్కడ ఆగిపోయినట్టు ఉంది,” నిజాయితీగా చెప్పింది, ఇంతకుముందు ఎవరితోనూ చెప్పని మాట ఇది.

కిరణ్ కాసేపు మౌనంగా విన్నాడు, తర్వాత మెల్లగా చెప్పాడు. “నాకు తెలుసు ఆ ఫీలింగ్ కొంతవరకు. నేను కూడా అమ్మ కోసం నా ఇష్టాలని ఎప్పుడూ పక్కన పెడుతూనే ఉంటాను. కానీ మీరు చేస్తున్నది గొప్ప విషయం అనూష. మీ నాన్నగారికి ఈ టైంలో మీరు దగ్గర ఉండటం, ఆయనకి అదే పెద్ద ధైర్యం.”

అనూష కొద్దిసేపు మాట్లాడలేదు. “థాంక్స్ కిరణ్. ఇలా చెప్పే వాళ్ళు తక్కువ, ఎక్కువమంది ‘ఇంతకీ పెళ్ళి ఎప్పుడు’ అనే అడుగుతారు నాన్న బాగోలేకపోయినా.”

కిరణ్‌కి ఆ మాటలో ఏదో నొప్పి తెలిసింది. “మీకు కూడా అలా అడిగేవాళ్ళు ఉన్నారా?”

“బంధువులు కొందరు. ‘ఇన్ని సంవత్సరాలు ఫారిన్‌లో ఉండి ఏం సాధించావు, ఇప్పటికైనా పెళ్లి చేసుకో’ అని. వాళ్ళ మాటలకి నాకు కోపం రాదు, కానీ బాధగా ఉంటుంది. నా స్ట్రగుల్ వాళ్ళకి కనిపించదు, కేవలం ‘పెళ్ళి కాలేదు’ అనేది మాత్రమే కనిపిస్తుంది,” అంది అనూష, గొంతులో అలసట, కొంచెం బాధగా.

ఆ సంభాషణ కిరణ్ మనసులో ఏదో కదిలించింది. ఫోన్ పెట్టేశాక కూడా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎప్పుడో మధ్యరాత్రికి నిద్రపోయాడు.

మర్నాడు ఉదయం, సరోజ కిరణ్ కు బ్రేక్ ఫాస్ట్ పెడుతూ, మళ్ళీ బెంగళూరు సంబంధం గురించి అడిగింది. “బాబు, ఆ అమ్మాయి ఫ్యామిలీ మనలని కలవాలని చూస్తున్నారు. ఎప్పుడు కలుద్దాం చెప్పు.”

కిరణ్ ఒక్క క్షణం ఆగి, తర్వాత మెల్లగా చెప్పాడు. “అమ్మా, నాకు ఒక విషయం చెప్పాలి.”

సరోజ కొడుకు మొహం చూసి కొంచెం ఆందోళనగా అడిగింది. “ఏంటి బాబు?”

“నేను ఒక అమ్మాయిని కలిశాను, వార్సా ఎయిర్‌పోర్ట్‌లో, ఫ్లైట్ డిలే అయినప్పుడు. మేము అప్పటినుండి మాట్లాడుకుంటున్నాం.”

సరోజ మొహంలో మిశ్రమ భావాలు – ఆశ్చర్యం, కొంచెం ఆందోళన. “ఎవరు ఆ అమ్మాయి? ఏం చేస్తుంది?” అని అడిగింది.

“పేరు అనూష. క్రాకోలో ఉంటుంది, IT job చేస్తుంది. ప్రస్తుతం విజయవాడలో ఉంది, నాన్నగారికి ఆరోగ్యం బాలేక వచ్చింది.”

“విజయవాడా?” సరోజ కొంచెం ఆలోచనలో పడింది. “ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నీకు ఎంతవరకు తెలుసు ఆమె గురించి?”

కిరణ్‌కి ఆ ప్రశ్న ఎక్స్పెక్టెడ్ అనిపించింది, కానీ కొంచెం నొప్పి కూడా అనిపించింది. “అమ్మా, నాకు ఆమె గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియకపోవచ్చు, కానీ ఆమెతో మాట్లాడినప్పుడు ఒక బంధంగా ఫీలయ్యాను. ప్రియతో అలా అనిపించలేదు నాకు.”

సరోజ నిట్టూర్చింది, కొడుకు మొహంలో కొత్త తేజస్సు చూస్తూ. “నాన్నా, ఫ్లైట్‌లో కలిసిన అమ్మాయితో ఇలా ప్రేమలో పడిపోవడం, కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం. మనకి ఆ అమ్మాయి గురించి ఏమి తెలియదు.”

“తెలుసు అమ్మా, అందుకే నేను ఆమెని కలవాలనుకుంటున్నా, డైరెక్ట్‌గా. విజయవాడ వెళ్ళి, ఆమె ఫ్యామిలీని కలిసి, అన్నీ సరిగ్గా తెలుసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటున్నా.”

సరోజ కొడుకు వైపు తీక్షణంగా చూసింది – ఇదే మొదటిసారి కిరణ్ ఇంత నిర్ణయాత్మకంగా మాట్లాడటం, తన అభిప్రాయం కోసం ఇంతగా వాదించడం. లోపల ఏదో గర్వం, ఏదో ఆందోళన కలగలిపి అనిపించింది.

“సరే నాన్నా,” అంది చివరికి, నెమ్మదిగా. “కానీ జాగ్రత్తగా ఉండు. నాకు తెలియని ఫ్యామిలీలోకి నా కొడుకుని పంపించాలంటే భయం వేస్తుంది.”

కిరణ్ అమ్మ చేయి పట్టుకున్నాడు. “నమ్మకం ఉంచు అమ్మా. నేను తప్పు నిర్ణయం తీసుకోను.”

ఆ రాత్రి, కిరణ్ అనూషకి మెసేజ్ పెట్టాడు: “అనూష, నేను విజయవాడ రావాలని అనుకుంటున్నా. మిమ్మల్ని, మీ ఫ్యామిలీని కలవాలని ఉంది.”

కొన్ని నిమిషాల మౌనం తర్వాత రిప్లై వచ్చింది: “నువ్వు రావడం సంతోషం! కానీ ఎందుకు?”

ఆ సంభాషణలో ‘ ఎందుకు’ అనే మాట కిరణ్ మనసులో ఏదో కదిలించింది. ఫోన్ పెట్టేశాక కూడా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు.
మర్నాడు రాత్రి, కిరణ్ మెసేజ్ టైప్ చేసి, డిలీట్ చేసి, మళ్ళీ టైప్ చేశాడు – ఇలా నాలుగుసార్లు. చేతులు కొంచెం చెమటపట్టాయి కూడా, ఇంత చిన్న విషయానికి ఇంత టెన్షన్ ఎందుకో అనుకుంటూనే. చివరికి, ఆలోచించకుండా టైప్ చేసి పంపేశాడు, ఈసారి కూడా పంపకుండా ఆగితే ధైర్యం పోతుందని:
అనూష, ఇది ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు, కానీ చెప్పకపోతే మనసు వినట్లేదు. ఆరోజు ఎయిర్పోర్ట్ లో నిన్ను చూసినప్పుడే నాకు నీపై ప్రేమ కలిగింది… లవ్ ఎట్ ఫస్ట్సైట్ పై నీకు అనుమానం ఉంటే… అబ్బాయిలు ప్రేమించడానికి ఒక్క సెకండ్ చాలు అని ఒక మహానుభావుడు ఎప్పుడో అన్నాడు. కొందరుంటారు ఒక్క సెకండ్ లో ప్రేమిస్తారూ, మరో క్షణం దాటితే ఆ ప్రేమనే మర్చిపోతారూ. వీళ్ళని చూసి నీకు అనుమానం కలగొచ్చు కానీ నేను ఆ రకం కాదు. ప్రేమిస్తే జీవితాంతం తోడుండే రకం. ఇక్కడే నీకొక నిజం తెలియాలి! నాకు తెలుసు, నా ఆ ప్రయాణం వేరే అమ్మాయితో ఏడు అడుగులు వేయడానికని. ప్రియాను కలిసినప్పుడు కూడా  నా మైండ్ లో నీ మాటలే రన్ అయ్యాయి. ఇక అర్థమయింది నాకు, నేను నిన్ను ప్రేమించడం లేదు, పిచ్చిగా ప్రేమిస్తున్న అని. ఇప్పటివరకు నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఎవరిపైనా కలగలేదు.”

పంపేసాక వెంటనే ఫోన్ పక్కన పెట్టేశాడు, ఛాతీలో గుండె వేగంగా కొట్టుకుంటుండగా. “పిచ్చి పని చేశానేమో,” అనుకున్నాడు.

పది నిమిషాలు ఏం రిప్లై రాలేదు. కిరణ్‌కి ఆ పది నిమిషాలు పది గంటల్లా అనిపించాయి. మళ్ళీ మళ్ళీ ఫోన్ చెక్ చేస్తూ, “టైపింగ్…” అని కనిపించి మాయమవడం రెండుసార్లు చూశాడు.

చివరికి రిప్లై వచ్చింది: “నేను కూడా ఇదే మాట రాయాలని రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా, ధైర్యం చాలలేదు. నాకూ నువ్వంటే ఇష్టం కిరణ్. కానీ నిజం చెప్పనా?”

“చెప్పు.”

“భయంగా ఉంది. నా లైఫ్ ఇప్పుడు మెస్‌గా ఉంది – నాన్న ఆరోగ్యం, ఇక్కడ ఉండాల్సిన బాధ్యత. ఈ టైమ్‌లో ఎవరితోనైనా ఇలా ప్రేమలో పడిపోవడం సరైనదేనా అని తెలియట్లేదు.”

కిరణ్ కాసేపు ఆలోచించి టైప్ చేశాడు. “నాకు అర్థమవుతుంది. నేను నిన్ను తొందరపెట్టను. కానీ ఒక్కటే చెప్తా – నీకు అంతా సెట్ అయ్యేదాకా వెయిట్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు.”

అనూష స్క్రీన్ వైపే చూస్తూ కూర్చుండిపోయింది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా – ఇన్నాళ్ళూ ఎవరూ ఇలా చెప్పలేదు తనతో, ఇంత ఓపిగ్గా.
“థాంక్స్ కిరణ్,” అని మాత్రమే రిప్లై ఇవ్వగలిగింది అప్పటికి.

కొన్ని రోజులు గడిచాయి. మాటలు ఇంకా సాప్ట్ గా, ఇంకా ఎక్కువగా సాగుతున్నాయి, ఇప్పుడు ఇద్దరికీ తెలుసు ఏం జరుగుతోందో అని. ఒక రాత్రి, అనూషే మొదటిసారి ఆ టాపిక్ తిరిగి తెచ్చింది.
“కిరణ్, ఆలోచించాను నేను. నాన్న పరిస్థితి వల్ల భయపడి నిన్ను దూరం పెట్టడం సరైనది కాదు అనిపించింది. లైఫ్ ఎప్పుడూ ‘పర్ఫెక్ట్ టైమ్’ కోసం ఆగదు కదా.”

కిరణ్ గుండె వేగంగా కొట్టుకుంది. “అంటే?”

“అంటే… నువ్వు ఇక్కడికి వచ్చి, మా ఫ్యామిలీని కలవాలని అనుకుంటే, నాకు అభ్యంతరం లేదు. కానీ నాన్న ఆరోగ్యం దృష్ట్యా, చిన్నగా, తొందరపడకుండా చేద్దాం.”

కిరణ్ మొహంలో నవ్వు వచ్చింది, ఒంటరిగా గదిలో ఉన్నా బయటకి నవ్వేసేంత సంతోషంగా. “సరే. నేను వచ్చే వారం విజయవాడ రావొచ్చా?”

“రావచ్చు,” అంది అనూష, చిన్నగా నవ్వుతూ.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *