స్థలం: కేజీహెచ్ హాస్పిటల్ ఐసియు బయట – తెల్లవారుజామున 4:30 గంటలు.
ఆసుపత్రి ఆవరణలో మసక చీకటి విడిపోతుంది. ఐసియు కారిడార్ నిశ్శబ్దంగా ఉంది. లోపల బెడ్ మీద ప్రాణాపాయం నుంచి బయటపడి ప్రశాంతంగా పడుకుని ఉన్న రమ్య వైపు, పక్కనే కుర్చీలో కూర్చున్న లావణ్య మౌనంగా చూస్తోంది.
తల తిరిగే హాస్పిటల్ మందుల వాసన, పక్కనే ఈసిజి మెషిన్ నుంచి వస్తున్న సన్నటి శబ్దం… లావణ్యను సుదూర జ్ఞాపకాల లోకి తీసుకెళ్లాయి.
విశాఖపట్నంలోని ఆ పాత గవర్నమెంట్ స్కూల్… 2005.అప్పుడు వాళ్లు ఎనిమిదో తరగతి. టైలర్ దగ్గర కుట్టించిన లాంగ్ స్కార్ఫ్‌లతో సైకిళ్లు తొక్కుకుంటూ స్కూల్‌కి వెళ్లే రోజులు.
లంచ్ బెల్ మోగగానే రబ్బర్ బ్యాండ్లు తీసి, క్యారేజ్ డబ్బాలు పట్టుకుని చింత చెట్టు కింద కూర్చునేవాళ్లు.
లావణ్య క్యారేజ్‌లో బెండకాయ కూర ఉంటే, రమ్య క్యారేజ్‌లో పచ్చడి ఉండేది. ఇద్దరి మధ్యా ఏ దాపరికం ఉండేది కాదు.
ఆగస్టు 15 సందర్భంగా స్కూల్ లో ఆటలపోటీలు పెట్టారు. పరుగు పందెంలో పరిగెడుతూ లావణ్య కిందపడిపోయింది. మోకాలు కొట్టుకుపోయి రక్తం కారుతుంది. టీచర్లు మరియు క్లాసులోని మిగతా పిల్లలంతా నిలబడి చూస్తుంటే… రమ్య మాత్రం పరిగెత్తుకొచ్చి లావణ్య కాళ్లు పట్టుకుని ఏడ్చేసింది.
తన చేతికున్న రబ్బర్ బ్యాండ్ తీసి, చేతి గుడ్డతో రక్తాన్ని ఒత్తి పట్టి… స్కూల్ ఆయా కారంతో కడుగుతానన్నా వినకుండా, లావణ్యను తన భుజాల మీద మోసుకుంటూ పిహెచ్సి సెంటర్‌కి తీసుకెళ్లింది.
ఆ రోజు డాక్టర్ కుట్లు వేస్తుంటే లావణ్య కంటే రమ్యనే ఎక్కువగా ఏడ్చింది. దెబ్బ లావణ్యకి తగిలితే, ఆ నెత్తుటి చార రమ్య గుండెల్లో ఇంకిపోయింది. ‘స్నేహం’ అనే పదానికి రూపం ఉంటే అది రమ్యే అని లావణ్యకి ఆ రోజే అర్థమైంది.
స్కూల్ రోజుల్లోనే వాళ్ల కలలు రూపుదిద్దుకున్నాయి.
స్కూల్లో లెక్కల మాస్టారు సరిగ్గా పాఠం చెప్పకపోతే… సాయంత్రం ఆటల సమయం వదిలేసి, తోటి పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని లావణ్య బోర్డు మీద సుద్దముక్కతో పాఠాలు చెప్పేది. ఎదుటివారికి నేర్పించడంలో, ఆ పిల్లల కళ్లలో వెలుగు చూడటంలో లావణ్య ఆనందం వెతుక్కునేది. అందుకే లావణ్య టీచర్ అయింది.
కానీ రమ్య అలా కాదు. క్లాసులో ఏ అన్యాయం జరిగినా సరే తట్టుకునేది కాదు. హెడ్మాస్టర్ ముందు కూడా ధైర్యంగా నిలబడి నిజం చెప్పేది. “సమాజంలో అమాయకులకు అన్యాయం జరగకూడదు లావణ్యా… అందుకే నేను నల్లకోటు వేసుకోవాలి, న్యాయం వైపు నిలబడాలి” అని పదో తరగతిలోనే చెప్పింది. చెప్పినట్టే లాయర్ అయింది.
అలాంటి రమ్య… ఈ రోజు తన ప్రాణస్నేహితురాలు లావణ్య భర్త రవికుమార్ హత్య వెనుక ఉన్న రాక్షసులను బయటకు తీయడానికి, లావణ్యకి న్యాయం చేయడం కోసం వచ్చి ఆసుపత్రి ఐసియు బెడ్‌పై చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది.
అప్పుడే కారిడార్‌లో అడుగుల శబ్దం వినబడింది. స్టేషన్ నుంచి తిరిగి వచ్చిన కానిస్టేబుల్ శ్రీను, లావణ్య దగ్గరకు వచ్చాడు.
“లావణ్య గారు… రాత్రి దాడి చేసిన ఆ నకిలీ వార్డ్ బోయ్ని స్టేషన్లో మా స్టైల్ లో విచారించాం. వాడు నిజం చెప్పేశాడు” అన్నాడు శ్రీను.
లావణ్య జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి, “ఏం చెప్పాడు శ్రీను గారు?” అని అడిగింది.
“వాడిని పంపింది భూపతి రెడ్డి మనుషులే. విక్టరీ క్లబ్లో దొరికిన ఆ పెన్‌డ్రైవ్ ఎక్కడుందో రమ్య మేడమ్‌కి తెలుసని… ఆమె కళ్లు తెరిచి పోలీసులకు ఆ విషయం చెప్పకముందే ఆక్సిజన్ మాస్క్ పీకి చంపేయమన్నారట. అదృష్టవశాత్తూ మీరు సమయానికి కాపాడారు” అన్నాడు శ్రీను.
అదే సమయంలో రమ్య ఉన్న ఐసియు గది లోపల ఈసిజి బీప్ శబ్దం మారింది. లోపల రమ్య మెల్లగా కళ్లు తెరవడానికి ప్రయత్నిస్తోంది.. రమ్య మెల్లగా కళ్లు తెరిచి, లావణ్య వైపు చూసి నీరసంగా నవ్వింది.
“రమ్యా…” లావణ్య ఆమె చెయ్యి పట్టుకుంది.
రమ్య నోటి మీద ఉన్న మాస్క్ కింద నుంచి సన్నటి గొంతుతో అంది:”లావణ్యా… పెన్‌డ్రైవ్…”
“నువ్వేమీ మాట్లాడకు రమ్యా, ప్రశాంతంగా ఉండు” అంది లావణ్య.
రమ్య కష్టపడుతూ శ్వాస తీసుకుంటూ శ్రీను వైపు చూసింది. “శ్రీనూ… ఆ రోజు విక్టరీ క్లబ్ మేనేజర్ ఆఫీస్ రూమ్‌లో బన్నీ వాస్, అతని మనుషులు నా మీద దాడి చేసినప్పుడు… నా చేతిలో ఉన్న పెన్‌డ్రైవ్ జారి అక్కడున్న రౌండ్ టేబుల్ కింద పడిపోయింది. అది వాళ్లు చూడలేదు… ఆ పెన్‌డ్రైవ్ అక్కడే ఉంది!”
శ్రీను కళ్లు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. “సరే మేడమ్, మీరు అసలు కంగారుపడకండి. నేను ఇప్పుడే వెళ్లి ఆ పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకుంటాను” అని చెప్పి శ్రీను వేగంగా బయటికి పరుగెత్తాడు. లావణ్య రమ్య దగ్గరే ఉండిపోయింది.
అర్ధగంట తర్వాత… విక్టరీ క్లబ్‌కి చేరుకున్న శ్రీను, మేనేజర్ రూమ్‌లోకి వెళ్లాడు. రమ్య చెప్పినట్టే అక్కడ ఉన్న రౌండ్ టేబుల్ కింద వెతికి, డస్ట్ పట్టిన ఆ నల్లటి పెన్‌డ్రైవ్‌ను చేతిలోకి తీసుకున్నాడు!
శ్రీను ముఖంలో గెలుపు నవ్వు కనిపిస్తుండగా… సైలెన్సర్ అమర్చిన పిస్టల్ నుంచి వచ్చిపడిన బుల్లెట్ తల వెనుక నుంచి దూసుకెళ్లింది.
అతని శరీరం ముందుకు తూలి నేలపై కుప్పకూలింది.చివరి క్షణంలో కళ్లు తెరిచి వెనక్కి చూశాడు.
పిస్టల్ పట్టుకుని నిలబడి ఉన్న వ్యక్తిని చూసి అతను ఆశ్చర్యపోయాడు.
అది భూపతి రెడ్డి మనిషి కాదు…
డిపార్ట్మెంట్ లో ఉండే తన సొంత స్టేషన్ జిల్లా ఎస్పీ.
శ్రీను చేతిలోంచి పెన్‌డ్రైవ్‌ను తీసుకున్న ఎస్పీ, ఏమీ జరగనట్టే గది నుంచి బయటకు వెళ్లిపోయాడు.
Leave a Reply