ఉదయం 7:00 గంటలు. కేజీహెచ్ హాస్పిటల్ ఐసీయూ బయట కారిడార్.
లావణ్య కుర్చీలో మౌనంగా కూర్చుని ఉంది. అప్పుడే అక్కడికి వ్యాపారవేత్త వెంకటరెడ్డి వచ్చాడు. ఆయనతో ఇద్దరు బాడీ గార్డ్స్ వచ్చారు. ఆయనను చూడగానే బయట ఉన్న కానిస్టేబుళ్లు రాము, వెంకట్ గౌరవంగా లేచి నిలబడ్డారు.
వెంకటరెడ్డి ఐసీయూ లోపలకి వెళ్ళి చికిత్స పొందుతున్న సీఐ చంద్రమౌళిని, ఆ తర్వాత పక్క బెడ్‌పై ఉన్న లాయర్ రమ్యను చూసి నేరుగా లావణ్య దగ్గరకు వచ్చాడు.
“లావణ్య గారు…” అని మెల్లగా పిలిచాడు.
లావణ్య తలెత్తి చూసింది.
“రవికుమార్ నా దగ్గర ఉద్యోగి మాత్రమే కాదు… నేను ఎంతో నమ్మిన మనిషి. ఏ పని అప్పగించినా బాధ్యతగా పూర్తి చేసేవాడు. అలాంటి వాడిని ఇలా అర్ధాంతంగా కోల్పోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంది.”
లావణ్య కళ్లలో నీళ్లు మెరిశాయి.
“రమ్య చాలా తెలివైన లాయర్. తన గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు! మీ భర్త హత్య చేసిన వాళ్లు ఎంత పెద్దవాళ్లైనా సరే… ఏదొకరోజు తప్పకుండా బయటపడతారు. ఆ నమ్మకం మాత్రం కోల్పోవద్దు. తను త్వరగా కోలుకోవాలి!”
ఒక్క క్షణం ఆగి…
“ఇక నుంచి మీరు ఒంటరిగా లేరు. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా… మొహమాటం లేకుండా నన్ను అడగండి.” అన్నాడు వెంకటరెడ్డి.
లావణ్య మౌనంగా తల ఊపింది.
వెంకటరెడ్డి మరో క్షణం అక్కడే నిలబడి, నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.
విశాఖపట్నం శివార్లలోని భూపతి రెడ్డి గెస్ట్ హౌస్.
భూపతి రెడ్డి హాలులో కూర్చుని ఉండగా, వెనుక తలుపు నుంచి జిల్లా ఎస్పీ లోపలికి వచ్చాడు.
ఎస్పీ తన జేబులోంచి నల్లటి పెన్‌డ్రైవ్‌ను తీసి టేబుల్ మీద పెట్టాడు.”విక్టరీ క్లబ్ నుంచి తీసుకొచ్చాను. శ్రీను చేతికి చిక్కింది… కానీ బయటకు తీసుకెళ్లలేకపోయాడు,” అన్నాడు.
భూపతి రెడ్డి వెంటనే టేబుల్ మీద ఉన్న ల్యాప్‌టాప్‌ను తనవైపుకు లాగి, పెన్‌డ్రైవ్‌ను అందులో పెట్టాడు.
కొన్ని క్షణాల్లో స్క్రీన్‌పై ఫైళ్లు కనిపించాయి.ఒక్కో ఫైల్‌ను తెరిచి చూస్తున్న కొద్దీ భూపతి రెడ్డి ముఖం గంభీరంగా మారింది.
కొద్దిసేపటి తర్వాత పెన్‌డ్రైవ్‌ను తీసి టేబుల్‌పై పడేశాడు.”ఇదే… రవికుమార్ దాచిన పెన్‌డ్రైవ్.”
ఎస్పీ ఊపిరి పీల్చుకున్నాడు.”అయితే ఇక ప్రమాదం తప్పినట్టే.”
భూపతి రెడ్డి తల అడ్డంగా ఊపాడు.”లేదు… ప్రమాదం ఇంకా పూర్తిగా పోలేదు. రవికుమార్ హత్య కేసుకి సంబంధించి ఆ లాయర్ రమ్య దగ్గర కానీ, రవికుమార్ ఇంటి దగ్గర కానీ ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయేమో వెతకాలి. ఒక్క చిన్న సాక్ష్యం మిగిలినా మనిద్దరికీ ప్రమాదమే.”
“సరే. నేను హాస్పిటల్‌కి వెళ్తాను. అక్కడ ఎవరికి అనుమానం రాకుండా చూసుకుంటాను,” అన్న ఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కేజీహెచ్ హాస్పిటల్ ఐసీయూ కారిడార్ – ఉదయం 8:30 గంటలు.
ఎస్పీ తన అధికారిక వాహనంలో కేజీహెచ్ హాస్పిటల్‌కి వచ్చాడు. ఐసీయూ కారిడార్‌లోకి అడుగుపెట్టగానే రాము, వెంకట్ సెల్యూట్ చేశారు.
ఎస్పీ డాక్టర్ రాజు దగ్గరకు వెళ్లి, “చంద్రమౌళి, రమ్యల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది డాక్టర్?” అని అడిగాడు.
“రమ్యగారు డేంజర్ జోన్ నుంచి బయటపడ్డారు. కానీ చంద్రమౌళి గారి పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉంది. స్పృహ రావడానికి కొంత సమయం పడుతుంది,” అని చెప్పాడు డాక్టర్ రాజు.
ఎస్పీ తల ఊపి చుట్టూ ఒకసారి చూసాడు.”ఇక్కడ డ్యూటీలో ఉండాల్సిన కానిస్టేబుల్ శ్రీను ఎక్కడ? కనిపించడం లేదు.” అని అడిగాడు.
“సార్… రాత్రి డ్యూటీకి వచ్చాడు. తెల్లవారుజామున బయటికి వెళ్లాడు. ఇంకా తిరిగి రాలేదు సార్,” అని రాము చెప్పాడు.
ఎస్పీ వెంటనే ఫోన్ తీసి శ్రీను నంబర్‌కి కాల్ చేశాడు.’స్విచ్ఛాఫ్’ అని వినిపించింది.
ఒక్క క్షణం ఆలోచించిన ఎస్పీ, “ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందా… సరే. శ్రీను వచ్చిన వెంటనే నాకు సమాచారం ఇవ్వండి,” అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
కేజీహెచ్ హాస్పిటల్ – ప్రత్యేక ఆర్థోపెడిక్ వార్డు
విక్టరీ క్లబ్‌లో రమ్యపై దాడి చేసే క్రమంలో తీవ్రంగా గాయపడిన బన్నీ వాస్, పోలీసుల కాపలా మధ్య అదే కేజీహెచ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
బెడ్‌పై పడుకున్న బన్నీ వాస్ మెల్లగా కళ్లు తెరిచాడు. శరీరమంతా నొప్పితో మూలుగుతూ కదలడానికి ప్రయత్నించాడు.
అదే సమయంలో వార్డులోకి వచ్చిన డాక్టర్ రాజు, బన్నీ వాస్‌కు స్పృహ రావడం గమనించాడు. వెంటనే అతన్ని పరీక్షించి, బయటకు వచ్చాడు.
వార్డు బయట డ్యూటీలో ఉన్న పోలీసుల దగ్గరకు వెళ్లి,”బన్నీ వాస్‌కి స్పృహ వచ్చింది. అయితే ఎక్కువసేపు మాట్లాడించకండి. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన విషయాలు మాత్రమే అడగండి,” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
బయట ఉన్న పోలీసులు వెంటనే ఒకరినొకరు చూసుకుని, బన్నీ వాస్‌ను విచారించేందుకు వార్డులోకి అడుగుపెట్టారు.
Leave a Reply