గాలి కూడా భారంగా మారింది
“ఇకపై మనం చేసే ప్రతి పని మన ఊరి బాగు కొరకే! జంకు ఫుడ్ తిని తిని ఆరోగ్యం పాడుచేసుకుంటున్న మన ఊరిలోకి కల్తీ ఆహారంపై అవగాహన రప్పించి నాటు కోడ్లు పెంపకం.. ఆర్గానిక్ మొక్కలు పెంపకం.. పాకెట్ వస్తువులు కంటే స్వచ్చమైన పశువుల పాల పదార్థాలను వాడించాలి. ముఖ్యంగా పంచాయితీ నిధులుతో రోడ్లు వేయించాలి.. ప్రతి ఇంటికి నీటి సరఫరా కోసం కుళాయిలు, ఆడవాళ్ళు మాన రక్షణ కోసం బాత్రూంలు అన్ని కట్టించాలి.” అని రమేష్ సిట్టింగ్ లో కూర్చొని తాగుతున్న ఫ్రెండ్స్ తో అన్నాడు.(సిట్టింగ్ స్టార్ట్ చేసి పది నిమిషాలు తర్వాత)రమేష్ తో పాటు మరో నలుగురు ఉన్నారు ఆ సిట్టింగ్ లో (కిరణ్, రవి, వినయ్, మరియు సాయి). బీచ్ ఒడ్డున అలలుపై నుండి వచ్చే ఆ గాలిలో కూర్చొని నిండు వెన్నెలలో చల్లని బీర్లు తాగుతూ ప్రతి సిప్ తర్వాత ఫ్రెష్ గా మసాలా వేసి వండినా నాటుకోడి మాంసం తింటూ మాట్లాడుకుంటున్నారు ఆ నలుగురు స్నేహితులు. రమేష్ మాటలు విన్న కిరణ్ తన విస్థిరాకులో ఉండే నాటుకోడి మాంసం మసాలా జ్యూస్ చప్పరిస్తూ ఇలా అన్నాడు; అవును మామ! ఒకప్పుడు ఎలా ఉండేదిరా మన ఊరు. అప్పుడుండే తిండులు ఏంటి! ఆ మనసులు చేసే పనులు ఏంటి! ఏ కాలంలో ఏది పండించుకోవాలో తెలిసిన వాళ్ళ తెలివి ఏంటి! అప్పుడంత సొంత ఉపాధి, స్వయంకృషి. ఇప్పుడేమో చేయడానికి ఉద్యోగాలు ఉండవు! తినడానికి సరైన తిండి ఉండదు! అంతెందుకు మన తాగే బీర్లు కూడా కల్తివి. కిరణ్ మాటలకు వత్తాసు పలుకుతూ సాయి ఇలా అన్నాడు; నిజంగా ఆ కాలంలోనే బాగుండేది అంట! నాకు అన్ని మా తాత చెప్పాడు. మా తాత కన్ను వేస్తే కోరిక తీర్చుకునే వరకు వదిలే వాడు కాదంట. నచ్చిన దానిని నచ్చిన అన్నిసార్లు అనుభవించేవాడు అంట. ఇప్పుడు దేనినైనా గెలికితే చాలు పోక్సో అని కేసులు వేసి బొక్కలో తోస్తున్నారు. సాయి మాటలకి రమేష్ అరుస్తూ ఇలా అన్నాడు: రే సాయి కసాయిలా మాట్లాడకు. ఆపురా! మేము మాట్లాడేది మన బాగు కోసం, మన ఊరి బాగు కోసం. ఇన్నాళ్లు ఎన్నో చిల్లర పనులు చేసి ఇంటివాళ్లను అలాగే ఊరిలో వాళ్లను ఇబ్బంది పెట్టాము. ఇకపైనైనా మనం మారి మన ఊరికి మంచి చేద్దాం. రమేష్ మాటలను ఏకీభవిస్తూ కిరణ్ ఇలా అన్నాడు; రేయ్ రమేషు నువ్వు చెప్పింది బాగుంది. మనం చేద్దాం కానీ ఒక్కసారి ఆగు. నాది ఒకటే మాట! రే సాయి విను. మన ఊరిలో మన కంటే పోరంబోకులు ఎవడైనా ఉన్నాడా? ఎన్ని చేశాము రా! ఆరోజుల్లో మీ తాత చేసినదానికంటే ఇంతవరకు మనం చేసినవి తక్కువ చెప్పు? చెప్పు రా? చెప్పు?కిరణ్ మాటలకు మాంసం ముక్క నములుతూ ఇలా అన్నాడు; రేయ్ కిరణు. మా తాత ముందు నువ్వు జుజుబి రా! మా తాత హాఫ్ సెంచరీ పైనే అంట రా మనమెంత రా! అయినా సింగిల్ చింతకాయ గాడివి నీతో పోలిక ఏంటి మా తాతకి. మా తాత ఆకాశమైతే నువ్వు ఆ ఆకాశంలో చుక్క. నీకు తెలుసు కదా! మా తాతకి మరో పేరు కూడా ఉంది! పులిరాజా అని. బాగా ఎక్కేసిన రవి అటు ఇటు ఊగుతూ, సాయి మాటలకు ఇలా అన్నాడు: సాయి.. ఎవడు రా మీ తాత. వాడు పులిరాజా నా గుళ్ళి రాజా! రేయ్ రవి! మా తాత గురించి మాటలు మర్యాదగా రాని. నోటికొచ్చిన మాట మాట్లాడితే నీకు నా చేతిలో చావే! అంటూ సాయి కోపంతో అన్నాడు.సైలెంట్ గా వీళ్ళు మాటలు వింటూ థంబ్స్ అప్ డ్రింక్ తో స్టఫ్ మాత్రమే తింటున్న వినయ్ ఒక్కసారిగా నవ్వుతూ సాయి మాటలకు ఇలా అన్నాడు: మీ తాత నిజంగా పులిరాజే. అందుకే కదరా మీ తాత ఎయిడ్స్ వచ్చి పోయాడు. ఈ విషయం మా నాన్న చెప్పాడు! “రేయ్ వినయ్! మా తాత గురించి అలా మాట్లాడకు. మా తాత చనిపోయింది ఎయిడ్స్ తో కాదు. టిబి వచ్చి.” అంటూ సాయి.” ఆపరా. మీ తాత చనిపోయింది ఎయిడ్స్ వల్లే. నువ్వు టిబి అని సొల్లు చెప్పకు! ” అంటూ మళ్ళీ వినయ్ అన్నాడు.”అవును ఎయిడ్స్ వల్లే ” తూలుతూ అన్నాడు రవి.” రే వినయ్. నాకు మెంటల్ తెప్పించకు. మా తాత చనిపోయింది ఎయిడ్స్ వల్ల కాదుబే. టిబి వల్లే! ” అంటూ ముందున్న కాళీ బీర్ సీసాను దూరంగా విసిరేసాడు సాయి.” నిజం ఇదేరా! నువ్వు ఉడికిపోతే మాత్రం నిజం మారిపోతుందా? మీ పులిరాజా ఎయిడ్స్ కి బలైపోయాడు. హి హి హి ” అంటూ వినయ్ చిన్నగా నవ్వుతున్నాడు. ఆ నవ్వుకి మిగిలిన ముగ్గురు మొఖలులో కూడా నవ్వు విరిసింది. అది భరించలేని సాయి మరింత కోపంతో పైకి లేచి వెంటనే వినయ తలపై చేయి చేసుకున్నాడు. అందుకు వెంటనే రమేష్ సాయి చేయిని పట్టుకుంటూ ఇలా అన్నాడు: రే సాయి. నువ్వు చేస్తుంది తప్పు! నీకు బాగా ఎక్కేసింది. చనిపోయిన మీ తాత కోసం బ్రతుకున్న మన ఫ్రెండ్స్ పై చేయి చేసుకోవడం తప్పు! ఇదంతా వదిలేసి హాయిగా తాగేసి ఇంటికి పోదాం రండి. వర్షం పడేలా ఉంది.”రేయ్ రమేషు. వర్షం లేదు బొక్క లేదు. ముందు నువ్వు చెప్పు వాడు ఎవడురా? మా తాతని అనడానికి. మా తాతని అనేముందు వాళ్ళ స్థాయి ఏంటో గుర్తుచేసుకోమను! అయినా వాడికేందుకు రా! మా తాత గురించి. నువ్వు చెప్పురా! మా తాత ఎలా చనిపోయాడో! ” అంటూ మళ్ళీ వినయ్ పై కొట్టడానికి చేయి లేపుతున్నాడు.”రే సాయి! తాగేసి ఉన్నవని ఆలోచిస్తున్న. లేకపోతే నేను గుద్దిన సగం గుద్దికె చచ్చిపోతావు.” అంటూ పళ్ళు బిగించాడు.” అయినా చనిపోయిన మీ తాతను అంటే ఎందుకు రా! నీకంత కోపం. ” అంటూ కిరణ్.”రే రమేష్ నువ్వు చెప్పు? ఎప్పుడూ మా ఇంటికొస్తావు కదా! మా తాత ఎలాంటివాడు రా? కాస్తో కూస్తో మన ఊరిలో డెవలప్మెంట్ ఉందంటే దానికి కారణం మా తాత. ఈ ఊరికి ఆ టైంలో ఎన్ని మంచి చేసాడు రా? ఇదంతా మర్చిపోయి వాడు మా తాతను గుళ్లి రాజు అంటే నాకు కోపమా రాదా? చెప్పు.” అంటూ సాయి వినయ్‌పైకి దూసుకెళ్ళి మెడ పట్టుకొని ఇసుకలోకి తోసాడు. అందుకు వినయ్ కూడా తిరిగి లేచి సాయిని ఎగిరి తన్ని, “మంచి పనులు చేశాడా? ఎక్కడరా? మాకెక్కడా కనిపించలేదు. ఎయిడ్స్ కి మందు కనిపెట్టాడా? అసలు మన ఊరిలో ఎయిడ్స్ రావడానికే కారణం మీ తాత” అంటూ ఇసుక దులుపుకున్నాడు. వారిద్దరినీ మిగిలిన ముగ్గురూ విడిపిస్తున్నారు. కానీ…)వీళ్ళు ఇలా గొడవపడుతున్న సమయంలో వాతావరణంలో చిన్నగా మార్పులు వచ్చాయి. నీటి కింద చాపలాగా వాళ్ళకి తెలియకుండానే చల్లని గాలి కాస్తా పెరిగి పెద్దదయింది. నిండు వెన్నెలను నల్లటి మబ్బులు కమ్మేశాయి. చిన్న చిన్న జల్లులుగా మొదలైన వర్షం నెమ్మదిగా పెరుగుతూ పెద్ద గాలివానగా మారింది. వర్షానికి తోడు ఉరుముల చప్పుళ్ళు కూడా మొదలయ్యాయి. అయినా ఆ హోరు వానలో కూడా వినయ్, సాయిలు గొడవపడడం ఆపలేదు. ఆ గొడవను భగ్నం చేసేలా ఆకాశం నుండి ఒక తెల్లని మెరుపు వచ్చి, ఆ వెంటనే భయంకరమైన పిడుగు చప్పుడు వినిపించింది.ఆ శబ్దానికి భయపడి, ఎలాగైనా ఇంటికి వెళ్ళాలని బైక్ స్టార్ట్ చేశారు. రవికి అప్పటికే మత్తు దిగిపోయింది. రమేష్, రవి, వినయ్ ఒక బైక్ పై (రమేష్, వినయ్‌ల మధ్యలో రవిని కూర్చోబెట్టి), సాయి, కిరణ్‌లు మరో బైక్ పై బయలుదేరారు. వాన జోరుగా కురుస్తుంది. గాలి వేగం మరింత పెరిగింది. పిడుగుల శబ్దాలు ఇంకా ఎక్కువయ్యాయి. బైక్ నడపడం రమేష్‌కి, సాయికి చాలా కష్టంగా మారింది. “రేయ్ సాయి, ఈ వర్షంలో బైక్ డ్రైవ్ చేయడం అసాధ్యం. అదిగో అక్కడ పది అడుగుల దూరంలో కనిపిస్తున్న షెడ్డులో బైకులు పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోదాం” అని అరిచాడు రమేష్. నెమ్మదిగా తడుచుకుంటూ వెళ్లి బైకులు రెండింటికీ తాళాలు వేసి ఆ షెడ్డులో పెట్టారు.ఆ జోరు వర్షానికి రవికి మత్తు పూర్తిగా వదిలిపోయింది. చలికి వణుకుతూ వినయ్, కిరణ్, రవిలు ముగ్గురూ ముందుకు నడుస్తున్నారు. సాయి, రమేష్‌లు షెడ్డులో బైకులు లాక్ చేసి వాళ్ళ వెనకాలే వస్తున్నారు.అప్పటికే సాయి, వినయ్‌ల మధ్య ఉన్న కోపం చల్లారలేదు. నడుస్తున్న ముగ్గురికీ వెనక వస్తున్న వాళ్ళతో మాట్లాడాలనిపించలేదు. “ముందు మనం నడవండిరా, వాళ్ళు వస్తారులే” అనుకుంటూ వినయ్, కిరణ్, రవిలు ఆ జోరు వర్షంలో వెనక్కి తిరిగి చూడకుండా, కళ్ళు కూడా సరిగ్గా కనపడనంత వేగంగా కురుస్తున్న వానను చీల్చుకుంటూ ముందుకు సాగిపోయారు.సరిగ్గా అదే సమయంలో… ఆకాశం నిలువునా చీలిపోయినట్టు ఒక మహా మెరుపు… ఆ వెంటనే భూమి బద్దలయ్యేలా షెడ్డు వైపు ఒక భయంకరమైన పిడుగు పడింది!ఆ పిడుగు ధాటికి షెడ్డు దగ్గర ఉన్న రమేష్, సాయిలు ఒక్కసారిగా ప్రాణభయంతో “రేయ్ వినయ్.. కిరణ్.. కాపాడండిరా..!!” అంటూ గట్టిగా కేకలు వేశారు. కానీ, ఆ సమయంలో కురుస్తున్న వాన హోరు, ఆకాశాన్ని కమ్మేసిన ఉరుముల భీకర శబ్దాల ముందు ఆ ఇద్దరి స్నేహితుల అరుపులు చాలా చిన్నవైపోయాయి. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్న ఆ ముగ్గురికీ ఆ అరుపులు అసలు వినిపించనే లేదు. ఏదో పెద్ద పిడుగు పడింది అనుకుంటూ వాళ్ళు అలాగే వణుకుతూ ఇళ్లకు వెళ్ళిపోయారు.మరసటి రోజు ఉదయం; తెల్లవారుజామున 5 గంటల 25 నిమిషాలు.రోజులాగే ఆ బీచ్‌లో వాకింగ్ చేయడానికి వస్తున్నాడు నూకయ్య. నేల చూస్తూ వాకింగ్ చేయడం కంటే సముద్రాన్ని చూస్తూ నడవడం నూకయ్యకు అలవాటు. రాత్రి కురిసిన వర్షానికి ఇసుకంతా గట్టిపడింది. నూకయ్య పాదాలు బీచ్‌లో నడుస్తున్నట్టు లేదు, చుట్టూ పచ్చని చెట్లు ఉన్న ఒక పార్క్‌లో నడిచినట్టు హాయిగా అనిపిస్తోంది. కానీ, కొన్ని అడుగులు నడిచిన తర్వాత సడన్‌గా ఒక స్పీడ్ బ్రేకర్ పై అడుగు వేసినట్టు అనిపించింది. “బీచ్‌లో స్పీడ్ బ్రేకర్ ఏంటి?” అన్న అనుమానంతో రెండు అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి చూశాడు.అక్కడ సగం కాలిన ఒక మనిషి శవాన్ని చూసి ఆశ్చర్యంతో, గుండె ఆగినంత భయంతో గట్టిగా కేక వేశాడు నూకయ్య. ఆ కేక విని బీచ్‌లో ఉన్న మరికొందరు పెద్దవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ పడి ఉన్న శవం ఎవరిదో కాదు… రమేష్‌ది! రమేష్ శవానికి కేవలం మూడు అడుగుల దూరంలో పూర్తిగా కాలిపోయి బొగ్గులా మారిన సాయి శవాన్ని చూసి అక్కడున్న వాళ్ళందరికీ ఊపిరి ఆగినంత పనైంది.విషయం తెలిసి ఊరంతా బీచ్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. రాత్రి వెనక్కి తిరక్కుండా వెళ్ళిపోతున్న వినయ్, కిరణ్, రవిలు కూడా పరుగున వచ్చారు. అక్కడ కాలిపోయి ఉన్న తమ స్నేహితుల శవాలను చూడగానే వాళ్ళ గుండెలు పగిలాయి. రాత్రి తాము వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం, ఆ సమయంలోనే పిడుగు పడడం గుర్తు తెచ్చుకుని… “ఒక్కసారి.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఉంటే వాళ్ళని కాపాడుకునేవాళ్లమేమోరా! ఆ వర్షంలో వాళ్ళు ఎంతలా అరిచారో.. మేము వినకుండా వదిలేసి వచ్చేశాంరా!” అంటూ ఆ ముగ్గురు స్నేహితులు ఇసుకలో దొర్లుతూ, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది.అంతలోనే రమేష్, సాయిల తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ అక్కడికి చేరుకున్నారు. చేతికొచ్చిన కొడుకులు, వయసుకొచ్చి కళ్ళముందు ఇళ్లను చక్కబెట్టాల్సిన కుర్రాళ్ళు… ఇలా బొగ్గులా శవాలై పడి ఉండడం చూసి ఆ కన్నవారి ప్రాణాలు విలవిలలాడిపోయాయి. కొడుకుల శవాలపై పడి ఆ తల్లులు ఏడుస్తున్న ఏడ్పులు, గుండెలు పగిలి అరుస్తున్న తండ్రుల ఆవేదన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. ఆ కన్నవారి కడుపుకోత, ఆ రాత్రి తమ స్నేహితులను వదిలేసి వచ్చామన్న పశ్చాత్తాపంతో ఏడుస్తున్న ఆ ముగ్గురు స్నేహితుల తీవ్రమైన వేదన చూసి… అక్కడ చేరిన ఊరి జనాలందరి గుండెలు బరువెక్కాయి.అప్పటివరకు చల్లగా వీచిన ఆ సముద్రపు గాలి, ఆ విషాదంలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేనంత బరువుగా మారిపోయింది. ఆ ఇద్దరి శవాలను చూస్తూ, ఆ తల్లిదండ్రుల వేదనను మోస్తూ ఆ ఊరి జనాలకి గాలి కూడా భారంగా మారింది.
Leave a Reply