రహస్య కోడలు – తులసి రాక ( భాగం 16)

Written by

in

మాదాపూర్ అపార్ట్‌మెంట్ – ఉదయం 10:30 గంటలు.​

డోర్‌బెల్ మోగడంతో వంటగదిలో ఉన్న అనూష చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపు తీసింది.​ఎదురుగా తులసమ్మ నిలబడి ఉంది.

​”అమ్మా… నువ్వా?” అనూష ముఖంలో ఆశ్చర్యం.

​” ఏంటమ్మా… లోపలికి రానివ్వవా?” తులసి చిన్నగా నవ్వింది.​

” ఏంటమ్మా నువ్వు మరిను ,రా లోపలకి,” అనూష పక్కకు తప్పుకుంది.​

తులసి లోపలికి అడుగుపెట్టింది. ఒక చేతిలో చిన్న బ్యాగ్, మరో చేతిలో పళ్ల కవర్ ఉన్నాయి.​”పక్కింటి వాళ్ల పెళ్లికి హైదరాబాద్ వచ్చానమ్మా. నిన్ను చూసి వెళ్దామని ఇలా వచ్చేశా.”​

“ముందే చెప్పి ఉంటే నేనే వచ్చేదాన్ని కదా?”​

“దానికేముందిలేవే, నా బంగారమింటికి రావడానికి కూడా ముందస్తు కబుర్లు ఎందుకు?” అంది నవ్వుతూ.

​అనూష కూడా నవ్వాలని చూసింది, కానీ ఆ నవ్వు పెదవుల దాటి రాలేదు. అది తులసమ్మ దృష్టిని దాటలేదు. క్షణకాలం కూతురి ముఖాన్నే పరీక్షగా చూస్తూ ఉండిపోయింది.​

“ఏంటమ్మా… ఏమైంది?” మెల్లగా అడిగింది.​

“ఏం లేదు అమ్మ.”

​”నాతో అబద్ధం చెప్పకు.”​అనూష తల దించుకుంది.​

తులసి దగ్గరకు వచ్చి, కూతురి చేయి పట్టుకుంది. “నిన్ను నేను కన్నానమ్మా. నీ ముఖం చూస్తే నీమనసులో ఏముందో నాకు తెలియదా? ముఖంలో ఆ కళ ఏది? కళ్ల కింద నల్లటి మచ్చలు వచ్చాయి, సరిగ్గా తిండి, నిద్ర ఉందో లేదో కూడా అనుమానమే. ఏమైంది చెప్పు?”​తులసమ్మ గొంతులో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.​

అనూష కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క క్షణం మారెక్ బెదిరింపులు, ఆ వీడియో దృశ్యాలు కళ్లముందు మెదిలాయి. ‘అమ్మకి చెప్పేద్దామా?’ అనిపించింది. కానీ మరుక్షణమే తట్టుకోలేని ఆవేదనతో ఆ ఆలోచనను విరమించుకుంది. కన్నీళ్లను బలవంతంగా దిగమింగుకుంటూ, “ఏం లేదమ్మా… నువ్వే అనవసరంగా ఊహించుకుంటున్నావు,” అని సర్దిచెప్పే ప్రయత్నం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.

తులసి ముఖంలో అనుమానం అలాగే ఉంది.​అప్పుడే హాలులోకి సరోజ వచ్చింది.​”అరే, ఒదిన గారు! ఎప్పుడు వచ్చారు?” అంటూ ఆప్యాయంగా పలకరించింది.​

“ఇప్పుడే వచ్చానండీ.”​

సరోజ వచ్చి సోఫాలో కూర్చుంటూ, “ముందే కబురు చేసి ఉంటే ఏదైనా కారు పంపించేదానిని కదా!” అంది.

​తులసి చిన్నగా నవ్వింది, కానీ ఆమె దృష్టి అనూష పైనే ఉంది. కొద్దిసేపు మామూలు విషయాలు మాట్లాడాక, ఇక ఆగలేక నేరుగా అడిగేసింది.​”ఒదిన… మా అమ్మాయి ఎందుకో చాలా దిగులుగా కనిపిస్తోంది. ఏమైనా జరిగిందా?”​

సరోజ ఒక్కసారి అనూష గది వైపు చూసింది. “నాకూ అర్థం కావడం లేదండీ. రెండు రోజులుగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటోంది. అడిగితే ఏం లేదంటుంది.”​


ఇంతలో అనూష గది నుండి హాల్ లోకి వచ్చి “అత్తయ్య… నిజంగానే ఏం లేదు,” అనూష ఆత్రంగా అంది.

తులసి తల ఊపినా, ఆమె మనసు ఒప్పుకోలేదు.​”చిన్నప్పటి నుంచి దీని అలవాటు ఇంతే ఒదిన… మనసులో ఎంత బాధ ఉన్నా బయటకు పడనివ్వదు,” అంటూ అనూష వైపు చూసింది.

“పెళ్లయిందని అమ్మకి పరాయిదానివి అయిపోయావామ్మా?”​ఆ మాట అనూష గుండెల్లో ఈటెలా గుచ్చుకుంది. తల్లి ఒడిలో తలపెట్టి గుండెలవిసేలా ఏడ్చేయాలనిపించింది. నిజం చెప్పేయాలని నాలుక చివరిదాకా వచ్చింది. కానీ మారెక్ హెచ్చరిక మనసులో మెదిలి నోరు నొక్కేసింది.

​అనూష మౌనంగా తల వంచుకుంది. ఆ నిశ్శబ్దం ఆ గదిలోని ముగ్గురికీ మూడు వేర్వేరు భావాలను మిగిల్చింది.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *