మృత్యువు తొడిగిన పూలదండ – భాగం 20

Written by

in

స్థలం: నేషనల్ హైవే – యాక్సిడెంట్ స్పాట్ – ఉదయం 6:45 గంటలు.

కళ్లముందే స్కార్పియో కారు ఐరన్ లోడ్ లారీ కిందకి దూసుకెళ్లడం, ఆ దృశ్యం చూసి శ్రీను ఒక్క క్షణం స్థంభించిపోయాడు. రోడ్డు మీద పొగలు కక్కుతున్న ఆ కారు దగ్గరకు జీప్‌ని వేగంగా తీసుకెళ్లి సడన్ బ్రేక్ వేశాడు.కారు ముందు భాగం నలిగిపోయి లారీ కింద ఇరుక్కుపోయింది. స్టీరింగ్‌కు బలంగా తాకడంతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

శ్రీను క్షణం కూడా టైమ్ వేస్ట్ చేయకుండా జీప్‌లోని వైర్‌లెస్ సెట్ అందుకున్నాడు.
“కంట్రోల్ రూమ్… నేషనల్ హైవే బైపాస్ మలుపు దగ్గర మేజర్ యాక్సిడెంట్. మల్టిపుల్ క్యాజువల్టీస్. వెంటనే అంబులెన్సులు, ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ పంపించండి.” ఓవర్!”

అప్పటికే హైవే పై వస్తున్న ప్రైవేట్ బస్సు, లారీ డ్రైవర్లు వాహనాలు ఆపి కిందకి దిగారు. శ్రీను ఆ రోడ్డుపై ఉన్న మనుషుల సహాయంతో కారు వెనుక డోర్‌ను లారీలో ఉన్న ఐరన్ రాడ్ తీసుకుని బద్దలు కొట్టించాడు. రమ్య వెనుక సీటు చివర పడి ఉండటం వల్ల లారీ నేరుగా గుద్దుకోలేదు.

కానీ ఆమె శరీరమంతా గాయాలై స్పృహ లేకుండా ఉంది. జనం సహాయంతో శ్రీను జాగ్రత్తగా రమ్యను బయటకు తీసి పక్కన పడుకోబెట్టాడు. ఆమె కోటుని ఆమెపై కప్పి, తల కింద బట్టలు అమర్చి ప్రాణాలు ఉన్నాయో లేదో చెక్ చేశాడు. పల్స్ ఉంది… త్వరగా ఎక్కించండి.

కారులో దెబ్బతిని తీవ్ర రక్తగాయాలతో స్పృహతప్పి ఉన్న బన్నీ వాస్‌ని, మిగతా ఇద్దరు రౌడీలను కూడా జనం బయటకు తీశారు.

సరిగ్గా అదే సమయానికి సైరన్ మోతలతో 108 అంబులెన్స్ అక్కడ ప్రత్యక్షమైంది. శ్రీను రమ్యను, బన్నీ వాస్‌ని అంబులెన్స్‌లోకి ఎక్కించి, వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) కు పంపించి, తను కూడా వెంట వెళ్ళాడు.

స్థలం: కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH), వైజాగ్ – ఎమర్జెన్సీ క్యాజువాలిటీ – ఉదయం 7:12 గంటలు.

ఎమర్జెన్సీ క్యాజువాలిటీ మొత్తం పరుగులు, కేకలు, స్ట్రెచర్ల చప్పుడు, మానిటర్ల బీప్‌లతో హడావుడిగా మారిపోయింది. గాయపడిన సీఐ చంద్రమౌళిని మరో పోలీస్ జీప్‌లో తీసుకొచ్చి అప్పటికే ట్రామా బేలోకి తరలించారు.

అదే సమయంలో కానిస్టేబుల్ శ్రీను అంబులెన్స్‌లో రమ్యను, బన్నీ వాస్‌ను తీసుకుని క్యాజువాలిటీ ముందు ఆపాడు.స్ట్రెచర్లు వరుసగా లోపలికి దూసుకెళ్తున్నాయి.

డ్యూటీలో ఉన్న సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ రాజు, గ్లౌజులు తొడుక్కుంటూ వేగంగా ట్రామా బేలోకి వచ్చాడు.

ఒక డ్యూటీ డాక్టర్ కేస్ షీట్ అందిస్తూ అన్నాడు.”సార్… సీఐ చంద్రమౌళికి తలకు తీవ్ర గాయం. ఇంటర్నల్ బ్లీడింగ్ అనుమానం ఉంది. బీపీ పడిపోతోంది.

“డాక్టర్ రాజు వెంటనే మరో స్ట్రెచర్ వైపు తిరిగాడు.”ఈ పేషెంట్?”

“రమ్య… రోడ్డు ప్రమాదం. హెడ్ ఇంజ్యూరీ, మల్టిపుల్ ట్రామా. ప్రస్తుతం అన్‌కాన్షస్. బీపీ చాలా లోగా ఉంది సార్.”

“ఇద్దరికీ వెంటనే CT స్కాన్ పూర్తి చేయండి. న్యూరో OT రెడీ చేయండి. అనస్థీషియా టీమ్‌ని వెంటనే పిలవండి. బ్లడ్ బ్యాంక్‌కి సమాచారం ఇవ్వండి. క్రాస్‌మ్యాచ్ ఆలస్యం కాకూడదు.”

డాక్టర్ రాజు వరుసగా ఆదేశాలు ఇస్తుండగా, నర్సులు, జూనియర్ డాక్టర్లు తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు.

అప్పటికే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ మోగింది.”సార్… పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి కాల్.”

డాక్టర్ రాజు ఫోన్ అందుకున్నాడు.

“డాక్టర్… సీఐ చంద్రమౌళి, అడ్వకేట్ రమ్య… ఇద్దరి పరిస్థితి ఎలా ఉంది?” అవతలి వైపు నుంచి ఆందోళనతో కూడిన స్వరం వినిపించింది.

డాక్టర్ రాజు ఒక క్షణం ఇద్దరి వైపు చూసి సమాధానమిచ్చాడు.”ఇప్పుడే ఖచ్చితంగా ఏమీ చెప్పలేం సార్. ఇద్దరికీ తీవ్ర గాయాలున్నాయి. న్యూరోసర్జరీ టీమ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతోంది. మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.”అని చెప్పి ఫోన్ నర్స్‌కు ఇచ్చేశాడు.

కొద్ది క్షణాలకే ఇద్దరి స్ట్రెచర్లను న్యూరో ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకెళ్లారు.

ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకుపోయాయి.పైన వెలిగిన ఎర్రటి లైట్ ఒక్కటే ఇప్పుడు బయట వేచి ఉన్న ప్రతి ఒక్కరిలో ఆందోళనను మరింత పెంచుతోంది.

స్థలం: బీచ్ రోడ్డులోని భూపతి రెడ్డి రాయల్ విల్లా – ఉదయం 7:20 గంటలు.

నగరం ఒకవైపు భయంకరమైన హత్యలు, యాక్సిడెంట్లు, పోలీస్ హడావుడితో రగులుతుంటే… భూపతి రెడ్డి మాత్రం ప్రశాంతంగా తన విల్లా లాన్‌లో వైట్ ట్రాక్ సూట్ వేసుకుని, లగ్జరీ మ్యూజిక్ వింటూ జాలీగా జాగింగ్ చేస్తున్నాడు.వాడి ముఖంలో ఎలాంటి కంగారు లేదు. సరిగ్గా అదే సమయానికి వాడి పర్సనల్ ఐఫోన్ రింగ్ అయింది.

భూపతి రెడ్డి జాగింగ్ ఆపి, చెమట తుడుచుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి కాన్ఫిడెంట్‌గా “చెప్పు!” అన్నాడు.

అవతలి వైపు నుండి వాడి అనుచరుడు వణుకుతున్న గొంతుతో చెప్పాడు: “అన్నా… పెద్ద ప్రమాదం జరిగింది. బన్నీ వాస్ కారు హైవే మీద ఐరన్ లారీని ఢీకొట్టింది. డ్రైవర్ స్పాట్ డెడ్! బన్నీ వాస్, ఆ లాయర్ రమ్య, పోలీస్ చంద్రమౌళి… అందరూ చావుబతుకుల మధ్య కేజీహెచ్ హాస్పిటల్‌లో ఉన్నారు. హాస్పిటల్ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఉంది.”

భూపతి రెడ్డి ముఖంలో ఉన్న నవ్వు ఒక్కసారిగా మాయమైంది. వాడు జాగింగ్ ఆపేసి, సిగరెట్ వెలిగించాడు. పొగను గాల్లోకి వదులుతూ, సముద్రం వైపు చూశాడు.”ఆ పెన్‌డ్రైవ్ ఏమైందిరా?” భూపతి రెడ్డి గంభీరంగా అడిగాడు.

“అది తెలిదు అన్నా… పోలీసుల చేతికి చిక్కిందో లేదో క్లారిటీ లేదు!” అవతలి వ్యక్తి అన్నాడు.

భూపతి రెడ్డి కళ్లు కొద్దిగా సన్నబడ్డాయి. వాడు సిగరెట్ ను చేతితో నలిపేస్తూ ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు:”చంద్రమౌళి గాడు ఆపరేషన్ థియేటర్ లోంచి బయటకు రాకూడదు! ఆ రమ్య కళ్లు తెరిచేలోపే ఆ పెన్‌డ్రైవ్ మన చేతిలో ఉండాలి… లేదా అదే లేకుండాపోవాలి. కేజీహెచ్ హాస్పిటల్‌కి మన మనుషులను పంపించు. అవకాశం చూసుకుని… మన దారికి అడ్డుగా ఉన్న ఒక్కరూ మిగలకూడదు.”

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *