ఒక ఆదివారం ఉదయం, సరోజ వాషింగ్ మెషీన్లో బట్టలు వేస్తూ, తన స్నేహితురాలు రాధకి కాల్ చేసింది.
“ఏం చేస్తున్నావ్ రాధా?”
“ఏం లేదు, ఇప్పుడే టిఫిన్ చేసుకుని కూర్చున్నా. మీ ఇంట్లో అంతా బాగున్నారా? కొత్త కోడలు ఎలా ఉంది?” రాధ అడిగింది.
“బానే ఉంది, బానే సర్దుకుంటోంది ఇంటి పద్ధతులకి,” సరోజ చెప్పింది, బాల్కనీలోకి వెళ్తూ.
కాసేపు వాళ్ళ ఇద్దరి పిల్లల గురించి, ఈమధ్య వచ్చిన ఏదో సీరియల్ గురించి కబుర్లు చెప్పుకున్నారు.
మాటల మధ్యలో, సరోజ కొంచెం తేలిక చేసి అంది, “ఒక్క విషయం రాధా, నాకు అర్థం కాలేదు – మా అనూష క్రాకోలో ఏం పని చేసిందో అడిగితే ఎప్పుడూ దాటవేస్తుంది. IT job అని చెప్తుంది కానీ డీటెయిల్స్ ఏం చెప్పదు.”
రాధ కాసేపు ఆలోచించి అంది, “మా అమ్మాయి స్నేహితురాలు ఒకామె కూడా పోలండ్‌లోనే ఉంది క్రాకోలోనే. అడిగి చూడనా ఏమన్నా తెలుసా అని?”
సరోజ ఒక్క క్షణం ఆగింది. “వద్దులే రాధా, అలా అనుషాకి తెలియకుండా తెలుసుకోవడం కరెక్ట్ కాదు,” అని అంది. కానీ మనసులో ఆసక్తి మాత్రం చంపుకోలేకపోయింది. “సరే, అడిగితే ఏమన్నా తెలిస్తే చెప్పు,” అని చివరికి ఒప్పుకుంది.
కాల్ పెట్టేశాక, రాధ తన అమ్మాయికి మెసేజ్ పెట్టింది, ఆ అమ్మాయి తన స్నేహితురాలికి పంపింది. ఇలా ఒకరి నుండి ఒకరికి ప్రశ్న ప్రయాణించి, చివరికి అది సరిగ్గా అనూష పాత కొలీగ్ దగ్గరికే చేరింది – ప్రపంచం ఎంత చిన్నదో ఋజువు చేస్తూ.
మూడు రోజుల తర్వాత, రాధ సరోజకి తిరిగి కాల్ చేసింది, గొంతులో కొంచెం సంకోచంతో.
“సరోజా, ఒక విషయం చెప్పాలి, కానీ నీకు నచ్చుతుందో లేదో తెలియదు.”
సరోజ గుండె వేగం పెరిగింది. “ఏంటి రాధా, చెప్పు.”
“మా అమ్మాయి ఫ్రెండ్ దగ్గర తెలిసింది – మీ కోడలు క్రాకోలో ఒక బార్లో వెయిటర్‌గా పని చేసిందంట, అంతేకాకుండా వీకెండ్స్‌లో ఏదో స్పా సెంటర్ లో కూడా చేసేదంట. ఇది వినగానే నేను షాక్ అయ్యా! IT job అనేది నిజం కాదు సరోజ.”
సరోజ చేతిలో ఉన్న ఫోన్ జారిపోబోయింది. నెమ్మదిగా “ఖచ్చితంగా తెలుసా నీకు?” అంది.
“ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆ అమ్మాయి స్వయంగా చెప్పిందంట మా అమ్మాయికి, ఏదో పాత కామన్ కొలీగ్ దగ్గర్నుండి తెలిసిందని.”
కాల్ పెట్టేశాక, సరోజ చాలాసేపు అలానే కూర్చుండిపోయింది, మనసులో వేల ఆలోచనలు తిరుగుతూ. కోపం, బాధ, మోసపోయిన ఫీలింగ్ – అన్నీ కలగలిపి.
“నాకు అబద్ధం చెప్పింది. నా కొడుక్కి ఇది తెలుసా, తెలియకపోతే ఎలా చెప్పను?” అనుకుంది, గుండెల్లో ఏదో బరువు పేరుకుపోతూ.
ఆ సాయంత్రం, అనూష బాల్కనీలో నుండి కిందకి చూస్తూ Blinkit డెలివరీ బాయ్ కోసం ఎదురుచూస్తోంది, ఆర్డర్ పెట్టిన కూరగాయలు రావాల్సి ఉంది. డెలివరీ తీసుకుని లోపలికి వచ్చేసరికి, సరోజ హాల్లో సోఫాలో కూర్చుని ఉంది, మొహం చాలా గంభీరంగా.
“అత్తయ్యా, ఏమైంది? బాలేదా?” అనూష కంగారుగా అడిగింది, డెలివరీ బ్యాగ్ కింద పెడుతూ.
సరోజ తలెత్తి చూసింది, కళ్ళలో ఏదో కొత్త చూపు – నమ్మకం పోయిన చూపు. “అనూషా, కూర్చో. నీతో మాట్లాడాలి.”
అనూష గుండె ఒక్కసారి జారిపోయినట్టు అనిపించింది. ఆ స్వరంలో ఉన్న తేడా ఆమెకి వెంటనే అర్థమైంది – ఏదో తప్పు జరిగిందని.”ఏంటి అత్తయ్యా?” అడిగింది, గొంతు వణుకుతూ, కానీ ఏం జరగబోతోందో ఆమెకి లోపల్లోపలే తెలిసిపోయింది.
సరోజ నేరుగా ఆమె కళ్ళలోకి చూసింది. “నువ్వు క్రాకోలో IT job చేయలేదు కదా. వెయిటర్‌గా కదా. నిజం చెప్పు?”గదిలో నిశ్శబ్దం అలుముకుంది.
అనూష చేతులు వణుకుతున్నాయి, మాట్లాడాలని ప్రయత్నించింది కానీ మాటలు రాలేదు మొదట్లో.”ఎవరు చెప్పారు మీకు?” అని మాత్రమే అడగగలిగింది, గొంతు పగిలిపోతూ.
“అది ముఖ్యం కాదు ఇప్పుడు. నిజమేనా అది, అవునా కాదా?” సరోజ గొంతులో కోపం, బాధ రెండూ కలగలిపి ఉన్నాయి.
అనూష కళ్ళలో నీళ్ళు తిరిగాయి, తల దించుకుంది. “అవును అత్తయ్యా. నిజమే.”ఆ ఒప్పుకోలుతో గదిలో ఒక భారీ నిశ్శబ్దం అలుముకుంది – మూడు నెలలుగా పేరుకుపోయిన అనుమానం, భయం, ఇప్పుడు ఒక్క క్షణంలో నిజమైన మాటగా మారిన క్షణం.
సరోజ, అనుషాలు ఒకరిని ఒకరు చూడకుండా తల దించుకునే మౌనంగా ఉన్నారు. ఒకరు మౌనం వెనుక ” అబద్ధం చెప్పాల్సిన అవసరమేముందని దీర్ఘ ఆలోచన ” మరొకరి మౌనం వెనుక ” ఈమెకు నేను కాక్రో లో చేసిందంతా తెలిసిపోయిందా? ఈ విషయం కిరణ్ కు చెబితే ఏమవుతుంది? ” అని…
Leave a Reply