మృత్యువు తొడిగిన పూలదండ (6)

Written by

in

స్థలం: హైదరాబాద్, పాడుబడిన బిల్డింగ్కనకరాజు శవం ముందు నిలబడిన చంద్రమౌళి మైండ్ తీవ్రమైన సందిగ్ధంలో పడింది. సైబర్ క్రైమ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం… గత మూడు రోజులుగా కనకరాజు మొబైల్ సిగ్నల్స్ రికార్డ్స్ పూర్తిగా హైదరాబాద్ లోనే చూపిస్తున్నాయి. వాడు మూడు రోజుల ముందే ఇక్కడికి వచ్చాడనే పక్కింటివాడి సాక్ష్యం వంద శాతం నిజం.చంద్రమౌళి టార్చ్ లైట్ ఆన్ చేసి, తన ఫోన్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ స్క్రీన్ షాట్‌ను,

కింద పడి ఉన్న కనకరాజు శవాన్ని మళ్లీ పోల్చి చూడటం మొదలుపెట్టాడు. ఇద్దరి బాడీ స్ట్రక్చర్, ఎత్తు, కుడి భుజం వాలిన తీరు అంతా ఒకేలా ఉన్నాయి. కానీ… చంద్రమౌళి చూపులు స్క్రీన్ షాట్‌లోని ఆ నల్లటి నీడ చేతి మణికట్టు మీద ఆగాయి. ఆ చీకటి మనిషి ఎడమ చేతికి ఒక మందపాటి ఇనుప బ్రేస్‌లెట్ (Bracelet) స్పష్టంగా మెరుస్తోంది.అతను వెంటనే కనకరాజు శవం ఎడమ చేతిని చూశాడు. వాడి చేతికి ఎలాంటి బ్రేస్‌లెట్ లేదు. వాడు అసలు బ్రేస్‌లెట్ వేసుకునే రకం కాదు.


“శ్రీనూ… వీడు ఆ చీకటి మనిషి కాదు!” చంద్రమౌళి గొంతులో గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది.

“అదేంటి సార్? బాడీ స్ట్రక్చర్ అంతా సేమ్ ఉంది కదా?” శ్రీను ఆశ్చర్యంగా అడిగాడు.

“స్ట్రక్చర్ ఒక్కటే, కానీ వీడి చేతికి బ్రేస్‌లెట్ లేదు. ఆ రాత్రి రిసార్ట్ గార్డెన్‌లో లావణ్యను కలిసిన ఆ చీకటి మనిషి ఎడమ చేతికి స్పష్టంగా బ్రేస్‌లెట్ ఉంది. అసలు నేరస్థుడు కనకరాజు కాదంటే… మరి వాడు ఎవడు? వాడి బాడీ స్ట్రక్చర్‌ను వాడుకుని, వీడిని ఇక్కడ చంపేసి, కేసును క్లోజ్ చేయాలని చూస్తున్న ఆ నల్లటి నీడ వెనుక ఉన్నదెవరు?” చంద్రమౌళి మళ్లీ ఒక అంతుచిక్కని ఆలోచనల చీకటి గుహలోకి మునిగిపోయాడు. .


స్థలం: రవికుమార్ స్వగృహం.

గది నిండా రోదనలు, నిశ్శబ్దం అల్లుకుపోయాయి. ఒకే ఒక్క కొడుకును కోల్పోయిన ఆ ముసలి తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. రవికుమార్ తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తుంటే, తండ్రి స్పృహ తప్పిన స్థితిలో మంచం మీద పడి ఉన్నాడు. ఇల్లు నిండా చుట్టాలు, ఊరి జనాలు నిలబడి ఉన్నారు.

అప్పుడే చుట్టాల్లోని ఒక వ్యక్తి గట్టిగా అన్నాడు, “పెళ్లయిన పంతొమ్మిది రోజులకే మొగుడిని మింగేసింది. ఆ లావణ్యే ఆస్తి కోసం రవికి విషమిచ్చి చంపేసింది. లేకపోతే అర్ధరాత్రి పూట ఆవిడ ప్రవర్తన ఏంటి? పోలీసుల విచారణలో అంతా బయటపడిందట, ఆవిడే హంతకురాలు!”

ఆ మాట వినగానే రవికుమార్ ముసలి తల్లి ఒక్కసారిగా లేచి కూర్చుంది. కళ్లల్లో నీళ్లు కారుతున్నా, ఆమె గొంతులో విపరీతమైన ఆక్రోశం, పట్టుదల కనిపించాయి. ఆమె ఆ మాట్లాడిన వ్యక్తి వైపు తిరిగి గట్టిగా కేక లేచింది.



“నోరు మూయ్! నా కోడలి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే ఊరుకోను!” ఆమె ఏడుస్తూనే ఎదిరించింది. “నా కొడుకు ఎలాంటివాడో, నా కోడలు ఎలాంటిదో నాకు తెలుసు. లావణ్య నా కొడుకు ప్రాణం. తను రవిని చంపడం ఏంటి? మీ నోటికి ఏది వస్తే అది వాగుతారా? ఆ పిల్లకు పెళ్లయి కనీసం నెల కూడా కాలేదు, తన పసుపు కుంకుమలు పోయి అక్కడ ఏడుస్తుంటే… మీరు ఇలాంటి నిందలు వేస్తారా? నా లావణ్య ప్రాణం పోయినా అలాంటి తప్పుడు పని చేయదు. అసలు హంతకుడు ఎవడో బయట తిరుగుతుంటే, నా కోడలిని అంటారా? లావణ్య నిర్దోషి… తను ఏ పాపం చేయలేదు!” అంటూ రవి తల్లి ఏడుస్తూ గట్టిగా లావణ్యను సమర్థిస్తూ నిలబడింది. చుట్టాలందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు.


స్థలం: భూపతి రెడ్డి ఫామ్‌హౌస్.

పచ్చటి చెట్ల మధ్య ఉన్న భూపతి రెడ్డి లగ్జరీ ఫామ్‌హౌస్ లోపల లైట్లు తక్కువ వెలుతురులో వెలుగుతున్నాయి.

టేబుల్ మీద ఖరీదైన మద్యం సీసాలు ఉన్నాయి. భూపతి రెడ్డి సోఫాలో రిలాక్స్‌గా కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. అతని అవతల… ఒక పటిష్టమైన బాడీ, ఎడమ చేతికి మందపాటి ఇనుప బ్రేస్‌లెట్ వేసుకుని, నల్లటి దుస్తుల్లో ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. అతను చూడటానికి నార్త్ ఇండియాలా ఉన్నాడు. అతని పేరే గంగూభాయ్.భూపతి రెడ్డి గ్లాసులో మద్యం పోసి గంగూభాయ్ వైపు నెట్టాడు.
“గంగూభాయ్… నీ పనితనం అద్భుతం. రవికుమార్‌ను ముగించావ్, ఆడిట్ ఫైల్స్ లేపేశావ్. ఆ చంద్రమౌళి గాడు ఆ నాలుగు గోడల మధ్య లావణ్య చుట్టు తిరుగుతూ అలిసిపోయి దానినే నేరస్థురాలు చేస్తాడు.. ఇక పోలీసులకి ఈ కేసులో ఎలాంటి లింకూ దొరకదు. లావణ్య జైలుకి వెళ్లడం ఖాయం,” భూపతి రెడ్డి ముఖంలో ఒక క్రూరమైన నవ్వు కనిపించింది.గంగూభాయ్ మద్యం గ్లాస్ అందుకుని ఒకే గుటకలో ఖాళీ చేశాడు. అతని ముఖంలో ఎలాంటి భావాలూ లేవు.

“గంగూభాయ్… నీతో నా పని అయిపోయింది. ఇక నువ్వు ఇప్పుడే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవచ్చు. నీకు ఇవ్వాల్సిన అమౌంట్ నీ అకౌంట్‌కి చేరిపోయింది. దిస్ ఈజ్ ఎ స్మాల్ పార్టీ ఫర్ యు,” అంటూ భూపతి రెడ్డి చిన్న సెలబ్రేషన్ ముగించాడు.

సెలబ్రేషన్స్ పూర్తి కాగానే, అర్ధరాత్రి వేళ గంగూభాయ్ తన బ్యాగ్ పట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా లోకల్ రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాడు. స్టేషన్ ప్లాట్‌ఫారమ్ మీద జనాలు పెద్దగా లేరు. లైట్లు మసకగా వెలుగుతున్నాయి. గంగూభాయ్ రైలు కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు.
సరిగ్గా అదే సమయంలో… సీధోని రిసార్ట్ వెయిటర్ (నిన్న రాత్రి రవికుమార్ రూమ్‌కి గ్రీన్ టీ తీసుకెళ్లినవాడు) తన ఊరికి వెళ్లడం కోసం అదే రైల్వే స్టేషన్‌కి వచ్చాడు.



వాడు ప్లాట్‌ఫారమ్ మీద నడుచుకుంటూ వెళ్తుండగా, అక్కడ నిలబడి ఉన్న గంగూభాయ్ మీద వాడి చూపు పడింది. గంగూభాయ్ ఎడమ చేతికి ఉన్న ఆ ఇనుప బ్రేస్‌లెట్ మసక వెలుతురులో మెరిసింది.


వెయిటర్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. వాడి కళ్లు భయంతో, ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నిన్న రాత్రి జరిగిన సీన్ వాడి కళ్లముందు కదలాడింది.
“అరేయ్… వీడు… వీడే కదా ఆరోజు రాత్రి! నేను రూమ్ నెంబర్ 207 కి గ్రీన్ టీ ఇవ్వడానికి వెళ్లినప్పుడు… కారిడార్ చివర విండో (కిటికీ) నుండి కిందకి దిగిపోయింది వీడే కదా! ఆ బ్రేస్‌లెట్, ఈ నడక… వంద శాతం వీడే. వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ విషయం వెంటనే పోలీసులకి చెప్పాలి,” అనుకుంటూ వెయిటర్ వణుకుతున్న చేతులతో కంగారుగా జేబులోంచి ఫోన్ బయటికి తీశాడు…

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *