ట్రాజెడీ కథలు

Written by

in

శ్వాస కూడా భారమైంది

గోడపై ఉన్న గడియారంలో చిన్న ముళ్ళు 11 మీదకు, పెద్ద ముళ్ళు 12 మీదకు వెళ్ళి ‘టంగ్’ మంటూ ఒక పెద్ద శబ్దం చేశాయి.
బహుశా ఆ టంగ్ మని శబ్దమే పైవాడు నాకు పంపిన సందేశం? “ఇకపై నీకు ఈ భూమిపై నూకలు లేవు, నా దగ్గరకు వచ్చేయ్” అని? ఎప్పటి నుంచో నేను కూడా సిద్ధంగానే ఉన్నాను. “సమాజం చూసే చెడు చూపుకి,రక్తం తాగే రాకాసి మాటలు భరించలేక నేను కూడా ఈ సమయంకోసమే ఎదురుచూస్తున్న ” అని మనసులో అనుకుంటుంది దేవి.ఇంతలో దేవి తల్లి జానకి “ఒసేయ్, ఇంట్లో కారం లేదు. నేను అలా మిల్లు దగ్గరకు కారం ఆడించి వస్తాను. ఇంతలో మీ నాన్న వస్తే తినడానికి అన్నం పెట్టు” అంటూ గట్టిగా అరిచింది.తల్లి మాటలకు ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా విన్నట్టే అనిపించిన దేవి మనసులోని ఆలోచనల వేగానికి అసలు భంగం కలగలేదు. ప్రహరీ గేటు మూసుకున్నట్టు శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో దేవి ఆలోచనల నుండి విశ్రాంతి తీసుకొని గడియారం వైపు మరలా చూసింది.సమయం 11 గంటల 7 నిమిషాలు అయింది. అంటే తను అనుకుంటున్న దేవుడు పిలిచి 7 నిమిషాలు దాటింది. నెమ్మదిగా చైర్ నుండి లేచి… హదావిడిగా తన గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకొని, కిటికీలు మూసేసి, అలమరాలో ఉండే తన బట్టలన్నీ ఒకటి ఒకటిగా తీస్తోంది.కొన్ని బట్టలు నేలపై పడి ఉన్నాయి. అలమరాలో మరికొన్ని, దేవి చేతిలో కొన్ని బట్టలు ఉన్నాయి. చివరకు తనకు కావలసిన నీలం రంగు హెవీ జర్దోసీ అనార్కలి గౌన్ దొరికింది. మిగిలినవన్నీ వదిలేసి కేవలం ఆ అనార్కలి గౌన్‌ను తన చేతుల్లోకి తీసుకొని గుండెకు హత్తుకుంది. ఆ డ్రెస్ నుండి వచ్చే పరిమళాన్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని తన ప్రియుడి గురించి ఆలోచిస్తోంది.


(Flashback)


అవి దేవి కాలేజీ చదివే రోజులు…. 10వ తరగతిలో మంచి మార్కులు రావడంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో తనకి ఫ్రీ సీటు వచ్చింది. ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి ఇంతవరకు ఎవరికీ దక్కని అవకాశం అది. అందుకని దేవిని ఒక చదువుల సరస్వతిగా చూసేవారు ఆ ఊరి జనాలు. తన చుట్టాలలో కొందరైతే దేవికి ముందు ‘సరస్వతి’ అని చేర్చి ‘సరస్వతీదేవి’ అని పిలిచేవారు.ఇదంతా దేవికి కాస్త గర్వాన్ని పెంచింది. పరీక్షలు ఎప్పుడూ పెట్టీనా ఫస్ట్ తనదే అని. కానీ కాలువ నుండి నదిలోకి వచ్చాననే సంగతి తను తెలుసుకోలేకపోయింది. అందుకని కాలేజీ మొదటి సంవత్సరంలో, ఇన్నాళ్ళూ ఊరిలో అణిగిపోయిన తన మనసు ఇక్కడ స్వేచ్ఛగా రెక్కలు విప్పింది. పంజరం లేని చిలుక ఎక్కడికైనా వెళ్తుంది… ఏమైనా చేస్తుంది.అందంలో సూపర్ గుడ్‌కు ఏమాత్రం తీసిపోని దేవిపై, కిరణ్ అనే క్లాస్‌మేట్ మనసు పారేసుకున్నాడు. కిరణ్ ఒక్కడే కాకుండా మరికొందరు కూడా ఆమెను ఇంప్రెస్ చేయాలని చాలా ట్రై చేశారు. ఆ అందరిలో కిరణ్ కాస్త నచ్చినా, దేవి అతని భావాలతో రెండేళ్ళు ఆడుకుంది.సినిమాల్లో చూపించే తింగరితనంతో దేవి తనతో ఆడుకుంటోందని తెలిసినా కిరణ్ ఏనాడూ తనని ద్వేషించలేదు, కోపం చూపించలేదు, తనని కాదని వేరే అమ్మాయిని ప్రేమించలేదు. రోజురోజుకూ తనపై ప్రేమను ఇంకా పెంచుకున్నాడు. తను చేసిన కొన్ని అల్లరి పనులను కిరణ్ కూడా ఎంజాయ్ చేశాడు.ఆరోజు సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ ముగిసే రోజు. అదేరోజు మరో విశేషం… దేవి పుట్టినరోజు కూడా! ఎగ్జామ్స్ రాసి తన లగేజ్‌తో నేరుగా నూజివీడు రైల్వే స్టేషన్‌కు వెళ్ళింది. ఆరోజు వరకు దేవి ఎలాంటి పనులు చేసినా ప్రేమించాడే కానీ, తనకు దూరమవ్వాలని కిరణ్ ఎప్పుడూ అనుకోలేదు.బర్త్‌డే సందర్భంగా ఆమె చేత కేక్ కట్ చేయించి ఆ రోజును ఒక మెమొరబుల్ డే చేయాలని కిరణ్ బేకరీకి వెళ్ళి స్పెషల్ కూల్ కేక్ ఆర్డర్ చేశాడు. బెలూన్లు, స్ప్రేలు, ఆమెకు ఇష్టమైన డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్లతో పాటు ఎంతో స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేశాడు.పాండాల పుట్టిన ఇల్లయిన చైనా దేశంలోని ‘చెంగ్దూ’ నగరం నుండి ఒక క్యూట్ పాండా టెడ్డీ బేర్‌ను తెప్పించి, స్పెషల్ ప్యాకింగ్ చేయించుకుని నేరుగా స్టేషన్‌కు వచ్చాడు. కానీ అక్కడ చూసిన దృశ్యానికి అతనికి పెద్ద షాక్ తగిలింది.స్టేషన్ అంతా పూలతో నిండిపోయింది. ప్రతి ఒక్కరి చేతుల్లో బంతి, చామంతి పువ్వులు ఉన్నాయి. కానీ ఒక్కడి చేతిలో మాత్రం ఎర్రటి గులాబీ పువ్వు ఉంది. బర్త్‌డే విషెస్ చెబుతూ దేవిపై పూల వర్షం కురుపిస్తున్నారు స్టేషన్‌లో ఉన్న జనాలు. ఇదంతా చూసి కిరణ్ గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. దేవికి పది అడుగుల దూరంలో ఆగిపోయి నిశ్చేష్టుడై చూస్తున్నాడు కిరణ్.దేవి తన రెండు చేతులతో మొహం దాచుకుంటూ నవ్వుతూ ఆ సర్ప్రైజ్ సెలబ్రేషన్‌కు  ఫిదా అయిపోయింది. గులాబీ పట్టుకున్న ఆ అబ్బాయి దేవి ముందుకు వచ్చి, “మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డార్లింగ్” అన్నాడు.ఆ గులాబీని అందుకుంటూ, “థ్యాంక్యూ రాకేష్… ఐ లవ్ యు సో మచ్” అంది దేవి. రాకేష్ వెంటనే ఒక కవర్ దేవి చేతిలో పెట్టాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో నీలం రంగు హెవీ జర్దోసీ అనార్కలి గౌన్ ఉంది. అది చూడగానే దేవి ఆనందానికి అవధులు లేవు.దేవి భరించలేని ఆనందంలో ఉంటే… కిరణ్ అంతే భరించలేని వేదనతో ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
ఇద్దరి ఫీలింగ్స్‌కు బ్రేక్ వేస్తూ, దూరం నుండి స్టేషన్ పట్టాలపై ‘పూమ్’ అంటూ దూసుకొస్తున్న రైలు హారన్ వినపడగానే కిరణ్ కళ్ళు తిరిగి పడిపోయాడు.ఇంతకీ రాకేష్ ఎవరో కాదు… అదే ట్రిపుల్ ఐటీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న కుర్రాడు. బాగా డబ్బున్నవాడు. చదువులోనే కాదు, అన్నింటిలోనూ హుషారుగా ఉండేవాడు. అందుకే దేవి అందానికి ముగ్ధుడై ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ రెండేళ్ళుగా రాకేష్‌కు ఎలాంటి సమాధానం చెప్పని దేవి, అంతిమంగా రాకేష్ ప్రేమను ఫీల్ అయి యాక్సెప్ట్ చేసింది.ఆ తర్వాత సెలవుల్లో వాళ్ళు మాట్లాడుకోని గంటంటూ లేదు.


తిరిగి కాలేజీ ప్రారంభమై దేవి థర్డ్ ఇయర్‌లోకి అడుగుపెట్టిన 45 రోజుల తర్వాత… రాకేష్ చేసిన ఆ బర్త్‌డే సర్ప్రైజ్ సెలబ్రేషన్ కాలేజీ అంతా తెలిసిపోయింది. వాళ్ళ ప్రేమకు అందరూ సహాకరించసాగారు… ఒక్క కిరణ్, అతని స్నేహితులు తప్ప! అలాగని ఏ రోజూ కిరణ్ వాళ్ళ ప్రేమపై పగ తీర్చుకోలేదు.దేవి, రాకేష్‌ల ప్రేమ కేవలం చూపులకు, మాటలకే పరిమితం కాకుండా, ఇద్దరిలోనూ అంతకుమించిన శారీరక అనుబంధాన్ని పెంచుకోవాలనే కోరిక కలిగింది. అందుకు కలుసుకోవడానికి వాళ్ళకో ఏకాంతమైన ప్లేస్ కావాలి.


కానీ ట్రిపుల్ ఐటీ కాలేజీలో అబ్బాయిలకు, అమ్మాయిలకు విడివిడిగా హాస్టల్స్ ఉంటాయి. పైగా హాస్టల్, కాలేజీ ఒకే ప్రహరీ లోపల ఉండేసరికి కలుసుకోవడం చాలా కష్టం. సరైన సమయం కోసం ఇద్దరూ వేచి చూస్తున్నారు.అందుకు దేవి ఒక ప్లాన్ వేసింది. ఆగస్టు 15 సందర్భంగా కాలేజీలో గేమ్స్ కండక్ట్ చేశారు. అందరూ ఆటల హడావిడిలో ఉన్నారు. ఇదే సరైన సమయమని రాకేష్‌ను తన రూమ్‌కి రమ్మని మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసి, ఫ్రెండ్స్ సహకారంతో రాకేష్ గర్ల్స్ హాస్టల్ అవుట్‌సైడ్ ఉన్న సీసీ కెమెరాలను తప్పించుకొని ఎవరికీ తెలియకుండా దేవి రూమ్‌కి చేరుకున్నాడు.రాకేష్, దేవిల శారీరక కలియక ఇది రెండోసారే అయినా… ఈ కలియక వల్ల కలిగే అనుభవం వాళ్ళ జీవితంలోనే ఒక మరుపురానిది. ఆ రూమ్‌లో ఆకలి ఆలోచనలు లేవు, చదువుల సమస్యలు లేవు… కేవలం ఒకరినొకరు శృంగార చదువులోనే వాళ్ళ ఆకలిని తీర్చుకుంటున్నారు. లేత వయసు నుండి పరువాల వయసుకొచ్చిన ఆ ఇద్దరి తనువులు రోజంతా అలసట లేని ఒక రసవంతమైన యుద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి.వాళ్ళ అనుభూతి ఏ కవి వర్ణించలేనిది. వర్ణించే ప్రయత్నం చేసినా ఇంకా కొంత భాగం మిగిలిపోయేలా అంత గాఢంగా సాగింది. ఆ నాలుగు గోడల హాస్టల్ గదిలో ఒకరి శ్వాసను మరొకరు పీల్చుకుంటూ, అదే ఆహారంగా బ్రతికారు.అలా దేవి రూమ్‌లో రాకేష్ ఉండిపోవడానికి అది రెండో రోజు రాత్రి. లేడీ హాస్టల్ వార్డెన్ సరోజినీ దేవికి… ఆ రూమ్ ఎప్పుడూ గడిపెట్టే ఉండడం చూసి అనుమానం వచ్చి డోర్ కొట్టింది. ఆ సమయంలో మంచు కురిసిన లేత ఆకుల వంటి ఒంటిపై నూలుపోగు లేకుండా, శరీరాలు అలసిపోయి నిద్రిస్తున్న వేళ అది. సరోజిని తలుపు కొట్టే శబ్దం రాకేష్ నిద్రను పాడుచేసింది.మెలుకువ వచ్చిన రాకేష్ ఆకస్మాత్తుగా తలుపు సగం తీసి సరోజిని చూసి, గుండె ఆగినంత పనై మళ్ళీ డోర్ మూసేసి దేవిని లేపాడు. ఏం చేయాలో తెలియక దేవి తన పెద్ద సూట్‌కేస్ ఓపెన్ చేసి అందులో దాక్కోమని చెప్పింది. తను చెప్పినట్టే రాకేష్ ఆ సూట్‌కేస్‌లో ఇరుక్కుని దాక్కున్నాడు.చెల్లాచెదురుగా ఉన్న బట్టలన్నీ సర్ది, తను బట్టలు వేసుకుని, రాకేష్ ఆనవాళ్ళు ఆ రూమ్‌లో లేకుండా చేసి డోర్ ఓపెన్ చేసింది దేవి.అప్పటికే దేవి రూమ్ బయట సరోజినితో పాటు హాస్టల్‌లో ఉండే కొందరు అమ్మాయిలు, అక్కడ పనిచేసే వంటవాళ్ళు కూడా వచ్చేసారు. భయంతో చమటలు పడుతున్న దేవిని వార్డెన్ సరోజిని గట్టిగా నిలదీసింది. ఇక్కడ ఎవరూ లేరని దేవి ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఆ గదిలో పైపైన అంతా వెతికినా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. అంత పకడ్బందీగా రూమ్‌ని సర్దేసింది దేవి. కానీ ఎక్కడో చిన్న అనుమానంతో వార్డెన్ సరోజిని ప్రస్తుతానికి అక్కడ నుండి బయటకొచ్చింది.వార్డెన్ సరోజిని వెళ్ళిపోయిన తర్వాత రాకేష్ అతికష్టం మీద ఆ సూట్‌కేస్ నుండి బయటపడ్డాడు. ఇద్దరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. “ఇప్పుడు ఏం చేద్దాం?” అని ఇద్దరూ కూర్చుని తీవ్రంగా ఆలోచించసాగారు.

(సీన్ కట్ చేస్తే… ప్రస్తుత కాలం)


గతాన్ని గుర్తుచేసుకుంటున్న దేవి కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి. చేతిలో ఉన్న నీలం రంగు గౌన్‌ను పక్కన పెట్టి, దానికి మ్యాచింగ్ అయిన ఆ నీలం రంగు చున్నీని తీసుకుంది. శ్వాస భారంగా మారుతుండగా ఆ చున్నీని సీలింగ్ ఫ్యాన్‌కు ముడి వేసి, మరో కొసను తన మెడకు చుట్టుకుంది. సరిగ్గా అదే సమయంలో… కింద ఇంటి మెయిన్ గేట్ తెరుచుకున్న పెద్ద శబ్దం వినిపించింది.ఆ శబ్దంతో దేవికి తన తండ్రి వచ్చాడని అర్థమైంది. వెంటనే చున్నీని మెడ నుండి తీసేసి, కళ్ళు తుడుచుకుని హాల్‌లోకి వచ్చేసింది. ఏమీ ఎరగనట్టు తండ్రికి అన్నం వడ్డించింది. తండ్రి తింటుంటే… ఆమె మనసు మళ్ళీ ఆనాటి రాత్రి హాస్టల్‌లో జరిగిన మిగిలిన సంఘటన వైపు వెళ్ళింది.


(మళ్ళీ ఫ్లాష్ బ్యాక్…)


సమయం అర్ధరాత్రి 11:45 నిమిషాలు అయింది. దేవి రూమ్‌లో రాకేష్, దేవిలు కూర్చుని ఎలాగైనా రాకేష్‌ను అక్కడి నుండి సురక్షితంగా పంపించాలని ప్లాన్ వేస్తున్నారు. అప్పుడు వాళ్ళకో ఆలోచన వచ్చింది. సాధారణంగా ఆ హాస్టల్లో అర్ధరాత్రి 12 గంటలకల్లా అందరూ గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఆ సమయానికి ఎవరూ మెలకువగా ఉండరు. కాబట్టి సరిగ్గా 12 గంటలకు ఐదు నిమిషాల ముందు వాచ్‌మెన్‌కు మందు (alcohol) ఇచ్చి మేనేజ్ చేస్తే, రాకేష్ ఎవరి కంటా పడకుండా తప్పించుకోవచ్చు.ఈ ప్లాన్‌కు ఇద్దరూ ఒప్పుకున్నారు. వెంటనే దేవి ఫోన్ నుండి రాకేష్ ఫ్రెండ్స్ లో ఒకరికి కాల్ చేసి ఈ ప్లాన్ చెప్పి, వాచ్‌మెన్‌ను డ్రింక్‌తో మేనేజ్ చేయమన్నారు.సరిగ్గా సమయం 12 గంటలు అయింది. హాస్టల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ప్లాన్ ప్రకారం అంతా సేఫ్ అనుకుని రాకేష్ నెమ్మదిగా డోర్ తీసి బయటకు ఒక అడుగు పెట్టాడు. కానీ… దురదృష్టం ముంచుకొచ్చింది. అక్కడ చీకట్లో పొంచి ఉన్న వార్డెన్ సరోజిని, రాకేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. లైట్లు ఆన్ అవ్వడంతో హాస్టల్ అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది.


(ప్రస్తుత కాలం…)


ఆనాటి భయానక దృశ్యం గుర్తొచ్చేసరికి దేవి ఒళ్ళు వణికిపోయింది. తండ్రి భోజనం ముగించి బయటకు వెళ్ళగానే… దేవి మళ్ళీ పరుగున తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది. ఈసారి ఆమె ఏమాత్రం ఆలస్యం చేయలేదు. గుండె మొద్దుబారిపోయింది. ఆ నీలం రంగు చున్నీని ఫ్యాన్‌కు తగిలించి, స్టూల్ ఎక్కి, మెడకు ఉరితాడు బిగించుకుంది. ఒక్క ఉదుటున స్టూల్‌ను కాలితో తన్నేసింది. కొద్ది క్షణాల పాటు ఆమె ప్రాణం కొట్టుకుంది… ఆ తర్వాత శ్వాస శాశ్వతంగా భారమై ఆగిపోయింది. చదువుల తల్లి దేవి ఫ్యాన్‌కు శవమై వేలాడింది.


ఆనాడు హాస్టల్లో జరిగిన ఆ ప్రేమ వ్యవహారం, వార్డెన్ సరోజిని ఇచ్చిన కంప్లైంట్ ద్వారా స్థానిక న్యూస్ ఛానెళ్ళలో బ్రేకింగ్ న్యూస్‌గా ప్రసారమైంది. ఆ వార్త దావానలంలా దేవి చుట్టుపక్కల గ్రామాలకు, చుట్టాలకు పాకిపోయింది.


“ఊరంతా చదువుల తల్లి ‘సరస్వతీదేవి’ అనుకున్నామురా… కానీ ఈమె శృంగార దేవత ‘సరసాలదేవి’ అయి కూర్చుంది” అంటూ ఊళ్ళో ప్రతి ఒక్కరూ దేవి క్యారెక్టర్‌ను తూలనాడడం మొదలుపెట్టారు. ఒకప్పుడు గర్వంగా తిరిగిన ఆ కుటుంబం సమాజంలో తలదించుకోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఆ నిందల తాకిడి, అవమానాల మాటల బాణాలు దేవి మనసును ముక్కలు చేశాయి. సమాజం వేసే నిందలను భరించలేక, తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా చివరకు దేవి ఇలా ఉరివేసుకుని తన జీవితాన్ని ముగించింది.కానీ, ఈ అనంత విశ్వాన్ని నడిపించే “కాలం” అనే ఆకాశవాణి ఈ సమాజపు కళ్ళు తెరిపిస్తూ ఇలా గర్జిస్తోంది:
“ఓ సమాజమా! ఒక తప్పు దొరికితే చాలు… దానికి వేల రంగులు పూసి, ఆ మనిషి ప్రాణం పోయే వరకు వేటాడే మీ బుద్ధి ఎప్పుడు మారుతుంది? ఆనాడు దేవి చేసింది తప్పే కావచ్చు, చదువుకునే వయసులో పక్కదారి పట్టి ఉండవచ్చు. కానీ, రెండు హృదయాల కలయికను అంతటి ఘోర అపరాధంగా మార్చి, ఒక అమ్మాయి శీలాన్ని బజారున పడేసి  పొందే మీ కసి సరైనదేనా?


అదే గదిలో దేవి కంటే ముందు రాకేష్ అడుగుపెట్టాడు. కానీ మీ నోళ్ళు కేవలం ‘దేవి’ని మాత్రమే నిందించాయి. ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడూ ఆడదాని కన్నీటితోనే తన అహంకారాన్ని తృప్తి పరుచుకుంటుంది. చదువుల సరస్వతిని రాత్రికి రాత్రే ‘సరసాలదేవి’గా మార్చి, ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేసిన మీ మాటల బాణాల వెనుక ఉన్నది రాక్షసత్వమే కానీ న్యాయం కాదు.
శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, బుద్ధి చెప్పడానికి తల్లిదండ్రులు ఉన్నారు… కానీ ఒక మనిషి ప్రాణం తీసుకునేలా అవమానించే హక్కు ఈ లోకంలో ఎవరికీ లేదు. దేవి ఉరితాడుకు వేలాడింది కేవలం చున్నీతో కాదు… మీ నిందల భారంతో! ఈ ఆత్మహత్యకు కారకులు మీరే!

కథ 2

శ్వాస కత్తిలా కోసింది

కరణం గారి వీధి చివర్న ఒక పాత హాస్పిటల్ ఉంది. దాన్ని కట్టించింది రాజేష్ నాన్న రమేష్. అక్కడ డాక్టర్ గా పని చేసింది రాజేష్ అమ్మ సావిత్రి. ఆ వీధిలో వాళ్ళిద్దరూ లేని రోజు వస్తుందని ఎవరూ అనుకోలేదు.

ఆ రోజు హాస్పిటల్ కి కొత్త డయాలసిస్ మెషిన్ తీసుకురావడానికి రమేష్, సావిత్రి హైదరాబాద్ బయలుదేరారు. వెళ్ళే ముందు సావిత్రి రాజేష్ తో ఇలా చెప్పింది. “డాడీ. నేను నాన్న చిన్న పనిపై హైదరాబాద్ వెళుతున్నాం. రేపటికి వచ్చేస్తాము. నీకు బోలెడు చాకొలేట్లు తీసుకొస్తాము. నువ్వు బుద్దిగా స్కూల్ కెళ్ళి పెద్దమ్మ మాట వినాలి. సరే నా?”
“సరే అమ్మ! కానీ నాకు ప్రభాస్ అన్న గ్రీటింగ్ కార్డ్స్ తీసుకురండి.”
మరసటి రోజు సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన రాజేష్ ని పక్కింటి పెద్దమ్మ గుమ్మం దగ్గరే ఆపింది. ఆమె మొహం చూస్తేనే తెలిసింది ఏదో జరిగిందని. కొంత సేపటికి పెద్దనాన్న వచ్చి పక్కన కూర్చున్నాడు.

“బస్ యాక్సిడెంట్ అయింది రాజేష్. మీ అమ్మా నాన్న చనిపోయారు.”

రాజేష్ ఏమీ మాట్లాడలేదు. లేచి బయటకి వెళ్ళాడు. హాస్పిటల్ గేట్ దగ్గర నిల్చున్నాడు. అప్పుడు లోపల లైట్లు వెలుగుతున్నాయి. పేషెంట్లు ఉన్నారు. నర్సులు తిరుగుతున్నారు. కానీ అమ్మ మాత్రం లేదు.

నెమ్మదిగా అన్నీ ఆగిపోయాయి. డాక్టర్ లేదు, డబ్బు లేదు, పేషెంట్లు రావడం మానేశారు. హాస్పిటల్ మూతపడింది. అప్పులు తీర్చలేక కుటుంబీకులు ఇల్లు లాక్కున్నారు. వేరే చోటు లేక రాజేష్ ఆ పాత హాస్పిటల్ లోకి వచ్చాడు.

సగం పగిలిన అద్దాలు, గడియ లేని తలుపులు, తిరగని ఫ్యాన్లు. నాన్న కట్టించిన గోడలు, అమ్మ నడిచిన వరండాలు. రాత్రిపూట చీకటిలో చెదపురుగుల సౌండ్ తప్ప మరో అలికిడి లేదు. వర్షం పడితే పైన్నుండి నీళ్ళు పడతాయి. అయినా రాజేష్ కి ఆ హాస్పిటల్ సేఫ్ గా అనిపించింది. ఆ గోడల మీద అమ్మానాన్నల స్పర్శ ఉంది కదా.

రిలేటివ్స్ చేరదీయకపోయినా ఏనాడూ భిక్షం ఎత్తలేదు. కూలీపనికి వెళ్తూ వచ్చిన డబ్బుతో తిండి సామాన్లు కొనుక్కుంటూ, మూడు జతల బట్టలతో జీవిస్తున్నాడు. చాన్స్ దొరికినంత వరకు ఎవరు ఏ పని చెప్పినా చేశాడు. తన పరిస్థితి తలుచుకొని ఎవరు పైన కక్ష పెట్టుకోలేదు.

రాజేష్ కి ఒకే ఒక్క బలమైన కోరిక ఉంది. తనకొక సొంత ఇల్లు ఉండాలి. అది కూడా ఒకప్పుడు తన పెదనాన్న లాగేసుకున్న ఆ ఇంద్ర భవనంకంటే చాలా పెద్దగా ఉండాలి.

—వనజ తల్లిదండ్రులు రోడ్డు పక్కన బతికే వాళ్ళు. ప్లాస్టిక్ వస్తువులు ఎత్తుకుని అమ్ముకుంటూ జీవించేవాళ్ళు. వనజకి అప్పుడు ఆరేళ్ళు.
ఆ రోజు సాయంత్రం తల్లిదండ్రులు రోడ్డు పక్కన ప్లాస్టిక్ ఎత్తుకుంటున్నారు. వనజ కొంచెం దూరంలో ఒక చెట్టు కింద కూర్చుని ఉంది. అంతలో వేగంగా వచ్చిన ఒక బస్ అదుపు తప్పింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్ అది.
ఆ బస్ రోడ్డు పక్కకి దూసుకుపోయి వనజ తల్లిదండ్రులను గుద్దేసింది.
వనజ చూస్తూ ఉండిపోయింది. ఏడవలేదు. అరవలేదు. ఆరేళ్ళ వయసుకి ఏం జరిగిందో అర్థం కావడానికి సమయం పట్టింది.
ఆ బస్ లో అప్పుడు ఒక డాక్టర్, ఆమె భర్త కూర్తి హైదరాబాద్ వెళ్తున్నారు — ఒక కొత్త మెషిన్ తీసుకురావడానికి.—
కొన్ని సంవత్సరాల తర్వాత రాజేష్ కి కొత్తగా కడుతున్న ఒక అపార్ట్‌మెంట్లో పెయింటింగ్ పని దొరికింది. పదో అంతస్తు. చేతిలో బ్రష్, కళ్ళలో ఏకాగ్రత. చుట్టూ సిమెంట్ వాసన, పనివాళ్ళ అలికిడి ఉన్న కానీ రాజేష్ కి అవేమీ వినిపించడం లేదు.

ఆ చిత్రం నెమ్మదిగా తయారవుతోంది. ఒక మనిషి ఒక స్త్రీని భుజాల మీద నడిపిస్తున్నాడు. ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. అతను ఆమెను ఒక అందమైన భవనం లోపలికి తీసుకెళ్తున్నాడు. ఆ భవనం తలుపు తెరుచుకుని ఉంది — లోపల వెలుతురు ఉంది. మిగతా అన్నీ తొందరగా వేసినా, ఆ వెలుతురు మాత్రం రాజేష్ నెమ్మదిగా, పొరపొరగా వేశాడు.
అదే సమయంలో కింద రోడ్డు మీద వనజ తన సంచి భుజాన వేసుకుని నడుస్తోంది. అపార్ట్‌మెంట్ గోడ దాటేటప్పుడు ఆగిపోయింది. తల పైకెత్తింది. చిత్రం చూసింది.

ఆ చిత్రంలో ఆ స్త్రీ మొహంలో భయం లేదు. అతని భుజాల మీద నడుస్తూ కూడా ఆమె తల నిటారుగా ఉంది. గౌరవంగా ఉంది.

“ఇలాంటి మనిషి ఉంటాడా నిజంగా? ” అనుకుంటూ వనజ అక్కడే నిల్చుండిపోయింది. సంచి కింద పెట్టింది. చూస్తూనే ఉంది.

కొంత సేపటికి రాజేష్ కిందకి చూశాడు. వనజ కనిపించింది. ఆమె చూపు చిత్రం మీద నుండి తప్పడం లేదు. రాజేష్ కిందికి వచ్చాడు. వనజ పక్కన నిల్చున్నాడు.

“నచ్చిందా?” అన్నాడు.

వనజ తల తిప్పింది. రాజేష్ ని చూసింది.

“ఆ మనిషి ఎవరు?” అని అడిగింది.

“తెలియదు.” అన్నాడు రాజేష్.

“మరి ఎందుకు వేశావు?”

రాజేష్ కొంచెం సేపు మాట్లాడలేదు. “ఇలా ఉండాలని అనిపించింది. అందుకే.”

వనజ మళ్ళీ పైకి చూసింది. “ఆ స్త్రీ మొహంలో భయం లేదు.” అంది నెమ్మదిగా.

రాజేష్ కి అర్థమైంది ఆమె చిత్రాన్ని చదివింది అని.



మర్నాడు కూడా వనజ అదే దారిలో వచ్చింది. పైకి చూసింది. రాజేష్ కిందికి చూశాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. వనజ వెళ్ళిపోయింది.

మూడో రోజు రాజేష్ కిందికి వచ్చాడు. “రోజూ వస్తావు.” అన్నాడు.

“ఇదే నా దారి.” అంది వనజ.

“చిత్రం చూస్తావు.”

“అవును చూస్తాను.”

“ఎందుకు?”

వనజ కొంచెం సేపు మాట్లాడలేదు. “పూర్తవుతుందేమోనని.”

రాజేష్ నవ్వాడు. వనజ నవ్వలేదు కానీ మొహం కొంచెం తేలిగ్గా అయింది.

” నీ పేరు? “

” వనజ “” మరి నా పేరు అడగవా? “” అవసరం లేదా? “” లేదు ” అంటూ వెళ్ళిపోయింది.

వారం గడిచింది. రాజేష్ పని అయిపోయే సమయానికి వనజ వస్తుంది. ఇద్దరూ అపార్ట్‌మెంట్ కింద ఉన్న టీ కొట్టు దగ్గర నిల్చుంటారు. రాజేష్ రెండు టీలు తీసుకుంటాడు. వనజ డబ్బు తీయబోతుంది.

“వద్దు.” అంటాడు రాజేష్.

“వేరే వాళ్ళు సొమ్ము నాకొద్దు.” అంటుంది వనజ.

ఈ మాట రాజేష్ కు చాలా నచ్చింది. ఫ్రీ గా వస్తే ఏదైనా తినడానికి సిద్ధంగా ఉన్న ఇప్పటి సమాజంలో ఇలాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు.”పర్వాలేదు నేను ఇస్తాను.” అని అన్నాడు.

“నాకు అలవాటు లేదు.” అని వనజ తన టీ డబ్బులు ఇచ్చింది.

రాజేష్ తన పెద్దమ్మ పెదనాన్న గుర్తొచ్చారు. వాళ్ళు చనిపోయి చాలా కాలం అయి ఉంటుంది. వాళ్ళతో వనజాని పిలుచుకుంటూ ఆలోచిస్తున్నాడు.” బాస్  మీ టీ కూడా రెడీ , తీసుకోండి” అంది వనజ.

టీ తీసుకుంటూ”టీ తాగు వనజా.” అన్నాడు నెమ్మదిగా. వనజ తీసుకుంది.

ఒక సాయంత్రం వనజ అడిగింది — “నువ్వు ఎక్కడ ఉంటావు?”

“హాస్పిటల్లో.”

వనజ అర్థంకానట్టు చూసింది.

“పాత గవర్నమెంట్ హాస్పిటల్. నాన్న కట్టించాడు. అమ్మ అక్కడ డాక్టర్. ఇప్పుడు పాడుబడింది. నేను అక్కడే ఉంటాను.”

వనజ ఏమీ అనలేదు. జాలి చూపు చూడలేదు. అడగలేదు ఎందుకని. అది చూసి రాజేష్ కి ఏదో తేలికగా అనిపించింంది.

రెండు నెలలు గడిచాయి. ఒక రోజు వర్షం వచ్చింది. వనజ దగ్గర గొడుగు లేదు. రాజేష్ దగ్గరా లేదు. ఇద్దరూ ఆ అపార్ట్‌మెంట్ షెడ్ కింద నిల్చున్నారు. చాలా సేపు వర్షం ఆగలేదు. ఇద్దరూ మాట్లాడలేదు.

కొంత సేపటికి వనజ అంది — “అసలు నీ గోల్ ఏంటి?”

“నాకంటూ సొంత ఇల్లు ఉండాలి. అది నా జీవితకాలపు కోరిక.” అన్నాడు రాజేష్.

వనజ వర్షం వైపే చూస్తూ అంది — “నాకు ఇల్లు వద్దు. కానీ ఒక మనిషి కావాలి. అది దొరికితే చాలు.”

రాజేష్ వనజ వైపు చూశాడు. వర్షం ఆగింది. ఇద్దరూ వేర్వేరు దారుల్లో వెళ్ళిపోయారు. కానీ అదే చివరిసారి వేర్వేరుగా వెళ్ళింది.



ఒక సాయంత్రం టీ కొట్టు దగ్గర రాజేష్ వనజకి చెప్పాడు: “నాకు నీతో ఉండాలని ఉంది వనజా. నీకు కూడా అలానే అనిపిస్తే — ఇకపై నీ టీ డబ్బులు ఎప్పటికీ నేనే కడతా.”

వనజ ఏమీ అనలేదు. చేతిలో ఉండే వేడిని టీ ని అలా చూస్తూ ఉండిపోయింది. ఒక్క నిమిషం. రెండు నిమిషాలు.

రాజేష్ కి అర్థమైంది. నిరాశగా అన్నాడు — “అందరిలాగే అనుకున్నాను. మన పరిచయాన్ని ప్రేమ అనుకున్నాను. సరే — ఆ మాట ఇకపై ఎప్పుడూ చెప్పను. మనం ఫ్రెండ్స్ గానే ఉందాం.”

వనజ మొహం తిప్పింది. కళ్ళు నిండిపోయి రెండు చుక్కలు కన్నీళ్లు కారాయి.

రాజేష్ చూశాడు. ఏం చేయాలో తెలియలేదు. టీ కప్పు పక్కన పెట్టాడు. అటు చూశాడు. ఇటు చూశాడు. లేవబోయాడు. మళ్ళీ కూర్చున్నాడు.

రాజేష్ చేస్తున్నఆ చేష్టలను వనజ  చూసింది. గట్టిగా నవ్వింది.

రాజేష్ స్తబ్ధుగా చూస్తూనే ఉన్నాడు.

వనజ కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది — “చూసింది చాలు. టీ డబ్బులు కట్టేసి రా.. మొదటిసారి నీతో సినిమా చూస్తా.”

రాజేష్ కి మాటలు రాలేదు. “నువ్వు నాతో సినిమా చూస్తావా? అంటే.. నువ్వు.. నన్ను.. ” అన్నాడు.

” అవును ఇకపై నీతోనే చూస్తాను. మనం ఒకటైపోయాం బాస్” అంది వనజ.

” బాస్ ఏంటి? రాజేష్! ”

” మొగుడిని పేరు పెట్టీ పిలవకూడదు. ”

” అవునా! సరే పెళ్ళాన్ని పేరుతో పిలవచ్చా? “

” పిలవకూడదు ”

” ఏంటి? పిలవకూడదా? ”

” అవును, కానీ ముద్దుపేరుతో పిలవచ్చు. ”

“ముద్దు పేరు హ? ” అంటూ ఆలోచించాడు. రెండు నిమిషాలు తరువాత ” ఇప్పుడు నాకేమి గుర్తు రావడం లేదు, తరువాత చెబుతా ” అంటూ సినిమా టికెట్స్ తీసుకొని హాల్ లోపలకి వెళ్ళారు.



ఆ పాడుబడ్డ హాస్పిటల్లో జీవితం మొదలైంది. ఉదయాన్నే వనజ లేస్తుంది. పాత వంటింటిలో టీ పెడుతుంది. రాజేష్ లేస్తాడు. ఇద్దరూ ఆ పాత వరండాలో కూర్చుంటారు. మాట్లాడతారు. ముద్దులు పెట్టుకుంటారు. నవ్వుకుంటారు. జాలీగా ఉంటారు.

వనజ ప్లాస్టిక్ ఏరడానికి వెళ్తుంది. రాజేష్ పనికి వెళ్తాడు. సాయంత్రం ఇద్దరూ తిరిగొస్తారు.

ఒక రోజు రాజేష్ అడిగాడు — “నీకు ఇది చాలా చిన్నగా అనిపించడం లేదా వనజా? ఈ జీవితం?”

వనజ కొంచెం సేపు ఆలోచించింది. “చిన్నది కాదు. మనమే చిన్నగా అనుకుంటున్నాం.”

రాత్రిపూట కరెంటు పోతే చీకట్లో కూర్చుంటారు. వనజ అడుగుతుంది — ” మీ నాన్న ఈ హాస్పిటల్ ఎందుకు కట్టించాడు?”

రాజేష్ తండ్రి ఆశయం గురించి చెప్తాడు. అమ్మ గురించి కూడా చెప్తాడు. డయాలసిస్ మెషిన్ గురించి చెప్తాడు. బస్ ఆక్సిడెంట్ గురించి చెప్తాడు.

వనజ వింటుంది. చివరికి అంటుంది — “మంచి వాళ్ళను ఆ దేవుడు ఎక్కువ కాలం బ్రతకనివ్వడు”

“అవును.”

“నువ్వు కూడా మీ నాన్న లాగా ఇలాంటి ఆసుపత్రి కడతావా? “

రాజేష్ నవ్వాడు — “మర్చిపోయావా నా జీవిత కల ఏదో?”

వనజ అంది — “గుర్తుంది. కానీ ఇలాగే ఉంటే నీ కల నెరవేరుతుందా?”రాజేష్ మౌనంగా ఉన్నాడు.



కాలం గడిచింది. రాజేష్ వయసు నలభై దాటింది. వనజ ప్లాస్టిక్ ఏరడం, రాజేష్ పెయింటింగ్ పనులు — అదే జీవితం. ఇల్లు లేదు, స్థలం లేదు. కానీ ఇద్దరూ ఒకరికొకరు ఉన్నారు.

ఆ సంవత్సరం కొత్త గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఒక స్కీమ్ ప్రకటించారు — ఇల్లు లేని వాళ్ళకు సెంటు స్థలం ఫ్రీగా ఇస్తారని. రాజేష్ ఈ వార్త ఫోన్ లో వింటూనే లేచాడు. వనజ మొహంలో కూడా ఏదో వెలిగింది.

“రాజేష్, మనకు ఇల్లు వస్తుందా?”

“వస్తుంది వనజా. ఈసారి వస్తుంది.”

అప్లికేషన్ వేశాడు. డాక్యుమెంట్లు సర్దాడు. గ్రామ సర్పంచ్ రమణ దగ్గరికి వెళ్ళాడు. సర్పంచ్ కాగితాలు తీసుకున్నాడు. “చూద్దాం రాజేష్.  నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది.” అన్నాడు.

కానీ లోపల జరిగింది వేరే కథ. సర్పంచ్ రమణకి ఆ లిస్ట్ లో తన బంధువులను, పార్టీ వర్కర్లను ఎక్కించాలని ఒత్తిడి ఉంది. ఒక రియల్ ఎస్టేట్ మనిషి సర్పంచ్ కి డబ్బు ఆశ చూపించాడు — రాజేష్ కి కేటాయించాల్సిన స్థలం వేరే వాళ్ళకి ఇప్పించమని. సర్పంచ్ కి అది చిన్న విషయంలా అనిపించింది. ఒక లిస్టులో ఒక పేరు మారిస్తే ఏమవుతుందని అనుకున్నాడు. తనకే తెలియకుండా అది ఒక మనిషి జీవితాన్ని తీసుకుపోతున్న నిర్ణయం అని అతనికి తోచలేదు.

గ్రామ పంచాయతీ లో లిస్ట్ పేర్లు చదివారు. రాజేష్ పేరు లిస్టులో లేదు. ఆ స్థలాలు అన్నీ సర్పంచ్ బంధువులకు, పార్టీ వర్కర్లకు వెళ్ళాయి.

రాజేష్ మళ్ళీ వెళ్ళాడు. “సర్పంచ్ గారు, నాకు నిజంగా ఇల్లు లేదు. నాన్న కట్టించిన హాస్పిటల్లో ఉంటున్నాను. ఆ స్కీమ్ నాకే కదా వర్తిస్తుంది. నాకెందుకు రాలేదు.”

సర్పంచ్ మొహం మారలేదు “లిస్ట్ అయిపోయింది రాజేష్. నెక్స్ట్ టైమ్ చూద్దాం.”

నెక్స్ట్ టైమ్ అంటే ఎప్పుడో తెలియదు. రాజేష్ కి తెలుసు.. ఇంకో నెక్స్ట్ టైమ్ రాదని.

ఆ రాత్రి హాస్పిటల్ కి తిరిగి వచ్చాడు. వనజ అడగలేదు. రాజేష్ చెప్పలేదు. ఇద్దరూ ఆ చీకట్లో కూర్చున్నారు.

కొంత సేపటికి రాజేష్ అన్నాడు “వనజా, నాన్న ఈ హాస్పిటల్ ఎందుకు కట్టించాడో తెలుసా? ఊర్లో పేదవాళ్ళకు ట్రీట్మెంట్ దొరకట్లేదని. అమ్మ ఎందుకు డాక్టర్ అయిందో తెలుసా? డబ్బు లేని వాళ్ళకు సాయం చేయాలని. వాళ్ళు మంచి పని చేశారు. కానీ చివరికి ఏం మిగిలింది?”

వనజ ఏమీ అనలేదు. రాజేష్ చేయి పట్టుకుంది. “అవన్నీ పోయినా నాకు నిన్ను ఇచ్చారు. ఇది చాలా నాకు” అంది.



ఆ తర్వాత రాజేష్ ఇంకెప్పుడూ స్కీమ్ గురించి మాట్లాడలేదు. కానీ లోపల ఆ కోరిక చనిపోలేదు. నెమ్మదిగా అది ఒక గాయంలా మారింది. అది బయటికి కనిపించనిది, కానీ లోపలే తినేస్తున్నది.

రోజులు గడిచాయి. సంవత్సరాలు గడిచాయి. రాజేష్ వయసు నలభై ఎనిమిది వచ్చింది. శరీరం బలహీనపడింది. కానీ అతని కళ్ళలో ఆ కోరిక మాత్రం అలాగే ఉండింది. చిన్నప్పుడు మూసిన తలుపు, తీరని సొంతిల్లు కోరిక.

ఒక రాత్రి రాజేష్ నిద్రలోనే చనిపోయాడు.

పొద్దున్న వనజ లేచింది. పక్కన రాజేష్ లేడు. నిద్ర నుండి లేపడానికి ముట్టుకుంది. కానీ శరీరం చల్లగా ఉంది.

వనజ ఏడవలేదు. అతని పక్కనే కూర్చుంది. చాలా సేపు మాట్లాడలేదు. మెల్లగా అతని చేయి పట్టుకుంది.

“నువ్వు ఆ గోడ మీద చిత్రం వేస్తున్నప్పుడే నేను ఒకటి గమనించా రాబోయే నీ జీవితం ఎలా జీవించాలి అనుకుంటున్నావో. ఇలాంటి మనిషి ఈ సమాజంలో ఉంటాడా అని నేను ఆ చిత్రం చూసి ఆగిపోయాను. అట్లాగే నన్ను ఇన్నాళ్లు మహారాణిలా నీ భుజాలపై మోశావు.  ఇల్లు ఇవ్వలేకపోయావు, కానీ గౌరవం ఇచ్చావు. అది చాలా మంది ఇవ్వలేరు రాజేష్.

నీకు ఇల్లు రాలేదు. నీ తప్పు కాదు. ఈ వ్యవస్థ నిన్ను చూడలేదు. నీలాంటి వాళ్ళని ఈ వ్యవస్థ ఎప్పుడూ చూడదు.”

వనజ లేచింది. బయటకి వెళ్ళింది. హాస్పిటల్ గేట్ దగ్గర నేల తవ్వింది. రాజేష్ అంత్యక్రియలు ఒంటరిగానే  చేసి తన సమాధిపై ఒక చిన్న మొక్క నాటింది.

ఏ మొక్కో తెలియదు. ఎందుకు నాటిందో వనజ చెప్పలేదు. అడిగిన వాళ్ళు కూడా లేరు.

ఆ హాస్పిటల్ గోడల మీద ఇంకా రమేష్ చేతుల స్పర్శ ఉంది. వరండాలో సావిత్రి అడుగుల గుర్తులు ఉన్నాయి. పదో అంతస్తు గోడ మీద ఇంకా ఆ చిత్రం ఉంది — ఒక మనిషి ఒక స్త్రీని భుజాల మీద నడిపిస్తూ, వెలుతురులోకి తీసుకెళ్తున్న చిత్రం. గేట్ దగ్గర వనజ నాటిన మొక్క ఉంది.

రాజేష్ కి ఇల్లు రాలేదు.

కానీ అతను బ్రతికిన చోటు, అతను ప్రేమించిన మనిషి, అతను గీసిన చిత్రం — అవి అతనివే. ఎవరూ లాగేసుకోలేనివి.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *