ఆదివారం రాత్రి…
మాదాపూర్ అపార్ట్మెంట్ బెడ్రూమ్లో నిశ్శబ్దం గనక పగిలితే వినిపించేంత ప్రశాంతత. మర్నాడు ఉదయాన్నే లండన్ తిరిగి వెళ్లాల్సి ఉన్న కిరణ్ బ్యాగ్ సర్దుతోంది అనూష. చేతులు మాత్రమే పనిచేస్తున్నాయి… మనసంతా ఎక్కడో దూరంగా ఉంది.
“షర్ట్లు అన్నీ పెట్టేశా,” అంది అనూష, సూట్‌కేస్ జిప్ లాగుతూ.
“సరే,” ఫోన్లో ఈ-టికెట్ వివరాలు చూసుకుంటూ పొడిగా సమాధానమిచ్చాడు కిరణ్.
కానీ ఇద్దరినీ ఆ మౌనం తొలిచేస్తోంది. అనూష సూట్‌కేస్‌ని మంచం పక్కన నిలబెట్టి, కొద్దిగా ధైర్యం తెచ్చుకుని పిలిచింది.”కిరణ్.”
అతను ఫోన్ నుంచి చూపు తిప్పి ఆమె వైపు చూశాడు.
“నువ్వు వెళ్లిపోతున్నావ్… కానీ మనం సరిగ్గా మాట్లాడుకోలేదు.”
“దేని గురించి?”
“అదే… నా పరిస్థితి గురించి.”
కిరణ్ ఫోన్ పక్కన పెట్టి, కాస్త గంభీరంగా ఆమె వైపు చూశాడు.”ఏం మాట్లాడాలి అనూష? నువ్వు చెప్పేదంతా విన్నాను. అమ్మ అభిప్రాయం కూడా విన్నాను. మన మధ్య ఇంకా మాట్లాడుకోవడానికి ఏం మిగిలింది?”
అనూష వేళ్లు సూట్‌కేస్ జిప్కి గట్టిగా బిగుసుకున్నాయి.”తెలియదు… కానీ నువ్వు నా మీద ఇంకా కోపంగా ఉన్నావేమో అని భయంగా ఉంది.”
“కోపం కాదు అనూష,” కాసేపు మౌనంగా ఉండి అన్నాడు కిరణ్. “కానీ… ఇంతకుముందులా ఒకరికొకరం పూర్తిగా స్పష్టంగా ఉన్నామనే నమ్మకం రావట్లేదు… అంతే.”
“ఎందుకు అలా అనిపిస్తోంది?”
కిరణ్ లేచి కిటికీ దగ్గరికి నడిచాడు. రాత్రి వేళ దూరంగా మెరుస్తున్న హైటెక్ సిటీ వెలుగుల వైపు చూస్తూ అన్నాడు.”తెలియదు… నువ్వు మాట్లాడే ప్రతి మాట వెనుక ఏదో ఒక విషయాన్ని ఇంకా దాచిపెడుతున్నావేమో అనిపిస్తోంది.”
ఆమె వైపు తిరక్కుండానే మళ్లీ అడిగాడు.”నిజంగా ఇంకా ఏమైనా ఉందా అనూష?”
“ఏం ఉంటుంది కిరణ్?” ఆమె గొంతు వణికింది.
“నాకేం తెలుసు? అందుకే నిన్నే అడుగుతున్నా.”
ఆ గదిలో కొద్దిసేపు మళ్లీ నిశ్శబ్దం రాజ్యమేలింది. అనూష గొంతు సర్దుకుని మెల్లగా అంది.”లేదు కిరణ్… ఇంకేం లేదు.”
కిరణ్ మెల్లగా తల ఊపాడు. కానీ అతని కళ్లలో ఆమె మాటలపై నమ్మకం కనిపించలేదు. ఆ సంభాషణను అక్కడితో ముగించేయాలనే అలసట మాత్రమే కనిపించింది.
మరుసటి రోజు ఉదయం…
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.కిరణ్‌ను పంపడానికి సరోజ, అనూష ఇద్దరూ వచ్చారు.
డిపార్చర్ గేట్ దగ్గర చెక్-ఇన్ లైన్లో నిలబడి, భుజాన ఉన్న హ్యాండ్ లగేజ్ సరిచేసుకుంటూ కిరణ్ ఫోన్ చూసుకున్నాడు.”ల్యాండ్ అయ్యాక ఒక మెసేజ్ పెడతా,” అన్నాడు ఇద్దరి వైపు చూస్తూ.
అనూష ఒక్క అడుగు ముందుకు వేసి అతన్ని హత్తుకోవాలనుకుంది. కానీ ఎయిర్పోర్ట్ రద్దీ… పక్కనే ఉన్న అత్తగారి చూపులు గుర్తొచ్చి ఆగిపోయి, భారంగా తల ఊపింది.
సెక్యూరిటీ చెకింగ్ లైన్లోపలికి వెళ్లేముందు కిరణ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. చిన్నగా చేయి ఊపి, ఆ తర్వాత లోపలి ప్యాసింజర్ రద్దీలో కలిసిపోయాడు.
కారులో ఇంటికి తిరిగి వస్తుంటే ఐటీ కారిడార్ ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ అప్పుడే మొదలవుతోంది.సరోజ కిటికీ బయటకి చూస్తూనే, మెల్లగా అడిగింది.”బాగానే మాట్లాడుకున్నారా… నిన్న రాత్రి?”
“ఆ… బాగానే.”అనూష సమాధానం చాలా చిన్నదిగా ముగిసింది. ఆమె గొంతులోని నీరసాన్ని సరోజ గమనించినా, మళ్లీ ఆ విషయం ప్రస్తావించలేదు.
ఇంటికి చేరగానే అనూష అలసటగా హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి ఫోన్ బయటకు తీసింది.స్క్రీన్ మీద…
3 Missed Callsఅని కనిపించింది.
ఆ మూడూ ఒకే విదేశీ కంట్రీ కోడ్ (+44) ఉన్న కొత్త నంబర్ నుంచే వచ్చాయి!ఆ కంట్రీ కోడ్ కనిపించగానే అనూష గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది.
రెండు క్షణాలు ఆ నంబర్ వైపు భయం, అయోమయంతో చూస్తూ నిలిచిపోయింది.ఆ తర్వాత ఎవరైనా గమనిస్తారనే భయంతో, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కాల్ హిస్టరీని డిలీట్ చేసేసింది!
Leave a Reply