స్థలం: వైజాగ్, రవికుమార్ నివసిస్తున్న అపార్ట్మెంట్ బయట.
సీధోని రిసార్ట్ మర్డర్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ… చనిపోయిన రవికుమార్ తల్లిదండ్రులను పరామర్శించడానికి బడా బిజినెస్ మాన్ వెంకట రెడ్డి స్వయంగా వారి అపార్ట్‌మెంట్‌కు వచ్చారు.
రవికుమార్ ఒకప్పుడు తన కంపెనీల గ్రూప్‌లో అత్యంత నమ్మకమైన ఆడిటర్ కావడం, తన తమ్ముడు భూపతి రెడ్డి పెట్టే ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా పనిచేయడం వల్లే వెంకట రెడ్డికి అతనిపై ప్రత్యేకమైన గౌరవం ఉంది.
పరామర్శ ముగించుకుని ఆయన గంభీరంగా బయటకు వస్తుండగా, ఆ సమాచారం ముందే తెలుసుకున్న మీడియా ప్రతినిధులు, న్యూస్ ఛానెల్స్ మైకులతో ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు. కెమెరాల ఫ్లాష్ లైట్ల మధ్య రిపోర్టర్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
“సార్! రవికుమార్ హత్య కేసులో అతని భార్య లావణ్యను పోలీసులు అరెస్ట్ చేశారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి సార్?”వెంకట రెడ్డి నిలబడ్డాడు.
తెల్లటి ఖద్దరు చొక్కాలో ఉన్న ఆయన ముఖంలో ఒక పదునైన నిశ్శబ్దం ఆవరించింది. ఆయన మైకుల వైపు తిరిగి చాలా కాలిక్యులేటెడ్‌గా, గంభీరంగా మాట్లాడటం ప్రారంభించాడు.
“రవికుమార్ ఒక పక్కా ప్రొఫెషనల్ మాన్. తన వృత్తి ధర్మానికి కట్టుబడి, నా తమ్ముడు భూపతి రెడ్డి చేస్తున్న వందల కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్‌ల చిట్టా మొత్తాన్ని బయటపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఆ ఆడిట్ ఫైల్స్ బయటపడితే తన అక్రమ సామ్రాజ్యం కూలిపోతుందని భయపడే శక్తులే… ఈ హత్య వెనుక ఉన్నాయి. కానీ చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు మాత్రం పైనుండి వస్తున్న పొలిటికల్ ప్రెజర్ వల్ల అసలైన హంతకులను వదిలేసి, ఒక అమాయకురాలైన ఆడపిల్ల లావణ్యను బలిపశువును చేశారు. నా సంస్థల్లో పనిచేసే వ్యక్తుల భద్రత, వారి కుటుంబాల న్యాయం నా బాధ్యత. రవికుమార్ మరణానికి కారణమైన ఆ ప్రైవేట్ నంబర్ వెనుక ఉన్న ముసుగులను, నా తమ్ముడి అక్రమాలను చట్టం ముందు నిలబెట్టే వరకు నేను విశ్రమించను!”
వెంకట రెడ్డి ఇచ్చిన ఈ పవర్ఫుల్ కార్పొరేట్ స్టేట్మెంట్తో మీడియా సర్కిల్స్ ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఆయన విసురుగా తన కారు ఎక్కి వెళ్ళిపోయారు.
స్థలం: భూపతి రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఆవరణ.
ఈ వార్త టీవీల్లో బ్రేకింగ్ న్యూస్‌గా రావడం, అన్న వెంకట రెడ్డి నేరుగా మైనింగ్ స్కామ్ ప్రస్తావన తెస్తూ సవాల్ చేయడంతో… భూపతి రెడ్డి క్యాంప్ ఆఫీస్ బయట మీడియా ప్రతినిధులు భారీగా గుమిగూడారు. భూపతి రెడ్డి బయటకు రాగానే రిపోర్టర్లు మైకులు ముందర పెట్టారు.
“సార్! రవికుమార్ హత్య వెనుక మీ మైనింగ్ స్కామ్స్ ఉన్నాయని మీ అన్న వెంకట రెడ్డి గారు ఆరోపించారు. దీనికి మీ సమాధానం ఏంటి?”
భూపతి రెడ్డి ముఖంలో ఎలాంటి క్రూరత్వమూ కనిపించలేదు. ఒక అనుభవజ్ఞుడైన పొలిటిషియన్ లాగా ఆయన ముఖంలో ఒక కపటమైన ప్రశాంతత, నిశ్చలమైన నిబ్బరం కనిపించాయి. ఆయన చాలా కూల్‌గా, ఇండైరెక్ట్ గా అన్నను ఇరికిస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు.”
చట్టం, సాక్ష్యాలు ఎప్పుడూ నిజాలనే మాట్లాడతాయి. పోలీసులు లావణ్యను ఊరికే అరెస్ట్ చేయలేదు. రవికుమార్ చనిపోతున్న ఆ ఐదు నిమిషాల వ్యవధిలో ఆమె కింద గార్డెన్‌లోకి వెళ్లి ఒక గుర్తుతెలియని వ్యక్తిని కలిసినట్టు పక్కా టెక్నికల్ ఆధారాలు ఉన్నాయని వింటున్నాం. కానీ కొందరు పాత ఆస్తి గొడవలను, వ్యాపార పగలను మనసులో పెట్టుకుని, ఒక మర్డర్ కేసును వాడుకుంటూ నాపై బురద జల్లాలని చూస్తున్నారు. అసలు రవికుమార్ దగ్గర ఉన్న కంపెనీ రహస్య పత్రాలను దొంగిలించడానికి… వెనక నుండి ఎవరో పెద్ద తలకాయలే ఆ లావణ్యతో చేతులు కలిపి, ప్లాన్ ప్రకారం రవికుమార్‌ను లేపేశారేమో అనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది! ఆ పెద్ద మనుషుల నిజస్వరాలు బయటపడతాయనే భయంతోనే… ఇప్పుడు అమాయకత్వం ముసుగులో కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, త్వరలోనే ఆ సూత్రధారులు ఎవరో పోలీసులే బయటపెడతారు,” అంటూ చాలా హుందాగా నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు.
స్థలం: చింతపల్లి పోలీస్ స్టేషన్, సిఐ గది.
స్టేషన్ లోని టీవీ స్క్రీన్‌పై అన్నదమ్ముల సవాల్-ప్రతిసవాల్ వార్తలను చూస్తున్న సిఐ చంద్రమౌళి కోపంతో ఊగిపోతూ, చేతిలో ఉన్న కాఫీ కప్పును నేలకేసి గట్టిగా కొట్టాడు. కప్పు ముక్కలు ముక్కలై నేలపై పడింది.
“శ్రీనూ! అసలు మన స్టేషన్ లో ఏం జరుగుతోంది? కేసు డైరీలో ఉండాల్సిన విషయాలు, ఆ టవర్ డంప్ వివరాలు, ఆ ఐదు నిమిషాల గ్యాప్ స్టోరీ వీళ్లకు ఎలా లీక్ అయ్యాయి? ఒకడేమో కిల్లర్ అంటాడు, ఇంకొకడేమో మైనింగ్ స్కామ్ అంటాడు. మన ఇన్వెస్టిగేషన్‌ను వీళ్లు మీడియా ముందు బజారున పడేశారు! మన డిపార్ట్మెంట్లో ఎవడో పెద్ద నల్లగొర్రె ఉంది, వాడే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్లకు చేరవేశాడు!” అని చంద్రమౌళి గర్జించాడు.
తన ముప్పై ఏళ్ల సర్వీసులో ఇలాంటి భద్రతా వైఫల్యం జరగడం అతని ఈగోని దారుణంగా దెబ్బతీసింది.కానీ ఆ కోపం వెనుకే అతని పదునైన మెదడు ఒక నిజాన్ని గ్రహించింది. ఎస్పీ గారు తన చేతులు కట్టేసినా… ఇప్పుడు ఈ అన్నదమ్ముల పంతాల వల్ల కేసు వీధికెక్కింది.
ఈ లీక్‌లను, వారి మధ్య ఉన్న పగను వాడుకుని, ఇద్దరిలో ఎవరో ఒకరు చేసే చిన్న తప్పును పట్టుకుని అసలైన హంతకుడి వేటను అన్అఫీషియల్గా ఎలా మొదలుపెట్టాలో చంద్రమౌళి మైండ్‌లో ఒక ప్లాన్ సిద్ధమైంది. అతని కళ్లల్లో ఖాకీ రంగు పట్టుదల మరింత పదునెక్కింది…
Leave a Reply