రహస్య కోడలు – రిటర్న్ టికెట్ ( భాగం 12)

Written by

in

సాయంత్రం ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ నెమ్మదిగా రద్దీగా మారుతోంది. మాదాపూర్‌లోని ఆ అపార్ట్‌మెంట్ బాల్కనీలో నిలబడితే దూరంగా మెట్రో లైన్, మెరిసే హైరైజ్ భవనాలు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ కిరణ్ మనసు మాత్రం ఎయిర్‌పోర్ట్‌ నుంచి క్యాబ్‌లో వస్తున్నంతసేపూ వేరే చోటే ఉంది.

విదేశాల్లో ఉన్న గత కొన్ని రోజులుగా అనూషతో మాట్లాడిన ప్రతిసారీ, ఆమె గొంతులో వినిపించిన ఆ చిన్న మార్పు అతన్ని వదల్లేదు. మాటల్లో నవ్వే ఉంది… కానీ ఆ నవ్వు వెనుక ఏదో అలసట కూడా ఉంది.

శనివారం ఉదయం షమ్షాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన కిరణ్, ఎవరికీ చెప్పకుండా నేరుగా ఇంటికి వచ్చాడు.

డోర్‌బెల్ మోగింది.

తలుపు తీసిన అనూష రెండు సెకన్లు అలాగే నిలబడి చూసింది.

“ఏమండీ మీరా?” అంది ఆశ్చర్యంగా.

“నేనే డార్లింగ్… లోపలికి రానివ్వవా?” అని నవ్వాడు కిరణ్.

అనూష ఏమీ అనకుండా పక్కకు తప్పుకుంది. అతను లోపలికి అడుగుపెట్టగానే, బ్యాగ్ నేల మీద పెట్టి ఆమెని దగ్గరకు లాక్కుని హత్తుకున్నాడు.

“నేను నిన్ను చాలా మిస్ అయ్యాను.”

అనూష కళ్ళు మూసుకుంది. “నేనూ కూడా.”

“చెప్పకుండా వస్తే ఇలాగే రిసీవ్ చేసుకుంటావా?” అని ఆమె నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు.

అప్పుడే హాల్‌లోకి వచ్చిన సరోజ నవ్వింది.”వచ్చావా నాన్నా? దిగాక అయినా ఫోన్ చేయొచ్చు కదా.”

“చెప్తే సర్ప్రైజ్ ఉండదు కదమ్మా,” అన్నాడు కిరణ్.


మధ్యాహ్నం భోజనం అయిపోయాక, అనూష బాల్కనీలో బట్టలు ఆరేస్తోంది.కిరణ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు.

“హెల్ప్ చేయనా?”

“నువ్వా?” నవ్వింది అనూష.
“రెండు క్లిప్స్ పెట్టేలోపే విసుగొచ్చేస్తుంది నీకు.”

“అంత బాగా తెలుసా నాకు?”

“తెలుసు. నీ సంగతి నాకకుండా ఇంకెవరికి తెలుస్తుంది.”

కిరణ్ కూడా ఒక తువాలు తీసుకుని క్లిప్ పెట్టాడు.కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు.

“అను.”

“హ్మ్?”

“హ, ఇప్పుడు చెప్పు అసలు ఏమి జరిగింది?”

ఆమె చేతిలో ఉన్న చీర ఆగిపోయింది.”ఏం జరగాలి?”

“నువ్వు మునుపటిలా లేవు.”

“నేనా?” నవ్వడానికి ప్రయత్నించింది

.”ఫోన్‌లో కూడా అలాగే అనిపించింది. ఇప్పుడూ అలాగే అనిపిస్తోంది.”

అనూష చూపు తిప్పుకుంది.”ఏమీ లేదు కిరణ్.”

“నిజమా?”

“నిజమే.”

“నా కళ్లలోకి చూసి చెప్పు.”

అనూష మెల్లగా అతని వైపు చూసింది.రెండు సెకన్లు.మూడు సెకన్లు.తర్వాత బలవంతంగా నవ్వింది.”నువ్వు ఓవర్ గా థింక్ చేస్తున్నావు.”

కిరణ్ కూడా నవ్వాడు. కానీ పూర్తిగా నమ్మలేదు.”అమ్మతో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా?”

అనూష వెంటనే తల ఊపింది.” ఏ బాబు, నీకు చెబితే అర్థం కాదా!”

“ఏదైనా నువ్వు చెబితేనే నాకు అర్థమవుతుంది.”

“అయితే విను, అత్తలు కొత్త కోడల్ని ప్రశ్నలు అడగడం, కొంచెం టార్చర్ పెట్టడం… ఇవన్నీ కామనే కదా. అంతే.”

“అంతేనా?”

“అంతే.”

“నువ్వు హర్ట్ అయ్యావు.”

“మొదట్లో కొంచెం. ఇప్పుడు అలవాటైపోతోంది.”

కిరణ్ మొహం మారిపోయింది.”అమ్మతో మాట్లాడనా?”

అనూష వెంటనే అతని చేయి పట్టుకుంది.”వద్దు.”

“ఎందుకు?”

“నువ్వు మాట్లాడితే అది చిన్న విషయంగా ఉండదు. అత్తా కోడళ్ల మధ్య ఉండాల్సిన విషయం, అమ్మా కొడుకుల మధ్యకి వెళ్తుంది.”

కిరణ్ మౌనంగా ఆమె వైపు చూశాడు.

“ప్లీజ్.”

“నీకేం ఇబ్బంది రాకూడదనేదే.”

“నాకు ఇబ్బంది లేదు. నువ్వు అత్తమ్మతో మాట్లాడితేనే ఇబ్బంది మొదలవుతుంది.”

కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడలేదు.చివరికి కిరణ్ చిన్నగా తల ఊపాడు.

“సరే. ఇప్పుడైతే మాట్లాడను.”అనూష ఊపిరి పీల్చుకుంది.

సాయంత్రం కాఫీ తాగుతూ హాల్‌లో కూర్చున్నాడు కిరణ్.వంటగదిలో సరోజ, అనూష ఇద్దరూ ఏదో మాట్లాడుతున్నారు.సరోజ ఏదో అడుగుతోంది.అనూష చిన్న చిన్న సమాధానాలు చెబుతోంది.ఆ మాటలు స్పష్టంగా వినిపించలేదు.కానీ…

అనూష గొంతులో ఉన్న జాగ్రత్త మాత్రం కిరణ్‌కు స్పష్టంగా వినిపించింది.అతను కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టాడు.లోపలికి వెళ్లి ఏదైనా అడగాలని అనిపించింది.

కానీ వెంటనే అనూష చెప్పిన మాట గుర్తొచ్చింది.”నువ్వు మాట్లాడితేనే ఇబ్బంది మొదలవుతుంది.”మళ్లీ సోఫాలోనే వెనక్కి ఆనుకున్నాడు.

బయట సాయంత్రం చీకటి నెమ్మదిగా నగరాన్ని కప్పేస్తోంది.ఆ ఇంట్లో కూడా…

ఎవరి మనసులో వాళ్లు దాచుకున్న మాటలు, నెమ్మదిగా నిశ్శబ్దాన్ని మరింత భారంగా మారుస్తున్నాయి.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *