రహస్య కోడలు – నిశబ్ద లావా (భాగం 11)

Written by

in

మరుసటి రోజు ఉదయం.

టీవీలో న్యూస్ వస్తోంది.

సరోజ సోఫాలో కూర్చుంది.అనూష కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది.

“అత్తయ్యా…”సరోజ వెంటనే స్పందించలేదు.అనూష కాసేపు అక్కడే నిలబడి, వెనక్కి తిరిగి కిచెన్‌లోకి వెళ్లిపోయింది.

ఆమె లోపలికి వెళ్లాకే, సరోజ కప్పు చేతిలోకి తీసుకుంది.

ఆ రోజు మధ్యాహ్నం.

అనూష డైనింగ్ టేబుల్ దగ్గర ఉల్లిపాయలు తరగుతోంది.

అప్పుడే సరోజ తన గది నుంచి బయటికి వచ్చి, ఫ్రిజ్‌లోంచి బెండకాయలు తీసుకుని ఆమె ఎదురుగా కూర్చుంది.

ఒక్క మాట కూడా మాట్లాడకుండా, బెండకాయలు కోయడం మొదలుపెట్టింది.

అనూష ఉల్లిపాయలు తరుగుతోంది. సరోజ బెండకాయల చివర్లు తీస్తోంది.

సరోజ బెండకాయల చివర్లు తీస్తూనే అడిగింది.”ఎంతకాలం ఉన్నావ్ అక్కడ?”

అనూష తలెత్తి చూసింది.”ఎక్కడ అత్తయ్యా?”

“అదే… కేఫ్‌లో.”

“ఏడు నెలలు అనుకుంటా.”

“అది సరే…” సరోజ మరో రెండు బెండకాయలు కోసి “రాధ ఇంకోటి కూడా చెప్పింది.”

అనూష తలెత్తి చూసింది. “ఏంటి?”

“స్పా అన్నది.”

“స్పానే కానీ అందులో నేను రిసెప్షనిస్ట్.”

“ఓహ్,” మరో రెండు బెండకాయలు తీసుకుంది సరోజ, కోయకుండా చేతిలో పట్టుకుని.”రిసెప్షనిస్టా? ఎంత జీతం ఇచ్చేవాళ్ళు?”

“బానే ఇచ్చేవాళ్ళు.”

“బానే అంటే ఎంత?”

అనూష ఉల్లిపాయ తరగడం ఆపింది. “మారుతూనే ఉండేది అత్తయ్యా… టిప్స్ కూడా కలిపి వచ్చేవి.”

సరోజ ఆమె వైపు చూసింది రెండు సెకన్లు. తర్వాత బెండకాయ కోసింది.”ఎలాంటి స్పా అది?”

“మామూలుదే. మసాజ్, ఫేషియల్స్.”

“ఎవరు నడిపేవాళ్ళు?”

“ఒకావిడ. పోలిష్ ఆవిడ.”

“నువ్వు తప్ప ఇంకెవరు పనిచేసేవాళ్ళు అక్కడ?”

అనూష కత్తి పక్కన పెట్టింది. “ఎందుకు అత్తయ్యా ఇన్ని ప్రశ్నలు?”

“అడగకూడదా?”

“అడగొచ్చు, కానీ…” ఆగింది అనూష.

“కానీ?”

“ఏం లేదు.” మళ్ళీ కత్తి తీసుకుంది, ఉల్లిపాయ మీద పెట్టింది.సరోజ బెండకాయల చివర్లు తీయడం కొనసాగించింది. “కిరణ్‌కి చెప్పావా?”

“నిన్న రాత్రి చెప్పా.”

“ఏమన్నాడు?”

“ఈరోజు మాట్లాడదాం అన్నాడు.”

సరోజ చేయి ఆగింది క్షణం. “అంతేనా?”

“అంతే అత్తయ్యా.”పళ్ళెంలో బెండకాయలు నింపుకుంది సరోజ, లేచింది.

“సరే. కడిగేయ్ ఇవి కూడా.” వంటగది వైపు నడిచింది, తలుపు దగ్గర ఆగకుండా ఈసారి.

“అనూష మళ్లీ ఉల్లిపాయ మీదే దృష్టి పెట్టింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. అవి ఉల్లిపాయ వల్ల వచ్చినవో… లేక తనలో మొదలైన భయం వల్ల వచ్చినవో, తనకే తెలియలేదు.”

రాత్రి పదకొండున్నర.

ఫోన్ వైబ్రేట్ అయింది.”కిరణ్ కాలింగ్…”

అనూష రెండు సెకన్లు స్క్రీన్ వైపు చూసి, తర్వాత కాల్ లిఫ్ట్ చేసింది.”హలో…”

“ఏం చేస్తున్నావ్?” అడిగాడు కిరణ్.

“ఏం లేదు… పడుకోబోతున్నా.”

“తిన్నావా?”

“హ్మ్… ఇప్పుడే.”

“మావయ్య ఎలా ఉన్నారు?”

“సాయంత్రం మాట్లాడాను బాగానే ఉన్నారు.”

“గుడ్.”

కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఉన్నారు.


“ఏంటీ… చాలా సైలెంట్‌గా ఉన్నావ్ ఇవాళ,” అన్నాడు కిరణ్.

“అలాంటిదేం లేదు.”

“ఉంది.”

“లేదు.”కిరణ్ చిన్నగా నవ్వాడు.”అనూష, నువ్వు నాకు కొత్త పరిచయం కాదు. ఏదైనా ఉంటే నీ గొంతులోనే తెలిసిపోతుంది.”

“నిద్ర వస్తుంది అంతే.”

“అబద్ధం.”

మళ్ళీ మౌనం.

“ఏమైంది?” మెల్లగా అడిగాడు.

“ఏం కాలేదు.”

“ష్యూర్?”

“హ్మ్.”

“అమ్మతో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా?”

ఆ ప్రశ్న వినగానే అనూష కాసేపు ఏమీ మాట్లాడలేదు.

“అదేంటి అలా అడిగావ్?”

“ఊరికే కాదు. ఏదో జరిగింది. అత్త కోడళ్ళు ఓకే ఒరలో ఉన్నారు కదా! డౌట్ వచ్చి.”

అనూష నిట్టూర్చింది.”పెద్ద విషయం ఏం కాదు.”

“అంటే ఏదో ఉందన్న మాట.”

“అత్తయ్య ఇవాళ మళ్ళీ నా పోలాండ్ జాబ్ గురించి అడిగారు.”

“ఏమని?”

“‘ఎక్కడ పని చేసేదానివి?’… ‘ఎంత జీతం?’… ‘ఎవరు ఓనర్?’… ‘ఇంకెవరు పనిచేసేవాళ్లు?’… ఇలా.”

“నువ్వేం చెప్పావ్?”

“రిసెప్షనిస్ట్ అన్నా.”

“అంతేనా?”

“అంతే.”

“తర్వాత?”

“ఏం లేదు. మామూలుగానే అయిపోయింది.”

కిరణ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు.”అనూష…”

“హ్మ్?”

“అమ్మకి ఏమైనా డౌట్ వచ్చిందా?”

“తెలియదు.”

“నిజంగానే తెలియదా… లేక నన్ను కంగారు పెట్టకూడదని చెప్తున్నావా?”

అనూష చిన్నగా నవ్వింది.”రెండోది కాస్త ఎక్కువ.”కిరణ్ కూడా నవ్వాడు. కానీ ఆ నవ్వు కళ్ల వరకు రాలేదు.”సరే… నేను అమ్మతో మాట్లాడతాను.””వద్దు.””ఎందుకు?””ఇలాంటి విషయానికి మీరు ఇద్దరూ గొడవపడడం నాకు ఇష్టం లేదు.””గొడవ కాదు అనూష.””కానీ అవుతుంది.”కిరణ్ ఏమీ మాట్లాడలేదు.”ఇది కొత్తేమీ కాదు కిరణ్,” అంది అనూష మెల్లగా. “దాదాపు ప్రతి అత్తా కొత్త కోడల్ని కొంచెం పరీక్షిస్తుంది. నేను కూడా అలానే అనుకున్నా. పోతుంది.””అయినా…””ప్లీజ్.”మళ్ళీ నిశ్శబ్దం.”సరే,” అన్నాడు కిరణ్ చివరికి. “ఇప్పటికి ఏం మాట్లాడను.”అనూష ఊపిరి పీల్చుకుంది.”థాంక్యూ.”కాల్ కట్ అయిన తర్వాత కూడా కిరణ్ ఫోన్ చేతిలోనే పట్టుకుని కూర్చున్నాడు.”అమ్మతో మాట్లాడాలా… వద్దా?”అనే ఆలోచన అతని మనసులో మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉంది.ఒకవైపు అనూష మాట.మరోవైపు అమ్మ ప్రవర్తన.ఏది సరైనదో అర్థం కాక, చివరికి ఫోన్ పక్కన పెట్టి లైట్ ఆర్పేశాడు.”ఇప్పుడే అమ్మని నిలదీస్తే… ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందేమో.”అనే ఆలోచనే ఆ రాత్రి అతన్ని నిద్రపోనివ్వలేదు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *