Type your paragraph here
స్థలం: పోలీస్ స్టేషన్, విచారణ గది.
చంద్రమౌళి లోపలికి అడుగుపెట్టిన తీరులోనే కేసును సాల్వ్ చేసినా పొగరు కనిపిస్తుంది. అతని చేతిలో ఏ కాగితాలూ లేవు, కానీ అతని చూపులు లావణ్యను నిలువునా చీల్చేలా ఉన్నాయి.కుర్చీలో కూర్చుంటూనే టేబుల్ మీద రెండు చేతులూ గట్టిగా ఆనించి, లావణ్య ముఖానికి చాలా దగ్గరగా వంగాడు. గది ఒక్కసారిగా వేడిగా మారిపోయింది.
చంద్రమౌళి: (చాలా లోతైన, నిలకడైన స్వరంతో) మీ భర్త చనిపోతున్నప్పుడు… మీరు రూమ్ సర్వీస్ వెయిటర్ని లోపలికి రానివ్వకుండా తలుపు ఎందుకు తోసేశారు లావణ్య గారు? ఆయన మంచం మీద నుండి సైగలు చేస్తూ సాయం కోసం అరుస్తుంటే… మీరు కావాలనే అడ్డంగా నిలబడి వెయిటర్ చూడకుండా తలుపు లాక్ చేసేశారు. ఎందుకు?
(లావణ్య కళ్లల్లో ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. కానీ ఆమె ఏమాత్రం తడబడకుండా, చంద్రమౌళి కళ్లల్లోకి అంతే పదునుగా చూసింది.)
లావణ్య: ఇదేనా మీరు తెలుసుకోవాలి అనుకుంటుంది. అయితే వినండి. 10:15 కి భూపతి రెడ్డి ఫోన్ మాట్లాడినప్పటి నుండి నా భర్త తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి వస్తే ఆయనకి వెలుతురు అస్సలు పడదు, వికారం వస్తుంది. వెయిటర్ తలుపు తీయగానే బయటి కారిడార్ వెలుతురు రూమ్‌లోకి పడకుండా ఉండటానికే నేను తలుపు అడ్డంగా నిలబడి కప్పు తీసుకున్నాను. ఆ టైమ్‌లో ఆయన నొసలు నొక్కుకుంటూ, వాష్ రూమ్‌కి వెళ్తున్న నన్ను పిలవడానికి సైగలు చేశారు తప్ప… అది విషపు గిలగిల కాదు. రూమ్ సర్వీస్ వెయిటర్లకి లోపల ఏం జరుగుతుందో తొంగి చూస్తున్నట్టు నేను గమనించాను కాబట్టే, నేను వెంటనే తలుపు వేసేశాను.
చంద్రమౌళి: (ఆమె సమాధానాన్ని మధ్యలోనే కట్ చేస్తూ, గొంతు పెంచి) సరే! వెలుతురు పడక తలుపు వేశారు అనుకుందాం. మరి సరిగ్గా రాత్రి 11:15 కి… మీ భర్త శవం గదిలో ఉండగా, మీరు కారిడార్లోకి వచ్చి ఆ కంగారులో కూడా ఎవరికో ఫోన్ చేసి ఐదు నిమిషాలు మాట్లాడారు. సిగ్నల్స్ లేవని నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? ఆ టైమ్‌లో మీరు ఫోన్ చేసింది ఎవరికి? చెప్పండి మిసెస్ రవి?
లావణ్య: (ఒక సన్నటి, పదునైన నవ్వు నవ్వింది, ఆ నవ్వు వెనకనున్న అర్ధం నేరస్తులను వదిలేసి అమాయకులతో ఆడుకోవడం మీ పోలీసు వారికి అలవాటే అని) నేను ఎవరికీ ఫోన్ చేయలేదు సార్. 11:10 కి ఆయన నోట్లో నుండి నురుగు రావడం చూసి నేను పిచ్చెక్కిపోయాను. రూమ్ ఇంటర్‌కామ్ పని చేయలేదు. నా ఫోన్ లో సిగ్నల్స్ కోసం కంగారుగా కారిడార్ లోకి వచ్చి అటు ఇటు నడిచాను తప్ప ఎవరికీ కాల్ కలవలేదు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నా కాల్ లాగ్స్, నెట్వర్క్ హిస్టరీ చెక్ చేసుకోండి సార్… నిన్న రాత్రి ఆ టైమ్ కి ఒక్క కాల్ కూడా వెళ్ళలేదు, కేవలం నెట్వర్క్ సెర్చ్ మాత్రమే జరిగింది.
చంద్రమౌళి: (టేబుల్‌ను గట్టిగా చరుస్తూ, సీటులోంచి లేచి నిలబడ్డాడు. గదిలోని కానిస్టేబుళ్లు ఉలిక్కిపడ్డారు) నాటకాలు ఆపండి లావణ్య! కాల్ కలవకపోతే… కారిడార్ నుండి నిశ్శబ్దంగా సర్వీస్ లిఫ్ట్ ఎక్కి, రిసార్ట్ వెనుక ఉన్న చీకటి గార్డెన్ లోకి ఎందుకు వెళ్లారు? అక్కడ చీకట్లో పొంచి ఉన్న ఒక పరాయి మగమనిషిని రహస్యంగా కలిసి రెండు నిమిషాలు ఏం మాట్లాడారు? భర్త ప్రాణాలు పోతుంటే అర్ధరాత్రి చీకట్లో పరాయి మగాడితో మీకేం పని?
(గదిలో ఊపిరాడనంత నిశ్శబ్దం. చంద్రమౌళి ఈ ప్రశ్నతో ఆమెను పూర్తిగా కార్నర్ చేశానని అనుకున్నాడు. కానీ లావణ్య ముఖంలో అలజడి లేదు, ఒక విచిత్రమైన స్థిరత్వం వచ్చింది.)
లావణ్య: (చాలా నిదానంగా లేచి నిలబడింది, ఆమె చూపుల్లో నిశ్చలత్వం ఉంది) కారిడార్ లో సిగ్నల్ దొరక్కపోయేసరికి, కింద ఓపెన్ ప్లేస్ లో దొరుకుతుందేమో అని నేను గార్డెన్ లోకి వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికే అక్కడ చీకట్లో ఒక మగమనిషి నిలబడి ఉన్నాడు. అతను ఎవరో నాకు కూడా తెలియదు.
చంద్రమౌళి: (ఒక్కసారిగా స్తంభించిపోయాడు) నీకు తెలియదా? స్కూల్ లో చెప్పే కట్టుకథలు ఇక్కడ చెప్పకండి! మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మీ భర్తను మీరే చంపినట్టు ఒప్పుకోండి. నేరం మీకు మీరుగా ఒప్పుకుంటే తక్కువ శిక్ష పడుతుంది. మా ద్వారా ఒప్పిస్తే.. ఆడవాళ్ళు, పైగా టీచర్ గారు.. తట్టుకోలేరు!
లావణ్య: తప్పుడు సాక్ష్యాలతో నాలాంటి అభాగ్యురాలిపై నింద మోపి అసలు హంతకుడిని తప్పించాలి అనుకుంటున్నారా? నాకు పెళ్లయి సరిగా 19 రోజులు అయింది. నా భర్తను నేను చంపాలిసిన అవసరం నాకు లేదు. ఎవరు చెప్పారో వాళ్ళని పట్టుకోండి!
లావణ్య మాటలకి విచారణ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఘనీభవించింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కానీ ఆమె చూపుల్లో ఉన్న స్థిరత్వం చంద్రమౌళిని ఆలోచనలో పడేసింది. కేసు సాల్వ్ చేసేశానన్న అతని ముఖంలోని పొగరు… ఇప్పుడు ఒక్కసారిగా మాయమైపోయింది.
చంద్రమౌళి: (టేబుల్ మీద ఉన్న పెన్ చేతిలోకి తీసుకుని, లావణ్య కళ్లల్లోకి చూస్తూ) “నీకు తెలియదా…” అర్ధరాత్రి పూట, భర్త చనిపోతున్న టైమ్‌లో… నీకు తెలియని పరాయి మగాడితో గార్డెన్లో నీకేం పని లావణ్య? వాడు ఎవడో తెలియకుండానే రెండు నిమిషాలు మాట్లాడి తిరిగి రూమ్‌కి వచ్చావా? ఈ కథని నన్ను నమ్మంటావా?
లావణ్య: (ఎండిపోయిన గొంతును సవరించుకుంటూ, నిశ్చలంగా) నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం సార్. నేను గార్డెన్‌లోకి వెళ్లినప్పుడు ఆ చీకట్లో ఒక మగమనిషి నిలబడి ఉన్నాడు. నన్ను చూడగానే ఆయన అటుగా నాకు కాస్త దూరంగా వచ్చి.. “ఇక్కడ సిగ్నల్స్ రావు మేడం, మీరు రూమ్‌కి వెళ్లండి, నేను మేనేజర్ని పిలుస్తా” అని చెప్పి వెనక్కి తిరిగి చీకట్లోకి వెళ్ళిపోయాడు. నా భర్త ప్రాణాపాయంలో ఉన్నాడు కాబట్టి నేను అతని పెద్దగా పట్టించుకోలేదు… వెంటనే రూమ్‌కి వెళ్లి నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రిసెప్షన్‌కి వచ్చాను. అతని ముఖం కూడా నేను సరిగ్గా చూడలేదు.
చంద్రమౌళి: (కుర్చీలో వెనక్కి ఆనుతూ, అనుమానంగా కళ్లు చిన్నవి చేసి) “మేనేజర్ని పిలుస్తా అని వెళ్ళిపోయాడా…” సరే, మరి అదే టైమ్‌లో… అంటే 11:15 కి మీ రూమ్ లో ఉన్న ల్యాప్‌టాప్ నుండి కంపెనీ ఆడిట్ ఫైల్స్ అన్నీ డిలీట్ అయ్యాయి. ఆ ల్యాప్‌టాప్ ఇప్పుడు రూమ్‌లో లేదు. దాన్ని లోయలో పడేసింది కూడా ఆ టైమ్‌లోనే! ఆ రూమ్ లోపల మీ భర్త శవం తప్ప ఎవరూ లేరు. మరి ఆ ల్యాప్‌టాప్ ఎలా మాయమైంది? అసలు ఆ చీకటిలో ఉండే మనిషి ఎవరు? ఒకవేళ రవిని హత్య చేసి ఆ లాప్టాప్ తీసుకెళ్తే? వాడు ఎవడో కనిపిడితే ఈ కేసు సాల్వ్ చేయొచ్చు……
Leave a Reply