రహస్య కోడలు- ఆట ఆరంభం (భాగం 21)

Written by

in

కిరణ్ మారెక్ పంపిన లింక్ ఓపెన్ చేశాడు.

ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై వీడియో ప్లే అవ్వడం మొదలైంది. అది స్పా సెంటర్‌లోని ఒక గది.
మూలన అమర్చిన సీసీ కెమెరా ఫుటేజ్‌లా కనిపిస్తోంది.

ఆ వీడియోలో అనూష ఉంది.
ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు.
కొన్ని క్షణాలు స్క్రీన్ వైపే చూస్తూ ఉండిపోయాడు కిరణ్.

ఆ తర్వాత ఒక్కసారిగా ల్యాప్‌టాప్ మూసేశాడు.
కుర్చీలో వెనక్కి ఆనుకుని కళ్లుమూసుకున్నాడు.
మారెక్ చెప్పిందే నిజమా… లేక ఇందులో కూడా ఏదైనా మోసం ఉందా…

ఏదీ అర్థం కాక అతని మనసు తటపటాయించింది.
అప్పుడే టేబుల్ మీద ఉన్న ఫోన్ వైబ్రేట్ అయింది.
అనూష కాల్ చేస్తోంది.

కిరణ్ స్క్రీన్ వైపు మాత్రమే చూశాడు.కాల్ కట్ అయిపోయింది.
కొద్దిసేపటికే మళ్లీ ఫోన్ మోగింది.
ఈసారి సరోజ.

లోతుగా ఊపిరి తీసుకుని కాల్ లిఫ్ట్ చేశాడు.
“చెప్పమ్మా.”

“కిరణ్… ఒకసారి హైదరాబాద్ రా నాన్న. నీతో మాట్లాడాల్సిన విషయం ఉంది.” అంది సరోజ.

“ఏమైంది అమ్మ?”

“ఫోన్‌లో చెప్పే విషయం కాదు. నువ్వు వచ్చాక మాట్లాడుకుందాం.”

కిరణ్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు.”సరే అమ్మ. రేపు ఫ్లైట్ చూసుకుని వస్తాను.”

“సరే నాన్న…”అని చెప్పగానే కిరణ్ కాల్ ముగించాడు.

మొదటిసారి అనూష ప్రస్తావన లేకుండా కిరణ్ ఫోన్ పెట్టేయడం. ఇది గమనిస్తూ ఆలోచించుకుంటూ ఉండిపోయింది సరోజ.


అనూష గదిలో…
ఫోన్ మరోసారి మోగింది.అదే నంబర్.

కట్ చేసింది.

మళ్లీ మోగింది.

మళ్లీ కట్ చేసింది.

మూడోసారి కూడా అదే నంబర్ రావడంతో చిరాకుగా కాల్ లిఫ్ట్ చేసింది.”ఏంటి నీ గోల? ఎన్నిసార్లు చేస్తావ్?”

“Listen, Anusha…” అన్నాడు మారెక్.

“నీ మాటలు వినే అవసరం నాకు లేదు.”

“ఒక్కసారి విను. నేను నీ భర్తకు అన్నీ పంపించాను. ఫోటోలు… వీడియో… ఏదీ దాచలేదు.”

అనూష గుండె ఒక్కసారిగా బరువెక్కింది.
మారెక్ మళ్లీ మాట్లాడాడు.”ఇప్పటికే అతను చూసి ఉంటాడు. ఇక నుంచి ఏం జరుగుతుందో… అది నీ చేతుల్లో లేదు. నా ఆఫర్ ఒప్పుకుంటే నీ జీవితం మరోలా ఉండేది. బ్యాడ్లక్.”అంతే.
కాల్ కట్ అయిపోయింది.

కొన్ని క్షణాలు అనూష అలాగే నిలబడి ఉంది.
తర్వాత ఒక్కసారిగా ఫోన్‌ను గోడకేసి బలంగా విసిరేసింది.”You bastard! I hope you die! Get lost… Motherfucker!”ఫోన్ నేలపై పడి స్క్రీన్ బద్దలైంది.


ఆ శబ్దం విని సరోజ పరుగెత్తుకుంటూ గది దగ్గరకు వచ్చింది. తలుపు తోసి లోపలికి అడుగుపెట్టింది.

అనూష మంచం మీద కూర్చుని ముఖం చేతుల్లో దాచుకుని ఏడుస్తోంది. సరోజ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసింది.కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు.

తర్వాత…”రా… బయటికి వెళ్దాం.” అంది.

అనూష మెల్లగా తలెత్తి చూసింది.

“నీతో ఒక విషయం చెప్పాలి.”సరోజ గొంతు భారంగా మారింది.”ఇన్నేళ్లుగా నా మనసులో దాచుకున్న విషయం అది. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు.”

ఒక్క క్షణం ఆగి అనూష కళ్లలోకి చూసింది.

“ముందు నేను చెప్పేది పూర్తిగా విను. ఆ తర్వాత నీకు ఏం అడగాలనిపించినా అడుగు.”

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *