మృత్యువు తొడిగిన పూలదండ -భాగం 25

Written by

in

చింతపల్లి ఇన్‌ఛార్జ్ ఎస్సై నరేందర్ కేజీహెచ్ ఆర్థోపెడిక్ వార్డులోకి వచ్చాడు. అక్కడ డాక్టర్ రాజు బెడ్ మీద ఉన్న బన్నీ వాస్ బిపి, పల్స్ చెక్ చేస్తున్నాడు.

ఎస్సై నరేందర్ బన్నీ వాస్ వైపు సీరియస్‌గా చూస్తూ, డాక్టర్ రాజు గారి అనుమతితో ప్రశ్నించడం మొదలుపెట్టాడు.
“బన్నీ వాస్… లావణ్య భర్త రవికుమార్‌ని మీరే చంపినట్టు నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. నిజం ఒప్పుకోండి! నువ్వు ఇప్పుడు చావుబతుకుల మధ్య ఉన్నావ్… నువ్వు చెప్పే నిజాలే చట్టం ముందు న్యాయం గెలిచేలా చేస్తాయి!” అని అడిగాడు.

బన్నీ వాస్ బెడ్ మీద కదలకుండా, “నాకేమీ తెలియదు సార్… ఆ రోజు మేము అక్కడికి వెళ్లేసరికే రవికుమార్ చనిపోయి ఉన్నాడు.”

“అబద్ధం చెబుతున్నావు! రవిని చంపింది మీ హోటల్ వాళ్ళే అని లావణ్య ఫిర్యాదు ఇచ్చింది. నిజం దాచడానికి చూస్తే నిన్నే మెయిన్ అక్యూజ్డ్‌ని చేస్తాను!” అంటూ నరేందర్ గట్టిగా కేకలు వేశాడు.

అక్కడే ఉన్న డాక్టర్ రాజు వెంటనే కల్పించుకుని, “సార్, ఆయన హెల్త్ కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉంది. కాస్త నెమ్మదిగా విచారించండి… లేకపోతే పల్స్ పడిపోయి, ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది ” అని హెచ్చరించాడు.

నరేందర్ కొద్దిసేపు ఆగి, “ఓహ్, సరే డాక్టర్. డాక్టర్… వీడు ఇలా అడిగితే నిజం చెప్పేలా లేడు. నా స్టైల్‌లో లోపల విచారిస్తాను… మీరు, మిగతా పోలీసులు కాస్త బయట కాపలా ఉండండి” అని చెప్పి డ్యూటీ పోలీసులను బయటికి పంపించేశాడు.

కానీ డాక్టర్ రాజు ఆ మాటను నిరాకరించి ఇలా అన్నాడు; సారీ సార్, మా హాస్పిటల్ లో ఎలాంటి థర్డ్ డిగ్రీ ఇన్వెస్టిగేషన్ కు అనుమతి లేదు.

“డాక్టర్ గారు, నేను థర్డ్ డిగ్రీ లాంటి ఇన్వెస్టిగేషన్ తీసుకోను, కేసుకు సంబంధించి స్టేట్ మాత్రమే తీసుకుంటాను. మీరు కాస్త మెడికల్ రిపోర్ట్స్ తీసి బయట ఉన్న మా కానిస్టేబుల్‌కి చెక్ చేయడానికి ఇవ్వండి. నేను సీక్రెట్ ఆఫీషియల్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలి” అంటూ డాక్టర్ రాజును అనుమతి కోరుతాడు.

ఆయన ఒప్పుకొని బయటికి వెళ్తారు. వాళ్లు బయటికి వెళ్లగానే వార్డు తలుపులు మూసి, బన్నీ వాస్ దగ్గరకు జరిగాడు నరేందర్. తన జేబులోంచి ఫోన్ తీసి నేరుగా ఎస్పీకి కాల్ చేసి, స్పీకర్ ఆన్ చేసి బన్నీ వాస్‌కి ఫోన్ అందించాడు.

అవతలి నుంచి ఎస్పీ గొంతు వినిపించింది.”బన్నీ… నరేందర్ మన మనిషే. ఎలాంటి భయం లేకుండా మాట్లాడు.”

ఎస్పీ గొంతు వినగానే బన్నీ వాస్ ముఖంలో కంగారు తగ్గి ప్రశాంతంగా ఫోన్ ఇచ్చేశాడు.
నరేందర్ ఫోన్ జేబులో పెట్టుకుని, “ఇక్కడ నాటకాలు ఆడటానికి ఎక్కువ సమయం లేదు బన్నీ. ఈ కేస్ నుంచి భూపతి రెడ్డి గారి పేరు తీసేసి… జరిగిన కథలో లావణ్యే నేరస్థురాలు అనిపించేలా ఉన్న ఒక్క పాయింట్ చెప్పు” అని సూటిగా అడిగాడు ఎస్సై.

బన్నీ వాస్ ఆలోచించి చెప్పడం మొదలుపెట్టాడు:”నరేందర్ గారు… లావణ్యకి వేరే ఒకరితో సీక్రెట్ అఫైర్ ఉంది. ఆ విషయం భర్త రవికుమార్‌కి తెలిసిపోతుందనే భయంతో, అతన్ని అడ్డు తొలగించుకోవడానికి ప్లాన్ చేసింది. ఆ రోజు మా హోటల్ నుంచి రూమ్‌కి ఆర్డర్ చేసిన గ్రీన్ టీలో లావణ్యే స్వయంగా విషం కలిపి రవికుమార్‌కి ఇచ్చి చంపేసింది. కేసులోంచి తప్పించుకోవడానికి ఇప్పుడు నాటకాలు ఆడుతోంది అని రికార్డ్ చేయండి.”

ఎస్సై నరేందర్ ఎలాంటి ప్రశ్నలు అడగకుండా, బన్నీ వాస్ చెప్పిన ఆ పాయింట్‌ని కాగితం మీద రాసుకుని సంతకం చేయించుకున్నాడు.

ఆ వెంటనే వార్డు బయటికి వచ్చి, ఎస్పీకి ఫోన్ చేసి బన్నీ వాస్ ఇచ్చిన స్టేట్‌మెంట్ గురించి వివరించాడు నరేందర్. లావణ్యను విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవడానికి వెంటనే ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లను కేజీహెచ్ ఆసుపత్రికి పంపాల్సిందిగా స్టేషన్‌కి సమాచారం అందించాడు.

కొద్దిసేపటికి స్టేషన్ నుంచి ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు కేజీహెచ్‌కి చేరుకున్నారు.

ఎస్సై నరేందర్ ఐసియు బయట కూర్చుని ఉన్న లావణ్య దగ్గరకు వెళ్లి, “లావణ్య గారు… మీ భర్త రవికుమార్ హత్య కేసులో మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ కోసం స్టేషన్‌కి తీసుకెళ్లాలి. రండి,” అన్నాడు.

లావణ్య ఆందోళనగా లేచి నిలబడింది. “ఏంటి? ఇన్వెస్టిగేషనా? అసలు ఏం మాట్లాడుతున్నారు ఎస్సై గారు?”

“సాక్షి బన్నీ వాస్ మీ మీద పక్కా ఆధారాలతో స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మీరే గ్రీన్ టీలో విషం కలిపి మీ భర్తను చంపారని చెప్పాడు. పదండి,” అని గంభీరంగా అన్నాడు నరేందర్.

లావణ్య కళ్లమ్మట నీళ్లు తిరిగాయి. “సార్… సీఐ చంద్రమౌళి గారు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నా తరఫు నుంచి స్టేట్‌మెంట్ ఇచ్చాను. పైగా నా స్నేహితురాలు రమ్య లోపల ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయినా నా భర్తను నేను చంపలేదు సార్… నన్ను నమ్మండి!” అంటూ ఏడుస్తూ ఎస్సై నరేందర్‌ని ప్రాధేయపడింది.

కానీ నరేందర్ ఏమీ వినకుండా, లేడీ కానిస్టేబుళ్లకు సైగ చేసి లావణ్యను అక్కడి నుంచి స్టేషన్‌కి తీసుకెళ్లేలా చూశాడు.

మరోవైపు, కానిస్టేబుళ్లు రాము, వెంకట్ కంట్రోల్ రూమ్ ద్వారా శ్రీను ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయించారు.

లాస్ట్ లోకేషన్ విశాఖపట్నం శివార్లలోని పాత పారిశ్రామిక ప్రాంతం చూపించడంతో రాము, వెంకట్ వెంటనే జీపులో అక్కడ ఉన్న ఖాళీ గోడౌన్ దగ్గరకు వెళ్లారు.

లోపల మూల మూలలా వెతికారు.కానీ అక్కడ శ్రీను లేడు. అతని బైక్ గానీ, ఫోన్ గానీ, ఎలాంటి ఆధారాలు గానీ అక్కడ దొరకలేదు.
“రేయ్ వెంకట్… లాస్ట్ లోకేషన్ ఇక్కడే చూపించింది. కానీ వాడు ఇటు వచ్చినట్టు కూడా ఏ ఆధారమూ లేదు. అసలు శ్రీనుకి ఏమైందిరా?” అని రాము ఆందోళనగా వెంకట్‌తో అన్నాడు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *