శూన్యం విస్తరించింది అంతా

Written by

in

నా పేరు సంతోష్. నా జీవితం అంతా చిన్నగా మొదలైంది. ఒక చిన్న పల్లెటూరులో పుట్టుక, చిన్న ఇంటిలో నివాసం, చిన్న కుటుంబం, ఇలా నా పాతికేళ్ల వయసు వరకు నా జీవితంలో అంతా చిన్నదే. కానీ ఎప్పుడైతే నా చదువు పూర్తి అయి ఇంటి దగ్గరే ఏ పని లేకుండా ఖాళీగా తిరిగానో అప్పటినుండి నా చిన్న జీవితం కాస్త పెద్దదయింది. అదెలా తెలుసుకోవాలంటే నా కథ పూర్తిగా చదవాలి.

చదువు పూర్తి అయిన తర్వాత ఇంటి దగ్గరే ఏ పనిపాటా లేకుండా తిరుగుతున్న సమయంలో.. ఆ ఏడు వేసవి రోజుల్లో మే నెలలో మా గ్రామ దేవత బంగారమ్మతల్లికి జాతర జరిగింది. ఆ జాతరలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాను. తను చాలా అందంగా ఉండదు కానీ తను అలంకరించుకున్న ఆభరణాలతో పాటు మెడలో వేసుకున్న బంగారు నెక్లెస్ లో తనని చూస్తుంటే నిండు వెన్నెలలాంటి అమ్మవారి ప్రతిబింబం తన ఫేసులో కనిపించింది. పెద్ద కళ్ళు, ఎర్రటి పెదాలు, నున్నని బుగ్గలు.. ఇవన్నీ చూస్తుంటే ఈమెను పొందకపోతే నేను బ్రతుకుండి వ్యర్థమే అనిపించింది. ప్రపంచాన్ని శాసించాలనే కోరిక అలెగ్జాండర్ కు ఎందుకు కలిగిందో ఆరోజు నాకు అర్థమైంది. అలాగే చరిత్రలో ప్రేమ కోసం ప్రాణాలైనా అర్పించడానికి కొందరు ప్రేమికులు ఎందుకు వెనకాడరో ఆ రోజు నాకు అర్థమైంది.

ఎందుకంటే కోరుకున్నది కోల్పోతామనే భయం కలిగితే.. ఆ భయం నుండి వచ్చే ధైర్యంతో ఎలాంటి సాహసం చేయడానికైనా సిద్ధపడతాము. నా బుర్రలో మరో ఆలోచన లేదు. నా ప్రేమ విషయం తనకి చెప్పి ఒప్పించుకోవాలి.

నా చుట్టూ ఉండే ప్రపంచాన్ని మర్చిపోయాను. నా కళ్ళు చుట్టూ ఉన్న మనుషులను బ్లర్ చేసి కేవలం తనని మాత్రమే ఫోకస్ చేసిన కెమెరాలా పనిచేస్తున్నాయి. నేనొక విలుకానిలా నా లక్ష్యం తనే అన్నట్టు నా పాదాలు తన చుట్టే తిరిగేవి. యావరేజ్ గా ఉండే ఆ పిల్లని అప్పుడు నేను ఎందుకు అంతగా ప్రేమించానో తెలియదు. అది ఇప్పుడు ఆలోచించినా అంతుచిక్కని ఒక రహస్యంగా మిగిలిపోయింది.

తన వెంటే తిరగడం తను గమనించి వాళ్ళ ఇంటిలో వాళ్ళకి నాపై కంప్లైంట్ ఇచ్చింది. తను వేసుకున్న బంగారాన్ని దోచుకోవడానికి వచ్చిన ఒక దొంగను అనుకుంది. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది. కానీ ఆరోజు అమ్మవారి ఊరేగింపులో మోగే డప్పుల సౌండ్స్ నా వీపుపై అన్ని చోట్లా మోగేశాయి. తనకున్న బ్యాంక్రౌండ్ కి నన్ను చాలా తక్కువగా కొట్టారనే చెప్పొచ్చు! పైగా అది నా ఊరు. విషయం పైకి రాకుండా సీక్రెట్ చోటికి తీసుకెళ్లి మరి కుమ్మేశారు. నేను కూడా గుడ్డు గుర్రంలా తననే ఫాలో అయ్యాను.

వాళ్ళు కొట్టిన కొట్టుడు బ్రేక్ లేని తమన్ మామ మ్యూజిక్ లాగా వారం రోజుల వరకు నొప్పులు తగ్గలేదు నాకు. నా గదిలో ఈ వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటున్న నేను టివిలో చూసిన మూవీస్ ఏంటో మీకు తెలిస్తే షాక్ అవుతారు. ఇడియట్, అబ్బాజి పేట మ్యారేజ్ బాండ్, రాజు వెడ్స్ రాంబాయి, మజిలీ, చంటి (వెంకటేష్) సినిమాలు. ఈ సినిమాలకు నాకు ఒక లింక్ ఉంది. ఈ కథల్లో హీరోయిన్ తాలూకా వాళ్ళు హీరోని కొడతారు అలాగే నా జీవితంలో కూడా నన్ను కొట్టారు.

అదేంటో దెబ్బ తగలకముందు లేని తెగింపు.. దెబ్బ తగిలితే రెట్టింపు అవుతుంది. నేను కోలుకున్న తర్వాత తన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. తనది ఏ ఊరు.. ఏమి చదువుతుంది.. ఎప్పుడూ ఎక్కడ ఎలా ఉంటుందో అన్ని తెలుసుకున్నాను. తన గురించి తనకే తెలియని కొన్నిటిని నేను తెలుసుకున్నాను. ఇలాంటివి అన్ని సినిమాలోనే జరుగుతాయి.. బయట ఇలాంటివి అన్ని కట్టు కథలే అని మీరంటే.. కాదని మీతో వాదించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే.

తన గురించి అణు అణువు తెలుసుకోవడానికి నాకు కొన్ని రోజులు పట్టింది. ఇలా తెలుసుకునే ప్రాసెస్ లో కొన్ని చోట్ల తను నన్ను చూసింది. మనసన్నది చాలా విచిత్రమైనది కదా! ఎందుకంటే ఆ మనసుకు ఎప్పుడూ ఏది నచ్చుతుందో , ఏది నచ్చాదో ఎవరికి తెలియదు.

తొలిచూపులో నాపై కలిగిన ద్వేషాన్ని పోగొట్టడానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని భారీగా విఫలమయ్యాయి. ఏదైతే ఏమి ఒకరోజు ఏకాంతంగా తనతో మాట్లాడే ఛాన్స్ దొరికింది.

తనని కలిసే ఆ క్షణం వరకు ఏమి మాట్లాడాలో క్లియర్ గా మైండ్ లో గుర్తుంది. కానీ మిడ్ టెస్ట్ లో అదరగొట్టి ఫైనల్ ఎగ్జామ్స్ లో బెడిసికొట్టి ఫెయిల్ అయినట్టు తన ముందు మాటలు రాలేదు నాకు.

బేసిక్ గా అమ్మాయిల దగ్గర అసలు సిగ్గుపడని నేను ఆరోజు తన ముందు మాటలు రాక తలదించుకునేంత సిగ్గేసింది. నా తడబాటు చూసి తను తిరిగిపోతున్న సమయంలో టక్కున నోటి నుండి ‘ఐ లవ్ యూ’ అనే మాట వచ్చేసింది.

తను కూడా క్షణం లేటు చేయకుండా ‘సారీ’ అంది.
ఆ మాట వినగానే హార్ట్ పేషెంట్ లా ఛాతిలో గుండె ఉండే చోటు నొప్పి లాగా అనిపించింది. ఎందులోనైనా ఓడిపోయినా పర్వాలేదనిపించే నాకు తనని పొందలేకపోతున్న విషయం అర్థమైనప్పటి నుండి చీకటి గదిలో బంధించిన ఖైదీ పరిస్థితి అయిపోయింది. తన కోసం ఇన్నాళ్లు నా శ్రమ, నా త్యాగం, నా ప్రేమ ఇవన్నీ తనని కదిలించలేకపోయేసరికి నాలో ఉన్న జీవం బయటికి పోతున్నట్టు అనిపించింది. నా శరీరమంతా శూన్యం విస్తరించినట్టు అనిపించింది. నిలబెట్టిన విగ్రహంలా నిలుచున్నాను కానీ కదిలిస్తే కూలిపోయేలా ఉన్నాను. ఆ క్షణం నా కళ్ళు ముందు తనకే నేను రాసుకున్న కవితలు, ప్రేమలేఖలు, మధుర మాటలు అన్ని అగ్నిలో కాలిపోయి బూడిదై కనిపిస్తున్నాయి. మళ్ళీ తన స్పర్శ నా చేతిని ముట్టుకుంటే గాని ఈ అనంత విశ్వంలో నేను ఇంకా బ్రతికే ఉన్నానని తెలియలేదు. తన స్పర్శే కాదు.. ఆపై తన నోటి నుండి వచ్చే తీయని ఆ మాటలకి నా శరీరంలో ఊపిరి పోసింది.

నిజానికి తను ‘సారీ’ చెప్పింది నన్ను దొంగ అనుకోని కొట్టినందుకు! తన క్లాస్మేట్ (మా ఊరి అమ్మాయి) చెప్పడం వల్ల నేను ఎలాంటివాడినో తెలుసుకున్నానని.. ఈ మధ్య నాకోసం నువ్వు పడే పాట్లు నన్ను నీతో ప్రేమలో పడేశాయని చెప్పింది. అలా మా ప్రేమ ఆరోజు విత్తనంలా మొలకెత్తింది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలకు మాకు మధ్య ఎన్నో గొడవలు జరిగినా, మా ప్రేమ కోసం పోరాడి చివరికి పెళ్లి పీటలు ఎక్కాము.

తను రాకముందు వరకు చిన్నగా ఉండే నా జీవితం.. పెళ్లయ్యాక చూస్తే వాళ్ళది బ్యాంక్ లో కోట్లలో డబ్బులు.. ఎకరాల ఎకరాలు భూములు.. రెండు పెట్రోల్ బంకులు.. ఫుడ్ ఇండస్ట్రీలో 5 స్టార్ పేర్లతో రెస్టారెంట్లు.. మోటార్ ఫీల్డ్ లో 3 కంపెనీలు .. ఇలా చెప్పుకుంటూ పోతే మినిసైజ్ అంబానీ ఫ్యామిలీ వాళ్ళది. అలాంటి అమ్మాయి ఏదో మొక్కు కోసం మా గ్రామానికి రావడం… తనని చూసి నేను ప్రేమలో పడడం.. ఎముకలు ఇరిగేలా వాళ్ళు నన్ను కొట్టడం.. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఒకటే లక్ష్యంతో తననే ప్రేమించి తిరిగి ప్రేమను పొంది పెళ్లి చేసుకోవడం.. ఇదంతా కేవలం రెండు నెలల్లో జరిగిపోయింది. నెల టికెట్ జీవితం కాస్త థియేటర్ ఓనర్ చేసేసింది కాలం.

ఇంత రిచ్ అమ్మాయికి మా ఊరి అమ్మాయి తన క్లాస్మేట్ ఎలా అయిందనే చిన్న డౌట్ రావచ్చు. మట్టిలో మాణిక్యాలు అని ఒక మాట అంటారు. అలాంటి మట్టిలో మాణిక్యం మా ఊరి అమ్మాయి. తన దగ్గర డబ్బు లేకపోయినా చదువుతో ఏదైనా సాధించవచ్చని తెలుసుకొని పట్టు వదలకుండా చదివి తాడేపల్లిగూడెంలో ఉండే ఎన్ఐటీ (NIT) కాలేజీలో సీటు సంపాదించింది. అక్కడ వీళ్ళిద్దరూ స్నేహితులయ్యారు.

అదేంటో ఒక విషయం నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తను రాకముందు నా జీవితంలో ఏ పని చేయకుండా ఖాళీగానే ఉన్నాను.. తనని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఏ పని లేకుండా ఖాళీగానే జీవిస్తున్నాను.

పేదరికంలో డబ్బు లేనప్పుడు సమయమంతా డబ్బు సంపాదించడానికి ఖర్చు చేస్తే.. ఇప్పుడు ధనవంతుడిగా ఉన్నప్పుడు సమయం గడవడానికి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.

ఈ కథ ద్వారా నేను చెప్పేది ఒక్కటే: ఒక్కదానినే లక్ష్యం చేసుకొని పోరాడితే.. తప్పకుండా అందులో నువ్వు విజయం సాధిస్తావు.

ఇట్లు
కృష్ణ పేర్ల ❣️


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *