నాకు తెలిసిన ఒక స్త్రీ ఉంది. తనెప్పుడూ తన భర్తను వెతుకుతూనే ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, పేపర్లో యాడ్ వేయించినా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, న్యూస్ ఛానెల్స్‌లో గంటల తరబడి డిస్కషన్స్ పెట్టినా, బంధువులు, కుటుంబీకులు.. ఇలా అందరి చేతా ఈ భూ ప్రపంచాన్ని జల్లెడ పట్టి వెతికించినా అతను ఎక్కడా దొరకలేదు.
చివరికి అంతరిక్షంలో దాక్కున్నాడేమో అని అక్కడ కూడా వెతికించింది, అయినా దొరకలేదు.
ఒకరోజు నేను తనని అడిగాను, “అసలు ఏం జరిగింది? నీ మొగుడు ఎలా మిస్ అయ్యాడు, చెప్పు?” అని.
ఆ స్త్రీ ఇలా అంది: “మాకు పెళ్లయిన కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నాడు! రోజుకు ఏదో ఒక మాటైనా చెప్పే తను, ఆ రోజు మాత్రం ఏ మాట చెప్పలేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత నా మాటలు వినడం మానేశాడు. అలా కొన్ని వారాలకి తను నాపై అరవడం స్టార్ట్ చేశాడు. కొన్ని నెలల తర్వాత కొట్టడం మొదలుపెట్టాడు. ఏడాది తిరిగేసరికి తాగడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సడెన్‌గా ఒకరోజు కనిపించకుండా పోయాడు. ఇదే జరిగింది.”
“అవునా! సరే నాకు ఇది చెప్పమ్మా! ఇంతకీ మీ ఆయన రోజూ ఏదో ఒక మాట చెప్పేవాడు కదా, ఆ రోజు ఎందుకు చెప్పలేదు?” అని అడిగాను.
“అదా..! ఒకరోజు తను ఏదో చెబుతుంటే… ‘చాలు చాలులే… ఏం చేయాలో, ఏం చేయకూడదో నాకు తెలియదా! నేనేమైనా చిన్న పిల్లననుకుంటున్నావా నువ్వు చెప్పే అడ్డమైన సోది వినడానికి’ అన్నాను, అంతే! ఆ మరుసటి రోజు నుండి తను ఏ మాట చెప్పలేదు. ఆ తర్వాత రోజు ‘తప్పయిందండి, నిన్న మిమ్మల్ని అలా అనకుండా ఉండాల్సింది’ అని సారీ కూడా చెప్పా!”
”సారీ చెప్పినా ఎందుకు మాట్లాడలేదు?” అని అడిగా.
”సారీ అయితే చెప్పాను కానీ.. ఆ తర్వాత అతని మాటలు నాకు వినబుద్ధి కాలేదు. అందుకే తను ఏమైనా చెప్పేస్తాడేమోనని, నేనే ముందుగా మాట్లాడేసేదానిని. కానీ నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా తను పట్టించుకోవడం మానేశాడు. అప్పటికే చాలా సారీలు చెప్ప అని నా మాటలు వినడం మానేశాడు దాంతో నాకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఒకసారి గట్టిగా అరిచా!”
”అరిస్తే ఏమైంది? విన్నాడా?”
“లేదు, వినలేదు.. నాలుగు గోడల మధ్య అరిస్తే లాభం లేదని, వాళ్ళ వాళ్ల ముందు అరిస్తేనైనా నా మాట వింటాడని, ఎక్కడ పడితే అక్కడ తనపై అరిచేదానిని. ఏమైందో తెలియదు, ఎక్కడి నుండి ఏ బలమొచ్చిందో తెలియదు.. తను కూడా నాపై అరవడం స్టార్ట్ చేశాడు. దాంతో నాకు చిర్రెత్తి, అర్థంపర్థం లేని మాటలతో ఇంకా గట్టిగా అరిచేదానిని” అంటూ ఆగిపోయింది.
జోరుగా కురిసే వర్షంలా మాట్లాడి, సడెన్‌గా ఆగిపోతే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత నెమ్మదిగా “ఎందుకు చెప్పడం ఆపేశావు?” అని అడిగా.
తను చిన్నగా నవ్వుతూ, “ఏమీ లేదు.. అది ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయా!” అంది.
“అంటే అర్థంపర్థం లేని నీ మాటలకే తను తాగడం స్టార్ట్ చేశాడా?” అని కావాలనే కథను కాస్త ముందుకు నడిపించడానికి అడిగాను.
తను నావైపు చూస్తూ, మళ్ళీ తల దించుకుంటూ… కాస్త సిగ్గుపడుతూ “ఆ రోజు తను నాపై చేయి చేసుకున్నాడు.. నన్ను కొట్టాడు” అని అంది.
”నిన్ను కొట్టాడని సిగ్గుతో చెబుతున్నావేంటి?” అని కుతూహలంగా అడిగా!
”మొదటి ప్రేమలో ఉండే అనుభూతి చెప్పలేనిదైతే.. మొగుడు కొట్టే మొదటి దెబ్బ వర్ణించలేనిది. నీకు అర్థమవ్వాలంటే శ్రీదేవి, చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ పాట వింటే అర్థమవుతుంది” అంది.
“అంత నచ్చిందా?”
“మామూలుగా కాదు, తీన్మార్ డప్పుల సౌండ్.. మోత మోగిపోయింది. ఎలాగైనా మళ్లీ దెబ్బలు తినాలని నేను ఇంకా రెచ్చిపోయాను. కానీ నేను ఎంత రెచ్చగొట్టినా నాలో మార్పు రాకపోయేసరికి.. తను నన్ను కొట్టడం మానేసి, మందు కొట్టడం మొదలుపెట్టాడు. ఇక అంతే నేను ఆడదానిని మర్చిపోయి, బూతుల బయోగ్రఫీలో ఉండే అన్ని బూతులూ అతనిపై వదిలేశా! దాంతో ఒకరోజు సడెన్‌గా మాయమైపోయాడు. అతను ఉన్నప్పుడు ఏనాడూ నాకు బోర్ కొట్టలేదు. మనిషి కళ్ళ ముందు లేకపోయేసరికి నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఒక్కోసారి ఎందుకు బ్రతకాలి, చనిపోదామా అనిపిస్తుంది. నాకు తను కావాలి. తిండి, బంగారం, ఆస్తులు.. ఇంకేమీ వద్దు, తను మాత్రమే కావాలి. నువ్వైనా తనని నాకు వెతికి ఇస్తావా? ప్లీజ్ ప్లీజ్!” అంటూ నా కాళ్లపై పడిపోయింది.
నేను తనని పైకి లేపుతూ, సూటిగా తన కళ్ళల్లోకి చూసి ఒక మాట చెప్పాను: “అరికాలు కింద భూమి దగ్గర నుండి అంతరిక్షం వరకు వెతికినా దొరకని వాడు.. కొన్నిసార్లు మనిషి మనసుల్లో వెతికితే దొరుకుతాడు. కళ్ళు మూసుకుని, తెలియక చేసిన తప్పులకి క్షమాపణలు చెప్పుకుంటూ, ఇకనైనా ఆ మనిషిని తన స్వేచ్ఛతో బ్రతకనిస్తే.. నువ్వు కళ్ళు తెరిచేసరికి నీ కళ్ళ ముందే ఉంటాడు” అని చెప్పి నేను మాయమైపోయాను!
Leave a Reply