
2 బంతుల్లో 7 పరుగులు చేస్తే చందమామ టీం గెలుస్తుంది. చేయకపోతే సూర్యుడు టీం గెలుస్తుంది. పాతికేళ్ల చరిత్రలో చందమామ టీం, సూర్యుడి టీంపై ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. బౌలింగ్ వేస్తున్న రాహుల్ కళ్ళల్లో అలాగే మిగిలిన ప్లేయర్స్ అందరిలో కూడా గెలుస్తామనే ధీమా కనిపిస్తుంది. కానీ చందమామ టీమ్ కెప్టెన్ మనోజ్ కుమార్ ఒంటరి పోరాటం చేస్తూ తన టీమ్‌ను అద్భుతంగా ఇంతవరకు తీసుకొచ్చాడు. ఒకవైపు తన టీం 8 వికెట్లు కోల్పోయినా.. మరోవైపు నుండి పరుగులు చేస్తూ వచ్చాడు. 20 బంతుల్లో 31 పరుగులు చేసి స్ట్రైక్‌లో తనే ఉన్నాడు.
రాహుల్ బంతిని గట్టిగా పట్టుకుని గీతకు ఏడడుగుల దూరం నుండి పరిగెడుతూ అంపైర్‌ను దాటి బౌలింగ్ వేశాడు. బంతి వేగంగా మనోజ్ కుమార్ దాటి వెళ్తుండగా లేట్ కట్ చేసి థర్డ్ మాన్ దిశగా బంతిని కొట్టాడు. స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ మరియు గల్లీ ఫీల్డర్.. ఇద్దరు బంతిని ఫోర్ వెళ్లకుండా ఆపడానికి వేగంగా పరుగెత్తుతున్నారు. బంతిలో వేగం తగ్గింది. బౌండరీని చేరుకోవడానికి మరో మూడు అడుగుల దూరంలో ఉంది. మనోజ్ మరియు అతని టీమ్ మేట్ ఇద్దరు అప్పటికే రెండు పరుగులు ముగించుకొని మూడో పరుగు కోసం పరిగెడుతున్నారు. స్లిప్ ఫీల్డర్ వేగంగా పరిగెడుతూ డైవ్ వేసి బంతిని పక్కకు తోశాడు. ఆ దృశ్యం చూస్తున్న అందరూ ఆశ్చర్యంలో ఉన్నారు. బంతి నెమ్మదిగా గల్లీ ఫీల్డర్ వచ్చి పట్టుకునేలోపు బౌండరీ లైన్‌ను ముట్టుకుని ఫోర్ వెళ్ళింది. చందమామ టీం ప్లేయర్స్ మరియు అక్కడున్న అందరూ (ఒక్క సూర్యుడు టీం తప్ప!) చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తూ మనోజ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు.
ఒక్క బంతికి 3 పరుగులు చేస్తే మొదటి సారి సూర్యుడు టీంపై చందమామ టీం గెలుస్తుంది. 2 పరుగులు చేస్తే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. ఒకటి లేదా జీరో చేస్తే ఇన్నేళ్లు జరిగినట్టు కామన్‌గా ఓడిపోతారు. ఇన్నాళ్లు ఎలాంటి పోటీ లేకుండా చిత్తుగా ఓడిపోయేవారు. కానీ గెలిచే అవకాశాలు సూర్యుడు టీం కంటే వీళ్ళకే ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ 60% చందమామ వైపు, 40% సూర్యుడు టీం వైపు ఉంది. చందమామ గ్రామం వాళ్ళు అన్నిటిలో సూర్యుడు టీంపై గెలిచారు.. ఓడారు కానీ ఈ ఒక్క క్రికెట్ లోనే ఎప్పుడూ గెలవలేదు. ఒకే పంచాయతీలో మూడు గ్రామాలు ఉంటాయి. కానీ ఈ రెండు గ్రామాలకే అన్నిటిలో పోటీ ఉంటుంది. రాజకీయ పరంగా కూడా ప్రతిసారీ గట్టి పోటీనే నడుస్తుంది. కొన్ని సార్లు సూర్యుడు గ్రామంలో నాయకుడు గెలిస్తే మరికొన్ని సార్లు చందమామ గ్రామ నాయకుడు గెలిచేవాడు. ఈ మ్యాచ్ గెలవాలని ఆ టీమ్ ప్లేయర్స్ ఒక్కరిదే కల కాదు.. ఆ గ్రామంలో ఉండి క్రికెట్ అంటే ఏంటో తెలిసిన అందరిదీ. ఆ కల నెరవేరేది మనోజ్ వల్లనే అని అక్కడున్న అందరూ అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు మనోజ్, మనోజ్, మనోజ్ అంటూ చీర్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. మనోజ్ వాళ్ళ వైపు చూసి ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుడిని ఇలా ప్రార్ధిస్తున్నాడు: “దేవుడా! నిజంగా నువ్వు ఉంటే మేము గెలిచేలాగా చేయాలి! మమ్మల్ని గెలిపిస్తే నీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, వచ్చే ఏడు మాల వేసి నీ కొండకు వచ్చి మొక్కు తీర్చుకుంటాను” అని.
ఇంతలో ఆ ఊరి సీనియర్ ప్లేయర్ అయిన వెంకటేష్, మనోజ్ వద్దకు వచ్చి చెవిలో ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న మనోజ్ ఒక్కసారి గ్రౌండ్ చుట్టూ బౌండరీ గ్యాప్ కోసం చూశాడు. మనసులో వెంకటేష్ అన్న చెప్పిన చోటును ఎంచుకున్నాడు. రాహుల్ ఎలాంటివాడో.. ఇలాంటి సమయంలో ఎలా బౌలింగ్ చేస్తాడో తెలుసు. రాహుల్ సూపర్ ఫాస్ట్ బౌలర్ అయినా మనోజ్ కూడా ఐదేళ్లుగా గ్రామ సీనియర్ టీంలో క్రికెట్ ఆడుతున్నాడు. మిడ్ ఆన్ దిశగా సిక్స్‌లు కొట్టడం చాలా ఇష్టం మనోజ్‌కు. కానీ ఆ వైపుగా సిక్స్ కొట్టే ప్రాసెస్‌లో ఎక్కువ సార్లు బౌల్డ్ అయ్యాడు. ఈ విషయం సూర్యుడు టీం కెప్టెన్ అయిన మణీంద్ర, రాహుల్‌తో చెప్పాడు. రాహుల్ కూడా కెప్టెన్ మాటను అంగీకరించాడు. రాహుల్‌తో చర్చ తర్వాత మణీంద్ర మిడ్ ఆన్ (mid-on) ఫీల్డర్‌ను లోపలకు రప్పించి, స్క్వేర్ లెగ్ (square leg) ఫీల్డర్‌ను బౌండరీ వద్దకు పంపాడు.
ఫీల్డింగ్‌లో మార్పును చూసి మనోజ్ మనసు గజిబిజిగా ఉంది. సీనియర్ ప్లేయర్ వెంకటేష్ అన్న చెప్పిన మాట వైపు ఆడాలా లేక తన బలం అనుకునే స్ట్రెయిట్‌గా ఆడాలా? ఏదీ నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఇంతలో బౌలర్ రాహుల్ బాల్ వేయడానికి పరిగెడుతూ వస్తున్నాడు. చిన్న పురుగు మనోజ్ కళ్ళను తాకుతూ వెళ్ళింది. అందుకు మనోజ్ బ్యాటింగ్ చేయకుండా వికెట్ల నుండి వెనక్కి వెళ్ళాడు. కానీ అప్పటికే రాహుల్ బంతిని తన చేతి నుండి వేగంగా వేశాడు. ఆ బంతి మనోజ్ కాళ్ళకు తగిలింది. లెగ్ బైకి ఎలాంటి రన్స్ ఉండవు. వెంటనే సూర్యుడు టీం వాళ్ళు గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారు.
చందమామ టీం వాళ్ళు అలాగే మనోజ్ కూడా ఇలా ఆర్గ్యుమెంట్ చేశారు: “కళ్ళల్లో పురుగు పడింది, అందుకే నేను ఆడకుండా తప్పుకుంటే ఆ బంతిని కౌంట్ ఎలా చేస్తారు?” అని. కొంత సమయం తర్వాత లెగ్ అంపైర్ మరియు మెయిన్ అంపైర్లు మాట్లాడుకుని దానిని ‘నో బాల్’ (డెడ్ బాల్/నాట్ కౌంటెడ్) గా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంపై మణీంద్ర మరియు సూర్యుడు టీం ప్లేయర్లు అందరూ అంపైర్లపై విరుచుకుపడ్డారు. అంపైర్లకు సపోర్ట్‌గా చందమామ టీం వాళ్ళు నిలిచారు. ఇలా రెండు జట్ల మధ్య చిన్న గందరగోళ గొడవ జరిగింది. అప్పటికే రాజకీయ కక్షలు ఉన్న ఆ రెండు జట్ల ప్లేయర్స్ కయ్యానికి కాలు దువ్వుకున్నారు. రెండు జట్లలో ఆవేశంగా ఉన్న ఇద్దరు ప్లేయర్స్ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చిన్న చిన్న గాయాలే తగలడం వల్ల ఒకరిపై మరొకరికి పూర్తిగా కోపం తగ్గలేదు. కానీ అక్కడ ఎక్కువమంది ఉండడంతో ఆ ఇద్దరిని విడదీశారు.
ఇరు గ్రామాల నాయకులు కలగజేసుకొని, అంపైర్ల ఆధ్వర్యంలో పక్క గ్రామాల్లో ఉండే క్రికెట్ రూల్స్ బాగా తెలిసిన సీనియర్ ప్లేయర్‌కి కాల్ చేసి అసలుసిసలైన రూల్ ఏంటో తెలుసుకున్నారు. బంతి బ్యాటర్ ఉన్న క్రీజ్ దాటకుండా వెలుపల ఉన్నప్పుడు బ్యాటర్ బంతిని ఆడకుండా తప్పుకుంటే ఆ బాల్ కౌంట్ అవ్వదు.
ఆ తీర్పుకు చందమామ గ్రామం వాళ్ళు మ్యాచ్ గెలిచినంత ఆనందంగా విజిల్స్ మరియు వెక్కిరింపులు.. ఇలా చాలా చేశారు. ఔటర్స్ మరియు నాయకులు అందరూ గ్రౌండ్ ఖాళీ చేసి బయటికి వెళ్ళారు. ఫీల్డింగ్ చేస్తూ సూర్యుడు టీం, బ్యాటింగ్ చేస్తున్న మనోజ్ మరియు అతని టీమ్‌మేట్, ఇద్దరు అంపైర్లు మాత్రమే ఉన్నారు.
“చందమామ టీం ఆఖరి బంతిలో మూడు పరుగులు చేయాలి” అంటూ మైక్‌లో ఒకాయన కామెంటరీ చేస్తున్నాడు. మణీంద్ర మరియు అతని టీం ప్లేయర్స్ అందరూ “వెరీ ఈజీ, వెరీ ఈజీ.. నైస్ బౌలింగ్ రాహుల్. లాస్ట్ బాల్ ఫోకస్…” అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. అటుసైడ్ నుండి డగౌట్‌లో ఉన్న చందమామ ప్రజలు, టీం ప్లేయర్లు మనోజ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు.
రాహుల్ బంతిని పట్టుకొని పరిగెడుతూ వచ్చి వేగంగా వేశాడు. కళ్ళ ముందు ఆ బంతి వేగాన్ని చూసి ఏమి చేయాలో తెలియక కళ్ళు మూసుకొని ఊపేశాడు……….
.
.
.
.
.
.
.
అది ఒక విశాలమైన ప్రదేశం. చుట్టూ చూస్తే మనిషి అన్నవాడే లేడు… ఒక్క మనోజ్ తప్ప!
కళ్ళ ముందు సూర్యుడు అస్తమించాడు.. వెన్నెల జల్లుతూ చంద్రుడు ఉత్తరాన ఉదయిస్తున్నాడు. ఆ వెన్నెలను చూస్తూ మనోజ్ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు:
“నా చెవిలో ఇంకా ‘మనోజ్.. మనోజ్..’ అంటూ ఊరంతా అరిచిన నమ్మకపు అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. నా కళ్ళకు నన్ను గెలిపించమంటూ దేవుడికి దండం పెట్టుకున్న ఆ చేతులు కనిపిస్తూనే ఉన్నాయి. పాతికేళ్ల ఓటమి రాతను మార్చడానికి, ఇన్నాళ్ల అవమానాలకు సమాధానం చెప్పడానికి నాకిదే ఆఖరి అవకాశం అనుకున్నాను. కానీ… అంతా అయిపోయింది. ఒకే ఒక్క క్షణంలో ఆశలన్నీ ఆవిరై అడియాశలయ్యాయి. ఊరి జనం నాపై పెట్టుకున్న నమ్మకం ముక్కలైపోయింది. గెలవాలనే ఆశతో ఇంతసేపు కొట్టుకున్న నా గుండె చప్పుడ్లు ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నా శ్వాస నా అదుపులో లేదు… గొంతులోనే ఇరుక్కుపోయింది. అవును, నా ఊపిరి సగం ఆగిపోయింది! బ్రతికున్నానో లేదో తెలియని ఒక శూన్యంలో కొట్టుమిట్టాడుతున్నాను. ఇన్నాళ్లు చిత్తుగా ఓడిపోయినా లేని బాధ, గెలుపు అంచుల్లోకి వచ్చి ఓడిపోవడంలో ఉంది. ఈ గుండె కోతను భరించడం నావల్ల కావడం లేదు… నా జీవితం ఇక్కడితో అంతమైపోతేనే నేను ఈ భరించలేని నరకం నుండి, అవమాన భారం నుండి స్వేచ్ఛను పొందుతాను కాబోలు…”
ఆ శూన్యంలో, తన చేతిలోని బ్యాట్‌ను కిందపడేసి, మోకాళ్లపై కూలబడి తల పట్టుకుని రోదించాడు మనోజ్. చందమామ గ్రామం కల ఆఖరి బంతికి కన్నీరై కరిగిపోయింది.
— ది ఎండ్ —
Writer: krishna perla