పల్లెటూరి కథలు

నిశ్చిలత గట్టిగా అరుస్తుంది

పాతికేళ్లు వచ్చినా పావలా సంపాదన లేని నీలాంటివాడు ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? వీడి కంటే చిన్నవాళ్లు ఉద్యోగాలు చేస్తూ.. పెళ్లిళ్లు చేసుకుని, పిల్లల్ని కని డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్లని చూసైనా మారాలి. సిగ్గు ఎగ్గు లేని జీవితం. మూడు పూటలా తిని పడుకుని తిరిగే జీవితం… అదీ ఒక జీవితమా? కుక్క జీవితం! నీకంటే పశువులే నయం. కాస్త గడ్డేస్తే రోజుకి నాలుగు లీటర్ల పాలైనా ఇస్తాయి. మనిషిగా జన్మ ఎత్తిన తర్వాత ఒళ్లొంచి పని చేసే ఆలోచన ఉండాలి. లేదా ఎందులోనైనా దూకి చావాలి.’ అంటూ కిచెన్‌లో వంట చేస్తూ, ఇంకా పడక లేవని కొడుకు మురళిని తిడుతోంది శ్యామల.

​ఒకపక్క శ్యామల తిడుతున్నా మౌనంగా దుప్పటి కప్పుకుని వింటూ, మురళి తనలో తాను ఇలా ఆలోచించుకుంటున్నాడు: “పశువులు… గడ్డేస్తే లీటర్ల లీటర్లు పాలు ఇస్తాయంట! పేరంటాలకు, ఫంక్షన్లకు, ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్‌కి బండి మీద తీసుకెళ్లేది ఆ పశువులా? నేనా? నేను లేకపోతే ఇల్లు దాటి బయటికి వెళ్లలేరు. నన్ను పట్టుకుని ఎన్ని మాటలు అంటోంది! నాది కుక్క జీవితమంట, నాలాంటి వాడు ఉండే కంటే చావడం మంచిదంట! అవును, చావడమే మంచిది. నేను చస్తే గానీ అప్పుడు తెలియదు నా విలువ! ఇలాంటి తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టి బతకడం కంటే చావడం మేలు.

​ఒక పూట తిండి ఉంటే మరోపూట తిండి ఉండదు! వీళ్ల మొహాలు గేదెకి గడ్డేసే మొహాలా? ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు… అలాంటి పిసినారులు నన్ను ఆ పోరంబోకులతో పోలుస్తోంది. అయినా, ఒళ్లు తెలియనంత పీకల దాకా తాగేసి తిరిగే వాళ్లతో నన్ను కంపేర్ చేసింది. వాళ్ల అమ్మనాన్నలు కొడుకులు ఏది అడిగితే అది కొనిస్తారు. కానీ వీళ్లు ఇంటర్వ్యూకి వెళ్తాను, ఉద్యోగం చూసుకుంటాను అన్నా వంద రూపాయలు కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరని గట్టిగా అడిగితే ‘నువ్వు కష్టపడి తెచ్చిన సంపాదన ఏదైనా ఉందా’ అని తిరిగి నన్నే తిడతారు. సంక్రాంతికి సినిమాకి డబ్బులు ఇవ్వరు, వినాయకచవితికి చందా ఇవ్వరు, దసరాకి కొత్త బట్టలు కూడా కొనరు. మిగిలిన కుర్రాళ్లు కొత్త కొత్త బట్టలు వేసుకుని ట్రిప్‌లకి తిరుగుతారు. నేనేమో ఈ నాలుగు గోడల మధ్య… లేదంటే పది కిలోమీటర్ల పరిధిలో ఉండే చుట్టాల ఊర్లకి తిరగాలి. అది కూడా వాళ్ల పనులకే!”

​మురళి తన ఆలోచనల్లో అలా మునిగిపోతుండగా, అతని రెండు కళ్ల నుండి కారిన కన్నీటి చుక్కలు తలదిండును తడుపుతున్నాయి.

​ఇంతలో శ్యామల వంట పూర్తయింది. కిచెన్‌లోని పొయ్యి మంట ఆరిపోయింది. ఎంత తిట్టినా ఉలకకుండా పడుకున్న కొడుకును చూసి ఆమె మనసులోని కోపం కూడా చల్లారింది. ‘ఎక్కువ తిట్టేశానా… ఉదయాన్నే నోరు పారేసుకున్నాను, పాపం కడుపు మార్చుకుంటున్నాడేమో’ అన్న చిన్న అపరాధ భావంతో, ప్రేమను దాచుకుంటూ గదిలోకి వచ్చింది. వెంటనే ఇలా అంది: “రేయ్ నాన్న! బ్రష్ చేసి ఈ ఉప్మా తిను…” అంటూ మురళి కప్పుకున్న దుప్పటి తీసింది. దానిని మళ్లీ ముఖం మీదికి లాక్కుంటూ, కళ్లలోని కన్నీటి చుక్కలను తుడుచుకున్నాడు మురళి.

​మళ్లీ దుప్పటి లాగుతూ… “నేను ఎన్ని మాటలన్నా తిరిగి పల్లెత్తు మాట అనడు. నేను ఏ పని చెప్పినా వింటాడు. బంగారు కొండ! నా కొడుకు శ్రీరాముడు! లే నాన్న. లేచి నువ్వు ఉప్మా తింటే మనం గంగత్తమ్మ వాళ్ల కూతురు ఎంగేజ్‌మెంట్‌కి వెళ్దాం.” అంది శ్యామల.

​”ఏంటి? ఎవరికి ఎంగేజ్‌మెంట్?” అని దుప్పటి తీసి ఆశ్చర్యంగా అడుగుతాడు మురళి.

​”అదే రా! మన పక్క ఊరిలో ఉంటున్న గంగత్తమ్మ కూతురికి. దాని పేరు ఏదో మల్లిక, మన్నిక ఉంటుంది…” అని తల గోకుకుంటూ ఆలోచిస్తుంది శ్యామల.

​”మల్లిక, మన్నిక కాదమ్మా… మౌనిక! మొన్ననే ఇంటర్ అయింది.” అంటూ భారమైన గొంతుతో అంటాడు.

​”సరే లే! త్వరగా తిను.. ముందుగా వెళ్లకపోతే మళ్లీ మీ అత్త మనమీద నోరేసుకుని పడిపోతుంది.” అంటూ స్నానానికి వెళుతుంది శ్యామల.

​’అది నా పిల్ల అమ్మా!’ అంటూ మనసులో గట్టిగా అరుస్తాడు మురళి.

​అదేంటో… కొందరికి అంతే, ఎంత కష్టపడినా గుర్తింపు రాదు.. కాలం కూడా కలిసిరాదు. అన్నింటినీ అణచుకుని, ఓర్చుకుని, ఓపికతో బతకడమే వాళ్ల జీవితం. వాళ్లను ఎవరూ సపోర్ట్ చేయరు! వాళ్ల బాధను ఎవరూ అర్థం చేసుకోరు!

​ఇది 100 మందిలో ఒకడి కథ కాదు.. 100లో 90 మంది కథ!

చీకటి లోపలే కేకలు

ఆ కాలంలో మా ఊరిలో చదువుకున్న 10 మందిలో బాగా చదివిన మనిషి రమణమూర్తి. చూడటానికి సన్నగా కర్రలాగా పొడుగుగా ఉండి, మధ్య పాపిడితో చామనచాయ కంటే కాస్త తక్కువ రంగులో ఉండేవాడు. ప్రభుత్వ పాఠశాలలు ఊరికి పది కిలోమీటర్ల అవతల ఉండేవి. అందుకని ఊరిలో వందల కొద్దీ పిల్లలు ఉన్నా 10 మంది కంటే ఎక్కువమంది బడికి పోయేవారు కాదు. ఆ పది మందిలో కొందరు ఏటి స్నానాలకు వెళితే, మరికొందరు లేత కొబ్బరి దొంగతనానికి వెళ్ళేవారు. కానీ రమణమూర్తి మాత్రం క్రమం తప్పకుండా బడికి వెళ్లేవాడు.ఆయన 10వ తరగతి చదువుతున్నప్పుడు చదువుల సరస్వతి సుబ్బమ్మకు, రమణమూర్తికి మాంచి పోటీ ఉండేది. మొదటి ర్యాంకు కోసం ఇద్దరు పోటీపోటీగా చదివారు. క్లాస్‌లో పాతిక మంది ఉన్నా బాగా చదివే వీరిద్దరూ అంటే నూకయ్య మాస్టర్‌కి అమితమైన ప్రేమ. సొంత బిడ్డలు లెక్క! వాళ్ళిద్దరికి ఆఖరి పరీక్షలకు నెల రోజుల ముందు ఈసారి కొత్తగా ప్రీ-ఫైనల్స్ అంటూ పరీక్షలు నిర్వహించాడు. అందులో మొదటి ర్యాంకు వచ్చినవాళ్లకు హీరో సైకిల్ బహుమతిగా కొనిస్తానని ఆఫర్ పెట్టాడు.మరో రెండు రోజుల్లో పరీక్షలు మొదలు. రోజుకి రెండు పరీక్షలు. ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొకటి. ఇష్టమైన మాస్టర్ మెప్పును పొంది, అతను ఇచ్చే సైకిల్ బహుమతిగా పొందాలని ఇద్దరూ రాత్రి పగలు చదివారు. కానీ,ఈ విషయం మా ఊరి నుండి చదివే మిగిలిన తొమ్మిది మందికి తెలిసింది. ఎట్లాగైనా ఆ బహుమతి మా ఊరి వాడికే రావాలనే దురుద్దేశంతో సుబ్బమ్మను చదవనివ్వకుండా చేయాలని పథకం వేసుకున్నారు. అప్పటివరకు లేని విధంగా ఆ తొమ్మిది మంది ఆ రెండు రోజులు బడికి వచ్చి, సుబ్బమ్మను చదవనివ్వకుండా అర్థంపర్థం లేని డౌట్‌లు అడిగేవారు.రమణమూర్తి గురించి లేనిపోని కబుర్లన్నీ చెప్పి సొల్లు కబుర్లుతో సమయం వృధా చేసేవారు. ఇది చాలక ఆమె చదువుతున్నప్పుడు గదినంతా అల్లరితో నింపేవారు. ఇవన్నీ తన అమాయకత్వంతో సహించి అప్పుడప్పుడు చదువుకునేది. రమణమూర్తిని ఆ రెండు రోజులు బడికి రానివ్వకుండా ఇంటిపట్టున చదవమని సలహా ఇచ్చారు. అలాగే చేశాడు.పరీక్ష రాసే రోజు…నిద్రలేని కళ్ళతో ఒకపక్క సుబ్బమ్మ పరీక్ష రాస్తుంటే, హాయిగా ఎటువంటి చీకుచింత లేకుండా రమణమూర్తి పరీక్ష రాసేవాడు. అలా మూడు రోజుల్లో అన్ని పరీక్షలు ముగిశాయి. మరో మూడు రోజుల తర్వాత…పరీక్ష పేపర్లు తను దిద్దితే ఇద్దరికి సమాన మార్కులు వేస్తానేమో అన్న చిన్న సందేహంతో మరో పాఠశాల ఉపాధ్యాయునితో దిద్దించాడు. పాఠశాల అంతా ఎదురుచూసింది ఈ రోజు, ఈ క్షణం కోసం. నూకయ్య మాస్టర్‌తో పాటు మిగిలిన అందరి మాస్టర్లు, మేడమ్‌లు ఆ క్లాస్‌రూమ్‌కి హాజరయ్యారు. గదంతా నిశ్శబ్దం. ప్యూన్ కనకరాజు ఆ ఇద్దరు రాసిన ప్రశ్నపత్రాలు తీసుకొచ్చి హెడ్‌మాస్టర్ అయిన రాఘవేంద్ర గారికి ఇచ్చాడు. మొదట తెలుగు పేపర్ మార్కులు చెప్పాడు. ఇద్దరికి సమానంగా 100కి 99 వచ్చాయి. ఆపై హిందీ పేపర్ తీశాడు. మళ్ళీ ఇద్దరికి సమానంగా 87 వచ్చాయి. ఆ గదిలో రమణమూర్తి, సుబ్బమ్మలతో పాటు మిగిలిన పిల్లలు మరియు నూకయ్య మాస్టర్ల గుండె చప్పుడు 8డి సౌండ్స్‌లా వినిపిస్తున్నాయి. హెడ్‌మాస్టర్ గారు ఇంగ్లీష్ పేపర్ మార్కులు చెప్పడం మళ్ళీ మొదలుపెట్టాడు. రమణమూర్తికి 89 వస్తే, సుబ్బమ్మకు 86 మార్కులు వచ్చాయి. మా ఊరి తొమ్మిది మందిలో మెరుపులాంటి ఆనందం కళ్ళల్లో మెరిసింది. కానీ ఆనందం ఎక్కువైన మా ఊరి గంగరాజు గట్టిగా చప్పట్లు కొట్టాడు. “సైలెన్స్” అంటూ హెడ్‌మాస్టర్ రాఘవేంద్ర గారు తన కళ్ళజోడు మధ్యలోంచి కళ్ళు పెద్దవి చేస్తూ అన్నారు.కానీ, గంగరాజు చేసిన పనికి అక్కడున్న ప్రతి ఒక్కరిలో కాస్త రిలీఫ్ వచ్చింది. ఒక్క సుబ్బమ్మలో మాత్రం లేదు. చేతి వేళ్ళు నలుపుతూ మిగిలిన మార్కులు కోసం ఎదురుస్తుంది. ఆపై హెడ్‌మాస్టర్ మిగిలిన పరీక్ష పేపర్ల మార్కులు చెప్పడం స్టార్ట్ చేశాడు. మ్యాథ్స్‌లో రమణమూర్తికి 98 వస్తే, సుబ్బమ్మకు 97 వచ్చాయి. ఇది సైన్స్‌లో తారుమారైంది. రమణమూర్తికి 97 వస్తే, సుబ్బమ్మకు 98 వచ్చాయి. ఇప్పటివరకు రమణమూర్తికి ఐదు సబ్జెక్టుల్లో 470 వస్తే, సుబ్బమ్మకు 467 వచ్చాయి. సుబ్బమ్మ రమణమూర్తి కంటే సరిగ్గా 3 మార్కులు వెనుకబడి ఉంది. ఈ లీడ్ ఆఖరి పేపర్ ఫలితాన్ని కూడా శాసించబోతోంది.ఇక మిగిలింది సోషల్. అందులో వచ్చే మార్కుల ఆధారంగా ఎవరు గెలుస్తారో నిర్ణయమవుతుంది, నూకయ్య మాస్టర్ ఇచ్చే హీరో సైకిల్ ఎవరికి దక్కుతుందో తేలిపోతుంది. సుబ్బమ్మ కళ్ళు మూసుకొని దేవుడిని ప్రార్థిస్తుంది. తన పక్కనున్న స్నేహితురాళ్ళు కూడా సుబ్బమ్మే గెలవాలని కోరుకుంటున్నారు. ఆఖరిగా రాఘవేంద్ర హెడ్‌మాస్టర్ సోషల్ పేపర్ మార్కులు చదువుతానని అన్నారు. ఈసారి మొదట సుబ్బమ్మకు వచ్చిన మార్కులు చెప్పాడు — 99. టెన్షన్ అందరిలో మరింత పెరిగింది. రమణమూర్తిలో టెన్షన్ ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే ఇది ఆఖరి పరీక్ష, పైగా తన ఫ్రెండ్స్ సుబ్బమ్మను చదవకుండా చేసిన పనుల్ని విని, ఎలాగైనా తనే గెలుస్తాడనే అహంతో ఆఖరి పరీక్ష సోషల్ సరిగా చదవకుండా రాశాడు. రాఘవేంద్ర మాస్టర్ రమణమూర్తి సోషల్ పేపర్ ఓపెన్ చేసి, ఒకసారి రమణమూర్తి వైపు, మరోసారి సుబ్బమ్మ వైపు చూసి మార్కులు చదవడం మొదలుపెట్టాడు. “97” అని చెప్పి “కంగ్రాట్స్ రమణమూర్తి” అని కొంచెం గట్టిగా అన్నాడు. ఆ క్లాస్‌రూంలో ఉన్న బాయ్స్ అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ అక్కడక్కడా పెదాల మధ్య గాలితో విజిల్స్ వేస్తున్నారు. మిగిలిన టీచర్స్ కూడా రమణమూర్తికి అభినందనలు చెప్పి, సుబ్బమ్మకు “ఇది ఫైనల్ ఎగ్జామ్స్ కాదు… ఇది సరదాగా పెట్టిన పోటీ. చాలా గట్టి పోటీ ఇచ్చావు, ఒక్క మార్కుతో ఓటమి… ఓటమి కాదు. ఫైనల్ ఎగ్జామ్స్‌లో నువ్వు ఫస్ట్ వస్తే, ఈ రాష్ట్రమే నీకు చప్పట్లు కొడుతుంది” అని ఓదార్పునిచ్చారు.సుబ్బమ్మ కళ్ళ నుండి కన్నీటి చుక్కలు కారుతున్నాయి. తన స్నేహితురాలు ఓదాస్తుండగా  నూకయ్య మాస్టర్ వచ్చి ” నీ బాధకు కారణం నేను, నువ్వు బాధపడితే నేను తప్పు చేశానని ఫీల్ అవుతాను. నాకు తెలిసిన సుబ్బమ్మ ఇది కాదు. ఎలాంటి సవాళ్లు వచ్చిన రాణి రుద్రమ్మ దేవిలా ధైర్యంతో ఎదుర్కుంటుంది గాని లేడీ పిల్లలా పారిపోయినట్టు కన్నీళ్ళు కార్చదు. అయినా తొలి ఓటమి మనిషిని అసలైన గెలుపు వైపు నడిపిస్తోందని చెప్పిన మాట మర్చిపోయావా? ” అన్న మాటలకు సుబ్బమ్మలో చిన్నగా మనో ధైర్యం వచ్చింది. కళ్ళ నుండి కారుతున్నా ఆ కన్నీటి చుక్కలు తుడుచుకుంటూ ” మాస్టర్ నిద్ర లేక కళ్ళు మంటలుగా అనిపించి కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తున్నాయి అంతే. రమణమూర్తి చేతిలో ఓటమి వల్ల కాదు” అంటూ లేచి రమణమూర్తికి అభినందనలు చెప్పింది. తిరిగి ” థాంక్స్ సుబ్బమ్మ. నీకు సైకిల్ తొక్కడం రాదు కదా! మన పరీక్షలు పూర్తి కాగానే నీకు మాస్టర్ ఇచ్చే సైకిల్ పై నేర్పిస్తా”అంటూ చెప్పి   మిగిలిన పిల్లలతో ఉత్సాహంగా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు.పదో తరగతి పూర్తి అవుతుంది. ఆ పరీక్షలో సుబ్బమ్మకు మొదటి ర్యాంకు వస్తుంది. రమణమూర్తికి మూడో ర్యాంకు వస్తుంది. మరో అమ్మాయికి రెండో ర్యాంకు వస్తుంది. తను మూడో స్థానం రావడం వల్ల బాధను తట్టుకోలేక నెమ్మదిగా కల్లు తాగుడికి అలవాటు పడ్డాడు. టౌన్ లో ఉండే ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాడు. నూకయ్య మాస్టర్ లాంటి గురువు లేకపోవడంతో ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయ్యాడు. అయినా కానీ ఆరోజు రమణమూర్తి ఏడవలేదు. ఫలితాల పట్టిక ముందు నిలబడి, తన పేరు పక్కన ఉన్న “ఫెయిల్” అనే మూడక్షరాల మాటను రెండుసార్లు చదివి, మౌనంగా వెనుదిరిగాడు. లోపల ఏదో ఒక భాగం చచ్చిపోయినట్టు అనిపించింది. నూకయ్య మాస్టర్ ఉన్నప్పుడు తప్పు దారిలో అడుగు పెట్టబోతే వెనక్కి లాగే ఒక చెయ్యి ఉండేది, ఒక కళ్ళు ఉండేవి, తనని గమనించే ఒక మనసు ఉండేది. ఆ చెయ్యి లేకపోయేసరికి, ఎవరూ చూడని చోట పుస్తకాలు మెల్లమెల్లగా మూలన పడ్డాయి, ధూళి పట్టాయి.ఇంట్లో అమ్మానాన్నల నుండి వినిపించే మాటలు మొదట్లో బాధలా అనిపించినా, తర్వాత అలవాటై సాధారణంగా మారిపోయాయి. “ఎంత తెలివైన కొడుకు కాస్త ఇలా తయారయ్యాడేంటి” అని అమ్మ నిట్టూర్పు, “వాడి ఖర్మ” అని నాన్న విసుగు. ఇవి రోజూ వినేసరికి రమణమూర్తిలో ఒక మొద్దుబారిన తనం వచ్చేసింది. తనలాగే ఎవరూ దారి చూపించని ఊరి పిల్లలకు చదువు చెప్పే మాస్టారుగా మారిపోయాడు. ఆ ఒక్కప్పటి “ఊరి తెలివైన కుర్రాడు” ఇప్పుడు ఇంటిదగ్గరే వసారాలో బల్లపరుపు వేసుకుని పాఠాలు చెప్పే ట్యూషన్ మాస్టారు.మొదట్లో ఆ పని బాగానే సాగింది. కానీ వయసుతో పాటు లోపల ఏదో అసంతృప్తి, ఏదో ఖాళీతనం పెరుగుతూ వచ్చింది. తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని, తనని ఓడించింది కేవలం ఒక పోటీ పరీక్ష మాత్రమే కాదని, తన చుట్టూ ఉన్న ప్రపంచమే తనని మోసం చేసిందని. ఇలాంటి ఆలోచనలు అతని మనసులో నిదానంగా ఒక చేదు విషంలా నిండుకున్నాయి. ఆ శూన్యాన్ని, ఆ అసంతృప్తిని ఎలా నింపుకోవాలో తెలియని వయసులో, తప్పు దారిలో ఓదార్పు వెతుక్కున్నాడు.ఆ రోజుల్లో ఏం జరిగిందో ఊరి వాళ్లకు పూర్తిగా తెలియదు. తెలిసినా ఎవరూ గట్టిగా మాట్లాడలేదు. ఎందుకంటే అలాంటి విషయాలు బయటకు వస్తే నష్టపోయేది ఆడపిల్లేనని ఊరి పెద్దలకు బాగా తెలుసు. రమణమూర్తి ట్యూషన్ కి వచ్చే అమ్మాయిల్లో ఒకమెను ఎవరికి తెలియకుండా కడుపు చేశాడు. కానీ ఫలితం అందరి కళ్ళ ముందు నిలబడింది. ఆ అమ్మాయి, తన తల్లిదండ్రుల కళ్ళలో చూడలేక, ఊరి వాళ్ళ గుసగుసలకు తలవంచుకుని, తనకు జరిగిన అన్యాయానికి తానే బాధ్యురాలైనట్టు నెలల తరబడి ఇంట్లోంచి బయటికే రాలేదు. ఆమె తండ్రి పంచాయితీ పెట్టినప్పుడు, రమణమూర్తి తలవంచుకుని నిలబడ్డాడు. పశ్చాత్తాపంతో కాదు, పట్టుబడిపోయాననే భయంతో. ఊరి పెద్దలు కూర్చుని ఆమెతోనే పెళ్లి చేయించారు. ఆ పెళ్ళి ప్రేమతో మొదలైంది కాదు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి తొందరగా కుట్టిన అంగీ లాంటిది. పెళ్లి మండపంలో రమణమూర్తి కళ్ళలో ఉన్నది సంతోషం కాదు, ఒక ఓటమి. తనకి ఇష్టం లేని జీవితాన్ని బలవంతంగా అంగీకరించిన ఓటమి.కాలం గడిచింది. ఆ ఇంట్లో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టారు. మొదట్లో పిల్లల నవ్వులతో ఇల్లు కొంచెం వెలుగుతున్నట్టు అనిపించినా, ఆ వెలుగు ఎక్కువ కాలం నిలవలేదు. రమణమూర్తి చేతిలో ఏనాడూ నిలకడైన సంపాదన లేదు. ట్యూషన్ డబ్బులు ఏ నెలైనా వస్తే వచ్చేవి, లేకపోతే లేదు. పగటిపూట పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టారు, రాత్రిపూట ఊరి చివర కల్లు దుకాణంలో మనిషిగా మారిపోయేవాడు. ఇల్లు గడవడమే కష్టం అయినప్పుడు, పిల్లల చదువు గురించి ఆలోచించేంత తీరిక ఎక్కడిది? భార్య ఇంటిపనులతో పాటు కూలి పనులకు వెళ్ళి కొంత సంపాదించేది, కానీ అదొక్కటే సరిపోయేది కాదు. కొడుకులిద్దరూ బడి మధ్యలోనే మానేసి తొమ్మిదో తరగతికే కూలి పనులకు వెళ్ళాల్సి వచ్చింది. ఒకప్పుడు తన తండ్రి ఊరిలో అందరికంటే బాగా చదివిన మనిషి అని తెలిసినప్పుడు వాళ్ళ మనసుల్లో కలిగిన సిగ్గు, ఆ తర్వాత కోపంగా మారింది.”నాన్న చదువుకున్నాడంట, ఊరిలో ఫస్ట్ వచ్చేవాడంట” అని ఎవరైనా చెప్తే, కొడుకులకు అది ఒక వెటకారంలా వినిపించేది. తండ్రి తనకి ఇవ్వాల్సిన బాల్యాన్ని ఇవ్వలేకపోయాడని, తనకి రావాల్సిన చదువుని లాక్కున్నాడని — ఆ కసి వాళ్ళ మనసుల్లో మెల్లమెల్లగా అల్లుకుంది.ఆఖరున కూతురి పెళ్లి రోజు వచ్చినప్పుడు రమణమూర్తి చేతిలో ఒక్క రూపాయి లేదు. ఆ భారం మొత్తం కొడుకుల భుజాలపైనే పడింది. కూలి పనిచేసి, వడ్డీకి అప్పులు చేసి, తమ్ముళ్ళిద్దరూ కలిసి అక్క పెళ్లి జరిపించారు — తండ్రి చేయలేని బాధ్యతను తామే మోసుకున్నారు. ఆ రోజు రమణమూర్తి మండపంలో ఒక మూలన కూర్చుని ఉండగా, ఎవరో బంధువు “పిల్లనిచ్చే తండ్రి నువ్వేగా, డబ్బులు మాత్రం కొడుకులేనా” అని అన్న మాట అతని చెవిలో ములుకులా గుచ్చుకుంది. అప్పటి నుండి ఇంట్లో మాటలు తగ్గి, తిట్లు పెరిగాయి.”నువ్వు ఏం సంపాదించావు నాన్నా, మేము ఇంత కష్టపడేలా?” అని కొడుకులు నిలదీసి అడిగే ప్రశ్నకు రమణమూర్తి దగ్గర సమాధానం ఉండేది కాదు. ఒకప్పుడు ఊరు మెచ్చుకున్న తెలివి, ఇప్పుడు తన కొడుకుల కళ్ళలో ఒక పనికిమాలిన తండ్రి రూపంగా మిగిలిపోయింది. భార్య కూడా ఇన్నేళ్ల తర్వాత అతని మీద ఏ ఆశలు పెట్టుకోకుండా, తన కష్టాన్ని తానే మౌనంగా మోస్తూ బతికేసింది. ఆమెకు అతని మీద ప్రేమ ఎప్పుడో లేదు, ఉన్నదల్లా ఒక అలవాటైన సహజీవనం మాత్రమే.చివరి రోజుల్లో వృద్ధాప్యం, అనారోగ్యం కలిసి రమణమూర్తిని మంచానికే పరిమితం చేశాయి. ఆ ఇంటి చీకటి మూలగదిలో ఒంటరిగా పడుకుని, కొడుకుల తిట్లు వింటూ, తనకోసం ఎవరూ లేరన్న ఒంటరితనంతో అతను కుమిలిపోయాడు. బయటకు ఏడవలేదు. ఏడిస్తే వినిపించే వాళ్ళు ఎవరూ లేరని తెలుసు. లోలోపలే ఆ పచ్చి తాపం కేకలు వేసేది. కళ్ళు మూసుకున్న ఆఖరి క్షణాల్లో అతని మనసులో మెదిలింది ఒకే ఒక్క దృశ్యం — నలభై ఏళ్ల క్రితం, ఒక క్లాస్‌రూమ్‌లో, హెడ్‌మాస్టర్ మార్కులు చదువుతుండగా, తను గెలిచిన ఆ క్షణం. అప్పుడు తనకి తెలియదు, ఆ గెలుపే తన జీవితంలో ఆఖరి నిజమైన గెలుపు అని.