కోడి కూత కూసిన తర్వాత, సూర్యుడు కంటే ముందుగానే నా కళ్ళు తెరుచుకుంటాయి. లోకం ఇంకా నిద్ర లేవక ముందే నేను మేల్కొంటాను. కొందరిలాగే నేను కూడా లేవగానే ఫోన్ ఓపెన్ చేస్తా. ఏమైనా మెసేజ్ లు వచ్చాయేమోనని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెయిల్స్… అన్నీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూస్తా. సాధారణంగా నాకు అంత ముఖ్యమైన మెసేజ్ లు ఏవీ రావు. కానీ, ఎప్పుడో ఒక్కసారి ఒక అనుకోని వ్యక్తి నుండి “గుడ్ మార్నింగ్ స్వీట్ బాయ్” అని ఒక చిన్న మెసేజ్ వస్తుంది. ఆ ఒక్క మెసేజ్ వచ్చిన రోజంతా నాకు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది, ఎంతో ఉత్సాహంగా నా పనులు చేసుకుంటాను. లేచిన వెంటనే ఫోన్ చూడడం తప్పని నాకు తెలుసు, కానీ ఆ ఒక్క మెసేజ్ కోసం 365 రోజులు ఇదే నా మొదటి రొటీన్.
ఆపై ఫోన్ పక్కనపెడతాను. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నా ఇష్టాన్ని గుర్తించి, నా పుట్టినరోజు వేడుకగా నా ప్రాణస్నేహితుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ‘boAt Stone 580’ బ్లూటూత్ స్పీకర్. అందులో ఏ.ఆర్. రెహమాన్ గారి లవ్ సాంగ్స్ ప్లే చేసుకుంటూ కాలకృత్యాలు అన్ని ముగించుకుంటాను. ఆ తర్వాత, తనకంటే నన్ను ఎంతో ఎక్కువగా ప్రేమించిన నా అర్ధాంగి… నాపై ప్రేమతో నాకు ఇచ్చిన మొదటి బహుమతి అయిన షర్ట్, ప్యాంట్ ను నీట్ గా ఇస్త్రీ చేసుకొని వేసుకుంటాను. ఆ బట్టలు వేసుకుంటే చాలు, ఆమెను హత్తుకున్నట్టే ఉంటుంది. ప్రేమ గుడ్డిది అంటారు కదా, నన్నడిగితే అది 100% నిజమంటాను!
ఇక సోల్పహరంగా మా పెరటిలో పెరిగిన చెట్ల నుండి ఒక కొబ్బరికాయ, రెండు జామకాయలు కోసుకుని తింటాను. ఆకలి తీరిన తర్వాత, నేను పుట్టినప్పటి నుండి నన్ను ఎంతగానో ఆదరించిన ఈ ఊరి మనుషుల కష్టసుఖాలను తెలుసుకోవడానికి బయలుదేరతాను.
ఊరికి ఎడమవైపున ఒక పెద్ద చింతచెట్టు ఉంది. దాని కింద జ్ఞాపకార్థంగా నాలుగు సిమెంట్ బల్లలు వేశారు. అక్కడ నాకోసం ఒక బల్ల ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. నేను వెళ్ళి ఆ బల్ల మీద కూర్చుంటాను. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆ చెట్టు నుండి ఎన్ని ఆకులు రాలిపోయాయో, మళ్ళీ ఏప్రిల్, మే నెలల్లో తిరిగి ఎన్ని ఆకులు చిగురించాయో ఒక్కొక్కటిగా లెక్కపెడుతూ కూర్చుంటాను.
అలా మధ్యాహ్నం వరకు అక్కడే ఆగి, ఆ తర్వాత మా ప్రెసిడెంట్ గారి తోటలోకి వెళ్తాను. అక్కడ బాగా పండిన రెండు బొప్పాయి పండ్లు కోసి, చక్కగా కడిగి, మళ్ళీ అదే బల్ల మీద కూర్చొని తింటాను. ఆ పండ్లే నాకు పంచభక్ష పరమాన్నాలు. కడుపు నిండుతుంది. చల్లటి గాలికి నిద్ర మహారాజు నన్ను ఆహ్వానిస్తాడు. ఈ ప్రపంచంలో ఎవరూ కనని ఒక అద్భుతమైన, ప్రశాంతమైన లోకంలో విహరిస్తున్నట్టు కలలు కంటూ అలా నిద్రపోతాను.
సూర్యాస్తమయం అయ్యే సమయానికి నిద్ర లేచి, మళ్ళీ ఇంటికి చేరుకోవాలని నడక ప్రయాణం మొదలుపెడతాను. కానీ అదేంటో… ఉదయం ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా త్వరగానే వచ్చేస్తాను. కానీ సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం ఎన్నో అడుగులు వేస్తే గానీ ఇల్లు రాదు. ఎంత నడిచినా దూరం తరగనట్టు అనిపిస్తుంది. ఇది ఎవరైనా శాస్త్రవేత్తలు పరిశోధించి నాకు అంతుచిక్కని ఈ రహస్యాన్ని చెప్పాలి?
అయినా, నాకు కనిపెట్టి చెప్పడానికి ఏ శాస్త్రవేత్త ఖాళీగా ఉంటాడు? ఎప్పుడూ వాళ్ళ బుర్రల్లో తిరిగే పెద్ద పెద్ద ప్రశ్నలే గానీ, నాలాంటి వాడి ప్రశ్నలకు సమాధానాలు ఎందుకు వెతుకుతారు? పెళ్లాం పిల్లలను వదిలేసి, ల్యాబ్‌లలో ఒకే చోట ఒకే పనిలో నిమగ్నమైన వాళ్ళను ఈ ప్రపంచం మేధావులు అంటుంది. కానీ, ఎవరికీ ఏ హానీ చేయకుండా, ఎవరికీ బదులు చెప్పనవసరం లేకుండా ఊరి మీద తిరిగే నాలాంటి వాడిని మాత్రం ఈ లోకం ‘పిచ్చోడు’ అంటుంది! అసలు నిజమైన పిచ్చోళ్ళు ఈ జనాలే అని ఈ లోకానికి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో!
రోజు ఇలా నాలో నేనే గుసగుసలాడుకుంటూ, నాలోని బాధను ఎవరికీ చెప్పుకోలేక, జనాలని తిట్టుకుంటూ ఒంటరిగా జీవితం గడుపుతున్నాను. నా ఊహల్లో నేను ఎవరి సహాయం లేని ఒక పద్ధతైన, క్లీన్ మనిషిగా బతుకుతున్నాను.
“ఓ చదువరీ! విను… ఇప్పటివరకు ఆ మనిషి చెప్పినవన్నీ కేవలం అతని మనసు సృష్టించుకున్న ఒక అందమైన బూటకం! ఒక తియ్యటి భ్రమ! వాస్తవ ప్రపంచంలో అతను నిజంగానే ఒక పిచ్చోడు. కానీ అతను పుట్టుకతో పిచ్చోడు కాదు… అతన్ని ఈ సమాజమే పిచ్చోణ్ణి చేసింది.
అతను ప్రాణంగా నమ్మిన స్నేహితుడు, అతనికన్నా ఎక్కువగా ప్రేమించిందని అనుకున్న అతని భార్య, సొంత అనుకున్న కుటుంబం, చుట్టూ ఉన్న సమాజం… అంతా కలిసి అతన్ని దారుణంగా మోసం చేశారు. అతని నమ్మకంతో ఆడుకున్నారు. అతని జీవితాన్ని ముక్కలు చేసి, వాళ్ళు సంతోషపడ్డారు. ఆ ద్రోహాన్ని, ఆ గుండె కోతను తట్టుకోలేకే అతని బుర్ర పాడైపోయింది.
ఈరోజు అతని చేతిలో ఫోన్ లేదు, ఏ ‘స్వీట్ బాయ్’ మెసేజ్ లూ రావు. అతని దగ్గర boAt స్పీకర్ లేదు, ఏ రెహమాన్ పాటలూ ప్లే అవ్వవు. అతని భార్య ఇచ్చిన బట్టలు లేవు, ఆ కొబ్బరి తోటలు అతనివి కావు. కానీ… ఆ చేదు నిజాన్ని భరించే శక్తి ఆ గాయపడిన మనసుకు లేదు. అందుకే, ఆ ద్రోహులందరినీ తన ఊహల్లో ఎంతో ప్రేమిస్తున్నట్టు మార్చేసుకున్నాడు.
ఎవరి సహాయం లేకుండా, తన ప్రపంచంలో తనే రాజులా బతుకుతున్నానని భ్రమిస్తూ… ఊరి చివర చింతచెట్టు కింద కూర్చుని రాలే ఆకులను లెక్కపెట్టుకుంటున్నాడు. సమాజం చేసిన గాయానికి రూపమే… ఈ పిచ్చితనం!
ఇట్లు
కృష్ణ పేర్ల ❣️

#PsychologicalDrama #EmotionalStory #TeluguStory #HeartTouching #Betrayal #HumanNature