అమ్మేసిన కల
అబ్దుల్ కలాం గారు “కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి” అన్నారు. కానీ, కలలు కన్న ప్రతి ఒక్కరి ఊహలూ ఊరికే కూలిపోవు. వాళ్ళ బుర్రల్లో ఉండే ‘అతి తెలివి’ ఆ ఆశలను లోలోపలే అంతం చేస్తాయి.
నా కథలోనూ సరిగ్గా ఇలాంటి ఘట్టమే ఒకటి ఉంది.చిన్నప్పుడు స్కూల్లో టీచర్ “పెద్దయ్యాక ఏమవుతావు?” అని అడిగినప్పుడు నా మనసు చెప్పిన సమాధానం ఒకటి. కానీ, ఊళ్ళో జనం అడిగినప్పుడు మా అమ్మానాన్నలు చెప్పిన సమాధానం మరొకటి. రెండు విన్న నేను, ఆ వయసులోనే నా కలను పక్కనబెట్టి, అమ్మానాన్నల కలని నెరవేర్చడమే నా బాధ్యత అనుకున్నాను. అక్కడ మొదలైంది నా ఊహల పతనం!ఆ తర్వాత యవ్వనంలోకి వచ్చాక మరో కొత్త కల పుట్టింది. అప్పుడు అమ్మానాన్నల ఆశ కోసం దాన్ని దాచేశాను.
ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్న అక్కో, అన్నో చెప్పారని… అప్పటివరకు ఊహించుకున్న ప్రపంచాన్ని మార్చేసుకున్నాను.
చివరికి, ఈ సమాజం చూసే కోణం వేరని తెలుసుకుని, నా కలను మళ్ళీ మార్చుకుని, నేనెప్పుడూ ఊహించని ఒక దిశగా నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను.ఇదంతా నా కలను మార్చుకుంటూ నేను దాటి వచ్చిన వివిధ ‘దశలు’.
కానీ, ఈ ప్రపంచానికి మాత్రం ‘డబ్బు‘ అనే ఒకే ఒక్క దిశ తెలుసు. “నువ్వు ఎలాగైనా బతుకు, ఏ కలలైనా కను… కానీ చివరికి నా వైపే రావాలి” అని ఈ ప్రపంచం శాసిస్తోంది.చిన్నతనంలో నాకు నచ్చిన పనిని ప్రేమిస్తూ బతకాలని ఊహలు కన్నాను… కానీ ఈరోజు, డబ్బును ప్రేమించక తప్పని స్థితిలో, నాకు నచ్చని పనిని చేస్తూ బతుకుతున్నాను!అంటూ ఓ జీవుడు చెప్పుకున్న కథ ఇది.