” రూపాయి ఋణం ”
Type your paragraph here
రాఘవకు ఒక పెద్ద టెక్స్‌టైల్ బిజినెస్ ఉంది. నెలకు లక్షల్లో లాభాలు వస్తుంటాయి. కానీ అతని జీవనశైలి చూస్తే ఎవరికైనా పిచ్చోడిలా అనిపిస్తుంది. సొంత ఇల్లు లేదు, ఒక చిన్న అద్దె ఇంట్లో ఉంటాడు. తిరగడానికి సొంతంగా బండి కూడా లేదు, ఎంత దూరమైనా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తాడు. మంచాన పడ్డ తల్లికి కావాల్సిన మందులు, ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా కేవలం ప్రభుత్వ సూపర్ మార్కెట్లు, డిపోల నుంచే బిల్లు కట్టి, పక్కాగా టాక్స్ రూపంలో కొనుగోలు చేస్తాడు. చుట్టుపక్కల వాళ్ళు అతన్ని చూసి “అంత పెద్ద బిజినెస్ పెట్టుకుని, కనీసం ఒక సొంత ఇల్లు కూడా కొనలేని లోభి” అని వెటకారం చేస్తుంటారు. రాఘవ మాత్రం ఆ మాటలన్నింటినీ ఒక చిన్న నవ్వుతో దాటేస్తూ ఉంటాడు.
పక్కింట్లో ఉండే సురేఖ రోజు రాఘవ ఇంటికి వచ్చి, మంచాన పడ్డ అతని తల్లితో సరదాగా కబుర్లు చెబుతూ, ఆమెకు సేవలు చేస్తూ ఉంటుంది. ఒకరోజు సురేఖ ఆ ఇంట్లోని పాత సామాన్లను, ఆ అద్దె ఇల్లును చూసి మనసులోని అసూయను దాచుకోలేకపోతుంది. “వీళ్ళకి అంత లాభాలు వస్తాయి.. అయినా ఇలా అద్దె ఇంట్లో బ్రతుకుతున్నారు. మాకు ఆ మాత్రం ఉంటే ఈపాటికి పెద్ద ఇల్లు కట్టుకునేవాళ్ళం” అనుకుంటూ, ముఖంలో ఆ ఈర్ష్యాభావాలను చూపిస్తూ, గొంతులో కాస్త వెటకారాన్ని నటిస్తూ నేరుగా ఆ తల్లిని అడుగుతుంది.
సురేఖ: (చేతిలో ఉన్న గిన్నెను కాస్త విసురుగా పక్కన పెడుతూ, ముఖం ఒకలా పెట్టి) “అమ్మా, మీకు టెక్స్‌టైల్ బిజినెస్ ఉంది. అది చాలా లాభాలను తెస్తుంది. అయినా కానీ ఈ అద్దె ఇంటిలో ఉంటున్నారు? సొంతంగా తిరగడానికి ఒక వెహికల్ లేదు, ఒంటి మీద కనీసం ముద్ద బంగారాలు లేవు… ఏమీ లేకుండా ఇంత సాధారణ మనుషుల్లా ఎందుకు బ్రతుకుతున్నారు అమ్మా? మీలాగా మాకు బిజినెస్ ఉంటే విలాసమైన భవంతిలో ఉంటూ, పెద్ద పెద్ద కార్లు కొంటూ ఒంటి నిండా బంగారం వేసుకొని ఉండేవాళ్ళం. నేనే కాదు, చాలా మంది ఇలాగే ఉండాలి అనుకుంటారు. కానీ మీరేంటి ఇలా ఉన్నారు? తప్పుగా అనుకోకు.. చాలా రోజులు అడగాలని అనుకుంటున్నా, ఆపుకోలేక అడిగేసా అమ్మ!”
ఆ మంచాన పడ్డ తల్లి సురేఖ ముఖంలోని ఆ ఈర్ష్యను ఏమాత్రం గమనించదు. సురేఖ ఏదో కుతూహలంతో అడిగింది అనుకుని, కొడుకుపై ఉన్న గర్వంతో చాలా క్యాజువల్ గా, అమాయకంగా సమాధానం చెబుతుంది.
రాఘవ తల్లి: “నువ్వు చూస్తున్న లాభాలన్నీ నిజమే సురేఖా. కానీ రాఘవ ఆ లాభాల్లో మా తిండికి, మందులకి కావాల్సినంత మాత్రమే ఉంచుకుని, మిగతా ప్రతి రూపాయిని పక్కాగా ప్రభుత్వానికే టాక్స్ రూపంలో కట్టేస్తాడు. వాడు ఒక్కటే అంటాడు సురేఖా… సొంత ఇల్లు, కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ కాకుండా వాడు సంపాదించేదంతా దేశ ప్రభుత్వ ఖజానాకే వెళ్ళాలంటాడు. వాడు చిన్నప్పుడు వాళ్ళ తాత చెప్పిన మాటల కోసం తన సర్వస్వాన్ని దేశానికే ఇచ్చేస్తున్నాడమ్మా.”
తల్లి మాటలు విన్నాక సురేఖకు ఎలాంటి గిల్ట్ రాదు. బదులుగా ఆమె ముఖంలో “ఎంత పిచ్చోళ్ళు.. డబ్బుండి కూడా అనుభవించడం చేతకాక దేశం అంటున్నారే” అనే చులకన భావం కనిపిస్తుంది.
పైకి మాత్రం “అవునా అమ్మా.. చాలా గ్రేట్” అని నవ్వుతూనే, మనసులో ఆ ఈర్ష్యతో అక్కడి నుంచి వచ్చేస్తుంది.రాత్రి భోజనం టైమ్‌లో సురేఖ తన భర్త రవితో ఆ ముఖంలో వెటకారాన్ని చూపిస్తూనే చెబుతుంది.
సురేఖ: “ఏమండీ, ఆ పక్కింటి రాఘవ అన్నయ్య గురించి వాళ్ళ అమ్మగారిని అడిగాను. చేతినిండా అంత లాభాలు పెట్టుకుని ఇలా ఎందుకు ఉంటున్నారని! దానికి ఆవిడ ఏమన్నారో తెలుసా? తను సంపాదించేదంతా పక్కాగా టాక్స్ రూపంలో ప్రభుత్వానికే కట్టేస్తున్నాడంట! దేశం బాగుపడాలంట! డబ్బు సంపాదించడం వచ్చు కానీ, అనుభవించడం తెలియని పిచ్చితనం కాకపోతే ఏంటి చెప్పండి?”ఆ మాటలు వినగానే భర్త రవి గుండె బరువెక్కుతుంది.
అతనికి రాఘవ మీద అమితమైన గౌరవం కలుగుతుంది.
మరుసటి రోజు ఉదయం.
రాఘవ చేతిలో ఒక చిన్న సంచీ పట్టుకుని సాదాసీదాగా బస్ స్టాప్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎదురుగా రవి వస్తున్నాడు, అతని వెనుకాలే సురేఖ కూడా వస్తోంది. సురేఖ ముఖంలో ఇంకా అదే వెటకారపు చూపులు ఉన్నాయి. రవి మాత్రం రాఘవను ఆపి మాట్లాడాలనే పట్టుదలతో ఉన్నాడు.
రవి: (రాఘవకు నమస్కారం పెడుతూ, కాస్త ఆరాటంగా) “రాఘవ అన్నగారూ.. ఒక్క నిమిషం ఆగుతారా, మీతో కొంచెం మాట్లాడాలి.”
రాఘవ: (ఆగి, ప్రశాంతమైన నవ్వుతో) “చెప్పండి తమ్ముడూ, ఏంటి విశేషం?”
రవి: “నిన్న రాత్రి సురేఖ మీ ఇంటి విషయాలు, మీ బిజినెస్ లాభాలు అన్నీ టాక్స్ రూపంలో ప్రభుత్వానికే కట్టేస్తున్నారని చెప్పింది అన్నగారు. నిజం చెప్పాలంటే నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. రూపాయి టాక్స్ ఎగ్గొట్టడానికి వంద దారులు వెతికే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. అంత సంపాదన ఉండి కూడా.. సుఖాలన్నీ వదిలేసి, ఒక అద్దె ఇంట్లో ఉంటూ, ప్రతి పైసా దేశానికే ఇచ్చేయాలనే ఈ ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది అన్నగారూ? దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా?”
(వెనుక నిలబడిన సురేఖ చులకనగా చూస్తూ ఉంటుంది.)
రాఘవ: (రవి అడిగిన ప్రశ్నలోని జెన్యూనిటీని చూసి, ఒక క్షణం ఆగి, బస్ స్టాప్ వైపు ఉన్న ఒక అరుగు వైపు చూపిస్తూ) “కారణం ఉంది తమ్ముడూ.. కూర్చోండి చెబుతాను.”
(ముగ్గురూ కూర్చుంటారు. రాఘవ కళ్ళు గతాన్ని గుర్తుచేసుకుంటూ మెరుస్తాయి.)
రాఘవ: “నాకు ఏడెనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు.. మా తాతగారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక మాట చెప్పారు. ‘ఒరేయ్ రాఘవా, మన దేశం అంటే మట్టి కాదురా, మన చుట్టూ ఉన్న మనుషులు. ఒక ఇంట్లో దొంగలు పడి ఇల్లంతా దోచుకుంటే ఆ ఇంట్లో ఇంకేముంటుంది? ఇప్పుడున్న ఈ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు కూడా అంతేరా. రకరకాల వ్యాపార ట్రిక్కులు ఉపయోగించి దొంగచాటుగా మన సొమ్మునంతా దోచేస్తున్నాయి. ఒకప్పుడు బ్రిటీష్ వాడు మన దగ్గర ట్యాక్సులు వసూలు చేసి… మన సంపదనంతా ఓడల్లో వాడి దేశానికి ఎలా పట్టుకుపోయాడో, ఇప్పుడు ఈ ప్రైవేట్, విదేశీ కంపెనీలు కూడా బ్రాండ్ల పేరుతో మన డబ్బును అంతే దొంగతనంగా విదేశాలకు పట్టుకుపోతున్నాయి. వాడు బాగుపడితే మనకేంటిరా? అదే మన డబ్బు ప్రభుత్వానికి వెళ్తే… మన పక్కనున్న పేదవాడికి అన్నం దొరుకుతుంది, మన దేశానికి బలం పెరుగుతుంది. దేశానికి ఇవ్వడంలో ఉన్న తృప్తి దేంట్లోనూ లేదురా’ అన్నారు. ఆ వయసులో మా తాత చెప్పిన ఆ మాటలు నా మనసులో, నా రక్తంలో బలంగా నాటుకుపోయాయి తమ్ముడూ.”
రవి: (ఆశ్చర్యంగా వింటూ) “కానీ అన్నగారూ, తాతలు ఎన్నో చెబుతారు. పెద్దయ్యాక ప్రాక్టికల్ గా ఆలోచిస్తాం కదా? సొంత ఇల్లు, లగ్జరీలు ఎవరికి వద్దు చెప్పండి?”
రాఘవ: (నవ్వి) “నిజమే.. కానీ నేను వ్యాపారం మొదలుపెట్టి మొదటిసారి పెద్ద మొత్తంలో లాభం చూసినప్పుడు, నా కళ్ళ ముందు తాతగారి రూపమే కదలాడింది. నేను కార్ కొంటే ఆ డబ్బు ఒక ప్రైవేట్ కంపెనీ జేబులోకి వెళ్తుంది. అదే ఆ డబ్బును పక్కాగా టాక్స్ కట్టి ప్రభుత్వ బాండ్లలో పెడితే, నా దేశంలో ఎక్కడో ఒకచోట ఒక ప్రభుత్వ బడికో, ఒక పేదవాడి వైద్యానికో ఉపయోగపడుతుంది కదా! నేను నా సుఖాలను త్యాగం చేయట్లేదు రవి.. ఈ దేశంలో పుట్టి, ఇక్కడ బ్రతుకుతున్నందుకు నేను కట్టాల్సిన ఋణాన్ని కడుతున్నాను. అంతకంటే ఎక్కువ ఆశ లేదు నాకు.”(
రాఘవ లేచి నిలబడి, చేతి గడియారం చూసుకుని) “సరే తమ్ముడూ, బస్సు వచ్చే టైమ్ అయింది. నేను వెళ్తాను” అని చెప్పి, చాలా గర్వంగా, పవిత్రమైన అడుగులతో బస్ స్టాప్ వైపు నడిచి వెళ్ళిపోతాడు.రాఘవ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ ప్రదేశంలో ఒక నిశ్శబ్దం ఆవరిస్తుంది. రవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. కానీ అసలైన మార్పు సురేఖలో కనిపిస్తుంది. రాఘవ స్వయంగా చెప్పిన ఆ మాటలు, అతని కళ్ళల్లో ఉన్న ఆ నిష్కల్మషమైన దేశభక్తి, నిగర్విత్వం చూశాక ఆమె ఒక్కసారిగా స్తంభించిపోతుంది. అప్పటివరకు ఆమె మనసులో ఉన్న ఈర్ష్య, వెటకారం అంతా ఒక్క క్షణంలో కరిగిపోతాయి. అంతటి మహోన్నతమైన ఆశయంతో బ్రతుకుతున్న వ్యక్తిని చూసి తను ఇంతకాలం చులకనగా చూశానా? ఎంత పాపం చేశాను? అని ఆమెకు అసలైన అపరాధ భావం (Guilt) ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. తను ఎంత సంకుచితంగా, స్వార్థంగా ఆలోచించానో అర్థమై, భర్త రవి పక్కన తల దించుకుని నిలబడిపోతుంది. ఆమె కళ్ళల్లోంచి పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లు వస్తాయి. రవిలో కూడా ఒక పెద్ద మార్పు వస్తుంది. లంచాలు ఇవ్వడం, టాక్స్ ఎగ్గొట్టడం లాంటివి ఇకపై చేయకూడదని రవి నిర్ణయించుకుంటాడు.
సంవత్సరాలు గడుస్తాయి. రాఘవకు వృద్ధాప్యం వస్తుంది. టెక్స్‌టైల్ బిజినెస్ ఆగిపోతుంది. తను సంపాదించినదంతా దేశానికే కట్టేయడం వల్ల, భవిష్యత్తు కోసం సొంతంగా ఏమీ దాచుకోడు. ఆశ్రయం ఇచ్చిన తల్లి కూడా చనిపోతుంది. ఒంటరివాడైన రాఘవ, వృద్ధాప్యంలో తన కనీస అవసరాల కోసం ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేస్తాడు.కానీ, ఈ కుళ్ళిపోయిన వ్యవస్థ అతని అడుగులను పరీక్షించడం మొదలుపెడుతుంది. పెన్షన్ ఆఫీసు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతాడు. అక్కడ ఉన్న అధికారులు లంచం అడుగుతారు. లంచం ఇవ్వడం రాఘవ సిద్ధాంతానికి విరుద్ధం. దాంతో రూల్స్ పేరుతో, టెక్నికల్ కారణాలు చెబుతూ అతని పెన్షన్ ఫైల్‌ను పక్కన పడేస్తారు.తాను ప్రాణంగా ప్రేమించిన, ప్రతి రూపాయిని ధారపోసిన దేశ వ్యవస్థ… ఈరోజు తన కనీస హక్కు అయిన ఒకే ఒక్క పెన్షన్ రూపాయిని ఇవ్వడానికి నిరాకరిస్తుంటే రాఘవ గుండె ముక్కలవుతుంది.
అంతకాలం దేశంపై ఉన్న అమితమైన ప్రేమ కాస్తా, తీవ్రమైన విరక్తిగా, ఆవేదనగా మారుతుంది.ఒకరోజు పెన్షన్ ఆఫీస్ ముందు రాఘవ నిలబడి ఉంటాడు. అధికారులు అతన్ని విసుక్కుంటూ బయటకు నెట్టేస్తారు. ఒకప్పుడు దేశాభివృద్ధి కోసం ఎంతో గర్వంగా పడిన అతని అడుగులు, ఈరోజు నిరాశతో, ఆకలితో, మోసపోయాననే బాధతో తట్టుకోలేక అక్కడే రోడ్డుపై కూలిపోతాయి.
అతని ప్రాణం పోయే చివరి క్షణంలో… అంతకాలం తను ప్రాణంగా చూసుకున్న రూల్స్ ని బ్రేక్ చేస్తూ, సమాజంపై తిరుగుబాటుగా… అక్కడే పడి ఉన్న ఒక నకిలీ నోటుని చేతిలోకి తీసుకుని, ఎగతాళిగా నవ్వుతూ… అందరిలాగే దేశానికి నష్టం చేస్తూ… “ఐ లవ్ మై కంట్రీ” అని ఆవేదనతో అరుస్తూ ప్రాణం విడుస్తాడు.అతని పార్థివ దేహం పక్కన రవి, సురేఖ కళ్ళీరు పెడుతూ నిలబడతారు. రాఘవ శారీరకంగా కూలిపోయినా, అతను రవిలో నాటిన ఆదర్శం మాత్రం బ్రతికే ఉంటుంది. వ్యవస్థ ఓడిపోయింది, కానీ రాఘవ ఆశయం రవి రూపంలో ముందడుగు వేస్తుంది.